విష్ణు మహా పురాణము

Table of Contents

15 - ధనుర్యాగ సంకల్పము - అక్రూర ప్రేషణము

 

 

అరిష్టుండను వృషభాసురుడు హతుడుగాగా ధేనుకుడు కూల్చబడగా ప్రలంబుడు చంపబడగా గోవర్ధన గిరి యెత్తబడగా కాళియ సర్పము దమితము గాగా పెనుమ్రాకులు కూల్చబడగా పూతన చంపబడగా శకటుడు తలక్రిందులు చేయబడగా నారదుడు కంసునకు యశోదా దేవకీ గర్భ పరివర్తనాది వార్త లన్నిటిని దెలిపెను. అదెల్ల దేవతలతో విని నాదరుని వలన కంసుడు విని యా దుర్మతి వసుదేవునిపై పగగొనెను. వాడు సర్వ యాదవ సమాజమందు నవ్వసుదేవు నాడిపోసెను. యాదవులం గర్హించెను. ఆపై కర్తవ్య మిట్లాలోచించెను. రామ కృష్ణులు బలవంతులు గానంతలో వారిని గడముట్టింప వలయును. వయసు వచ్చిన వీండ్రసాధ్యు లయ్యేదరు. ఇక్కడ చాణూరుడు మహావీర్యుడు, ముష్టికుడు మహాబలుడు. వీరిద్దరిచే మల్లయుద్దమున నీ యిద్దరు దుర్మతులం గడతేర్చెదను. ధనుర్యా గోత్సవమను నెపమున వ్రజము నుండి వాండ్ర నిటకు రావించి వారు నశించుట కాయా తీరుల యత్నింతును. శూరుడు శ్వఫల్క తనయుడు యడుశ్రేష్టుడు నగు నక్రూరుని వాండ్రను గొని వచ్చుటకు గోకులమునకుం బంపెదను. కువలయా పీడమను గజము నాయోద్దకేగు దెంచిన వాసుదేవ కుమారుల నిర్వుర జంప గలదు. అని యాలోచించి యా దుష్టుడు కంసుడు వీరులగు బలరామ కృష్ణుల గడతేర్ప నిశ్చయించి యక్రూరునితో ఇట్లనెను.

 

 

ఓ దానపతీ! నాకు సంతుష్టి గలుగ నే చెప్పినట్లు సేయుము. ఇక్కడ నుండి రథమెక్కి నంద గోకులమునకుం జనుము. విష్ణువు నంశమున వసుదేవుని కొడుకులు పరమ దుష్టులు నన్ను గడతేర్పం బుట్టి పెరుగు చున్నారు. ఈ చతుర్దశి నాడు నా ధనుర్యాగోత్సవ మిక్కడ జరుగ నున్నది. నీవేగి మల్ల యుద్దమునకా యిద్దరను గొనిరమ్ము. చాణూర ముష్టికు లిద్దరు నియుద్దమున, బాహు యుద్దమున నేర్పరులు. వారితో నీ యిద్దరు సేయు యద్ధము నిక్కడ లోకము దిలకించు గాక! కువల యాపీడ మను నేనుగు మావటీండ్ర నాయకునిచే ప్రేరితమై యీ వాసుదేవ సుతుల నిద్దరు పిల్లలను జంపగలదు. వారిం జంపి వాసుదేవుని నంద గోపునిం గూడ చంపెద. మిక్కిలి దుష్ట బుద్దియగు మా తండ్రిని ఉగ్రసేనుం గూడ కడతేర్చెద. ఆపై నెల్ల గోపకుల గోధనములను దానములను నేను హరించెదను. వాండ్రు నన్ను జంప వలెనను దురాలోచనలో నున్నారు. నీవు తప్ప యీ యాదవు లందఱు నాకు ద్వేషులు. ఆపై క్రమముగా వీరందఱి వధింప యత్నము సేసెదను. అప్పుడే రాజ్యమెల్ల యాదవ శూన్యమై నిష్కంటక మైనంత నీతో దీనిని నేను శాసింతును. కావున నీవేగుము. గేదె నెయ్యి పెఱుగు పాలుంగొని యాదవులు సత్వర మేతెంచు విధముగ వారికీవు నచ్చ జెప్పుము.

 

 

అని యిట్లాజ్ఞ యీబడి మహాభాగుడక్రూరుడు భగవద్భక్తుడు రేపేను కృష్ణుని దర్శింతునని యుప్పొంగి వేవేగ కంసరాజున కట్లేనని పలికి రథమెక్కి మధురా నగరము నుండి మధు వంశ్యులకు ప్రియుడగు నక్రూరుడు బయలుదేరెను.