విష్ణు మహా పురాణము

Table of Contents

1 - తృతీయంశము - పదునాలుగు మన్వంతరములు - తదధిపతులు

 

 

గురువు (పరాశరుడు) చే భూ సముద్రాదుల యొక్కయు, సూర్య తేజో మండలం యొక్కయు సన్నివేశము విస్తృతముగ చెప్పా బడినది. అట్లే దేవాదుల యొక్కయు, ఋషుల యొక్కయు సృష్టి వర్ణింప బడెను. చాతుర్వర్ణ్య సముత్పత్తి ధృవ ప్రహ్లాద చరితము వివరముగ మీచే చెప్పబడెను. మన్వంతరముల నన్నిటిని తదధిపతులగు నింద్రాదులను మీరు చెప్పగా విన గోరిక గలదు.

 

 

ఈ వారాహ కల్పము నందు అతీతము లైనవియు అనాగతము లైనవియు నగు మన్వంతరములను క్రమముగ చెప్పెదను. స్వాయంభువ మనువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుష మనువు అను నారుగురు మనువులు గతించిరి. ప్రస్తుతము సూర్య పుత్రుడగు వైవస్వత మనువు యొక్క అంతరము అనగా నేడవ మన్వంతరము జరుగు చున్నది. కల్పాది యందలి స్వాయంభువ మన్వంతరము అందు దేవతలను, సప్తర్షులను పూర్తిగ జెప్పితిని. ఇక ముందు స్వారోచిష మన్వంతరమును, తదధిపతులను దేవతలను ఋషులను మను పుత్రులను తెల్పెదను. ఈ మన్వంతరము నందు తుషితునితో గూడి పారావారులు దేవతలు, మహాబలుడగు విపశ్చిత్ అను నాతడు దేవేంద్రుడు. ఊర్జుడు, స్తంభుడు, ప్రాణుడు, వాతుడు, వృషభుడు, నిరయుడు, పరీవాన్ అను సప్తర్షులుండిరి. చైత్రుడు కింపురుషుడు మున్నగు వారు స్వారోచిషుని పుత్రులు. ఇది రెండవ మన్వంతరము. మొదటి స్వాయంభువ మన్వంతరము నందు యామాఖ్య దేవతలు పన్నిద్దరు. మరీచ్యాదులు సప్తర్షులు. ప్రియవ్రతోత్తానపాదులు మను పుత్రులు. విశ్వభుక్ అనువాడు దేవేంద్రుడు.

 

 

తృతీయ మంవంతరమున నుత్తముడు మనువు. సుశాంతి యనువాడు దేవేంద్రుడు. సుధాములు, సత్యులు, జపులు, ప్రతర్దనులు, వశవర్తులు అను నైదు గణములు దేవతలు, ఒక్కొక్క గణమున పన్నిద్దరు గలరు. వసిష్ఠ తనయులు సప్తర్షులు. అజుడు పరశు దేప్తాదులు ఉత్తమ మనుపుత్రులు. చతుర్థమగు తామస మన్వంతరమున సుపారులు హరులు సత్యులు సుధియులునగు దేవా గణములు. ఒక్కొక్క గణమున నిరువది యేడుగురు గలరు. శిభియను వాడు దేవేంద్రుడు. శతక్రతుత్వ వజ్రిత్వ సహస్రాక్షత్వాది లక్షణములు సర్వ మన్వంతరీయ దేవేంద్రులకు సమానము. జ్యోతిర్ధామ పృథువు కావ్యుడు చైత్రుడు అగ్నిధనకుడు పీడుడు అనువారు సప్తర్షులు. నరుడు ఖ్యాతి కేతురూడుడు, జానుజంఘుడు మున్నగు వారు మహాబలులు రాజులునైన మనుపుత్రులు.

 

 

ఐదవదగు రైవత మన్వంతరమున రైవతుడు మనువు. విభువనువాడు దేవేంద్రుడు. అమితాభుడు భూతనయుడు వైకుంఠులు సుమేధసులు అగు పదునలుగురతో గూడిన పదునాలుగు గణములు దేవతలు. హిరణ్యరోముడు వేదశ్రీ ఊర్ధ్వబాహువు అతరుడు వేదబాహువు సుధాముడు పర్జన్యుడనువారు సప్తర్షులు. బలబంధువు సుసంభావుడు, సత్యకుడు మున్నగు వారు రైవత మను పుత్రులు. వారు మహావీర్య సంపన్నులు. రాజేంద్రులు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను నీ నలుగురు మనువులు ప్రియవ్రత వంశములోని వారు. రాజర్షియగు ప్రియవ్రతుడు తపస్సుచే విష్ణువు నారాధించి మన్వంతరాధి పతులయిన ఈ నల్వురను గనెను.

 

 

ఆరవ మన్వంతర మందు చాక్షుషుడు మనువు. మనోజవుడను వాడు దేవేంద్రుడు. ఆప్యులు, ప్రసూతులు, భవ్యులు, పృథుకులు, దివౌకసులు అను నైదు అష్టక గణములు దేవతలు. సుమేధ విరజుడు హవిష్మంతుడు ఉత్తముడు మధువు అతినాముడు సహిష్ణువు అను నీ యేడుగురు సప్తర్షులు. ఊరువు పూరువు శతద్యుమ్నుడు మున్నగు మహాబలులు చాక్షుష మను పుత్రులు. వీరు భూపతులు. ఇప్పుదేడవ మన్వంతరము. ఇందు వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు మనువు. ఈతడు బ్రాహ్మణుడు శ్రాద్ధదేవుడు. మహాతపస్వి, బుద్ధి మంతుడు. ఆదిత్య వసు రుద్రాదులు దేవతలు. పురందరుడను వాడు దేవేంద్రుడు. వసిష్ఠుడు కాశ్యపుడు అత్రి జమదగ్ని గౌతముడు విశ్వామిత్రుడు భరద్వాజుడు నీ యేడుగురు సప్తర్షులు. ఇక్ష్వాకువు, నృగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు నాభాగుడు రిష్టుడు కరూషుడు పృషద్రుడు అను నీ తొమ్మండుగురు వైవస్వత మనువు పుత్రులు. మిక్కిలి ధార్మికులు. సాటిలేనిదియు సత్త్వ గుణ ప్రధానమునగు విష్ణు శక్తి (అంశము) అన్ని మన్వంతరము లందును సర్వ జగద్రక్షకముగా యజ్ఞాది దేవతా రూపమున నుండును. దానికి విష్ణ్వంశముతోనే స్వాయంభువ మన్వంతరమున యజ్ఞము పుట్టినది. ప్రథమ మన్వంతరమున ఆకూతికి మానసదేవుడు పుట్టెను. అతడు స్వారోచిష మన్వంతరమున తుషితయందు పుట్టి తుషితులతో నజయుడై యుండెను.

 

 

ఉత్తమ మన్వంతరమున ఆ తుషితుడే సత్యయందు సత్య దేవతలలో సత్యుడను పేరున బుట్టెను. తామస మన్వంతరము నందు హర్యయందు హరులతో కూడా హరియే (విష్ణువే) పుట్టెను. రైవత మన్వంతరము నందు ఆతడే సంభూతి యందు మానసుడుగా విష్ణువే దేవతలతో పుట్టెను.

 

 

చాక్షుష మన్వంతరమున పురుషోత్తముడగు వైకుంఠవాసి వికుంఠ యందు వైకుంఠ దేవతలతో గూడ పుట్టెను. ఈ వైవస్వంత మన్వంతరమున విష్ణువు కాశ్యపుని వలన అదితి యందు వామనుడుగ పుట్టెను. ఆ మహానుభావుడు మూడు అడుగులచే ముల్లోకముల నాక్రమించి నిష్కంటకము చేసి యింద్రున కిచ్చెను. ఈ రీతిగా సప్త మన్వంతరము లందును నా మహా విష్ణు శరీరములే పుట్టి ప్రజాభి వృద్ధిని చేసినవి. ఈ ప్రపంచ మంతయు నాతని శక్తిచే ప్రవిష్టమై యున్నది. విశతి = ప్రవిశతి ప్రపంచమితి. ప్రపంచ మందు ప్రవేశించిన వాడు కావున విష్ణువను పేరు. కావున సమస్త దేవతలు మనువులు సప్తర్షులు మను పుత్రులు దేవేంద్రులు వీరందరు విష్ణుదేవుని విభూతులే.