విష్ణు మహా పురాణము
13 - జాంబవతీ కళ్యాణము - స్యమంతకోపాఖ్యానము
సత్త్వతుని కుమారు లేడుగురు భజన, భజమాన, దివ్య, అంధక దేవా, పృథ, మహాభోజ, వృష్టి నామకులు గల్గిరి. భజమానునికి నిమి, కృకణ, వృష్ణులు గల్గిరి. వారికి సవతి తల్లి కొడుకులు శతజిత్తు, సహస్రజిత్తు, ఆయతజిత్తు ననువారు ముగ్గురు. దేవాపృధునికి బభ్రువు గల్గెను. ఆ తండ్రి కొడుకుల గూర్చిన శ్లోకము భావమిది. దూరము నుండి యేమి విన్నామో దగ్గర నది చూచు చున్నాము. బభ్రువు మానవోత్తముడు దేవాపృథుడు దేవా సమానుడు. బభ్రువు వలన అఱువది యాఱువేల మంది, దేవాపృథుని వలననూ ఎనిమిది వేలమంది పురుషులు అమృతత్వము నందిరి. ఆ వంశమందు మహాభోజుడు బహు ధర్మమూర్తి. అతని పరంపర భోజులను పేర మృత్తికావర పురవాసులు మార్తికులనియు పేర్వడిరి. వృష్టి కొడుకులు సుమిత్రుడు యుధాజిత్తు. ఆటనుండి అనమిత్రుడు అనమిత్రుని కొడుకు నిఘ్నుడు. వాని కొడుకులు ప్రసేన, సత్రాజిత్తులు. సత్రాజిత్తునకు సూర్య భగవానుడు మిత్రుడు.
ఒకతఱి సముద్ర తటమందు సత్రాజిత్తు సూర్యుని స్తుతించెను. తదేక మనస్కుడై చేసిన ఆ స్తుతికి భాస్కరుడు వచ్చి ఎదుట నిలిచెను. కనబడీ కనబడకుండ నున్న ఈయనను జూచి సత్రాజిత్తు ఆకాశమందగ్ని గోళమట్లు నిన్నెట్లు చూచితినో అట్లే ఇప్పుడు నా యెదుట నున్నను కొంచెము అప్రసన్నుడవైన వానింగా జూచు చున్నాను. అనినంతట సూర్య భగవానుడు తన కంఠము నుండి తీసి స్యమంత మణి రత్నము నేకాంత మందుంచెను. ఆ మీదట సత్రాజిత్తు ఆదిత్యుని నెఱ్ఱగ వెలుంగుచు పోట్టివాడై యించుక తేనెరంగు కన్నులతో నున్న వానింగా గాంచెను. ప్రణామములు చేసి స్తుతించిన సత్రాజిత్తుం గని భగవంతుడు భానుడు సహస్ర కిరణుడు నీకభిమతమైన వరముం గోరుమన నతడా మణి రత్నమునే గోరెను. దానిని వానికి రవి యెసంగి నింగిం దనస్థానము నారోహించెను. సత్రాజిత్తు అత్యంత స్వచ్చమైన యా స్యమంతకమణి రత్నమును కంఠమున ధరించి సూర్యుని వలె వెలుంగుచు సర్వదిక్కుల వెలిగించుచు ద్వారకం బ్రవేశించెను.
అట్లు దేదీప్యమాన ప్రభతో నరుదెంచు నా సత్రాజిత్తుణి గాంచి పౌరులు భూభారావతరణమునకై విష్ణు నంశమైన మానుష మూర్తియై భూమి యందవతరించిన పురుషోత్తముడు భగవంతుడు ఆది పురుషుడునగు కృష్ణుని మ్రొక్కి స్వామీ! తమ దర్శనము గావింప సూర్య భగవను డిడుగో వచ్చు చున్నాడని తెలుప భగవంతుడు హరి యీతడు సూర్య భగవానుడు గాడు ఆదిత్యు దిచ్చిన స్యమంతకమను పేరిమణిని ధరించి యిటు సత్రాజిత్తు వచ్చు చున్నాడు శాన్తులై చూడడన వారునట్లనే చూచిరి.
ఆ సత్రాజిత్తు రత్నమును దనయింట నుంచికొనెను. ప్రతిదినమా మణిరత్నం ఎనిమిది బారువుల బంగారమును గనుచుండెను. ఆ ప్రభావము వలన సకల రాష్టము అనావృష్ట్యాదులగు నీతిబాధాలు అగ్ని వాయు వ్యాళాది ఉపద్రవములు వాసి దుర్భిక్షము మొదలయిన భయము లందలంగి సుఖముండెను. కృష్ణడా దివ్య రత్నము ఉగ్రసేనకు యోగ్యమని దాని జేకొన నిశ్చయించెను. శక్తుడయ్యు జ్ఞాతులతో భేదము వచ్చునను భయముచే దానిని గైకొనడయ్యె. సత్రాజిత్తు ఎన్నటికేని కృష్ణుడు దీనినిమ్మని తన్నడుగునని గ్రహించి యా మణి యెడగల యాశచే దానిని తమ్ముడగు ప్రసేనున కిచ్చెను. ఈ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో అశేష సువర్ణాదికమును బ్రసవించును. తక్కుంగల గుణము లన్నియు ఫలించును. మరొక విధముగా (అశుచియై) దీనిం ధరించి వాని నిది చంపునని యెఱుంగక యీ ప్రసేనుడు దానిని కంఠమున ధరించి గుఱ్ఱమెక్కి వేటాడ అడవికి పోయెను. అక్కడ సింహముచే మరణ మందెను. ఆశ్వముతో గూడ వానిం జంపి యా రత్నమును నోట గఱచుకొని పోవ ప్రయత్నించి ఋక్షాధిపతి (ఎలుగు రాజు) జాంబవంతుని చేతిలో నది మడిసెను. జాంబవంతుడా మణి రత్నమును చేకొని తన గుహం బ్రవేశించెను. సుకుమారుడను పేరు గల బాలకునికి దానిని ఆట వస్తువుగా నిచ్చెను.
ఆ ప్రసేనుడు తిరిగి రాకున్నంత కృష్ణుడు మణిపై చూపు పెట్టెను. అది యతడు గైకొనెను. నిక్కమిది యీ పని వీనిదని సకల యదులోక అందరు చెవి కొరుకుకొనిరి. ఆ లోకాపవాదము చెవింపడ కృష్ణ భగవానుడు యదుసైన్య పరివృతుడై ప్రసేనుని గుఱ్ఱము జాడం బట్టి యేగి సింహ నిహతుడి పడియున్న ప్రసేనుని జూచెను. అందరిలో సింగము నడుగు లంగని మనస్సు కలతతేరి యా యడుగు జాడలంటి పోయి ఎలుగుల రాజుచే హతమైన సింహము నత్యల్ప దూరమున చూచి ఆ మీదట గూడ నా రత్నము నెడ గౌరవముం బట్టి యా ఎలుగుగొడ్డు అడుగు జాడల ననుసరించెను. ఆ కొండచరియ నెల్ల యదు సైన్యమును నిలిపి యా యడుగులం బట్టి చని యా భల్లూకముండు బిలముం ప్రవేశించి సుకుమారుని యాడించు చున్న దాది యొక్క కంఠ స్వరమాలించెను. అది యుయ్యాలలో నా బాలునూపుతూ పాడుచున్న పాట భావమిది. “సింహము ప్రసేనుని గూల్చినది. ఆ సింహము జాంబవంతునిచే నీల్గినది. ఓ సుకుమారా! ఏడవకుము ఈ శ్యమంతకము నీదే కదా!” ఇట్లు ఆ దాది పలుకు విని శ్యమంతకము గనబడ లోపలికేగి యా కుమారునికి ఆట వస్తువుగా జేయబడిన యా మణి రత్నమును దాది చేతిలో జాజ్వల్యమానముగా నున్న దానిం జూచెను. శ్యమంతకముపై వలపుగొన్న చూపుల నరుదేంచిన యయ్యపూర్వ పురుషుని జూచి ధాత్రి రక్షింపు రక్షింపుమని కేకలు వేసెను. ఆయార్తరవ మాలించిన వెంటనే సునమదినిండి యా జాంబవంతు డరుదెంచెను. వారిరువురికి ఇరువది యొక్క రోజులు పోరు జరిగెను.. యదు సైనికులు ఆ గుహ కడ ఏడెనిమిది రోజులు కృష్ణుని రాక కెదురు చూచు చుండిరి. అతడు రాకున్నంత హరి యీ బిల మందు అవశ్యము అంతమంది యుండును. కాదేని యతడు జీవించి యుండిన నతనికి శత్రు సంహారమున కిన్నాళ్ళేల పట్టునని నిశ్చయించి ద్వారక కేతెంచి కృష్ణుడు హతుడయ్యెనని చెప్పిరి. బంధువులు తత్కాలోచిత మగు నుత్తర కర్మకలాములు గూడ జరిపిరి.
అట్లు వారుద్దేశించి చేసిన యా యాచరణ మందుత్తమ పాత్రులందు మిక్కిలి శ్రద్ధతో పెట్టిన మృష్టాన్నములచే శ్రీకృష్ణుని బలము ప్రాణము పుష్టినొందె. అవ్వల శత్రువునకో అనుదినము నా గురు పురుషునిచే (మహా పురుషునిచే పెద్ద మనిషిచే) గొట్ట బడునతి నిష్ఠురములైన దెబ్బలచే నొడలు నవయవములు నెచ్చటను నిరాహారి యగుట చేత బలము తరిగెను. అట్లు భగవంతునికోడి జాంబవంతుడు వ్రాలి యిట్లనియె. నీవు సురాసుర గంధర్వ యక్ష రాక్షసాదు లెవ్వరికీ జయింప రావు. నేలనున్న అల్ప బలులయిన నరులు నరుల కవయవ భూతములైన పశు పక్ష్యాదులకు వాని ననుసరించు నావంటి వారి మాట చెప్పనేల? తప్పక నీవు సకల జగత్పరాయణు డగు నారాయణున యంశమైన నా స్వామి రాముడవే యైయుందువు. అని విన్నవింప కృష్ణస్వామి యతనికి దానవనీ భారముండింప వచ్చుట నెరింగించెను. మఱియునుం బ్రీతి వ్యక్తమగు తన కరతల స్పర్శచే నాతని యుద్ద ఖేదమెల్ల నుపశమింప జేసెను. అతడు మఱి మఱి ప్రణామములు సేయుచు స్వామిం బ్రసన్నుం గావించి తన ఇంటి కేతెంచిన తన ప్రభువునకు పాదములు గడిగి యర్ఘ్యముగా జాంబవతిం దన కన్యా రత్నముం గ్రహింప జేసెను. మఱియుం బదముల కెరగి శ్యమంతక మణిరత్నముం గూడ స్వామికి కానుక పెట్టెను. అచ్యుతుండును మిక్కిలి వినతుడై యిచ్చిన యా మణిని గ్రహింప కూడనిదైనను తన శోధనకు (అపవాదవాపి కొనుటకు) దాను గైకొనెను. జాంబవతితో ద్వారక కేతెంచెను.
భగవంతుని యాగామనముచే గల్గిన యానందాతిశయముచే ద్వారకావాసి జనమ్మునకు మిగుల వయస్సు చెల్లిన వారికి గూడ కృష్ణ సందర్శనముచే ఆ క్షణము నూతన యౌవనము వచ్చినట్లయ్యెను. మహాభాగ్యము మహాభాగ్యమని సకల యాదవులు స్త్రీలును శ్రీహరిని గౌరవించిరి. స్వామియును యాదవ సమాజమునందు దాను పొందిన యనుభవము నున్నదున్నట్లు వారికి తెలిపెను. శ్యమంతకమణిని సత్రాజిత్తున కిచ్చి యాపవాదు తొలగించుకొని జాంబవతిని అంతఃపురము నందుంచెను. సత్రాజిత్తుడును నేను కృష్ణుని యందు లేనిపోని అపవాదును ఆరోపించితినని భయము వలన తన కుమార్తె సత్యభామను భగవంతునికి పత్నిగా నిచ్చెను.
ఆమెను లోగడ అక్రూర కృతవర్మ శతధనాదులు యాదవులు వరించి యుండిరి. ఆమెను కృష్ణుని కిచ్చినందున దమ్ము అవమానించెనని యెంచి సత్రాజిత్తు నందు వైరానుబంధము మొనరించిరి. అక్రూర కృతవర్మాదులా శతదన్వుని గని యిట్లు పలికిరి. అతి దుర్మార్గుడీ సత్రాజిత్తు. మేము నీవు బ్రార్ధించినను మమ్ములను నిన్నుంగూడ లెక్కసేయక తన పుత్రికను కృష్ణున కిచ్చెను. ఈతడు బ్రతికి యుండినది చాలు. వీనిని చంపించి యా మహారత్నము శ్యమంతకమను రత్నమును నీవెందులకు దీసికొనవు? నీపై కృష్ణుడు వైరాను బంధమును గొనెనేని మేమును నీవై యుండెదము. అన నతడట్లే కానిండనియే. లక్కయింట దగ్దులైరి. పాండవులని విని నిజ మెఱింగిన హరి భగవంతుడు దుర్యోధనుని ప్రయత్నములను వమ్ముచేయ యర్జునుని కానుకూల్య మొనరింప వారణావతమున కేగెను. అతడేగిన మీదట నిదురించు చున్న సత్రాజిత్తును శతధన్వుడు చంపి మణి రత్నమును దీసికొనెను. తండ్రి వధకు నిండుకోపము గొని సత్యభామ సత్వరముగ రథమెక్కి వారాణావాతముచని కృష్ణ భగవానునికి నన్నిచ్చుటకు సహింప లేక శతధన్వుడు మా తండ్రిని వధించెను. మఱియు నెమ్మణి ప్రభలచే ముల్లోకముల యంధకారము పటాపంచలగునో అట్టి శ్యమంతక మణిని గూడ హరించెను. ఇది నీకు చేసిన పరాభవమే కావున కర్తవ్య మిప్పుడేమో యాలోచింపు మని కృష్ణునితో పలికెను.
ఆ సత్యభామచే నిట్లు పలుకబడి శ్రీకృష్ణుడు సంతుష్టమైన మనసు గలవాడైనను సత్యభామతో క్రోధముచే నెఱ్ఱనైన నేత్రములు గలవాడై నిట్లనెను. సత్యా! సత్యమిది నాకు జేసిన యవమానమే. ఆ దురాత్ముని ఈ పనిని నేను సహింపను. శత్రు వృక్షమును తిరస్కరించిన దాని నాశ్రయించి యున్న పక్షుల నెవ్వరు జంపరు. నాముందు శోక ప్రేరితమై వచ్చిన నీవాక్య సముదాయము చాలునని పలికి ద్వారకకు వచ్చి ఏకాంతము నందు బలదేవునితో వాసుదేవుడు యిట్లనియె. వేటకై చనిన ప్రసేను నడవిలో సింహము చంపెను. సత్రాజిత్తు కూడ శతధన్వునిచే నిపుడు చంపబడెను. ఆ యిద్దరు పోవుట శ్యమంతక మణి మనకు ఉమ్మడి సొత్తుగా గలదు. అందువలన నీవిపుడు లేలెమ్ము. రథమెక్కుము. శతధన్వుని చంపు ప్రయత్నము సేయుము. అన విని బల రామమూర్తి యట్లేయని యంగీకరించెను. కృష్ణ బలరాము లందులకు బూనుకుని రని తెలిసి శతధన్వుడు కృతవర్మ దరికేగి తన సహాయ నిమిత్తము ప్రేరేపించెను. అప్పుడు కృతవర్మ నేను బలదేవ వాసుదేవులతోడి విరోధమునకు జాలనన అక్రూరుని ప్రేరేపించెను. ఇతడును నిట్లనియె. అడుగం దట్టిన మాత్రమున జగత్రయము గంపించును. అమర వైరుల యంగనలకు వైధవ్యము గూర్చును. ప్రజల రిపు చక్రమునకు అప్రతిహతమైన చక్ర ఆయుధమును దాల్చు నా చక్రితోను అల్లల్లన నొకయింత కనుదెరచి చూచి నంతన నరిబలముం జెక్కి వైచునట్టి ప్రబల శత్రు మదవారణములం బలిమియై దోరించుటలో వెలువరింప బడిన మహా మహిమము గల హలాయుధము గల హరి తోడను బోరుట కఖిల జగద్ద్వంద్యులగు బృందారకులలో గూడ నొక్కడును సమర్థుడు లేడు. నేనెక్కడ? అందుచే మఱొక్కని శరణు గోరుమన శతధన్వుడు నాకు రక్షణ యిచ్చుటకు నిన్నీవ సమర్థునిగ భావింతువేని యిదిగో యీ మణిని జాగ్రత్తగ భద్ర పరుపుమన నతడు అంత్యావస్థలో గూడ నీవింకొకని కిది తెలుపు నందువేని దీనిని నేను దీసికొందు ననియె. అతడట్లేయన నక్రూరుడు యామణిని చేకొనియె. శతధన్వుడు వేగము గల నూరామడల లేక ధాటింగొని పోగల గుఱ్ఱమెక్కి యటనుండి తఱలెను.
శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము లనెడి నాల్గు గుఱ్ఱములు నూన్చిన రథమందు బలభద్ర వాసుదేవు లెక్కి శతధన్వుని దరిమి కొనిపోయిరి. అతడెక్కిన గుఱ్ఱము నూరామడల పరువెత్తి చని చని మిథిలా నగరోపవన ప్రాంతమున ప్రాణములు వాసెను. శతధన్వుడు దానింబాసి పాదచారియై పరువెత్తెను. అప్పుడు కృష్ణుడు బలరామునితో నీవీ రథము మీద నిక్కడనే యుండుము. నేను పాదచారినై యీ పదాతియగు నీయధముని వెంబడించి కూల్చి వత్తును. ఈ ప్రాంతము నందిబ్బందులు భయంకర మయినవి చాల గలవు. నీవీ గుఱ్ఱములనిది దాటిపోనీకుమన బలరాము దట్లేయని రథమందే యుండెను. కృష్ణుడు రెండు క్రోషుల దూరము వెంబడించి దూరమందుండగనే శతధన్వునిపై చక్రము బ్రయోగించి వాని శిరస్సు ఖండించెను. వాని యోడలి పైనున్న వస్త్రము లందెంత వెదకినను ఆ శ్యమంతక మణిం బడయడయ్యె. అంతట వచ్చి బలభద్రున కిట్లనియె. శతధన్వుని మనము వృధాగా గూల్చితిమి. సర్వ జగమ్ములందు సారమైన యా మహారత్నము దొరకలేదు. అనవిని బలరాముడు కోపముతో కృష్ణునిం గూర్చి, ఛీ ఛీ నీవు దురాశకు వశుడ వైతివి తమ్ముడవని సైచితిని. నీ దారిని నీవు పొమ్ము. ద్వారకతో గాని నీతోగాని బంధువులతో గాని నాకు పనిలేదు. నీ మాయా శపథములు చాలు చాలునని కసరి కృష్ణునిచే బ్రతిమాల బడియు నట నిలువక విదేహ రాజ నగరముం బ్రవేశించెను. జనకరాజు నర్ఘ్య పూర్వాకముగా నతని నింటిలో బ్రవేశ పెట్టెను. అతడక్కడనే యుండెను. వాసుదేవుడు ద్వారక కేతెంచెను.
బలభద్రుడు జనకునింట నున్నంత వరకు దుర్యోధనుడు గదా యుద్దము నాతని కడ నభ్యసించెను. మూడేండ్ల తర్వాత బభ్రువు ఉగ్రసేనుడు మున్నుగా గల యాదవులు శ్యమంతక మణిని కృష్ణుడు అపహరింప లేదని తెలిసికొన విదేహ నగరికేగి వారు బలదేవుని విశ్వసింప జేసి ద్వారకకు తీసుకొని వచ్చిరి. అక్రూరుడును నయ్యుత్తమ మణి ప్రసవించు సువర్ణ సంపదచే భగవద్ద్యాన నిష్ఠుడై నిర్విరామముగ యజ్ఞములు చేసెను. అరువది రెండేండిట్లా మణి మహిమచే నక్కడ ఆపదలు దుర్భిక్షము మసూచి మరణములును లేవయ్యెను. అవ్వల నక్రూరుని వైపు వారగు భోజులచే సత్వతుని ప్రపౌత్రుడు (ముని మనువడు) చంపబడ భోజులతో గూడ నక్రూరుడు ద్వారకను విడిచి వెళ్ళిపోయెను. ఆ వెళ్ళిన నాటనుండి యక్కడ ఆపదలు కఱవు ఘాతుక మృగభయము అనావృష్టి మహామారి మొదలయిన యుపద్రవము లేర్పడెను. అంత బలరామోగ్రసేనులతో యాదవు లాలోచన సేసిరి. భగవంతుడు కృష్ణుడు ఈ యుపద్రవము లేర్పడుట గూర్చి యాలోచింప వలయునన అంధకుడను యదు వృద్ధుడు ఈ యక్రూరుని తండ్రి శ్వఫల్గు డెటనెట నుండు నక్కడ దుర్భిక్షమారికానావృష్ట్యాద్యుపద్రవము లుండవనియె. కాశీరాజు రాజ్యమందు అనావృష్టి యేర్పడ శ్వఫల్గుడటకు గోపోబదినంత నా క్షణమ పర్జన్యుడు వర్షించెను.
కాశీరాజు భార్య గర్భమందు మున్నొక కన్య యుండెను. ప్రసూతి సమయము పూర్తియైనను నా శిశువు గర్భము వెలువడి రాకుండెను. ఇట్లు పండ్రెండేండ్లయ్యెను. అప్పుడా కాశీరాజు గర్భమందున్న శిశువుతో, పుత్రీ! ఎందు వలన నీవు పుట్టవు? వెడలిరమ్ము! నీమోము చూడ గోరుచున్నాను. ఈ మీ యమ్మ నెందులకు చిరకాలము శ్రమ పెట్టెదవు? అన గర్భమందున్న యా యాడు శిశువిట్లనియె. తండ్రీ! దినదిన మొక్క గోవును బ్రాహ్మణు కిత్తువేని యింక మూడేండ్లకీ గర్భమును వేలుపడి వత్తునని విని యారాజు ప్రతిదినము విప్రునకు గోవునిచ్చు చుండెను. ఆ పిల్లయు నా చెప్పిన సమయమునకు జనించెను. అందుచే నామెకు తండ్రి గాందినియను పేరు పెట్టెను. ఆ గాందినిని యింటి కేతెంచిన శ్వఫల్గునకును తనకుపకారి యైన దానికి అర్ఘ్య (పూజాద్రవ్య) మైన యా కన్యను దానము చేసెను. ఆ శ్వఫల్గున కీయక్రూరుడు జనించెను. అతని పుట్టుక యిటువంటి గుణవంతు లయిన మిథునము నుండియైనది. ఈతడిట తలగి వెళ్ళినచో దుర్భిక్షమారి కాద్యుపద్రవము లెందులకు కలుగవు? అందువలన నీతని నిక్కడకు గొనిరండు. అతి గుణవంతుని యెడ దప్పులు వెదకుట యిక చాలునని యదువృద్దు డంధకుడు సెప్ప విని కేశవోగ్రసేన బలరామాదులతో యాదవులు సేసిన తప్పు సైరించి యభయ మిచ్చి శ్వఫల్గు కుమారు నక్రూరును పురమునకు రప్పించెను. అక్కడ నతడు వచ్చినంతనే యా శ్యమంతక మణి ప్రభావముచే ననావృష్ట్యాది
సర్వోపద్రవములు నుపశమించినవి.
అంతట కృష్ణుడిట్లు తలంచెను. గాంధిని యందు స్వఫల్గునికి అక్రూరు డుదయించెననుట ఇది చిన్న కారణము. అనావృష్టి దుర్భిక్షాద్యుపద్రవముల వారించు నీ ప్రభావము చాల గొప్పది కావున నిశ్చయముగ నితని దగ్గర నా మహామణి శ్యామంతకముండి తీరును. ఆ మణి ప్రభావము లనేకము లిట్టివి విన బడుచున్నవి. కావున నితని దరిని నిస్సంశయముగ అధిక జీవనాద్రవ్యమగు మణి రత్నమున్నదని నిశ్చయము చేసి మఱియు నొండు ప్రయోజనము నుద్దేశించి కృష్ణుడు సకల యాదవ సమాజముం దనయింట సంఘటించెను. ఆ సభయందందఱుం గూర్చుండ తొలుత సమావేశము యొక్క ప్రయోజనము నుపన్యసించి యదిపూర్తి యయినంతట నక్రూరునితో బ్రసంగాంతరమునకుం దిగి పరియాచకము లాడి జనార్దను డతనితో నిట్లనియె. దానపతీ! మేమెఱుంగనే యెఱుగుదుము. శతధన్వుడు సకల జగత్సారమయిన శ్యమంతక రత్నము నీకిచ్చినట్లు. సర్వరాష్ట్రో పకారక మయిన యది నీ దగ్గర నున్నది. ఉండుగాక! మేమందరమును దాని ప్రభావము యొక్క ఫలము ననుభవించు వారమే. అని యీతడు బలరాముడు మమ్ముల శంకించెను. అందుచే దానిని మా ప్రీతి కొఱకు జూపింపుమని పలికి భగవంతుడు వాసుదేవు డూరకున్నంత రత్నము దగ్గర పెట్టికొన్న యక్రూరు డిట్లనుకొనెను. ఇప్పుడు చేయ వలసినదేమి? ఇంకొకలాగు పల్కితినేని కేవలము బట్టచాటున నున్న దానిని వీరు వెదకువారై యమ్మణిం జూడగలరు. అథి విరోధము మంచిది గాదు, అని యాలోచించి యఖిల జగత్కారణమై యా నారాయణుం గూర్చి అక్రూరుడు యిట్లనియె.
భగవన్! ఈ రత్నమును శతధన్వుడు బహూకరించెను. అతడు సనిన మీదట ఇపుడో రేపో ఎల్లుండియో, భగవంతుడు హరి దీని నడుగ గలడని భోగములందు నా మనస్సత్తు కొనక రవ్వంత యేని సుఖ మెఱుంగ నైతిని. అశేష రాష్ట్రోపకారియైన దీనినింత మాత్రమేని యితడు భద్రపరుప లేక పోయినాడని నీవను కొందువని నిన్నిందులకు బ్రేరేపణ సేయనైతిని. అందువలన నిస్యమంతకముం గైకొనుము. నీ వేవ్వనికీయ నభిమతము వానికి బహూకారింపుము అని తన కడుపునకు జుట్టుకొన్న బట్టలో దాచు కొన్న మిక్కిలి చిన్న పెట్టినున్న దానిని వెలువరించెను. ఆ బరణి నుండి తీసి దానిని నయ్యదకుల సమాజము నందు విడిచెను.
విడిచిన మాత్రదాని యాపరిమిత కాంతిచేత నయ్యాస్థానమెల్ల మిఱుమిట్లు గొనెను. అంత నక్రూరుడదే మణి శతధన్వుడు మాకిచ్చినది ఇది ఎవ్వనిదో యాతడే దీనిం గైకొను గాక యనియె. అది చూచి సర్వయాదవులు ‘బాగు బాగు’ అని మది నచ్చెరువు గొని పలుకు పలుకులు వినబడెను. దానిం జూచి బలరాముడు మా కృష్ణునితో బాటు నాకునిది సమానమైన సొత్తని దానిపై వేడుక పడెను. నా తండ్రి సోత్తేయిది యని సత్యభామ దానిపై మిక్కిలి ముచ్చట పడెను. బలరామ సత్యభామలను జూచి కృష్ణుడు దనను గోచక్రాంతర మందున్న వానింగా భావించెను. సకల యాదవ సమక్షమందు నక్రూరునిం గూర్చి హరి యిట్లనియె. ఈ మణి రత్నమును నాయపవాదు తొలగించు కొనుటకై యీ యాదవుల కుంజూపితిని. ఇది నాకు మా బలరామునకు సరివంతయినది. సత్యభామ పితృ ధనమిది యామెదే. మఱి యెవ్వరిదిం కాదు. సర్వకాలము దీనిని శుచియై బ్రహ్మచర్యాది గుణ సంపన్నుడై ధరించునేని యిది సర్వరాష్ట్రోపకారకము. అశుచియై ధరించిన నిది యా ధరించిన వానిని జంపును. ఇందువలన పదాఱు వేలమందిని బెండ్లాడిన నేనద్దానిం ధరింప అసమర్థుడను. సత్యభామ మాత్రమేట్లు దీనిని స్వీకరించును! ఆర్య బలరామమూర్తి
ఈనిం ధరించునేని మద్యపానాది సకలోప భోగపరిత్యాగము సేయ వలసి యుండును. అందుచే నదివద్దు. ఈ యదులోకము బలభద్రుడు నేను సత్యయును నోదానపతీ! నిన్ను బ్రార్థింతుము. అది నీవే ధరింప సమర్థుడవు. నీవు ధరించిన నిది సర్వరాష్ట్రోపకారక మగును. అందువలన నీవే అశేష రాష్ట్ర నిమిత్తముగా ధరింపుము. మాఱుమాట పలుకకుము. అనిన దానపతి యట్లె యనియె. ఆ రత్నముం గైకొనెను. అది మొదలక్రూరుడు వెల్లడియై జాజ్వలు మానమై యున్న య మణిరత్నముం దన కంఠమున దాల్చి కిరణ మాలియైన యాదిత్యునట్లు సంచరించెను. ఈ కృష్ణ భగవానుని లోకాపవాదు బాపుకొన్న యితి వృత్తము నెవ్వడు స్మరించునో వానికించుకేని యపకీర్తిం గలుగదు. ఇంద్రియ పటుత్వము గలవాడై సకలపాప వుముక్తిం బొందును.
