విష్ణు మహా పురాణము
1 - చతుర్థాంశము - రాజవంశ వివరణము
భగవంతుడా! కర్మ మార్గ మందున్న మానవులు సేయనగు మంచిపని నిత్యము నైమిత్తకమగు కర్మ మేమి సేయవలెనో నాకు గురువులు చెప్పిరి. వర్ణాశ్రమ ధర్మములు గూడ చెప్ప బడినవి. రాజ వంశములను గురించి వినగోరెదనానతిమ్మన
మైత్రేయా! వినుము. బ్రహ్మ మొదలయిన మానవ వంశము అనేక యజ్ఞకర్తలు వీరులు ధీరులు శూరులునైన భూపాలురచే నాలంకృతమైనది. ఆ వంశము యొక్క అనుపూర్విని సర్వ పాప ప్రక్షాళము కొఱకై వినుము. అనాదియగు ఋగ్యజుస్సామాది వేదమూర్తి యగు విష్ణు భగవానుడు సర్వ జగములకాది ఆ పరబ్రహ్మ యొక్క సాకార రూపము హిరణ్య గర్భుడను వాడు బ్రహ్మాండ స్వరూపుడై భగవంతుడు బ్రహ్మ తొలుత రూపొందెను. ఆ బ్రహ్మ యొక్క కుడి బొటన వ్రేలినుండి దక్ష ప్రజాపతి అతని కదితి ఆమెకు వివస్వంతుడు ఆతనికి మనువు జనించిరి. మనువు పుత్రకాముడై నిత్రా వరుణులం గూర్చి యిష్టి కావించెను. మను పత్ని యగు శ్రద్దదేవి కన్యను కోరగా హోతచేసిన హోమమున పొరపాటు వలన అయిష్టి వికలముకాగా ఇలయను కన్య పుట్టెను. ఆమె మిత్రా వరుణుల యనుగ్రహముచే మనువు కొడుకు సుద్యుమ్నుడుగా నయ్యెను. ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు క్రీడించుచున్న ప్రదేశమునకు శివుని చూడ నేతెంచిన మునుల జూచి, కోపించిన పార్వతి నోదార్చుటకై ఇచటికి వచ్చిన పురుషుడు స్త్రీయగు గాక యని కోపముతో శివునిచే శపించిన బడిన తావునకు సద్యుమ్నుడు వేట తమకమున నేతెంచి ఈశ్వర శాపము వలన నాడుదై సోముని కుమారుడగు బుధుని యాశ్రమ ప్రాంతమున జరించెను. బుధుడామె యెడ ననురక్తుడై పురూరవుడను కుమారునిం గనెను. అతడు పుట్టగా మహాతేజస్వులగు పరమర్షులచే, యజురాది చతుర్వేద మయుడు సర్వమయుడు మనోమయుడు విజ్ఞాన మయుడు అశేష మయుడు అమృత మయుడు యజ్ఞ మూర్తియు నగు భగవంతుడు సుద్యుమ్నునికి పుంస్త్వము రావలెనని కోరి యథావిధిగా యజింప బడెను. తత్ప్రసాదముచే నిళ మరల సుద్యుమ్ను డయ్యెను. అతనికి ఉత్కల గయ వినతులను ముగ్గురు కొడుకులు పుట్టిరి. సుద్యుమ్నుడు మాత్రము తోలుతస్త్రీ యనందున రాజ్య భాగమును బొందడయ్యె. కాని వశిష్ఠుని మాట ననుసరించి యాతని తండ్రి ప్రతిష్ఠానమను నగరము నాతని కిచ్చెను. అతడు దానిని పురూరవున కొసంగెను. వాని వంశము వారు అన్ని దిక్కులందు క్షత్రియులైరి.
మనువు కొడుకు పృషధ్రుడు గురువగు వశిష్ఠుని గోపాలనము నకై నియుక్తుడై రాత్రి యందు గోవులను తినగోరి వచ్చిన పులిని చంపగోరి ప్రమాదమున గురు గోవును జంపి గురు శాపమున శూద్రత్వ మందెను. కరూశుని వలన కారూశులు క్షత్రియులు మహాబల పరాక్రములు జనించిరి. దిష్టుని కొడుకు నాభాగుడు కర్మచే వైశ్వత్వ మొందెను. అతనికి బలధనుడను పుత్రుడు కలిగెను. బలధనునికి కీర్తిశాలి యగు వత్స ప్రీతియు వానికి ప్రాంశువు వానికి ప్రజాపతి, వానికి ఖనిమిత్రుడు, వానికి చక్షుషుడు, వానికి నతిబల శాలియైన వింశుడు, వాని వలన వివింశకుడు వానికి ఖనినేత్రుడు వానికి అతివిభూతి, వానికి నతిబల పరాక్రముడగు కరంధముడు, వానికి అవిక్షిత్తు, వానికి మహాబల పరాక్రముడు మరుత్తుడు కల్గిరి. మరుత్తుని గూర్చి యిప్పటికిని యీ రెండూ శ్లోకములు గానము చేయ బడుచున్నవి.
మరుత్తుని యజ్ఞము వంటి యజ్ఞము భూమిపై మఱి ఎవ్వనికి జరిగెను, అందు సర్వ యజ్ఞ సామగ్రి స్వర్ణమయమే. సుశోభానమే, సోమముచే నింద్రుడును దక్షిణలచే ద్విజులు మదించిరి. వడ్డించు వారు మరుత్తులు, సదస్యులు దేవతలు. ఆ మరుత్త చక్రవర్తి నరిష్యంతుడను పుత్రునిం గాంచెను. వానికి దముడు, వానికి రాజ వర్ధనుడు, వాని వలన సువృద్ది, వానికి కేవలుడు, వాని వలన సుధృతి, వానికి నరుడు, వానికి చంద్రుడు, వానికి కేవలుడు, వానికి బంధుమంతుడు, వానికి వేగవంతుడు, వానికి బుధుడు, వానికి తృణబిందువు, అతనికి ఇలబిలయను కన్యయు జన్మించిరి. తృణ బిందువును ఆలంబుస యను నప్సరస వరించెను. ఆమె యందాతనికి విశాలుడు జనించిరి వైశాలి యను పురమును నిర్మించెను. అతని కొడుకు హేమచంద్రుడు, వానికి చంద్రుడు, వానికి ధూమ్రాక్షుడు, వానికి సృంజయుడు, వానికి సహదేవుడు, వానికి క్రుశాశ్వాడు. క్రుశాశ్వునికి సోమదత్తు డుదయించి శాతాశ్వ మేధములు చేసెను. వాని కొడుకు జనమేజయుడు వానికి సుమతి పుట్టెను. వీరు వైశాలికులను పేరందిన రాజులు. వీరిని గూర్చిన శ్లోకమది కీర్తింప బడుచున్నది.
తృణబిందుని ప్రసాదముచే సర్వ వైశాలిక రాజులు దీర్ఘాయుష్మంతులు మహాత్ములు వీర్యవంతులు అత్యంత ధార్మికులు. మను పుత్రులలో శర్యాతి కూతురు సుకన్య. ఆమెను చ్యవన మహర్షి పెండ్లాడెను. శర్యాతి కుమారుడు ఆనర్తుడు మహా ధార్మికుడు. ఆనర్తునికి రేవతుడు కొడుకు. ఆతడానర్త దేశమును బాలించెను. కుశస్థలి యాతని రాజధాని. రేవతుని కొడుకగు (రైవతుడు) కకుద్మియను పేరు గలవాడు. నూరుగురి కతడన్నగారు. అతని కూతురు రేవతి, అతడామెంజేకొని ఈమె ఎవ్వనికి భార్యగాదగుదని బ్రహ్మనడుగ సత్య లోకమున కేగెను. ఆ సమయంలో బ్రహ్మ సన్నిధిలో హాహాహూహూ యను నిద్దరు గంధర్వు లతితాన మను పేరు గల దివ్య గంధర్వమును (సంగీతమును) బాడిరి. అది కూడ త్రిమార్గ పర్యావృత్తిగ ననేక యుగములు జరుగు దాక యటనుండి విని యా కాలమంతయు నొక్క ముహూర్త మాత్రమయినట్లు భావించెను. పాట చివర భగవంతుని అబ్జయోనిని బ్రణమిల్లి రైవతుడు తన కన్య కర్హుడైన వరుడెవ్వరని యడిగెను.
భగవంతు డాతనిని నీకభిమతుడగు వరుడెవ్వడని ప్రశ్నించెను. అతడు ప్రణమిల్లి తన కభిమతులైన వరులను బెర్కొనెను. వీరిలో నీ కభిమతు డెవ్వడు? వానికి నా కన్య నిత్తుననియె. అంతట నించుక తలవంచి యల్లన నవ్వుచు బ్రహ్మ నిట్లనియె. నీ కభిమతులైన వారు వీరెవ్వరో వారి సంతానమునకు సంతానము కూడ నిపు డవనితల మందు లేదు. ఇచట నీవు సంగీతము వినుచుండ ననేక మహా యుగములు గడచి పోయినవి. ఈపుడవనిపై నిరువది ఎనిమిదివ మనువు యొక్క మహాయుగ మించుమించు గడచి పోవుచున్నది. కలి సమీపించినది గదా! నీవొంటరిగ నేవ్వనికేని ఈ పిల్లనిమ్ము. నీకు కూడ మంత్రి భృత్య కళత్ర బందుసైన్య కోశాదు లన్నియు నీ కాలమున పూర్తిగ జెల్లి పోయినవి. అన విని యా ఱేడు మిక్కిలి జడిసి భగవంతునికి మ్రొక్కి యిట్లడిగెను. స్వామి! పరిస్థితి యిట్లుండా నేనీ కన్య నెవ్వని కీయవలయు? నన నించుక మెడ వంచి చేతులు మొగిచి సర్వలోక గురువగు కమల యోని యిట్లనియె.
