విష్ణు మహా పురాణము

Table of Contents

4 - ప్లక్షాదిద్వీప వర్ణనము

 

 

క్షీర సముద్రముచే జంభూ ద్వీపము చుట్టబడి నట్లు ప్లక్ష ద్వీపము లవణోదధిచే పరివృతమై యున్నది. జంబూ ద్వీప విస్పృతి లక్ష యోజనములు, దానికి రెట్టింపు ప్లక్ష ద్వీపము. ప్లక్ష ద్వీపేశ్వరుడు మేధాతిథి, వాని కుమారు లేడ్వురు. శాంతహయుడు (జ్యేష్టుడు) శిశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు, వారీ ద్వీపము నేలినవారు. వారి పేరా మర్యాదా (హద్దు) కారక పర్వతము లేదు గలవు. అట్లే వర్ష పర్వతములు మఱి యేడు గలవు. మునులారా! వాని పేర్లు వినుడు. గోమేదము, చంద్రము, నరదము, దుందుభి, సోమపము, నుమనస్సు, వైభ్రాజము అనునవి.

 

 

పుణ్యాత్ములారా! రమ్యములగు నీవర్ష పర్వతము లందును, వర్షము లందును ప్రజలు దేవ గంధర్వులతో గూడి వసింతురు. అందలి దేశములు పవిత్రములు. వీర్యవంతములు. అందు జనులు మృతి నందరు. అది వ్యాధులు లేక సర్వ కాలము సుఖముందురు. అందు నదులు గూడ ఏడే. సముద్ర గాములు. వానిపేర్లు అనుతప్త, శిఖ, విప్రాష, త్రిదివ, కరము, ఆమృత, సుకృత అనునవి. వినినంతనే పాపములు హరించునవి. ప్రధానమైన నదులు, పర్వతములు పేర్కొన బడినవి. చిన్న చిన్న నదులు పర్వతములు వేలకొలది గలవు. ఆచటి వారు ఎప్పుడును యా నదీ జలములనే త్రాగు చుందురు. కాని నదులు తగ్గవు పెరుగవు. ఆ ప్రదేశము లేడింటి యందును యుగ వ్యవస్థ లేదు. ఎల్లప్పుడు త్రేతాయుగ సమముగనే కాలము నడుచును. ప్లక్ష ద్వీపము మొదలు శాక ద్వీపము దనుక జనులు అయిదు వేలేండ్లా యువుఁగల్గి నిరోగులయి యుందురు. వర్ణాశ్రమ విభాగానుసార మక్కడ ధర్మము నాల్గు విధములుగ నుండును. అక్కడ వర్ణములు నాలుగు. వానిని మీకు చెప్పుచున్నాను వినుడు. ఆర్యకులు, కురువులు, వివిశ్వులు భావులు నను పేర విప్రక్షత్రియ వైశ్వశూద్రులు అను నాలుగు వర్ణముల వారుందురు.

 

 

జంభూ ద్వీపమున జంబూ వృక్షమున్నట్లు అంత పరిమాణము గల జువ్వి చెట్టు ప్లక్ష ద్వీప మధ్య మందున్నది. అందుచే దానికా పేరు గల్గినది. అందు ఆర్యకాది వర్ణముల వారిచే జగత్కర్త సర్వేశ్వరుడును సోమరూపియు నగు నా హరి ఆరాధింప బడును. ప్లక్ష ద్వీప ప్రమాణము గల ఇక్షు (చెఱకు రసము) సముద్రముచే ప్లక్షద్వీప మావరింపబడి యున్నది. మునులారా! ఇట్లు మీకు ప్లక్ష ద్వీపము సంగ్రహముగ వర్ణించితిని. ఇక నాచే శాల్మల ద్వీపమును గూర్చి తెలిసికొనుడు.

 

 

 

 

 

ఇందలి వర్షములు శ్వేతము, లోహితము, జీమూతము, హరితము, వైధ్యుతము, మానసము, సుప్రభము ననునవి. ఇందు చాతుర్వర్ణ్య వ్యవస్థ యున్నది. కపిల = తేనె రంగు, అరుణ = ఎఱుపు, పీత = పసుపు, కృష్ణము = నలుపు అను రంగులు గల్గి క్రమముగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిందు నివసింతురు. అతి మనోహరమైన యీ ద్వీప మందు దేవతలు సన్నిధి సేసియుందురు. శాల్మల వృక్ష ముండుటచే నీ ద్వీపమునకు శాల్మల ద్వీపమని పేరు. కుశ ద్వీపము చుట్టును సురా సంద్ర మున్నది. శాల్మల ద్వీపమునకు రెట్టింపు విస్తారము గలది.

 

 

 

ఇందు రాజైన జ్యోతిష్మన్తుని కుమారులు ఉద్భిదుడు, వేణు మంతుడు, స్వైరధుడు, రంధనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు అనువారి పేరులతో వర్షము లున్నవి. ఇందు మనుజులతో బాటు దైత్య దానవ దేవ గంధర్వ యక్ష కింపురుషులును వసింతురు. ఇక్కడ స్వధర్మానుష్ఠాన పరులయిన బ్రాహ్మణాది చతుర్వర్ణ ప్రజలు వరుసగా దములు, శుష్మిణులు, స్నేహులు, మందేహులు నను పేర నుందురు. అక్కడ పరబ్రహ్మ రూపుడు జనార్ధనుడు డారాధ్యదైవము. అచట జనులు జనార్దను గూర్చి యజ్ఞములు సేసి అధికారము పురుషులుగా నవతరింప వలసిన పురాకృత పుణ్యకర్మ ఫలమును క్షయింప జేసికొందురు. అనగా కేవల నైష్కర్మ్య విషయమున ముక్తి కోరుదురని తాత్పర్యము. విద్రుమము, హేమ, శైలము, ద్యుతిమంతము, పుష్టిమంతము, కుషేశాయము, హరి మందరము ననునవి యచ్చట వర్ష పర్వతము లేడు. ధూతపాప, శివ, పవిత్ర, సమ్మతి, విద్యుదంభస్సు, మహీ యనునవి మరికొన్ని చిన్న చిన్న ఏరులు వేలకొలది సర్వపాప హరములైన వక్కడ నున్నవి. కుశద్వీప మధ్యమున కుశ స్తంభ మున్నది. అందుచే దాని కాపేరు గల్గినది. ఘృత సముద్రము క్రౌంచ ద్వీపముచే నావృతమయి యటనున్నది.

 

 

 

ఇక క్రౌంచ ద్వీపము కుశ ద్వీపము కంటె రెట్టింపు విరివి గలది. ఇచట ద్యుతి మంతుని కుమారు లేడుగురు పరిపాలకులు. కుశగుడు, మండుగుడు, ఉష్ణుడు, పీవరుడు, అందకారకుడు, ముని, దుందుభి యనువారు. దేవ గంధర్వ నిషేవితములు రమ్యములునైన వర్ష పర్వతము లిందున్నవి అవి క్రోన్చం, వామనము, అందకారకము, దేవవ్రతము, ధమము, పుండరీకవంతము, దుందుభి అనునవి యోకదాని కంటె నొకటి రెట్టింపు ప్రమాణము గలవి. ఇక్కడ దేవ గణములతో గూడి పుష్కరులు పుష్కలులు ననువారు ధన్యులై చరింతురు. బ్రాహ్మణాది చతుర్వర్ణములు. నిందు గలవు. ఇందు ప్రధాన నదు లేడు. గౌరీ, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీక యనునవి. అక్కడ పుష్కరాదులచే ధ్యాన యోగమున యజ్ఞమందు రుద్రరూపుడైన జనార్దను దారాదింప బడును. ఇది మీగడ సముద్రముచే ఆవృతము. అది యాద్వీప పరిమాణము గలది. దాని చుట్టును శాకద్వీప మున్నది.

 

 

శాకద్వీప పతియైన భవ్యునికి జలదుడు, కుమారుడు, మనీరకుడు, కుశమోదుడు, మోదకి, మహాద్రుముడు నను పుత్రులు గలరు. అందలి వర్షములు వారిపేర నున్నవి. అందేడు వర్ష పర్వతములు ఉదయగిరి, జలధార, రైవతకము శ్యామము. అంభోగిరి, అస్తికేయము, కేసరి యునునవి. సిద్ద గంధర్వ సేవితమై యిచట శాకమను (టీకుగాని కడిమిగాని) మహావృక్ష మున్నది. దాని యాకుల గాలి తాకినచో పరమాహ్లాదము గల్గును. అక్కడ పవిత్రము లయిన చతుర్వర్ణ ప్రజతో గూడిన జానపదములు గలవు. అచట జనులు నిరాతంకులు ఏ అభ్యంతరము లేనివారు నీరోగులు, నదులు మహా పుణ్యములు. పాప భయహరములు సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, ధేనుక, గభస్తి అనునవి ఏడు చిన్న చిన్న ఏరులు గిరులు వేలున్నవి. జలదాది గిరులపై వసించు జనులా నదీసలిలములను ద్రావుదురు. ఈ నదులు స్వర్గము నుండి వచ్చినవి. అచటి ప్రజలలో ధర్మహాని సుఖ దుఃఖములు, శాత్రము హద్దు మీరి నడుచుట అనునవి లేవు. మగులు మాగధులు మానసులు మండగులు ననుపేర బ్రాహ్మణాది చతుర్వర్ణ ప్రజలచట నివసింతురు. శాకద్వీప వాసుల కులదైవము విష్ణువు సూర్య రూపుడుగా యథావిధి శ్రీహరి యీ ప్రజలచే నర్చింప బడును.

 

 

శాక ద్వీపము అదే ప్రమాణము గల క్షీరాబ్డిచే నావరింప బడియున్నది. క్షీరాబ్ధి పుష్కర ద్వీప సమావృతము, శాక ద్వీపము కంటె రెట్టింపు ప్రమాణము కలది పుష్కరము. పుష్కర ద్వీప మందు పవనుని కుమారులు మహావీతుడు, ధాతకి యనువారు. వారిపేర వర్షములు రెండు. ఇక్కడ వర్ష పర్వతము మానసోత్తర మనున దొక్కటియే. అది యీద్వీపము నడుమ వలయా కారమున నున్నది. ఏబది వేల యోజనముల యెత్తు. అంతే వెడల్పు గలది. అది పుష్కర ద్వీప మండలమును నడిమికి రెండు భాగములు సేయు చున్నట్లున్నది. దాని మూలముననే యీ ద్వీపము రెండు వర్షములుగా విభక్తమైనది. అవి వలయాకారములు. వాని నడుమ పెద్ద గిరి కలదు. అచటి జనులు పదివేలేండ్లు జీవింతురు.

 

 

వారు రాగద్వేష శోకములు లేనివారు. ఆరోగ్యవంతులు వారిలో అధమోత్తమ భేదము లేదు. చంపువాడు చంప బడువాడును లేరు. ఈర్ష్యాసూయ లెరుగరు. భయము రోషము దోషము లోభము శూన్యములు. మానసోత్తర పర్వతమునకు మహావీత ఖండము వెలుపలిది. ధాతకీ ఖండము లోపలిది. దేవ దైత్యులు వసింతురురు. ఈ వర్ష ద్వయమున పుష్కర ద్వీపమందు సత్యానృతము (వాణిజ్యము) లేవు. నదులు లేవు. కొండలు లేవు. ద్వీపములు లేవు.

 

 

మనష్యు లందరి వేషమొక్కటే. వారు దేవ సమ రూపులు. అట వర్ణాశ్రమాచార ధర్మ విచక్షణ లేదు. వేదత్రయము వార్త దండనీతి శోశ్రుష యనునవి లేనేలేవు. ఈ వర్ష ద్వయము భూలోక స్వర్గమే. కాలము జరా రోగములు లేక సర్వసుఖ ప్రదమగును. ఈ రెండు ఖండము లందు పుష్కర ద్వీపమందు న్యగ్రోధ (మఱ్ఱి) మహావృక్షము బ్రహ్మయుండు స్థానము. బ్రహ్మ యచట సురాసురులచే పూజింప బడుచుండును. తియ్యని నీటి సముద్రముచే నది చుట్టు కొన్నది. దాని ప్రమాణము పుష్కర ద్వీప సమానము. ఇట్లు ద్వీపము లేడును సముద్రము లేడింటిచే నావరింప బడియున్నవి. ద్వీపము లన్నియు సమ ప్రమాణములు. సముద్రము లన్నియు వానికి రెట్టింపు ప్రమాణము గలవి.

 

 

అన్ని సాగరము లందలి నీరు నెల్లప్పుడును సమము. హెచ్చు తగ్గులు లేవు. నిప్పుచే గిన్నెలో నీరు పొంగినట్లు చంద్రుని వృద్ది ననుసరించి అందలి నీరు పొంగును. ఆ పొంగు క్రుంగు కూడా నన్నిట సమానమే. అన్ని సాగరములు సమముగా పొంగును తగ్గును. శుక్ల కృష్ణ పక్షములందు చంద్రోదయా స్తమయము లందు పదునైదు అంగుళములు పొంగుచు క్రుంగుచు నుండును. పుష్కర ద్వీపవాసు లందురు అన్ని వేళల స్వయంప్రాప్తమైన షడ్రసోపేత భోజనము సేయు చుందురు. స్వాదూదక (మంచి నీటి) సముద్రము చుట్టూ లోకమున్నది. దానికి రెట్టింపు బంగారు భూమి. జంతు రహితము ఆ మీద లోకాలోక పర్వతము పదివేల యోజనములు విరివైనది అంతే ఎత్తున లోతు గలది. అ శైలము నావరించి చీకటి యున్నది. ఆ చీకటి అండకాటాహ మంతట నావరించి యున్నది. ఇంత వరకు గల ఈ భూమి యేబదికోట్ల యోజనముల ప్రమాణము గలది. బ్రహ్మాండ కటాహముతో ద్వీపములతో పర్వతములతో నీధాత్రి విధాత్రి (సృష్టి హేతువు) యై సర్వ భూతములలో గుణాదిక్యము గలదై సర్వ జగదాధారయై యున్నది.