విష్ణు మహా పురాణము

Table of Contents

26 - రుక్మిణీ కల్యాణము - ప్రద్యుమ్న జననము

 

 

కుండినము రాజధానిగ భీష్మకుడను రాజు విదర్భ దేశము నేలుచుండెను. ఆయన కుమారుడు రుక్మి - కూతురు రుక్మిణి యనంబరగిరి. రుక్మిణిం గృష్ణుడు కృష్ణుని రుక్మిణియు నన్యోన్యము వరించి కొనిరి. కాని రుక్మి ద్వేషము గొని యామెం జక్రికీయ డాయెను. జరాసంధుని ప్రేరణమున రుక్మితో గూడ భీష్మకు డామెను శిశుపాలునకు వాగ్ధానము సేసెను. శిశుపాలుని హితవుకోరు రాజులు జరాసంధాదులు పెండ్లికి భీష్మక నగరమున కేతెంచిరి. కృష్ణుడును బలభద్రుడు మున్నగు యాదవులతో చైద్యరాజగు శిశుపాలుని పెండ్లి చూడ కుండినమున కేగెను. రేపు వివాహము గానున్న తరి కృష్ణుడు శత్రు నిగ్రహ కార్యభారమును బలరామాదులగు బందుగుల పైనిడి యా పెండ్లికూతుం దొంగచాటుగ గొనియేగెను.

 

 

అంత పౌండ్రక దంతవక్త్ర విదూరథ శిశుపాల జరాసంధ సాల్వాది రాజులు కోపమెత్తి హరిం బరిమార్ప పెద్ద ప్ర్రయత్నము సేసిరి. ఎదుర్కొని బలరామాది యదుపుంగవుల చేతిలో నోడిపోయిరి కూడ. కేశవు ననిం గూల్పక కుండినము సోరనని ప్రతినసేసి రుక్మి కృష్ణుం గూల్ప వెనుదరిమెను. బలానుజుడు చతురంగ బలముం గూల్చి విలాస మాత్రముగ నా రుక్మి నవనిం బడ ద్రొబ్బెను. ఇట్లు రుక్మిం గెల్చి చక్కగ రాక్షస వివాహ ప్రక్రియను లభించిన రుక్మిణిని మధుసూదనుడు పెండ్లాడెను. ఆమె యందు హరి మన్మథాంశుడైన వీర్యవంతుడగు ప్రద్యుమ్నునిం గనియె. అతనిని శంబరాసురుడు హరించి కొనిపోవ వానిని ప్రద్యుమ్నుడు సంహరించెను.