విష్ణు మహా పురాణము
10 - నిత్యనైమిత్తిక కామ్యక్రియ వర్ణనమ్ పాణిగ్రహ విధానమ్
బ్రాహ్మణోత్తమా! నాల్గాశ్రమముల యొక్కయు వర్ణముల యొక్కయు కర్తవ్య క్రియలు చెప్పితివి. నీవు సమస్త ధర్మముల నెఱింగిన వాడవు. కావున మానవుడాచరింప వలసిన నిత్య నైమిత్తిక కామ్య కర్మము నెల్ల వినగోరేద నెఱింగింపుము.
నీవడిగిన దానిని చెప్పెదను. ఏకాగ్ర మనస్కుడవై వినుము. తండ్రి కుమారుడు పుట్టగనే జాతకర్మ మున్నగునవి అభ్యుదయ శ్రద్ధతో జేయ వలయును. ఓ రాజా! ప్రాఙ్ముఖులగు బ్రాహ్మణ దంపతులను భుజింప జేయవలెను. హేతువాగు సంస్కారములను పిత్రర్చనలను బ్రాహ్మణులకు తృప్తి కలుగ నట్లు చేయవలెను. పెరుగు, యవలు, రేగుపల్లు వీనితో మిశ్రమమైన పిండములను సంతోషముతో నాందీముఖ దేవతల నుద్దేశించి దైవతీర్థ (కరాగ్ర) ముతో సమర్పించ వలెను. సమస్త వృద్ది కాలము లందు (కన్యాపుత్ర వివాహాదు లందు వి.పు.3 అం.13అ. 5,6 శ్లోకములలో చెప్పా బడినది.) ఉపచారముల నెల్ల ప్రాజాపత్య తీర్థము (కనిష్టికా మూలము)లో ప్రదక్షిణముగ చేయ వలయును. పిమ్మట తండ్రి పురుడు పడవ రోజు గడువగానే (11వ రోజున) కుల దేవతా నామయుక్తమై పురుష వాచకముగ నుండి బ్రాహ్మాణాదులగు నాల్గు వర్ణముల వారికి క్రమముగ శర్మ వర్మ గుప్త దాస పదములంతము నందు గల నామము నుంచ వలెను. అర్థశూన్యము అప్రశస్తము అపశబ్ద సహితము అమంగళకరము ఏవగింపును కలిగించునదియు గాక సమాక్షరములు గలదియుయై అథి దీర్ఘాక్షరములు అతి హ్రస్వాక్షరములు అథి గురు వర్ణ సమేతము కానిది సుఖముగ నుచ్చరింప దగినది లఘ్వక్షరములు చివర గలదై యుండు పేరును పెట్టవలెను. పిమ్మట బాలుడు అనంతర సంస్కారము (ఉపనిష్క్రమణ, అన్నప్రాశన, ఉపనయనము) లచే సంస్కరింప బడినవాడై విధి ననుసరించి విద్యాస్వీకారము చేసి, గురువునకు దక్షిణ నొసంగి గృహస్థాశ్రమము కోరి భార్యను చేపట్ట వలెను. లేక సంకల్ప పూర్వకముగా నైష్టిక (యావజ్జీవ) బ్రహ్మచార్యముతో నైనను కాలము గడుప వచ్చును. గురువునకు లేక వారి పుత్రాడులకు శుశ్రూష చేయవలెను. ఇచ్చ ననుసరించి అనగా పూర్వ సంకల్పమును బట్టి వానప్రస్థుడు లేక పరివ్రాజకుడు (సన్యాసి) కావచ్చును. ఏకగుణ వయస్కయగు భార్యను త్రిగుణ వయస్కుడగు నాతడు పెండ్లాడ వలెను. అనగా తనకంటే చిన్నదానిని వివాహము చేసికొన వలయునని తాత్పర్యము. అధిక కేశములు కలది, లేక కేశ శూన్యయైనది మిక్కిలి నల్లనిది గోరోచన వర్ణము గలది స్వభావ విరుద్ధముగా నధికాంగము గలదియు హీనాంగములు గలదియు అపరిశుద్ద మైనదియు దుష్కులమున బుట్టినదియు అదిక రోమములు గలది అతి రోగవతియు, దుష్టురాలు, దుష్ట వాయము లాడునది కుష్టాది రోగాలగు తల్లి దండ్రులు గలది పుంస్త్వాభివ్యన్జకమగు గడ్డము మీసాలు గలది, పురుశాకారము గలది, ఘర్ఘర స్వరము గలది, క్రుశించినది, కాకి ధ్వని గలది, చంచల దృష్టి గలది, గుండ్రని నేత్రములు గలది, రోమయుతము లగు పిక్కలు గలది, ఎత్తైన చీలమండలము గలది, నవ్వుచుండగా గుంటలు పడు చక్కిళ్ళు గలదియు వివాహమునకు పనికి రాదు. మిక్కిలి రూక్షమైన కాంతి కలది, తెల్లని గోళ్ళు కలది, ఎర్రని చూపు గలది, మిక్కిలి లావైన హస్త పాదములు గలది, మిక్కిలి పొట్టిది, మిక్కిలి పొడవైనది, కలిసి యున్న కనుబొమ్మలు కలది, మిక్కిలి ఎడమైన దంతములు గలది, భయంకర ముఖము గలదియు పనికి రాదు. మాతృ పక్షము నుండి అయిదవది, పితృపక్షము నుండి యేడవదియగను కన్యను ధర్మవిధి ననుసరించి వివాహమాడ వచ్చును, వివాహము లెనిమిది విధములు గలవు. బ్రాహ్మము, దైవము, ఆర్శము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము. వీనిలో నేవర్ణముణ కేది ధర్మముగా మహర్షులచే చెప్పబడి యున్నదో దానిని స్వీకరించి యితరమును విడువ వలెను. తనతో కూడి ధర్మ మాచరించు దానితో చేసికొనిన సద్వివాహము మహాఫలము నొసంగును.
