విష్ణు మహా పురాణము

Table of Contents

6 - సామశాఖా పురాణ వివరణము

 

 

సామవేద మనెడి వృక్షము యొక్క శాఖలను వ్యాస శిష్యుడగు జైమిని మహర్షి క్రమముగా విభజించిన రీతిని చెప్పెద వినుము. జైమిని పుత్రుడు సుమంతుడు. సుత్వానుడు సుమంతుని కుమారుడు. వీరిరువురు తమ తమ తండ్రుల యొద్ధ నొక్కొక్క సంహితను నధ్యయనము చేసిరి. సుత్వానుని కుమారుడు సుకర్మ కూడ తన తండ్రి యొద్ద అధ్యయనము చేసి సహస్ర సంహితా విభాగము చేసెను. ఆ విభాగమును సుకర్మ శిష్యులగు కోసల దేశీయులైన హిరణ్యనాభుడు పౌష్పింజియు గ్రహించిరి. పౌష్పింజికి ఉత్తర దేశీయులగు నైదు వందల మంది సామగానము చేయువారు శిష్యులుండిరి. హిరణ్యనాభునకు గూడ నంత మంది శిష్యులు, వారిని పండితులు ప్రాచ్యసామగు లందురు. లోకాక్షి, కౌముదికక్షీవాన్ లాంగలి యను పౌష్పింజి శిష్యులనేక సంహితలను శిష్య ప్రశిష్యులతో వ్యాప్తి చేసిరి. హిరణ్య నాభుని శిష్యుడు కృతనామ ముని తన శిష్యులకు నిరువది నాలుగు సంహితాలను చెప్పెను. వారిచేత నీ సామవేదము బహు శాఖలుగ విస్తరింప బడినది.

 

 

ఇక అదర్వ వేద సంహితల సముదాయమును చెప్పెదను. మహాతేజస్వి యగు వ్యాస శిష్యుడగు సుమంతుడు కంబంధుడను శిష్యునకు అధర్వ వేదమును చెప్పెను. అతడు దానిని రెండుగా చేసి తన శిష్యులగు దేవశర్మకు పథ్యునకు నిచ్చెను. దేవశర్మ శిష్యులు మేధ బ్రహ్మబల శౌల్కయని పిప్పలాదుడు నని నలుగురు. పద్యుని శిష్యులు మువ్వురు. జాబాలి సుముదాది శౌనకుడు. శౌనకుడు రెండుగ విభజించిన యొక దానిని బభ్రువున కిచ్చెను. రెండవ సంహితను సైంధవుడను వానికిచ్చెను. సైంధవుని తర్వాత ముంజికేషుడు, వేదములు రెండు భాగములు సేసెను. ఈ సంహిత వికల్పములు అయిదు. 1. నక్షత్ర కల్పము, 2. వైతన కల్పము, 3. సంహితా కల్పము, 4. అంగిరస కల్పము, 5. శాంతి కల్పము. ఇవి అధర్వుణులకు శ్రేష్ఠములు. పురాణార్ధ విశారదుడగు వ్యాసముని అఖ్యానములు (చూచి చెప్పిన కథలు) ఉపాఖ్యానములు(విని చెప్పిన కథలు) గాధలచే (ఋభువదాదులు) కల్పశుద్దులు (పితృ కల్పమంత్ర కల్పాదుల) చే పురాణ సంహితను నిర్మించెను.

 

 

మహామతి మంతుడగు వ్యాస భగవానుడు తన శిష్యుడు సూతుడని ప్రఖ్యాతుడగు రోమహర్షణునకు పురాణ సంహిత నొసంగెను. 1. సుమతి, 2. అగ్ని వర్చసుడు, ౩. మిత్రాయువు, 4. శాంసపాయనుడు 5. ఆకృత వ్రణుడు 6. సావర్ణి అను వారరుగురు రోమహర్షణుని శిష్యులు. సావర్ణి శంసపాయనుడు సంహితా కర్తలు. ఈ మూడు సంహితలకు మూలమగు సంహిత వ్యాసులు రచించి లోమహర్షుణుని కిచ్చిరి. "లోమహర్షణి కాచాణ్య" అని యందు చెప్పిన సంహిత లోమహర్షణుడు రచించినది కాక వ్యాసుల వలన పొందినదని యర్థము. ఈ పురాణ సంహితము మూలముగా గల పురాణములు నాచే రచింప బడినవి. మొదటి పురాణము బ్రహ్మము. పురాణములు పదునెనిమిది అని పురాణజ్ఞులు చెప్పుదురు. 1. బ్రహ్మము, 2. పాద్మము, ౩. వైష్ణవము, 4. శైవము, 5. భాగవతము (దేవీ), 6. నారదీయము, 7. మార్కండేయము, 8. ఆగ్నేయము, 9. భవిష్యము, 10. బ్రహ్మవైవార్తము, 11. లైంగము, 12. వారాహము, 13. స్కాందము, 14. వామనము, 15. కౌర్మము, 16. మాత్స్యము, 17. గారుడము, 18. బ్రహ్మాండము. ఈ పదునెనిమిది పురాణములు గాక ఉప పురాణములు గూడ మునులచే జెప్ప బడినవి. పురాణము లందు సర్గము ప్రతి సర్గము వంశము మన్వంతరములు వంశాను చరితము మను పంచ లక్షణములు చెప్పబడినవి. ఓ మైత్రేయా! నీకిపుడు నేను చెప్పుచున్న పురాణము విష్ణు పురాణము తరువాతది. సర్గాదుల యందు భగవానుడే కర్తగా నన్నిటి యందు చెప్ప బడుచుండును, వేదాంగములు ఆరు. వేదములు నాలుగు. మీమాంస న్యాయము (తర్కము) పురాణము, ధర్మశాస్త్రము నను నీ పదునాలుగు విద్యలు. ఆయుర్వేదము, ధనుర్వేధము, గాంధర్వ (సంగీత) వేదము, అర్థశాస్త్రము(రాజనీతి) అను నీ నాలుగు చేర్చిన పదునెనిమిది విద్యలగును. మొదట బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు అని ఋషి ప్రకృతులు మూడు. శాఖలు శాఖా భేదములు తత్కర్తలు ఆభేదమునకు కారణములు తెలుప బడినవి. అన్ని మన్వంతరము లందును శాఖాభేదము లిట్లే యుండును. కల్పాది యందు ప్రజాపతిచే దృష్టమైన శృతి (వేదము) నిత్యమే. ఇపు డధ్యయనము చేయ బడుచున్న శాఖా భేదములు ప్రాజాపత్యశ్రుతి యొక్క వికల్పములు. (కావున అనిత్యముల వంటివి. ప్రతి ద్వారమున కొంచెము మారుచుండును) మైత్రేయా! నీయడిగినంత చెప్పితిమి. వేద సంబంధమైన విషయ మింకేమి నీకు కావలెను.