హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

55 - బ్రహ్మ ఉపదేశము

వైశంపాయనుడిలా చెప్పాడు.

విష్ణుమూర్తి నారదుని మాటలు విని చిరునవ్వుతో శుభమైన వాక్యాన్ని ఇలా పలికాడు.

నీవు మూడులోకాల క్షేమం కోసం మాట్లాడిన దానికి సమాధానం చెపుతున్నా- రాక్షసులు ఏయే శరీరాలు ధరించి భూలోకం ఉన్న నేను అంతా ఎరుగుదును. ఉగ్రసేనుడి కొడుకు కంసుణ్ణి, కేశి, కువలయాపీడ, చాణూరముష్టిక రాక్షసుల నందరినీ నేనెరుగుదును. వీళ్ళు కాక ఖర, ప్రలంబ, పూతనలను, గరుడునికి భయపడి యమునలో దాగిన కాళియునీ బాగా ఎరుగుదును. రాజుల తలలపై ప్రకాశించు జరాసంధుని కూడా ఎరుగుదును. ప్రాగ్జోతిషపురంలో నరకాసురుడు శోణితపురంలో బాణాసురుడు కూడ నాకు తెలుసు. భూభారాన్ని తగ్గించే పని నామీద ఉంది. కంసుడు మొదలైనవాళ్ళను ఎలా చంపాలో ఆలోచిస్తూనే ఉన్నాను. నేను యోగబలం చేత రాక్షసుల మాయనంతనూ నాశం చేస్తా. నేను ఎక్కడ ఉండి ఏవేషంలో రాక్షసులను నాశం చెయ్యాలో బ్రహ్మ యిలా చెప్పాడు.

నారాయణా! పూర్వం కశ్యపుడు, వరుణుని ఆవులను తీసుకువెళ్ళాడు. కశ్యపుడికి అదితి, సురభి అని ఇద్దరు భార్యలు. వాళ్ళకు వరుణుని ఆవులను ఇవ్వటం ఇష్టంలేదు. ఒకరోజున వరుణుడు నావద్దకు వచ్చి నమస్కరించి ఓ పూజ్యుడా! నా తండ్రి కశ్యపుడు ఆవులనన్నిటినీ తీసుకున్నాడు. తన పని పూర్తి అయినా ఆవులను పంపలేదు. తన భార్యలైన అదితి, సురభి, అనేవాళ్ళ మాటలను సమర్ధిస్తున్నాడు. నా ఆవులకు ఏనష్టం రాదు. సముద్రము ఒడ్డున సంచరిస్తున్నాయి. కశ్యపుడు తప్ప ఎవడూ బెదిరించలేడు. ఆ ఆవులు అమృతం వంటి శ్రేష్ఠమైన పాలను ఎన్నెనా యిస్తాయి. నీవు ప్రభువు గురువూ, నీవు అందరినీ నియమించే వాడివి. నీవే మాకు గొప్పదిక్కు. తప్పు చేసినవాళ్ళను శిక్షించకపోతే లోకం అస్తవ్యస్త మౌతుంది.

మీరు నా ఆవులను ఇప్పించండి. నేను సముద్రానికి వెళ్ళిపోతాను. మీరు మొదట ఆవులను, బ్రాహ్మణులనూ సృష్టించారు. అందుచేత ఆవులను కాపాడటం మీకు ప్రధానమైన పని. ఆవులను రక్షిస్తే అవి బ్రాహ్మణుల్ని రక్షిస్తాయి. గోబ్రాహ్మణ రక్షణ వల్ల ప్రపంచమంతా రక్షింపబడుతుంది. ఓ అచ్యుతా! వరుణుడిలా చెప్పిన మీదట బాగా తెలుసుకొని కశ్యపుడికి ఆవుల్ని అపహరించినందువల్ల భూలోకంలో గొల్లవాడుగా పుట్టమని శాపమిచ్చాడు. అతని భార్యలైన అదితి, సురభి కూడా అతనితోపాటు భూలోకంలో పుడతారు. కశ్యపుడు గొల్లవాడై పుట్టి తన యిద్దరు భార్యలతో విహరిస్తాడు అని అన్నాడు.

కనుక ఈ సమయంలో కశ్యపుడు గొల్లవాడై వసుదేవుడనే పేరుతో గోరక్షణ చేస్తున్నాడు. మధురానగరం దగ్గరే గోవర్ధనమనే పర్వతము ఉంది. అక్కడనే వసు దేవుడు ఉండి కంసుడికి పన్ను చెల్లిస్తూ గోకులానికి రాజుగా ఉన్నాడు. అదితి, సురభి ఇద్దరూ దేవకి, రోహిణి, పేర్లతో అవతరించారు. సురభి రోహిణి అయింది. అదితి దేవకి అయింది. ఓ మధుసూదనా! లోకకల్యాణం కోసం గోపాలక వేషంలో అవతరించండి. పూర్వం వామనావతారంలో మాయతో కప్పబడినట్లు ఇప్పుడు గోపాలుడవై నీ శరీరాన్ని పోషించుకో, ఇంద్రుడు మొదలైన దేవతలు జయజయ ధ్యానాలు చేస్తూ స్తోత్రం చేస్తారు.

కాబట్టి నీవు దేవకీ రోహిణుల గర్బంలో జన్మించి వారిని సంతోషపెట్టు. అక్కడ వేలాది గోపికలు నీకు ఉత్సాహం కలిగిస్తారు. ఆవులను మేపటానికి అడివిలో తిరుగుతావు. ఆసమయంలో వనమాలతో ప్రకాశించే అందమైన నీ శరీరాన్ని చూచి కృతార్థులౌతారు. ఓ కమలనేత్ర! విష్ణు! నీవు బాలవేషంలో అవతరిస్తే నీ తత్త్యం తెలియక జనులు ఆజ్ఞానంలో పడతారు. గోపాలకులందరూ భక్తులై గోశాలలో నీకు సహాయం చేస్తారు. నీవు జలక్రీడకు యమునలో దిగినప్పుడు వాళ్ళందరూ మిక్కిలి సంతోషిస్తారు. వసుదేవుడికి నీవు ప్రాణమే. ఇప్పటివరకు నిన్ను తండ్రి అనేవాడు కుమారా అంటాడు. మహర్షి కశ్యపుడే తండ్రి కాదగినవాడు అట్లే దేవకియే నీకు తల్లికాదగినది.

ఇప్పుడు యోగబలంతో భూలోకంలో రాజులను జయించుటకు వెళ్ళు. మేమందరం ఇప్పుడు మాయిళ్ళకు వెళ్తున్నాం. వైశంపాయనుడిలా అన్నాడు. మహారాజా! శ్రీమహావిష్ణువు దేవతలను వాళ్ళలోకానికి పంపి క్షీరసముద్రానికి ఉత్తర దిక్కునందున్న తన నివాసానికి వెళ్ళాడు. అక్కడ మేరుపర్వతం విశాలగుహ ఉన్నది. అక్కడనే తన వెనుకటి శరీరాన్ని ఉంచి భూలోకంలో వసుదేవుని యింటితో సంబంధం పెట్టుకొన్నాడు.