హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
33 - యదువంశ వర్ణన - కార్తవీర్యోత్పత్తి
వైశంపాయనుడిలా చెప్పాడు.
రాజైన యదువుకు ఐదుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు- సహస్రదుడు, వయోదుడు, క్రోష్టుడు, నీలుడు, అంజికుడు. సహస్రద పుత్రులు హైహయ, హయ, వేణుహయ అను ముగ్గురు. హైహయునకు ధర్మనేత్రుడు, ఇతనికి కార్తుడు, ఇతనికి సాహంజుడు. ఇతని పట్టణం సాహంజని. ఇతనికి మహిష్మంతుడు. ఇతని పట్టణం మాహిష్మతి. ఇతనికి భద్రశేణ్యుడు. ఇతడు కాశీనగరపు రాజు. ఇతనికి దుర్గముడు. వీనికి బుద్ధిమంతుడైన కనకుడు. వీనికి నలుగురు పుత్రులు కృతవీర్యుడు, కృతేజుడు, కృతవర్మ, కృతాగ్ని. కృతవీర్యుని కొడుకు అర్జునుడు. ఇతని కుమారుడు కార్తవీర్యార్జునుడు. తన వెయ్యిచేతులతో ఏడుద్వీపాలతో కూడిన భూమిని జయించి దానికి రాజయ్యాడు. ఇతడు పదివేల సంవత్సరాలు తపస్సుచేసి దత్తాత్రేయుని పూజించాడు. దత్తాత్రేయుడు ప్రసన్నుడై నాలుగు వరాలిచ్చాడు. మొదటివరానికి వెయ్యిచేతులు, రెండవది అధర్మంగా ప్రవర్తించే వాళ్ళను నశింప చేయుట, మూడవది భూమినంతను జయించుటవలన ప్రజలను సంతోషపెట్టుట, నాల్గవది శత్రువులనందరినీ జయించి చివరకు బలవంతుడైన శత్రువుచేత మరణించుట అని నాలుగు వరాలు. ఇతనికి కావాలనుకోగానే వేయి చేతులు పుట్టేవి. ఏడుద్వీపాలను జయించి అక్కడ ఏడువందల యజ్ఞాలు చేశాడు. గొప్ప దక్షిణలిచ్చేవాడు. ప్రతియజ్ఞంలోనూ బంగారు యూపస్తంభాలు, బంగారు అరుగులు తయారుచేయించేవాడు.
విమానాలలో విహరించే దేవతలు, అప్సరసలు, గంధర్వులూ నిత్యమూ అతని యజ్ఞంలో కలుసుకొని ఆయాజ్ఞాలకు శోబ కలుగజేసేవాళ్ళు. గంధర్వ రాజైన వరీదాసుని పుత్రుడు గంధర్వుడైన నారదుడు అతని యజ్ఞాలన్నిటిలోనూ గుణాలను గానంచేయటానికి నియమింపబడ్డాడు. అతడు కార్తవీర్యుని ప్రభావం చూచి ఆశ్చర్యపోయాడు. నారదుడిలా అన్నాడు. యజ్ఞదాన తపస్సులందు, శోభాజ్ఞాన పరాక్రమములందునూ కార్తవీర్యునికి సమానుడెవ్వడూ లేడు. అతడు ఏడుద్వీపాలలోనూ ఖడ్గమును, ధనుస్సునూ ధరించి రథంమీద సంచరిస్తూ ప్రజలకు యోగిలా కనబడేవాడు.
ఈవిధంగా ధర్మపరిపాలన చేస్తూ ప్రజలను రక్షించేవాడు. అతని రాజ్యంలో ఏ లోటూ కనబడేదికాదు. కార్తవీర్యుడు యాభైవేల సంవత్సరాలు రాజ్యం చేసి చక్రవర్తియై ప్రపంచంలో సమస్త శ్రేష్ఠవస్తువులనూ అనుభవించాడు. అతని కాలంలో యోగబలంచేత అతడే క్షేత్రపాలకుడుగా, అతడే పశుపాలకుడుగా, అతడే నీటిని వర్షించే మేఘంగా రూపొందాడు. యుద్ధరంగంలో వేయిభుజాలు ధరించినప్పుడు అతడు వెయ్యికిరణాలు గల సూర్యుని శోభను పొందేవాడు. తేజశ్శాలియైన కార్తవీర్యుడు కర్కోటకుని కుమారులైన సర్పగణాలను జయించి వాళ్ళ మాహిష్మతీ పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్నాడు.
అతని భుజబలం చేత వర్షాకాల సముద్రవేగం కూడ ఎదురు ప్రవహించేది. నురుగుమాలతో శోభించే నర్మదానది తన తరంగాలతో భయపడుతూ తాకేది. భయంకరుడైన ఆరాజును చూచి మహాసర్పాలు తలలు కదిపేవి కావు. అతడు రావణుని జయించి తెచ్చి మాహిష్మతీ నగరంలో బంధించాడు. పులస్త్యుడు యాచింపగా రావణుని విడిచిపెట్టాడు. పరశురాముడు బంగారుతాడిచెట్లవనం వంటి ఈతని వెయ్యిచేతులను ఖండించాడు. కార్తవీర్యునికి కుమారులు వంద మంది. వాళ్ళలో జయధ్వజుడనువానికి తాలజంఘుడు పుత్రుడు. అతనికి వంద మంది పుత్రులు. వీళ్ళందరూ హైహయ వంశ మహాపురుషుల వంశంలో పుట్టిన వీతిహోత్ర, సుజాత, భోజ, అవన్తి, తాండికేర, భరత, విక్రాంత పేర్లుగల రాజులు తాలజంఘ వంశంలో పుట్టినవాళ్ళు.
వాళ్ళవంశం చాలా విస్తారమైనది. ఎక్కువమంది అవటంచేత వాళ్ళ పేర్లు చెప్పటంలేదు. వృషుడు మొదలైన యాదవులు పుణ్యాత్ములు. వృషుడు మూల పురుషుడు. ఇతనికి మధువు. ఇతనికి వందమంది పుత్రులు. వీళ్ళలో వృషణుడి వల్లనే ఈ వంశం విస్తరించింది. వృషణునికి వృష్ణిగణం, మధువుకి మాధవగణం, యదువుకు యాదవగణం, హైహయగణం జన్మించాయి. వీళ్ళలో శూర సేనుడనువాడు గొప్పవాడు. అతని దేశమునకుకూడ అతని పేరే. ధనం నశించేది కాదు, పోయినవస్తువు దొరికేది కార్తవీర్యుని జన్మ తలచుకొన్నవాడికి.
మహారాజా! ఈవిధంగా యయాతి కొడుకులు ఐదుగురు భూమిని పోషించారు. వాళ్ళ వంశచరిత్రను చెప్పాను. యయాతి కొడుకులు ఐదుగురి వంశ వృత్తాంతం విన్నవాళ్ళు ఐదు ఇంద్రియాల్నీ వశం చేసుకోవటానికి సమర్థులౌతారు. మరియు పుత్రులు, ఐశ్వర్యం, భూమి, ఆయుస్సు, కీర్తి ఈ ఐదింటినీ పొందుతారు. రాజా! ఇప్పుడు ఉత్తమ పురుషార్థంగల క్రోష్టువంశ చరిత్ర చెపుతా విను. ఈ వంశంలో వృష్ణవంశానికి అలంకారమైన శ్రీకృష్ణభగవానుడు జన్మించాడు. ఈ క్రోష్టువంశం వర్ణన విన్నవాడు అన్నిపాపాలనుండి విడువబడిన వాడగుచున్నాడు.
