హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
34 - వృష్ణి వంశవర్ణన - అక్రూరాది పరిచయము
వైశంపాయనుడిలా చెప్పాడు.
క్రోష్టువనువాడికి గాంధారి, మాద్రి ఇద్దరు భార్యలు. గాంధారి బలిష్ఠుడైన “అనమిత్రు”ని కన్నది. మాద్రి యుధాజిత్తు, దేవమీడుడు అను పుత్రులను కన్నది. ఈ ముగ్గురు పుత్రులచేత కృష్ణవంశము మూడుభాగాలుగా విడిపోయింది. యుధాజిత్తుకు “వృష్ణి”, “అంధకుడు” అని యిద్దరు పుత్రులు. వృష్ణికి కూడా శ్వఫల్కుడు, చిత్రకుడు అని యిద్దరు కొడుకులు. మహాత్ముడైన శ్వఫల్కుడు ఉన్నచోట వ్యాధి భయం ఉండేదికాదు. వర్షాలు లేకపోవుట కూడ ఉండేదికాదు. ఒక సమయంలో కాశీనగరరాజ్యంలో మూడు సంవత్సరాలు వర్షాలు కురవలేదు.
అప్పుడు కాశీరాజు గొప్ప ఆదరంతో శ్వఫల్కుని తన రాజ్యానికి తీసుకువచ్చాడు. అతడు రాగానే కాశీలో చక్కగా వర్షం కురిసింది. తరువాత కాశీరాజు తన కూతుర్ని గాందినిని శ్వఫల్కునికిచ్చి పెళ్ళి చేశాడు. గాందిని ప్రతిదినమూ బ్రాహ్మణులకు దానం చేసేది. ఆమె చాలారోజులు తల్లి గర్భంలోనే ఉండి పోయింది. ఒకరోజున తండ్రి బిడ్డా! ఇన్నాళ్ళు గర్భంలో ఎందుకు ఉన్నావు? త్వరగా జన్మించుము అన్నాడు. ఆ కన్య తండ్రీ! రోజూ ఒక ఆవును దానంచేసే ఏర్పాటు చేస్తే నేను పుడతాను అన్నది. తండ్రి అందుకు ఒప్పుకొన్నాడు. ఆమె పుట్టింది.
తరువాత శ్వఫల్కుని ద్వారా గాందినికి అక్రూరుడు పుట్టాడు. ఇతడు దాత, యజ్ఞం చేయువాడు, వేదం తెలిసినవాడు. అతిధులంటే ప్రేమ కలవాడు. అపానంగ, మద్గు, మృదుర, అరిమేజయ, అవిక్షిప, ఉపేక్ష, అరమర్ధన, శత్రుఘ్న, గృధ్రమీజ, అన్తక, ఆయాహ, ప్రతివాహ అనే పుత్రులు, ఒక అందగత్తె ఐన పిల్లకూడ పుట్టారు. అక్రూరుడికి మిక్కిలి అందగత్తె “ఉగ్రసేని” భార్య. ఆమె గర్భంనుండి ప్రసేనుడు, ఉపదేవుడు అనే యిద్దరు పుత్రులు పుట్టారు. శ్వఫల్కపుత్రుడైన చిత్రకునకు పృథు, అశ్వగ్రీవ, అశ్వబాహు, సుపార్శ్వక, గవేషణ, అరిష్టనేమి, సుధర్ముడు, సుబాహు అనే పుత్రులు, శ్రవిష్ఠ, “శ్రవణ” అనే యిద్దరు కన్యలు పుట్టారు. అశ్వకియందు దేవమీఢుషుడు శూరుడనేవాణ్ణి కన్నాడు.
ఇతనికి భోజకన్య “మహిషి” యందు పదిమంది పుత్రులు కలిగారు. వాళ్ళలో వసుదేవుడు పెద్దవాడు. ఇతనికి ఆనకదుందుభి అని రెండవపేరు. భూలోకంలో వసుదేవుడు వంటి అందగాడులేడు. ఇతని శరీరకాంతి వెన్నెలవలె ఉండేది. ఇతడు పుట్టిన తరువాత శూరుడికి దేవభోగ, దేవశ్రవ, అనాధృష్టి, కనవక, వత్సవంతుడు, గృంటిమ, శ్యామ, శమీక, గండూష అని తొమ్మిదిమంది కొడుకులు, పృథుకీర్తి, శృతదేవ, శృతశ్రవ, రాజాధిదేవి అని ఐదుగురు కన్యలూ పుట్టారు. కుంతిభోజుడు “పృథ”ను తన కుమార్తెగా చేసుకొనుటకు అడిగితే శూరుడు ఆ కన్యను కుంతి భోజుడికి ఇచ్చాడు. కుంతిభోజుడి కుమార్తె అయిన తర్వాత కుంతి అనే పేరు వచ్చింది. “అన్త్యుడి”కి శ్రుతదేవయందు జగృహు పుట్టాడు.
చేదిదేశపు రాజైన దమఘోషునివల్ల శ్రుతశ్రవకు “శిశుపాలుడు” జన్మించాడు. శిశుపాలుడు పూర్వజన్మలో హిరణ్యకశిపుడు. వృద్ధశర్మకు పృథుకీర్తి యందు కరూష దేశాధిపతి దంతవక్త్రుడు జన్మించాడు. కుంతిభోజుడు కుంతిని కుమార్తెగా చేసుకొన్నాడు. ఆమెను పాండురాజు పెండ్లి చేసుకొన్నాడు. ధర్మం తెలిసిన ధర్మరాజు ఆమెయందు యమునివలన, వాయుదేవునివలన భీముడు, ఇంద్రుని వలన ధనంజయుడు (అర్జునుడు) జన్మించారు. అనమిత్రునికి పుత్రుడు “శిని”. ఇతనికి సత్యకుడు, ఇతనికి యుధానుడు(సాత్యకి), ఇతనికి అసంగుడు, ఇతనికి “భూమి”, వీనికి యుగంధరుడు. ఇక్కడికీ వంశం పూర్తి అయింది. దేవభాగుడి కొడుకు ఉద్దవుడు. ఇతడు గొప్ప పండితుడు. అశ్మకికి అనాధృష్టి వలన “యశస్వి” జన్మించాడు. దేవశ్రవుని పుత్రుడు శత్రుఘ్నుడు, కిరాతులు అతన్ని తీసుకువెళ్ళి పెంచారు. అతడు పుట్టగానే విడిచిపెట్టబడ్డాడు. ఇతడే ఏకలవ్యుడని ప్రఖ్యాతి చెందాడు. పుత్రులులేని “వత్సవాతు” కు వసుదేవుడు కాశికుడనే పుత్రుని దానం చేశాడు.
అట్లే సంతానంలేని గండూషుడికి విష్వక్సేనుడు చారుదేష్ణ సుచారు, పంచాల, కృతలక్షణ అనే నలుగురు పుత్రులను దానంచేశాడు. చారుదేష్ణుడు యుద్ధం లేకుండా ఉండలేడు. చారుదేష్ణుడు రుక్మిణికి చివరికొడుకు. తంత్రజిత్తు, తంత్రి పాలుడు వీళ్ళిద్దరూ “కనవకు”డి పుత్రులు. వీరుడు, అశ్వహనుడు “గృంజిము”డి పుత్రులు. “శ్యాముడి” కొడుకు అభీకుడు. శమీకుడు రాజసూయయజ్ఞం ప్రారంభించాడు. ధర్మరాజు ఇతనికి సహాయంచేస్తూ శత్రువులనందరినీ నశింపచేశాడు. ఇప్పుడు వసుదేవుని వీరపుత్రుల వృత్తాంతం వర్ణిస్తాను. మహారాజ! అనేక శాఖలతో కూడిన మూడుభాగాలైన విశాల వృష్ణివంశపు చరిత్ర విన్నవాడు ఎప్పుడూ అనర్దమును పొందడు.
