హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

8 - మన్వంతర, యుగ, బ్రహ్మదిన, వర్షమానములు

మరల జనమేజయుడు ఓ బ్రాహ్మణోత్తమా! ఇప్పుడు మన్వంతరము యొక్క యుగముల సంఖ్యనూ, బ్రహ్మ యొక్క పగటి ప్రమాణాన్నీ చెప్పుము అని అడిగాడు.

అప్పుడు వైశంపాయనుడిలా అన్నాడు.

సూర్యుడు మనకు పగటిని, రాత్రిని విభజిస్తున్నాడు. ఈ రాత్రింబవళ్ళ లెక్క ప్రకారమే మన్వంతరము మొదలగువాటి సంఖ్యను నిరూపిస్తాను. పదిహేను రెప్పపాట్లు “కాష్ట” అనబడుతుంది. ముప్పైకాష్టలు “కల”. ముప్పై కలలు “ముహూర్తము”. ముప్పై ముహూర్తాలు ఒకరోజు. ఈవిధంగా చంద్రసూర్యుల నడకనుబట్టి రాత్రింబవళ్ళ లెక్క జరుగుతున్నది. 15 రోజులు ఒకపక్షం. రెండు పక్షాలు ఒకనెల. రెండునెలలు ఒక ఋతువు, మూడుఋతువులు దక్షిణాయనం, అలా మూడుఋతువులు ఉత్తరాయణం. రెండు ఆయనాలు ఒక సంవత్సరం. కాలతత్త్వం తెలిసినవాళ్ళు రెండుపక్షాలు పితృదేవతలకు ఒకరోజు. పితృదేవతలకు కృష్ణపక్షం పగలు, శుక్లపక్షం రాత్రి. కనుకనే కృష్ణపక్షంలోనే తల్లితండ్రులకు శ్రాద్ధం చేయబడుతుంది.

మనుష్యుల సంవత్సర కాలము దేవతలకు ఒకరోజు అవుతుంది. ఉత్తరా యణం వాళ్ళకు పగలు, దక్షిణాయనం రాత్రి. దేవతల పదిసంవత్సరాల కాలం మనువుకు ఒకరోజు. అతనికి ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. దేవతల పదిసంవత్సరాలు మనువుకు ఒకరోజు. ఈ ప్రకారంగా పదిరోజులు మనువుకు ఒక పక్షం. పదిపక్షాలు ఒకనెల, పన్నెండు మాసాలు ఒక ఋతువు, మూడు ఋతువులు ఒక అయనం. ఇలా రెండు ఆయనాలు గడిస్తే మనువుకు ఒక సంవత్సరం. దేవతల వేయి సంవత్సరాలు మనువుకొక సంవత్సరం.

ఓరాజా! సత్య, త్రేతా, ద్వాపర, కలి, అనేవి నాలుగు యుగాలు. వీటిలో మనువుల యొక్క నాలుగువేల సంవత్సరాలు సత్యయుగం. మూడువేల సంవత్సరాలు త్రేతాయుగం, రెండువేల సంవత్సరాలు ద్వాపరయుగం. వేయి యుగాల కాలంలో కలియుగం పూర్తి అయిపోతుంది. ఈ నాలుగు యుగాల ప్రాతఃకాల, సాయంకాల పరిమాణం- సత్యయుగంలో ప్రాతఃకాలం నాలుగు వందల సంవత్సరాలు, మరొక నాలుగు వందల సంవత్సరాలు సాయంకాలము. రెండే కాలాలుంటాయి. త్రేతాయుగంలో మూడు వందల సంవత్సరాలు ప్రాతః కాలము, మరొక మూడు వందల సంవత్సరాలు సాయంకాలము. ఇలాగే ద్వాపర యుగంలో రెండువందల సంవత్సరాలు ప్రాతఃకాలం, మరో రెండు వందల సంత్సరాలు సాయంకాలం. కలియుగంలో వందసంవత్సరాలు ప్రాతఃకాలం మరొక వంద సంవత్సరాలు సాయంకాలము. ఈ విధంగా మనువుకు అన్ని యుగాల మొత్తం సంఖ్య పన్నెండు వేల సంవత్సరాలు, ఇప్పుడు మనుష్యమానం ప్రకారం యుగ సంఖ్యను చెపుతాను విను.

71 యుగాలు ఒక మన్వంతరం. ఈ మనువులకు రెండు ఆయనాలు ఉంటాయి. మనువుల దక్షిణాయనకాలం బ్రహ్మకు పగలు. వాళ్ళ ఉత్తరాయణం మనువుకు రాత్రి. ఏ ఆయనంలోనైనా ఒక మనువు లయం చెందితే తక్కిన సమయానికంత కూ రెండవమనువు అతనిస్థానంలోకి వస్తాడు. పదివేల మన్వంతరాలు గడిస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. ఇలా యదార్ధం తెలిసిన వాళ్ళు చెప్పే మాటలు బ్రహ్మ రోజు కల్పము. వెయ్యియుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి అవుతుంది. బ్రహ్మయొక్క రాత్రి సమయంలో పర్వతాలతో వనాలతో కూడిన ఈ భూమి మెల్లమెల్లగా నీటిలో మునిగిపోతుంది. తరువాత వెయ్యియుగాలు నిండితే బ్రహ్మకల్పం నశిస్తుంది. బ్రహ్మకు ఒకరోజు గడిస్తే ఒక కల్పం అవుతుంది. ఈ విధంగా డెబ్భైయొక యుగాల వివరణ వినిపించాను.

జనమేజయా! సత్యత్రేతాది యుగాల సంఖ్య కీర్తిని వృద్దిచేసే పద్నాలుగు మనువుల యొక్క వృత్తాంతము నీకు చెప్పాను. వేదాలలో, పురాణాలలో మనువులు, ప్రజాపతులు చెప్పబడ్డారు. వీరి గుణాలను వింటే లోకంలో ధనం ప్రాప్తిస్తుంది. ప్రతి మన్వంతరంలోనూ ఒకమారు ప్రలయము సృష్టి జరుగుతాయి. ఈ సృష్టి లయాల ప్రవాహాన్ని నిరూపించటం మిక్కిలి కష్టము. వంద సంవత్సరాలలో కూడ పూర్తిగా చెప్పటం శక్యం కాదు. మన్వంతరం పూర్తి అయినప్పుడు దేవతలు సప్తర్షులు మాత్రం తపస్సు బ్రహ్మచర్యము శాస్త్రజ్ఞానంతో పాటు ఉంటారు. కాని వెయ్యి యుగాలు పూర్తి అయిన తరువాత అంతా నశించిపోతుంది. ఆ సమయంలో అన్ని ప్రాణులు సూర్యుని తాపానికి మండిపోతాయి. ఆ సమయంలో సమస్త జీవసముదాయము ఆదిత్యగణమూ బ్రహ్మదేవుడు భగవంతుడైన నారాయణుని శరీరంలో ప్రవేశిస్తారు. ప్రతికల్పంలోనూ ప్రాణులను సృష్టిస్తూ నిత్యస్వరూపుడై వెలుగొందుతున్నాడు పరమాత్మ.

ఈ సమస్త ప్రపంచమూ అతని మహిమయే. కల్పానమై ఈ ప్రపంచం సముద్రంలో కలిసిపోయినప్పుడు భగవంతునికి రాత్రి సమయం అవుతుంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గర్భంలో నిద్రపోయి వెయ్యిసంవత్సరాలు పడుకొంటాడు. రాత్రి గడిచిపోగానే ఆయన లేచి మరల సృష్టిపనిలో ప్రవేశిస్తాడు. అప్పుడు మళ్ళీ వెనుకటి ధర్మశాస్త్రాలు, పురాణాలు, దేవతాస్థానాలు, మహాపురుషుల చరిత్రలు ప్రపంచంలో ఏర్పడతాయి. ఈ పనులలో మధ్య మధ్య ప్రళయం వస్తూ బాధ పెడుతుంది. వెనుక సూర్యుని తాపానికి తగులబడిపోయిన ప్రాణులు ఆదేవర్షులు, యక్షరాక్షసగంధర్వ, సర్పాలు, పూర్వపు ఋతువులు వచ్చి తమతమ పనులు చేయటం ప్రారంభిస్తాయి.

ప్రజాసృష్టి చేయు బ్రహ్మ ఈ విధంగా మాటిమాటికీ భగవంతుని శరీరం నుంచి పుట్టి ప్రజలను సృష్టిస్తాడు. ఈ మధ్యలో దేవతలు, ఋషులు, బ్రహ్మలో లీనమైనవాళ్ళు మళ్ళీ పుట్టనవసరంలేదు. మహారాజా! కాలతత్వం తెలిసిన దేవదేవుడు నారాయణుడు ఈ ప్రకారం క్రమం వెయ్యి పగళ్ళు వెయ్యి రాత్రులు గడిపి సృష్టి విలయాన్ని చేస్తూ ఉంటాడు. ఇపుడు నేను వైవస్వత మనువు యొక్క వృత్తాంతాన్ని చెపుతా. ఎందుకంటే ఈ మన్వంతరంలోనే రాక్షసుల నాశము జనులకు మేలు చేయటానికి భగవంతుడు కృష్ణుడు వృష్ణవంశంలో పుట్టాడు.