హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

31 - కుక్షేయు వంశవర్ణనము

జనమేజయుడిలా అడిగాడు.

మహాత్మా! నేను “పూరు” వంశాన్ని పూర్తిగా వినగోరుతున్నాను. ద్రుహ్యుడు, అనువు, యదువు, తుర్వసువు వీరల వంశాన్ని విడివిడిగా వైశంపాయనుడీ విధంగా చెప్ప మొదలుపెట్టాడు. మహారాజ! నీవు ద్రుహ్యుడు అను యదు, తుర్వసు మొదలైన పూరువంశరాజుల చరిత్ర విను. ఆ వంశంలోనే కదా నీజన్మ.

మహాత్ముడైన పూరువుకు ప్రచిన్వంతుడనే బలశాలియైన ఒక పుత్రుడున్నాడు. ఇతడు తూర్పుదిక్కున విజయం పొందాడు. ప్రచిన్వంతుని పుత్రుడు ప్రవీరుడు. ఇతని కుమారుడు మనస్యుడు. ఇతని కొడుకు అభయదుడు. ఇతని కొడుకు సుధన్వుడు. ఇతని కుమారుడు బహుగవుడు. ఈతని పుత్రుడు శమ్యాతి. ఈతని కొడుకు రహస్యాతి, వీని కొడుకు రౌద్రాశ్వుడు. ఇతనికి ఘృతాచి అనే అప్సరస యందు పదిమంది పుత్రులు కలిగారు. వాళ్ళలో ఋచేయుడు అనువాడు మొదటి వాడు. కృకణేయుడు, కక్షేయుడు, స్థండిలేయుడు, సన్నతేయుడు, దశార్ణేయుడు, జలేయుడు, స్థలేయుడు, బలేయుడు, ధనేయుడు అనే పదిమంది కొడుకులు పుట్టారు. అలాగే పదిమంది కూతుళ్ళు. ఆపిల్లల పేర్లు - రుద్ర, శూద్ర, ఛద్ర, మదల, మలహ, ఖలద, నలద, సురస, గోచపల.

ఈ కన్యలందరూ అందగత్తెలు. అత్రికులంలో పుట్టిన ఋషి ప్రభాకరుడు వీళ్ళ భర్త. ఇతడు రుద్ర అనే భార్యయందు సోముడు అనే పుత్రుని కన్నాడు. రాహువు సూర్యుని చంపినపుడు అతడు భూమి మీదికి జారిపడుతుండగా ప్రపంచ మంతటా చీకటి వ్యాపించింది. కాంతిని సృష్టించే ఋషి అత్రి నీకు శుభమగుగాక అనగానే పడుతున్న సూర్యుడు బ్రహ్మర్షిమాట వలన పడలేదు. ఈ మహాతపశ్శాలి అత్రిగోత్రాన్ని ప్రవర్తింపచేశాడు. దేవతలు యజ్ఞంలో ఇతనికి కూడ యజ్ఞభాగాన్ని తప్పనిసరైన దాన్ని చేశారు. ఆ కన్యలవల్ల ఈతనికి మహాబలవంతులైన పదిమంది పుత్రులు జన్మించారు. ఈ పదిమంది పితరులుగా పేరొందారు. వేదపారదర్శులు, గోత్రప్రవర్తకులు, స్వస్త్యాత్రేయులుగా ప్రసిద్దిచెందారు. కాని అత్రివలె యజ్ఞభాగానికి అధికారులు కాలేదు.

కుక్షేయువుకు ముగ్గురు మహారధులైన పుత్రులు సభానరడు, చాక్షుషుడు, పరమన్యుడు. సభానరుని కొడుకు కాలానలుడనే రాజు. కాలానలుడికి ధర్మం తెలిసిన సృంజయుడు, ఇతనికి పురంజయుడు, వీని పుత్రుడు జనమేజయుడు. ఇతనికి మహాశాలుడు, ఇతనికి మహామనస్సు. ఇతడు దేవతలచే పూజింపబడిన వాడు, గొప్పకీర్తి గలవాడు. ధర్మం తెలిసిన ఉశీనరుడు బలశాలియైన తితిక్షువు వీరిద్దరూ మహాశాలుని పుత్రులు. ఉశీనరుడికి పెద్దపెద్ద రాజర్షివంశంలో పుట్టిన ఐదుగురు భార్యలు ఉన్నారు. వాళ్ళపేర్లు నృగ, కృమి, నవ, దర్వా, దృషద్వతి. ఉశీనర మహారాజుకు ఆ భార్యల వలన వంశకీర్తిని విస్తరింపచేసే ఐదుగురు పుత్రులు జన్మించారు. వాళ్ళలో నృగకు నృగుడు, కృమికి కృమి, నవకు నవుడు, దర్వాకు సువ్రతుడు, దృషద్వతికి శిబి పుట్టారు.

శిబి యొక్క పుత్రుల పేర్లు విను. వృషదర్భుడు, సువీరుడు, మద్రకుడు, కేకయుడు అని నలుగురు కుమారులు. వీళ్ళ రాజధాని పేరు వీళ్ళ పేరునను సరించియే యున్నది. ఇప్పుడు తితిక్షువు యొక్క వంశావళిని వర్ణిస్తున్నాను విను. తితిక్షువుకు మహాబాహువు ఉపద్రథుడు పుత్రుడు. ఇతడు తూర్పుదిక్కున రాజ్యాన్ని స్థాపించాడు. ఉపద్రథుడికి పుత్రుడు ఫేనుడు, ఇతనికి సుతపుడు, వీనికి “బలి”. ఇతడు పూర్వజన్మలో గొప్పయోగి. ఇతనికి ఐదుగురు కుమారులు. మొదటివాడు అంగుడు”, వంగుడు, సుహ్ముడు, పుండ్రుడు, కళింగుడు. వీళ్ళు బాలేయక్షత్రియులని పిలువబడ్డారు. పుట్టుకచే వీళ్ళు క్షత్రియులైనా బ్రాహ్మణు లయ్యారు. బ్రహ్మదేవుడు సంతోషించి బలికి నీవు యోగివి, కల్పానము వరకు ఆయుస్సు కలవాడవు, యుద్ధంలో జయము, బలంలో సాటిలేనితనము కల వాడవు, నాలుగు వర్ణాలను స్థాపించేవాడవు అవుతావు అని వరమిచ్చాడు. బ్రహ్మ ఈ వరములిచ్చిన మీదట బలికి మిక్కిలి శాన్తి కలిగింది.

అతని పుత్రులందరూ సుదేష్ణకు జన్మించినవాళ్ళు. వాళ్ళు క్షేత్రజ్ఞులని పిలువబడుచున్నారు. బలి యీ పుత్రుల్ని రాజ్యమందు పట్టాభిషిక్తులను చేసి తనను కృతకృత్యునిగా తలచి యోగమార్గాన్ని అవలంబించాడు. అతనిని ఎవడూ ఎదిరించ లేకపోయాడు. కొంచం సమయం తరువాత అతడు యోగపదాన్ని పొందాడు. అతని ఐదుగురు పుత్రుల రాజ్యాలు అంగ, వంగ, కళింగ, సుహ్మక, పుండ్రక దేశాలు. ఇప్పుడు అంగుని వంశావళి చెపుతున్నాను విను.

అంగుని కొడుకు దధివామనుడు. ఇతనికి దివిరధుడు, వీనికి ఇంద్ర తుల్యుడు, విద్వాంసుడైన ధర్మరధుడు, ఇతనికి చిత్రరధుడు పుత్రులు. చిత్ర రధుడు విష్ణు పదమనే పర్వతంమీద యజ్ఞం చేశాడు. అందులో సోమరసాన్ని త్రాగి ఇంద్రునితో సమానుడయ్యాడు. చిత్రరధుని పుత్రుడు దశరధుడు. అతడు లోమపాదుడని పేరుపొందాడు. ఋష్యశృంగుని దయచేత దశరధుడికి చతురంగుడనే పుత్రుడు జన్మించాడు. వీనికి పృథులాక్షుడు, వీనికి “చంపుడు”. ఇతని రాజధాని “చంప”. మొదట దీనిపేరు మాలిని. మునిశ్రేష్ఠుడైన పూర్ణభద్రుని దయవలన ఇతనికి హర్యంగుడు, వీనికి భద్రరధుడు, ఇతనికి బృహత్కర్మ, ఇతనికి బృహదర్భుడు, వీనికి బృహన్మనసుడు, ఇతనికి జయద్రధుడు, ఇతనికి దృఢరధుడు, వీనికి విశ్వజిత్తు, ఇతనికి కర్ణుడు, ఇతనికి వికర్ణుడు. ఇతనికి వందమంది పుత్రులు.

బృహన్మనసుడికి చైత్యుని కన్యలైన యశోదేవి, సత్య అనువారితో వివాహం జరిగింది. చైత్యుని యీ ఇద్దరు కన్యల వలన ఆ వంశం రెండు భాగాలుగా విడి పోయింది. రాజా! జయద్రధుడు, విజయుడు సత్యాదేవి అనువారికి జన్మించాడు. విజయుడు శాన్తిగుణంచేత బ్రాహ్మణులకంటే, శౌర్యగుణంలో క్షత్రియులకంటెనూ గొప్పవాడు. విజయుడి పుత్రుడు ధృతి, ఇతనికి ధృతవ్రతుడు, ఇతనికి సత్యకర్మ, ఇతనికి అధిరధుడు పుత్రులుగా జన్మించారు. అధిరధుడు సూతుడయ్యాడు. ఇతడు కర్ణుని పెంచినవాడు. ఈ కారణంచేత కర్ణుడు సూతపుత్రుడయ్యాడు. ఈ విధంగా నేను నీకు బలశాలియైన కర్ణుని వృత్తాంతం చెప్పాను. కర్ణుని కొడుకు వృషసేనుడు. ఇతని కొడుకు “వృషుడు” అంగవంశపు రాజులందరూ సత్యవ్రతులు, పుత్రవంతులు, మహారధులు. ఇప్పుడు నీవు పుట్టిన “ఋచేయు” వంశంవాళ్ళను గూర్చి విను.