హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

53 - బ్రహ్మ ఆజ్ఞచే దేవతల అంశావతారములు

వైశంపాయనుడిలా చెప్పాడు.

దేవతలందరూ భూదేవి మాటలను విని ఆమె అభిప్రాయాన్ని నెరవేర్చుటకు దేవతలు బ్రహ్మతో దేవా! భూదేవి బరువు తగ్గించటానికి ఏదైనా ఉపాయం చూడండి. ఎందుకనగా అన్ని లోకాల్నీ నీవే సృష్టించావు. నీవే లోక భర్తవు ప్రభువు. ఎవరే పని చేయాలో చెప్పు. ఎవరు భూలోకంలో అవతరించాలో మీ రాజ్ఞాపిస్తే మేము ఏ జాతిలోనైన పుట్టుటకు సమర్థులము అన్నారు. దేవతల మాటలు విని బ్రహ్మ ఓ దేవతలారా మీ నిశ్చయమే నానిశ్చయము. కాబట్టి మీరు తేజస్సును బట్టి ప్రభావాన్ని బట్టి మీమీ అంశలతో ప్రపంచంలో అవతరించి మూడులోకాలకు లక్ష్మివంటి భూదేవిని రక్షించింది. నేనిదివరకే ఆలోచించి ఉపాయాన్ని చెపుతా వినండి.

నేను పూర్వం ఇతిహాస పురాణాది విషయాల చర్చ చేస్తుండగా గంగ సముద్రం మరుద్గణం మొదలైనవారు నావద్దకు వచ్చారు. సముద్రుడు ఉజ్జ్వలవేషం ధరించి చంద్రునితో కూడి గంభీరమైన కంఠధ్వని కలవాడై నన్ను తిరస్కరిస్తూ తన ఒడ్డును దాటుతూ ఉప్పు నీటితో ఆ ప్రదేశాన్ని తడిపేశాడు. ఆ ప్రదేశాన్ని తొక్కిచేయుటకు ప్రయత్నించాడు. అప్పుడు కోపంతో నేను శాంతించావా? అని అడిగాను. వెంటనే సముద్రుడు తన వేగాన్ని తరంగాల్ని లేకుండా చేశాడు. అతని శరీరం మీద రాజ్యలక్ష్మి శోభ కనబడింది. తరువాత మీకు శుభం కోరి నేను గంగకూ సముద్రునికి శాపమిచ్చాను. నీవు రాజు రూపములో నా యెదుటకు వచ్చావు కనుక రాజు వేకమ్ము. భరతవంశంలో పుట్టి నీ తేజః ప్రభావాలతో ప్రజలను నియమించు నేను శాంతించ మన్నంతనే శాంతించావు. కనుక ప్రపంచంలో శంతనుడు అనే పేరు పొందుతావు.

అప్పుడు సౌందర్యవతియైన గంగ స్త్రీగా మారి నీతో కూడా ఉంటుంది. నేనిలా మాట్లాడగానే సముద్రుడు మిక్కిలి కోపించి ప్రభూ! దేవదేవ! నేను నీ ఆజ్ఞను పాటించే పుత్రుడను. మిమ్మల్ని తప్ప ఎవ్వరినీ ఎరుగను. నాకెందుకు శాపమిచ్చావు? నేను నీ ఆజ్ఞ ప్రకారం ప్రతిపూర్ణిమనాడూ వృద్ధి చెందుతూ ఉంటాను. ఇందులో నా తప్పేముంది? వాయువేగంగా వీచటంచేత నా నీరు మీ శరీరాన్ని తాకింది. దీనిచేత నేను శాపం పొందదగినవాడను కాను. మరొక కారణం చేత నేను తప్పు చేస్తే క్షమించి నాకు శాపం తగలకుండా చేయండి. నా మాట మీద విశ్వాసముంటే నాపై దయచూపండి. గంగాదేవి ఏమీ తప్పు చేయలేదు. నా తప్పు వలన ఈమెకు శాపం తగదు. అందుచే ఈమెపై ప్రసన్నులుకండి అన్నాడు.

అప్పుడు దేవతలు ఓ సముద్రుడా! నీవు దేవతల ప్రయోజనాన్ని ఎరుగవు. ఈ కారణంచేత శాపం వల్ల భయపడిపోయావు. భయపడవలసిన అవసరంలేదు. శాంతి పొందు. ఇప్పుడు నీవు సముద్ర శరీరం విడిచి రాజు శరీరంలో భరతవంశంలో జన్మించుము. అక్కడ రాజులకు చక్రవర్తివై నాలుగు వర్ణాల ప్రజలను పరిపాలిస్తూ కాలం గడుపుతావు. ఈ గంగ కూడ అందమైన రూపం ధరించి నిన్ను సేవిస్తుంది. ఓ సముద్రుడా! నా అనుమతితో గంగతో ఆనందాన్ని అనుభవిస్తూ మనుష్యజన్మ వల్ల కష్టాన్ని మరిచిపోతావు. ఇప్పుడు అష్టవసువులు స్వర్గం నుండి జారి పాతాళంలో ప్రవేశించబోయారు. వాళ్ళను పుట్టించటానికి నేను నిన్ను పంపుతున్నాను.

ఈ గంగ ఆ ఎనమండుగుర్ని పుత్రులుగా కంటుంది. వాళ్ళు సూర్యునివంటి గుణవంతులు, దేవతలకు సంతోషం కలిగించేవాళ్ళు. నీవు త్వరగా వసువులను కని కురువంశాన్ని వృద్ధిచేసి మళ్ళీ సముద్ర శరీరాన్ని ప్రవేశిస్తావు. దేవతలారా! మీ మేలు కొరకు భూమికి భారం తొలగించుటకు భవిష్యత్తును చూచి పూర్వమే నిశ్చయించాను. ఈవిధంగా శంతను వంశాన్ని భూమిపై జన్మింపచేశాను. శంతను వంశంలో పుట్టే ఏడుగురూ స్వర్గానికి వెళ్తారు. ఎనిమిదవవాడైన గంగా పుత్రుడు భీష్ముడు ఒకడే భూలోకంలో ఉంటాడు. శంతను మహారాజుకు రెండవ భార్యకు విచిత్రవీర్యుడనే పుత్రుడు కలిగాడు.

తేజశ్శాలియైన అతడు రాజ్యమందు పట్టాభిషిక్తుడయ్యాడు. అతని పుత్రులు పాండు ధృతరాష్ట్రులు. భూలోకంలోనే ఉంటారు. పాండురాజుకు కుంతి, మాద్రి అని యిద్దరు భార్యలు. ధృతరాష్ట్రుడికి పతివ్రతయైన గంధారి ఒక్కటే భార్య. ఓ దేవతలారా! మీరు శంతను వంశాన్ని విభజించి కొందరిని దేవతల పక్షంలోను, మరికొందరిని శత్రుపక్షంలోను సృష్టించండి. ముందు ముందు ఈ యిద్దరి రాజుల పుత్రులకు గొప్ప భయంకరయుద్ధం జరుగుతుంది. ఆయుద్దంలో చాలా మంది రాజులు మరణించి యమలోకానికి పోతారు. ఈ పోరాటం ప్రళయ కాలంలా భయంకరమౌతుంది. అప్పుడు చాలామంది రాజులు వాహనాలు నశించి అనేక పట్టాణాలు, రాష్ట్రాలు గల భూమి బరువులేనిదవుతుంది.

ద్వాపరయుగం చివరలో రాజులందరూ శస్త్రాలతో యుద్ధం చేసి వాహనాలతో సహా నష్టపోతారని నేను జ్ఞాన దృష్టితో చూచాను. ఆయుద్దంలో చావకబ్రతికియున్న వాళ్ళను అశ్వత్థామ భస్మం చేస్తాడు. ప్రళయకాలం వంటి ఆ క్రూరకార్యం పూర్తి కాగానే మూడవ ద్వాపరయుగం పూర్తి అవుతుంది. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు తన స్వస్థానానికి వెళ్ళిన తరువాత భయంకరమైన కలియుగం వస్తుంది. కలియుగం సాధారణంగా అందరూ ధర్మం తప్పినవారౌతారు. అప్పుడు ధర్మం ఎక్కడో ఒకచోట ఉంటుంది. సత్యం క్షీణించిపోతుంది. అసత్యం పెరుగుతుంది. ఆసమయంలో అందరూ శంకరుడికీ కుమారస్వామికీ భక్తులౌతారు. జనులు, ముసలివాళ్ళు కాకుండనే మరణిస్తారు. రాజుల వినాశానికి నేను చెప్పిందే మంచి ఉపాయం.

దేవతలారా! మీరు వృధాగా కాలం గడపక వెంటనే మీ మీ అంశలతో భూలోకంలో అవతరించండి. కుంతి గర్బాన యముని అంశను, గాంధారి గర్బాన కలిపురుషుని అంశను స్థాపించండి. ఈ యిద్దరి వల్ల రెండు పక్షాలు ఏర్పడుతాయి. భూమండలంలోని రాజులంతా ఈ రెండు పక్షాలలో చేరతారు. అప్పుడు భూమి లోకాన్ని ధరించే శరీరాన్ని పొందుతుంది. భూలోకంలో రాజుల వినాశానికి ఈ ఉపాయాన్ని మొదటే నిశ్చయించి పెట్టాను. బ్రహ్మ మాటలు విని భూమి తిరిగి వెళ్ళిపోయింది. రాజుల నాశానికి సమయము నిరీక్షిస్తున్నది. (ఎదురు చూచున్నది) బ్రహ్మ ఈ విధంగా రాక్షసుల వినాశం కోసం దేవతలందరికీ ఆజ్ఞా ఇచ్చాడు. దేవతలందరూ తమ తమ అంశలతో భూమిపై అవతరించాడు.

మహాబలవంతులైన వాళ్ళు లక్షలకొలది వేలకొలది వృష్ణి వంశంలో కురు వంశంలో పాంచాల వంశంలో బ్రాహ్మణుల ఇళ్ళలో జన్మించారు. వీళ్ళు ధర్మబుద్ది కలవాళ్ళు. వీళ్ళు పర్వతాలను కదపగలరు. భూమిని చీల్చగలరు. ఆకాశానికి ఎగరగలరు. సముద్రాన్ని కల్లోలం చేయగలరు. బ్రహ్మ ఈ విధంగా వాళ్ళను ఆజ్ఞాపించి లోకరక్షణ భారాన్ని నారాయణునిపై ఉంచి శాంతిని పొందాడు. భగవంతుడైన విష్ణువు బుద్ధిమంతుడైన వసుదేవుని కులంలో జన్మించాడు.