హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
6 - పృథువు భూమిని గోవుని చేసి పితుకుట
తన కొరకు గాని, ఇతరుడైన ఒక్కని కొరకుగాని చాలా ప్రాణులను చంపే వాడికి పాపం వస్తుంది. చాలామంది కొరకు ఒకనిని చంపితే పుణ్యం వస్తుంది. కనుక ప్రజల కొరకు నిన్ను చంపుతా. నీవు నా మాట వినకపోతే నిన్ను చంపి ప్రజలను రక్షిస్తాను. ప్రజలనందరినీ పోషించి బ్రతికించు. నీవు సమర్ధురాలవు. నీవు నాకు కూతురువైతే ఈ బాణాన్ని ప్రయోగించను అని. భూమి అప్పుడిలా అన్నది. నీవు చెప్పినదంతయూ చేస్తాను. ఉపాయం లేని పని సమకూరదు. ఫలించదు. నాకొక దూడను చూడు. అప్పుడు ప్రేమతో స్రవిస్తాను. అంతటా నన్ను సమతలంగా చెయ్యి. అప్పుడు స్రవించిన పాలు అంతటా వ్యాపిస్తాయి.
వైశంపాయనుడు ఇలా చెప్పాడు.
పృథుమహారాజు అప్పుడు తన ధనుస్సు చివరభాగంతో పర్వతాలను బ్రద్దలు చేసి భూమిని సమతలం చేశాడు. ఇతర మన్వంతరాలలో భూమి ఎత్తుపల్లాలుగా ఉండేది. సమతలం చేసిన తరువాత పట్టణాలు గ్రామాలు ఆవులను కాపాడుట వ్యవసాయం వ్యాపారం సత్యం, అసత్యం లోభము అసూయ లేకుండా పోవుట ఏర్పడ్డాయి. వైవస్వత మన్వంతరంలో పృథుమహారాజు మొదలుకొని యివి సంభ వించాయి. భూమి సమతలంగా ఉన్న చోటల్లా ప్రజలు నివసించ నారంభించారు. ఆహారం, పండ్లు, దుంపలు సమకూరాయి. పృథుమహారాజు స్వాయంభువ మనువును దూడగా చేసి తన చేతులతో అన్ని రకాలైన పైరులను పాలుగా పితికాడు. ఆ అన్నంతో ప్రజలు ఇప్పటికీ జీవిస్తున్నారు. .
ఋషులిలా అంటున్నారు!
మళ్ళీ పితికారనీ చంద్రుడు దూడ, బృహస్పతి పితికేవాడు. వేదాలు గిన్నె కాగా తపస్సు శాశ్వత బ్రహ్మరూపమైన పాలు వచ్చాయి. తరువాత ఇంద్రుడు మొదలైన దేవతలు బంగారుపాత్ర తెచ్చి పాలు పితికారని వింటున్నాము. అప్పుడు ఇంద్రుడు దూడ, పితికేవాడు సూర్యుడు కాగా బలకరమైన పాలు వెలువడ్డాయి. దేవతలా పాలను త్రాగారు. పితృదేవతలు కూడ పితికినట్లు వింటున్నాం. వెండిపాత్ర లోకి స్వధను(పితృదేవతల ఆహారం) పితికారు. అప్పుడు యముడు దూడ, కాలుడు(లోకనాశకుడు) పితికేవాడు. అతడు న్వధ (పితృదేవతల ఆహారం) పితికాడు. తరువాత తక్షకుణ్ణి దూడగా చేసిన సర్పాలు కూడ ఆనపకాయ బుర్రను పాత్రగాచేసి విషాన్ని పాలుగా పితికాయి. అప్పుడు ఐరావతుడు పితికేవాడు. తరువాత రాక్షసులు పితికాయి. వాళ్ళకు పాత్ర ఇనపది.
ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు దూడగా ఉన్నాడు. రెండుశిరస్సులుగ “మధువు” పితికేవాడు, మాయయే పాలు. ఆ మాయారూపమైన పాలను తాగి రాక్షసులు మాయావులు(మాయచేసేవాళ్ళు) అయ్యారు. తరువాత యక్షులు పితికారు. పచ్చిపాత్రలో అంతర్థానము (కనపడకపోవుట) అనే పాలు, కుబేరుడు దూడ, రజతనాభుడు పితికేవాడు. రాక్షసులు, పిశాచాలు మళ్ళీ పితికారు. వీళ్ళు శవము యొక్క పుర్రెలోకి రజత నాభుడు పితికాడు. సుమాలి దూడ. రక్తం పాలు. ఆ పాలతో యక్షులు, రాక్షసులు దేవతలతో సమానులయ్యారు. గంధర్వులు తామరాకులోకి మళ్ళీ అప్సరోగణాలతో కలిసి పితికారు.
అప్పుడు చిత్రరధుడు దూడ, సురుచి పితికేవాడు, పరిశుద్ధములైన సుగంధ ద్రవ్యాలు పాలు. పర్వతాలు మళ్ళీ పితికాయి. ఓషధులు అనేకవిధాలైన రత్నాలు పాలు. దూడ హిమవంతుడు. పితికేవాడు మేరుపర్వతము. కొండయే పాత్ర. లతలు మళ్ళీ పితికాయి. పాత్ర మోదుగ ఆకు. మద్దిచెట్టు పితికేవాడు. భూమి మొక్కలను కోసివేసినా మళ్ళీ మొలుచుటయే పాలు. ఈభూమి తల్లివలె అందరినీ పోషించేది. పరమపవిత్రమైనది. అన్ని కోరికలను తీర్చునది. అన్నివిధాలైన పైరులను పెంచేది. ఈభూమి సముద్రము వరకూ ఉండేది. మధుకైటభులనే రాక్షసుల యొక్క మేదస్సుచే తడిసినందున మేదినీ అనే పేరు కలదైనది. అందుచేత భూదేవి పృధుమహారాజు కుమార్తె అయినది.
పృధువు భూమిని విభజించాడు శుద్దిచేశాడు కూడ. పైరుల ఆకారాన్ని పొంది విస్తారమైన పట్టణములు, పురములు, మాలలుగా కలదైనది. ఇలాంటి ప్రభావం గలవాడు పృధుచక్రవర్తి. సమస్త ప్రాణుల చేత నమస్కరింపదగినవాడు, పూజింపదగినవాడును సంశయం లేదు. వేదపండితులైన బ్రాహ్మణులచేత కూడ పృధువు నమస్కరింపదగినవాడు. రాజులచేత, రాజు కాదలచినవారి చేతనూ ఆదిరాజైన పృధువు నమస్కరింపదగినవాడు. యుద్ధంలో జయం కోరే యోధుల చేత మొదటి రాజైన పృధువే నమస్కరింపదగినవాడు. పృధువును తలుచుకొని యుద్ధానికి వెళ్ళినవాడు ఘోరముద్దములలో జయం పొంది క్షేమంగా కీర్తి గల వాడవుతాడు. ధనవంతులైన వైశ్యులచేత కూడ అందరికీ జీవనం కల్పించిన పృధువే నమస్కరింపదగినవాడు. అట్లే శూద్రులచేత కూడ ఆదిరాజు నమస్క రింపదగినవాడు. దూడలను పితికేవాళ్ళకు పాలపాత్రలను చెప్పాను ఇంకా నీకేమి చెప్పను? ఈ పృధుచరిత్రను మొదటినుండి విన్నవాడు కొడుకులు మనవళ్ళతో చాలాకాలము సంతోషిస్తాడు.
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో పృథువు భూమిని పితుకుట అను ఆరవ అధ్యాయము.
