హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

17 - మార్కండేయ సనత్కుమార సంవాదము

తరువాత భీష్ముడిలా చెప్పాడు.

నేను మాతండ్రి మాటప్రకారం మార్కండేయమునిని పూర్వం తండ్రి నడిగిన ప్రశ్ననే అడిగాను. ధర్మాత్ముడు, మహాతపశ్శాలియైన మార్కండేయుడు ఇలా చెప్పాడు.

పూర్వం నేను పితరుల దయచేత దీర్ఘాయుస్సును, పితృభక్తిచేత గొప్పకీర్తినీ పొందాను. పూర్వం మేరుపర్వతంమీద అతికఠోర తపస్సు చేస్తుండగా కొన్ని యుగాలు, యుగాంతరాలు గడిచిపోయాయి. ఒకరోజున ఆకాశమండలాన్ని అంతనీ ప్రకాశింపచేస్తూ ఒకవిమానం ఉత్తరదిక్కునుండి వస్తుండగా చూచాను. ఆవిమానం దగ్గరకు రాగానే ఆవిమానంలో మంచంమీద మండుతున్న సూర్యుని వంటి బొటనవ్రేలు మాత్రం ప్రమాణంగల పురుషుణ్ణి చూశాను. అతడు అగ్నిమీద అగ్ని ఉన్నట్లు కనపడ్డాడు. నేనతనికి శిరస్సువంచి నమస్కరించాను. విమానంలో ఉన్న పురుషునికి పాద్యము, అర్షము ఇచ్చి పూజించాను. సమీపించ రాని విధంగా ఉన్న ఆ పురుషుని ఎవనిగా నిన్ను తెలుసుకోవాలని అడిగాను. తపః ప్రభావంచే పుట్టిన నారాయణాంశ గలిగి దేవతలకు కూడ దేవతవైన వాడని నా ఉద్దేశం అని పలికాను. అతడు చిరునవ్వు నవ్వుతూ నాకిట్లు చెప్పాడు.

నీ తపస్సు ఇప్పటికీ పూర్తికాలేదు అని పలికి అతడు దేవతారూపాన్ని పొందాడు. అంతటి అందమైన పురుషుని నేనెపుడూ చూడలేదు. సనత్కుమారుడిలా అన్నాడు. నేను బ్రహ్మయొక్క తపస్సుచేత, మహిమచేత అతనికి పుట్టిన మానసపుత్రుణ్ణి. నారాయణుని సత్యగుణ స్వరూపాన్ని. నువ్వు వేదాలలో సనత్కుమారుని పేరు విని ఉంటావు. ఆ సనత్కుమారుడను నేనే. నీకు శుభమగుగాక. నీకు నేనేం ఉప కారం చెయ్యాలో చెప్పు. తక్కిన నా సోదరులందరూ నాకంటే చిన్నవాళ్ళు. నాకు ఏడుగురు సోదరులున్నారు. వాళ్ళు వంశాలను స్థాపించారు. క్రతువు, వసిష్ఠుడు, పులహుడు, పులస్త్యుడు, అత్రి, అంగిరసుడు, మరీచి వీరు దేవగంధర్వాదులచే సేవింపబడిన వాళ్ళు.

మేము సన్యాస ధర్మం అవలంబించినవాళ్ళం. ప్రజాధర్మాన్ని, కామాన్ని విడిచి పెట్టి పుట్టినప్పటివలెనే ఉన్నాను. నన్ను సనత్కుమారునిగా తెలుసుకో. కనుక నాపేరు సనత్కుమారుడు. నాయందలి భక్తితో నన్ను చూడాలని తపస్సు చేశావు. ఇదిగో కనబడ్డాను. నీకు ఏకోరికను తీర్చమంటావో చెప్పు అని మాట్లాడిన అతనితో ఇలా చెప్పాను. అయ్యా! పితృదేవతల సృష్టి, శ్రాద్ధంయొక్క ప్రయోజనం తెలియ చేయండి అని. అతడు నా సంశయాన్ని పోగొట్టాడు. ధర్మాత్ముడైన అతడు చాలసేపు మాట్లాడి చివర ఓబ్రహ్మ! నీప్రశ్న విని చాల సంతోషించాను. ఇప్పుడీ విషయాన్ని వివరంగా చెపుతాను విను.

ఓమునిశ్రేష్ఠా! పూర్వం బ్రహ్మ తనను పూజిస్తారని దేవతలను సృష్టించాడు. కాని వాళ్ళు విషయఫలాలను కోరి యత్నించారు. అప్పుడు బ్రహ్మ మూఢులైన దేవతలను శపించాడు. మీరు పరిస్థితులను తెలుసుకొనే జ్ఞానంలేని వాళ్ళవుతారు అని శపించగా అప్పుడు దేవతలు వినయంతో బ్రహ్మను శరణువేడారు. అప్పుడు బ్రహ్మ మీరు చేసిన అపరాధానికి ప్రాయశ్చితం మీపుత్రుల నడగండి. మీకు మళ్ళీ వెనుకటి జ్ఞానం వస్తుంది అని చెప్పాడు.

వారు పుత్రులను ప్రాయశ్చితంగూర్చి అడిగారు. కుమారులు ప్రాయశ్చిత్తాలు స్తోత్రపాఠము, ధ్యానము, సాష్టాంగ నమస్కారం వీటిని మనస్సుచేత, వాక్కు చేత, తపస్సుల చేత తెలియజేయాలి అని చెప్పగా ప్రాయశ్చిత్త పదానికి అర్థం తెలిసింది. వాళ్ళకు వెనుకటి జ్ఞానం కూడ ప్రాప్తించింది. అప్పుడు దేవతలు మాకు ప్రాయశ్చితమంటే ఏమిటో తెలిసింది. మాకు జ్ఞానం కలిగింది.

పుత్రులారా! వెళ్ళండి అని చెప్పగా ఇప్పుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళండి అని పుత్రులు చెప్పారు. తరువాత దేవతలు మనం పుత్రులచే నిందింపబడ్డామని తమ సందేహం తీర్చుకోడానికి బ్రహ్మదగ్గరికి వెళ్ళారు. తమ సందేహాన్ని దేవతలు చెప్పగా బ్రహ్మ మీరు దేవతలకు శరీరమునిచ్చుటచే వాళ్ళకు పితరులు. వాళ్ళు మీకు జ్ఞానమిచ్చుటచే వాళ్ళు మీకు పితరులు. వాళ్ళకు మీరూ, మీకు వాళ్ళూ తల్లిదండ్రు లవడంలో సందేహమేమీలేదు అన్నాడు.

అప్పుడు దేవతలకు, పితరులకు సందేహం తొలగిపోయింది. రాక్షసులుగాని, దానవులుగాని ఎవరైనా పితరులను తృప్తిపరచక పోతే దానికి ఫలితమనుభవిస్తారు. శ్రాద్ధములచేత చంద్రుడుకూడ తృప్తిపడి సముద్ర, వన, పర్వతాలను, సమస్త ప్రాణులను బల వంతులనుగా చేస్తాడు. పితృదేవతలు శ్రాద్ధాలు పెట్టేవాళ్ళకు పుష్టినిస్తారు. తండ్రి, తాత, ముత్తాతల పేర్లు చెప్పి పిండాలు పెట్టినచో పితృదేవతలు తృప్తిపడి మనసంతానానికి అభివృద్ధి కలుగజేస్తారు. ఈవిధంగా దేవతలు, పితరులు ఒకరికొకరు పితరులయ్యారు. భావమేమిటంటే దేవతలే పితరులు, పితరులే దేవతలు అని.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో మార్కండేయ సనత్కుమార సంవాదము అను పదిహేడవ అధ్యాయము.