హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

23 - బ్రహ్మాదత్త కథ

మార్కండేయుడిలా చెప్పాడు.

ఓ భీష్మపితామహా! యోగధర్మ మందున్నట్టి మానస సరోవరమందు విహరించు ఏడుహంసలు వాయువును, నీటిని మాత్రమే ఆహారంగా తీసుకొని శరీరాన్ని కృశింపచేశాయి. వాటి పేర్లు పద్మగర్భ, అరవిందాక్ష, క్షీరగర్భ, సులోచన, ఉరుబిందు, సుబిందు, హిమగర్బ అని. ఆసమయంలో విభ్రాజుడనే రాజు తన అంతఃపుర స్త్రీలతో వనంలో విహరిస్తున్నాడు. అలా తిరుగుతూ యోగాభ్యాసం చేస్తున్న హంసలగుంపును చూచాడు. వాటిని చూచాక తన మనస్సులో వైరాగ్యం కలిగి మాటిమాటికీ వాటిమాటలనే విచారిస్తూ తన రాజధానికి తిరిగివచ్చాడు.

విభ్రాజుడికి అణుహుడను ధర్మాత్ముడైన పుత్రుడున్నాడు. శుకమహర్షి అన్ని శుభలక్షణాలుగల తన కుమార్తె “కృతి” కి అణుహునితో వివాహం చేశాడు. కృత్వి యోగాచార్యుడికి తల్లి. స్వయంగా యోగిని కూడ. కొంతకాలం తరువాత విభ్రాజ మహారాజు అణుహునికి రాజ్యం వప్పచెప్పి పౌరుల అనుమతితో బ్రాహ్మణుల ఆశీర్వాదంతో తపస్సు చేయటానికి ఏడుహంసలను వెనుకచూచినట్టి సరోవరానికి వెళ్ళాడు. ఆ సరస్సు ఒడ్డున ఆహారం మాని వాయువును మాత్రమే ఆహారంగా తీసుకొని వైరాగ్యంతో తపస్సుచేయ మొదలుపెట్టాడు. ఈ హంసలలో ఏహంస కడుపున ఐనా పుట్టి నేను గొప్ప యోగినవుతానని ఈతనికి కోరిక కలిగింది. ఇటువంటి కోరికతో విభ్రాజమహారాజు కఠోరమైన తపస్సు చేయటంలో మునిగిపోయాడు.

అందువల్ల అతని శరీరం మిక్కిలి ప్రకాశించింది. ఈ కారణంచేత ఆ సరస్సుకు వనానికి వైభ్రాజమనే పేరు వచ్చింది. ఆ సరోవరంలో నివసించే మూడు హంసలు యోగభ్రష్టులైనాయి. మిగిలిన నాలుగూ యోగాన్ని కొనసాగిస్తున్నాయి. అవి అన్నీ కాంపిల్యమనే నగరంలో రాజైన బ్రహ్మదత్తుడు మొదలైన పేర్లతో పుట్టాయి. వాటి పాపమంతా నశించిపోయింది. తక్కిన మూడు హంసలకీ వెనుకటి జన్మలోని మాటలు గుర్తులేవు. ఆ నాలుగు హంసలూ యోగ, జ్ఞాన, తపస్సులందు, వేద వేదాంగములందూ అంతుచూచాయి. వాటికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. బ్రహ్మ దత్తుడు కొద్దిసమయంలోనే జ్ఞానధ్యాన తపస్సులందు వేదవేదాంగముల లోనూ అంతుచూచిన వాడయ్యాడు.

పూర్వము బాభ్రవ్యుడు, వత్సుడు వీళ్ళిద్దరూ వేదవేదాంగాలూ తెలిసిన శ్రోత్రియుని పుత్రులు మరియు రాజుకు మంత్రులుకూడాను. ఛిద్రదర్శి, సునేత్రుడు మంత్రిపుత్రులు. వాళ్ళు వేదవేదాంగఙ్ఞానాన్ని సంపాదించారు. వాళ్ళు బ్రహ్మదత్తుడికి గట్టిమిత్రులైయారు. భరద్వాజుడి ఏడుగురు పుత్రులలో ఐదవవాడు “కవి” పాంచాలు డని పిలవబడేవాడు. ఖసుభర, కండరీక అని యితరులు పిలవ బడ్డారు. వాళ్ళిద్దరిలో పాంచాలుడు ఋగ్వేది. కండరీకుడు యజుర్వేది. పాంచాలుడు ఆచార్యుడయ్యాడు. కండరీకుడు అధ్వర్యుడయ్యాడు. అన్నిప్రాణుల భాషలనూ తెలిసిన అణుహు పుత్రుడు బ్రహ్మదత్తుడు రాజయ్యాడు. పాంచాలుడు, కండరీకుడు అతనికి మిత్రులయ్యారు ఈముగ్గురూ సంసారమందాసక్తి కలవారై మన్మధునికి బంటులయ్యారు. కాని పూర్వజన్మలో చేసిన శ్రాద్దఫలం వల్ల ధర్మార్థ కామముల ఫలం పొందటానికి సమర్థులయ్యారు. ఈసమయంలో అణుహుడు సత్పుత్రుడైన బ్రహ్మదత్తుడికి రాజ్యం వప్పచెప్పి ఉత్తమగతిని పొందాడు.

అసిత దేవలకుల పుత్రికలు దుర్ధర్ష, సన్నతి అనువారు బ్రహ్మదత్తుడికి భార్య లయ్యారు. సన్నతి ఆకారము మిక్కిలి చెడ్డది. ఈవిధంగా ఏడవజన్మవరకూ ఐదవ కుమారుడు పాంచికుడు, ఆరుజన్మల వరకూ పుండరీకుడు, బ్రహ్మదత్తుడు అవుతాడు. మిగిలిన నాలుగుహంసలు ఆ కాంపిల్యనగరంలోనే ఒక మిక్కిలి దరిద్ర బ్రాహ్మణుని యింటిలో శ్రోత్రియులుగా పుట్టారు. ఆ నలుగురి సోదరుల పేర్లు ధృతిమంతుడు, సుమనసుడు, విద్వాంసుడు, తత్త్యదర్శి. వీళ్ళందరూ వేదం చదివిన వాళ్ళు, మోక్షమును కోరువారును. కొన్నిరోజుల తరువాత వాళ్ళకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. వాళ్ళందరూ తండ్రి అనుమతి తీసుకొని యోగమందా సక్తితో బయల్దేరారు.

అప్పుడు తండ్రి, నన్ను విడిచివెళ్ళటం మీకు ధర్మంకాదు. బీదరికాన్ని పోగొట్ట కుండా, శుశ్రూష చేయకుండా ఎలా వెళ్తారు? అని అడిగాడు. అప్పుడు కుమారులు తండ్రీ! నీజీవితం చక్కగా గడిచేట్లు ఏర్పాటు చేస్తున్నాము. గొప్ప అర్థంగల ఈ శ్లోకాన్ని మంత్రులతో కూడియున్న రాజైన బ్రహ్మదత్తుడికి వినిపించు. అతడు సంతోషించి నీకు గ్రామాలను పుష్కలంగా భోగాలను ఇస్తాడు. నీవు కోరిన వాటి నన్నిటినీ ఇస్తాడు. నీవు స్వేచ్చగా వెళ్ళు అని పలిక వాళ్ళందరూ తండ్రిని పూజించి యోగధర్మాన్ని అవలంబించి గొప్పసుఖాన్ని పొందారు.