హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
21 - పక్షిణి కథ
అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు. పూజింపదగిన పక్షిణి చాలాకాలం బ్రహ్మ దత్తుని రాజభవనంలో ఉన్నప్పుడు అతని పెద్దకొడుకు కళ్ళు పెరికి ఎందుకు గ్రుడ్డివాణ్ణి చేసింది? ఇలా రాజుకి అపకారం ఎందుకు చేసింది? ఆపక్షిణి ఎవరు? ఆమెకు బ్రహ్మదత్తునితో స్నేహం ఎలా ఏర్పడింది? ఈవిషయంలో నాకు సందేహం ఉంది. కనుక విస్తారంగా ఈ వృత్తాంతం చెప్పండి.
భీష్ముడిలా చెప్పాడు.
ఒక పక్షిణి(ఆడపక్షి) బ్రహ్మదత్తుడికి స్నేహితురాలు. ఆపక్షికి రెక్కలు, వీపు, పొట్ట నల్లనివి. తలమాత్రం ఎర్రనిది. ప్రతిరోజూ ప్రొద్దున అది రాజభవనంనుండి వెళ్ళిపోతుంది. సముద్రపు ఒడ్డున, నీటిమడుగులందు, సరస్సులందూ, నదులు, పర్వతాలు, పొదరిండ్లు, వనములు, సువాసనలుగల వాయువులు ఉన్నచోట తిరిగి సాయంకాలానికి కాంపిల్యనగరానికి తిరిగివచ్చి రాత్రి అంతా బ్రహ్మదత్తుని యింటిలో నివసిస్తుంది. తాను చూచిన ఆశ్చర్యకర సంఘటనలను మహారాజుకు వినిపిస్తుంది.
ఒకనాడు బ్రహ్మదత్తుడికి కుమారుడు కలిగాడు. అతడి పేరు సర్వసేనుడు. ఇంతకు పూర్వమే పక్షి తనగూటిలో ఒకగ్రుడ్డు పెట్టింది. ఆగూటిలో పూర్వం ఒకగ్రుడ్డు చితికిపోయింది. అందుచేత పుట్టిన పక్షిపిల్ల చేతులు, కాళ్ళు కలది, ఎర్రని ముఖం కలిగి కన్నులు లేనిదైంది. తరువాత స్వల్పకాలంలో కళ్ళు వచ్చాయి. కొంచం రెక్కలు కూడా వచ్చాయి. ఆ పక్షి రాజపుత్రుని తన బిడ్డనూ సమాన ప్రేమతో చూస్తూండేది. ప్రతిరోజూ తన ముక్కుతో రెండు అమృతఫలాలు తెచ్చేది. తన పిల్లకొకటి, రెండవది రాజుశిశువుకు పెట్టేది. పిల్లలిద్దరూ ఆ పండ్లు తిని సంతోషంగా ఉండేవాళ్ళు.
పగటి పూట ఆపక్షి బయటకు వెళ్ళినపుడు దాది రాజపుత్రుని పిచ్చుకపిల్లతో ఆడించేది. ఒకనాడు రాజపుత్రుడు పక్షిపిల్ల కంఠం పట్టుకొని పిడికిలితో చంపేశాడు. రాజు చనిపోయిన పక్షిపిల్లనూ, శిశువును చంపిన కొడుకును చూచి దుఃఖించాడు. కన్నీరు కారుస్తూ దాదిని నిందించాడు. ఆపిచ్చుకపిల్లను గూర్చి విచారిస్తూ రాజు దుఃఖపడ్డాడు. ఆరోజున కూడా పక్షి రెండు పండ్లను బ్రహ్మదత్తుని యింటికి తెచ్చింది. మరణించిన తనశిశువుని చూచి మూర్చపోయింది. తెలివి వచ్చిన తరువాత దీనురాలై దుఃఖించింది. ఆపక్షి వస్తూనే జాలి కలిగేట్టు ఏడవటం మొదలుపెట్టింది. పూజనీయ(పక్షి) ఇలా అంది.
కుమారా! నేను నిన్ను పిలుస్తూ నీవద్దకు వచ్చాను. నీవు ఆకలితో చిన్ననోరు, ఎర్రని దవడలు చూపిస్తూ స్పష్టంగాని మాటలతో నాదగ్గరకు రావేం? నేను ప్రతి దినమూ రాగానే నిన్ను నారెక్కలతో పట్టుకొని గొప్ప సంతోషంతో కొంచెం మాట్లాడే దాన్ని. నీవూ కొంచెం ఏదో మాట్లాడేదానివి. ఈవేళ - సుందరమైన మాటలను ఎందుకు వినలేకపోతున్నాను? నీవు రెక్కలు కొట్టుకుంటూ నాదగ్గరికి వచ్చి మంచి నీళ్ళు అడుగుతావు అనుకొన్నాను. కాని నీ అకాల మరణంచేత నాకోరిక పూర్తిగా నశించిపోయింది చాలాసేపు దుఃఖించి రాజుతో ఇలా అంది.
ఓ నీచక్షత్రియుడా! నువ్వు రాజువు. సనాతనధర్మం తెలిసినవాడవు. దాది సహాయంతో నాపుత్రుని గూటినుండి బయటకులాగి నీ పిల్లవానిచేత ఎందుకు చంపించావు? అంగిరసుని ఈమాట నీవు వినలేదా? చిరకాలంనుంచి తన యింట్లో ఉన్నవాళ్ళను రక్షించాలి. ఇలా రక్షించనివాడు తప్పక కుంభీపాక నరకంలో పడతాడు. అతడిచ్చే ఆహారాన్ని దేవతలు, పితరులు ముట్టుకోరు అని. ధర్మరాజా! ఆ పక్షి ఇలా పలికి వివేకం కోల్పోయి రాజపుత్రుని రెండు కళ్ళూ పెరికింది. ఆకాశానికి ఎగిరిపోయింది. కుమారుని పరిస్థితి చూచి రాజు అన్నాడు.
కళ్యాణి! నువ్వు బాగా చేశావు. ఇప్పుడు నీవు దుఃఖం విడిచి తిరిగివచ్చేసాయి. నువ్వు నేను వెనుకటి స్నేహభావం కొనసాగిద్దాం. నువ్వు తిరిగివచ్చి యిక్కడనే ఉండు. నాపుత్రుని కళ్ళు పెరికినందుకు నీపై నాకు కొంచెంకూడ ద్వేషభావం లేదు. స్నేహితురాలా! నీవు చేసిన పని సరైనది. ఓ రాజేంద్రా! నేను పుత్ర మరణంచేత దుఃఖపడుతున్నట్లే నీవుకూడ గ్రుడ్డివాడైన కుమారునివల్ల దుఃఖపడతావు కదా! నీకుమారుణ్ణి గ్రుడ్డివాణ్ణిచేసి మీయింట్లో నివసించ దలచుటలేదు. శుక్రాచార్యులు చెప్పిన మాటలు చెపుతాను విను.
చెడుమిత్రుని, నీచుడైన రాజునీ, చెడుభార్య మొదలగువాళ్ళను దూరంగా విడిచిపెట్టాలి. వర్ణసంకర పురుషుని నమ్మరాదు. నమ్మినవాడు త్వరగా నష్టపోతాడు. ఇలా శుక్రాచార్యుల నీతివచనాలు చాలచెప్పి నీపుత్రుని గ్రుడ్డివానిని చేసి నిన్ను నమ్మజాలను అని పలికి ఆ పక్షి ఆకాశానికి ఎగిరిపోయింది. ధర్మరాజా! ఈవిధంగా నేను నీకు బ్రహ్మదత్తు, పూజనీయ(పక్షిణి) వృత్తాంతం వినిపించాను. శ్రాద్ధం విషయంలో నీ ప్రశ్నకు సమాధానంగా ఒకకథ చెపుతా. మార్కండేయుడు అడిగితే సనత్కుమారుడిలా ఈవిషయాన్ని చెప్పాడు.
