హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
29 - కశ్యప ప్రజాపతి వంశచరిత్ర
వైశంపాయనడిలా అన్నాడు.
రంభుడు సంతానం లేనివాడు. కాబట్టి అనేనసుని వంశాన్ని చెపుతాను. అనేనసుని పుత్రుడు గొప్పకీర్తి గల ప్రతిక్షత్రుడు. ఇతని పుత్రుడు నృంజయుడు. ఇతని పుత్రుడు విజయుడు. ఇతని కొడుకు క్వతి, ఇతని కుమారుడు హర్యశ్వుడు. ఇతనికి ప్రతావంతుడైన పుత్రుడు సహదేవుడు. ఇతని పుత్రుడు నదీనుడు. ఇతని కుమారుడు జయసేనుడు, ఇతని కుమారుడు సంకృతి. వీనికి యశస్విపుత్రుడు, వీని క్షత్రధర్ముడు. ఈ విధంగా అనేనసుని పుత్రులను లెక్క పెట్టి చెప్పాను. ఇక క్షత్రవృద్ధుని వంశ వృత్తాంతాన్ని విను.
క్షత్రవృద్దుని కుమారుడు సునహోత్రుడు, ఇతనికి కాశుడు, శలుడు. గృత్సమదుడు అని ముగ్గురు కొడుకులు. కాశుడికి కాశ్యుడు, దీర్ఘతపుడు కుమారుడు. దీర్ఘతపుడి పుత్రుడు ధన్వుడు, ఇతడి కొడుకు ధన్వంతరి. ఇది విని జనమేజయుడు ధన్వంతరి దేవత కదా భూలోకంలో ఎందుకు జన్మించాడు? ఈ వృత్తాంతాన్ని వినగోరుతున్నాను అన్నాడు. అప్పుడు వైశంపాయునుడు ఇలా చెప్పాడు. ధన్వంతరి పుట్టుకను చెపుతాను.
అతడు పూర్వం అమృతం కొరకు సముద్రాన్ని మధిస్తుండగా పుట్టాడు. అతడు ఆ సమయంలో విష్ణువును స్మరిస్తున్నాడు. (తలుచుకొంటున్నాడు) పుట్టిన తరువాత ఎదురుగా విష్ణువును చూచి స్తంభించి పోయి నిలబడ్డాడు. విష్ణువు నిలబడిన ఉన్న అతన్ని చూచి నీవు అబ్జుడవు (నీటిలో పుట్టినవాడవు) అన్నాడు. అప్పుడు అబ్జుడు ఓ ప్రభూ! నేను నీ పుత్రుణ్ణి. మీరు నాకు యజ్ఞంలో భాగం నివాసస్థానం ఏర్పరచండి అన్నాడు. అప్పుడు విష్ణువు ఓ అబ్జుడా! దేవతలు మొదటనే యజ్ఞభాగాలను పంచుకున్నారు. మహర్షులు కూడ హవిస్సును దేవతలకు ఇచ్చారు. ఈ సమయంలో యజ్ఞభాగాన్ని కల్పించలేను. నీవు క్రొత్త దేవతవు. రెండవ జన్మలో గొప్ప కీర్తిని పొందుతావు. అప్పుడు గర్భంలో ఉండగానే నీకు అణిమాదిసిద్ధులు ప్రాప్తిస్తాయి.
ఆ శరీరంతోనే నీవు దేవతవు అవుతావు. అప్పుడు బ్రాహ్మణులు నీ కొరకు చరువు మంత్ర జపాదుల ద్వారా యజ్ఞవిధానం ఏర్పరుస్తారు. ఆజన్మలో నీవు ఆయుర్వేదాన్ని ఎనిమిది భాగాలు చేస్తావు. బ్రహ్మ దీనిని పూర్వమే నిశ్చయించి పెట్టాడు. ద్వాపరయుగంలో నీవు రెండవసారి జన్మిస్తావు. విష్ణువు ఈ వరమిచ్చి అంతర్దానం చెందాడు. ద్వాపరయుగంలో కాశీరాజైన సునహోత్రుని పుత్రుడు దీర్ఘతపుడు పుత్రసంతానం కోసం కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. అబ్జదేవుడు అతనికి పుత్రుని ప్రసాదించేవాడు. ఇతని తపస్సుకు ప్రసన్నుడై అబ్జదేవుడు నీవేదడిగితే అది యిస్తానన్నాడు. దీర్ఘతపుడు మీరు నాకు పుత్రుడుగా జన్మించాలి అని కోరాడు. అబ్జదేవుడు అలాగే అగుగాక అని అంతర్ధానం చెందాడు.
కొంతకాలం తరువాత కాశీరాజుగా ధన్వంతరి అవతరించాడు. మహర్షి భరద్వాజుడి వద్ద ఆయుర్వేదాన్ని నేర్చుకొన్నాడు. ఆయుర్వేదంలోని ఎనిమిది భాగా లనూ తన విద్యార్థులకు చెప్పాడు. మహారాజ! ధన్వంతరి కొడుకు కేతుమంతుడు, ఇతని పుత్రుడు భీమరథుడు ఇతని కొడుకు దివోదాసుడు. దివోదాసుడు కాశీనగరం రాజు అయ్యాడు. క్షేమకుడనే రాక్షసుడు కాశీపట్టణంలో మనుష్యులు లేకుండా చేశాడు. బుద్ధిమంతుడైన మహాత్ముడు నికుంభుడు వెయ్యి సంవత్సరాల వరకూ “కాశీ” జనం లేనిది అవుతుందని శాపమిచ్చాడు. నికుంభుడు ఈ విధంగా శాపమిచ్చిన తర్వాత దివోదాసుడు గోమతీనది ఒడ్డున తన రాజధానిని ఏర్పరచు కొన్నాడు. పూర్వం కాశీనగరం మీద “భద్రశ్రేణు”ని అధికారం ఉండేది. దివోదాసుడు భద్రశ్రేణ్యుని వందమంది పుత్రులను చంపి కాశీకి అధికారి అయ్యాడు.
ఇంతవరకూ విని జనమేజయ మహారాజు అడిగాడు.
నికుంభుడు కాశీకి ఎందుకు శాపం పెట్టాడు? అతడు సామాన్యుడై ఉండడు. ఆ నికుంభుడెవడో కూడ చెప్పకోరుతున్నాను. వైశంపాయనుడిలా చెప్పాడు. మహారాజ! రాజర్షి దివోదాసుడు కాశీపట్టణంలో నివసిస్తుండగా శంకరుడు వివాహం చేసుకొని పార్వతిని సంతోషపెట్టుటకు అత్తవారి యింటిలో ఉంటున్నాడు. అతని ఆజ్ఞచేత యోగ్యులైన శివగణంలో వాళ్ళు శివుని ఉపదేశాలతో పార్వతిని సంతోష పెడుతున్నారు. పార్వతి సంతోషిస్తున్నది కాని ఆమె తల్లి మేనక సంతోషించలేదు. ఆమె మాటిమాటికీ శంకరుణ్ణి పార్వతినీ నిందిస్తూ ఉన్నది. ఓ బిడ్డా! నీ భర్త, ఆయన ప్రక్కనున్నవారూ అందరూ ఆచారభ్రష్టులు. వాళ్ళెప్పుడూ దరిద్రులుగా ఉంటారు. మంచిస్వభావం వాళ్ళకు లేనేలేదు. తల్లి ఇలా మాట్లాడగా పార్వతి కోపించింది. కొంచం నవ్వి తన భర్తవద్దకు వెళ్ళింది. అక్కడ ఏడుపు ముఖంతో దేవ! ఇప్పుడు నేనిక్కడ ఉండను. మీ యింటికి నన్ను తీసుకువెళ్ళండి అన్నది.
పార్వతి మాటలు విని శంకరుడు మూడులోకాలను పరిశీలించి భూలోకంలో వారణసీపురంలో ఉండటానికి నిశ్చయించుకున్నాడు. కాని అతనిపై దివోదాసుని అధికారం ఉంటుంది. ఇందువల్ల తనవద్ద కూర్చున్న నికుంభుని పిలిచి గణ నాయకా! నీవు వెళ్ళి మృదువైన ఉపాయంతో కాశీలో ఎవరూ లేకుండా చెయ్యి. ఇది కూడా గుర్తుంచుకో. దివోదాసుడు గొప్ప పరాక్రమవంతుడు. శివుని ఆజ్ఞచే నికుంభుడు కాశీకి వెళ్ళి అక్కడ కలలో కండుకుడనే మంగలికి దర్శనమిచ్చాడు. నా స్వరూపాన్ని తయారుచేసి నగరంలో ఏ భాగమందైనా స్థాపించు. ఇలాచేస్తే నీకు శుభం కలుగజేస్తాను అన్నాడు. మంగలి నికుంభుని ఆజ్ఞపాలించి పని అంతా పూర్తిచేశాడు. పట్టణ ముఖద్వార మందు పెద్దఆర్భాటంగా నికుంభునికి పూజ చేయమొదలెట్టాడు.
రాజైన దివోదాసుకు కూడా మంగలి సూచించాడు. ప్రతిదినమూ గంధధూప నైవేద్యాదులతో పూజ చేస్తున్నాడు. కాశీలో జనానికి ఇది పెద్ద ఆశ్చర్యంగా ఉంది. నికుంభుడీ విధంగా నిత్యమూ గణనాయకుని పూజిస్తున్నాడు. పురవాసులకు వేలాది వరాలిస్తున్నాడు. సుయశ అనే రాజుభార్య, రాజు ప్రేరేపించగా పుత్రులను కోరివచ్చి పూజచేసి పుత్రుడు కావాలని కోరింది. చాలామార్లు సంతానాపేక్షతో అక్కడకు వచ్చింది. నికుంభుడు పుత్రుని అనుగ్రహించలేదు. రాజు కోపిస్తే మనకు పని జరుగుతుంది అని. చాలాకాలానికి రాజుకి కోపం వచ్చింది. పట్టణద్వారంలో ఉన్న ఈభూతం పౌరులందరికీ సంతోషంతో వందలాది వరాలిస్తోంది. ఎల్లప్పుడూ మా వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు. పుత్రసంతానాన్ని కోరి విన్నవించాను. చేసిన మేలు మరిచే ఈతడు నాకు పుత్రుని కలుగజేయుటలేదు. కనుక ఇతనిని నేను గౌరవించను. ఇతని స్థానాన్ని నాశనం చేస్తాను అని నిశ్చయించి రాజద్రోహియైన దుర్మార్గుడు గణపతి స్థానాన్ని నాశనం చేశాడు. అప్పుడు నికుంభుడు ప్రత్యక్షంగా బయట పడి ఏ కారణం లేకుండా నా మందిరాన్ని నాశనం చేశావు కనుక నీ నగరం జనంలేనిది ఔతుంది అని శపించాడు. శాపంచేత పట్టణం శూన్యం అయింది. ఇలా శపించి నికుంభుడు శివునివద్దకు తిరిగివచ్చాడు.
ఆ శాపంచేత పురజనులందరూ నలు దిక్కులకూ పారిపోయారు. అప్పుడు శంకరుడు అక్కడ నివాసస్థానం ఏర్పరచుకొన్నాడు. పార్వతిని సంతోషపెడుతూ ఉన్నాడు. కాని పార్వతి సంతోషించలేదు. నేనీ పట్టణంలో ఉండను అన్నది. శివుడు ఇక్కడ అవిముక్తస్థానమే నాయిల్లు. దీనిని విడిచిపెట్టను. నీకు ఇష్టమైతే తండ్రి యింటికి వెళ్ళు. నేనక్కడకు వెళ్ళను అని నవ్వుతూ పలికాడు. అందుచే కాశీకి అవిముక్త క్షేత్రమని పేరువచ్చింది. ఈవిధంగా కాశీకి శాపవృత్తాంతం. దీనికి అవిముక్తమనే పేరు రావటానికి కారణం చెప్పాను. భగవంతుడైన శివుడు పార్వతితో మూడుయుగాలలోనూ నివసిస్తాడు. కలియుగంలో ఆ నగరం అంతర్థానం చెందుతుంది. శివుడు కూడ కనబడకుండా ఉంటాడు. ఈ విధంగా శపింపబడిన తరువాత జనులకు నివాసమైంది.
భద్రశ్రేన్యుని పుత్రుడు దుర్దముడు. దివోదాసునిచే బాలుడని దయతో అతడు విడిచిపెట్టబడ్డాడు. దుర్దముడనే రాజుకు హైహయుడను కుమారుడు అయ్యాడు. బలాత్కారంగా దివోదాసు అపహరించిన తండ్రి రాజ్యాన్ని సంపాదించాడు. దృషద్వతికి దివోదాసు వలన ప్రతర్దనుడు పుట్టాడు. ఇతడు (ప్రతర్దనుడు) దుర్దముడు లాగుకొన్న రాజ్యాన్ని తన అధికారంలోకి తెచ్చుకొన్నాడు. ప్రతర్దనుడికి వత్సుడు, భర్గుడను ఇద్దరు పుత్రులు. వత్సుడికి అలర్కుడు, వీడికి సన్నతి పుత్రులు. కాశీరాజైన అలర్కుడు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు, బ్రహ్మవేత్త కూడ. అలర్కుడు లోపాముద్రాదేవి అనుగ్రహం వలన అరవై ఆరువేల సంవత్సరాలు యువకుడుగా రాజ్యం చేశాడని పురాతన కథ ఉంది. అతనికి చాలా గొప్ప రాజ్యం ఉండేది.
నికుంభుని శాపం చివరకాలంలో క్షేమకుడనే రాక్షసుణ్ణి చంపి అందమైన వారాణసీ నగరాన్ని మరల ఏర్పరచాడు. సన్నతి పుత్రుడు సునీథుడు. ఇతనికి క్షేమ్యుడు పుత్రుడు. ఇతని పుత్రుడు కేతుమంతుడు. ఇతనికి సుకేతువు, ఇతనికి ధర్మకేతువు, వీనికి సత్య కేతువు, ఇతనికి విభుడుడు, దీనికి ఆనర్తుడు, ఈతనికి సుకుమారుడు, వీనికి ధృష్టకేతువు, ఇతనికి వేణుహత్రుడు, ఇతనికి భర్గుడు పుత్రులు. అలర్కుడి తండ్రి వత్సుడికి వత్సభూమి, వత్సభూమి తండ్రియైన భార్గవునకు భృగుభూమి జన్మించారు. మహర్షి అంగిరసునకు వీరందరూ భృగు వంశంలో పుట్టారు. వత్సభూమి, భృగుభూమి అనువారికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యజాతులకు చెందిన వెయ్యిమంది జన్మించారు. వీళ్ళందరికీ కాశిరాజు మూల పురుషుడు. ఇక నహుషుని వృత్తాంతం చెపుతాను.
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో కశ్యప ప్రజాపతి వంశచరిత్ర అను ఇరవైతొమ్మిదవ అధ్యాయము
