హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
48 - విష్ణువు దేవతలను ఊరడించుట, కాలనేమి వధ
వైశంపాయనుడిలా చెప్పాడు.
వేదము, ధర్మము, ఓర్పు, సత్యము నారాయణుని ఆశ్రయించి ఉండే లక్ష్మి ఈ ఐదు తనకు స్వాధీనం కాలేదని కాలనేమి కోపించి విష్ణుమూర్తి యొక్క స్థానాన్ని పొందాలని భగవంతుని దగ్గరకు వెళ్ళాడు. అక్కడ శంఖచక్ర గదలనే ఆయుధాలను ధరించి విష్ణువు తన అందమైన గదను త్రిప్పుతూ రాక్షసులను చంపుటకు సిద్ధంగా ఉన్నాడు. భగవంతుడు నీటితో నిండిన మేఘంలా నల్లగా ఉన్నాడు. మెరుపులాంటి పీతాంబరాన్ని ధరించాడు. బంగారు రెక్కలు గల గరుత్మంతుడు తన పీఠం మీద కూర్చోని ఉన్నాడు. కాలనేమి విష్ణువును చూచి మిక్కిలి కోపించాడు. విష్ణువును చూచి యిలా అన్నాడు.
మా పురాతన రాక్షసులకు ఈతడు శత్రువు. ఇతడు సముద్రంలో నివసించే మధుకైటభులను చంపాడు. ఇతడు మనకు జయింపశక్యం కాని శత్రువని విన్నాను. ఇతడు యుద్ధంలో ఆయుధాన్ని ధరించి మనల్ని సర్వనాశనం చేశాడు. ఇతని కారణంగా చాలామంది రాక్షసస్త్రీలు విధవలయ్యారు. ఇతడే దేవతల విష్ణువు. సర్పాలకు అనంతుడువలే బ్రహ్మకు బ్రహ్మదేవతలకు ఆధారము. రాక్షసులకు శత్రువు. ఇతని రోషంచేతనే హిరణ్యకశిపుడు నశించాడు. ఇతని వల్లనే దేవతలు మహర్షులిచ్చిన నేతిని తీసుకొంటున్నారు. ఇతడే రాక్షసుల నాశానికి మూలకారణం. ఇతని చక్రంచేత మావంశం నిర్మూలించబడింది. ఇది మా రాక్షసులకు యమ ధర్మరాజు.
ఈనాడు నాకు కనిపించాడు. ఈవేళనే ఈ దుర్బుద్ది తన పనులకు ఫలము అనుభవిస్తాడు. అదృష్టం వల్ల నేడు నాకు కనిపించాడు. ఈవేళ యీతన్ని చంపి మా పూర్వుల ఋణం తీర్చుకుంటాను. నారాయణుని చంపిన తరువాత అతని ఆశ్రితులను హతమారుస్తా. ఇకపైన ఇతని వల్ల రాక్షసులకు దుఃఖం లేకుండా చేస్తా. ఇతడే నరసింహరూపంతో నా (కాలనేమి) తండ్రియైన హిరణ్యకశిపుని సంహరించాడు. ఇతడే వామనరూపంతో బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల భూమి అడిగి మూడులోకాలనీ తీసుకున్నాడు. ఈ వేళ దేవతలతోపాటు ఇతన్ని చంపుతా. ఇలా అని విష్ణువును తిరస్కరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు.
ఇలా తిరస్కరించినా విష్ణుమూర్తి కోపించలేదు. తన ఓర్పుతో చిరునవ్వు నవ్వి ఓ రాక్షసశ్రేష్ఠా! శక్తి ఉన్నా కోపం రానివాడు వాస్తవంగా బలవంతుడు. గర్వమనే ఈ దోషంచేతనే నీవు మరణిస్తావు. బ్రహ్మదేవుని ఆజ్ఞను పాటించనివాడు ఎవడు సుఖపడతాడు? మీ పూర్వులు వెళ్ళినచోటికి నీవు వెళ్ళగోరుతున్నావు. ఈనాడు నిన్ను చంపి దేవతలను వారివారి స్థానాలలో మళ్ళీ స్థాపిస్తాను. శ్రీమహావిష్ణువు ఇలా మాట్లాడుచుండగా రాక్షసుడు నవ్వాడు. కోపంతో ఆయుధాలను చేతులతో పట్టుకొన్నాడు. తరువాత ఆయుధాలతో అలంకరింపబడిన వంద చేతులను ఎత్తి కోపంతో మిక్కిలి ఎర్రబడిన కన్నులు కలవాడై విష్ణుమూర్తిని రొమ్ముమీద కొట్టాడు.
మయుడు తారుడు మొదలైన రాక్షసులు కూడ ఆయుధాలను, ఖడ్గాలను పట్టుకొని విష్ణువు మీదికి వచ్చారు. అన్ని ఆయుధాలతో బలవంతులైన ఆ రాక్షసులు కొట్టినప్పుడు విష్ణువు పర్వతంలా కదలకుండా నిలబడ్డాడు. కాలనేమి మీదికి గరుత్మంతుడు వెళ్ళగా అతడు బలంకొద్దీ గదను చేతులతో పట్టుకొని గరుడుని పై విసిరాడు. గరుత్మంతుడు బాధపడుతుండగా చూచి కోపంతో ఎర్రనైన కన్నులు గలవాడై విష్ణుమూర్తి చక్రాన్ని పట్టుకున్నాడు. గరుడుడు, విష్ణువు ఇద్దరూ శరీరాలను పెంచారు. కాలనేమి చేతులు కూడ వృద్ధి చెంది పదిదిక్కులా వ్యాపించాయి. ఋషులు, గంధర్వులు, విష్ణువును స్తోత్రం చేశారు.
అప్పుడు భగవంతుని కిరీటంలో స్వర్గము, వస్త్రంలో మేఘాలతో కూడిన ఆకాశం పాదాలలో భూమి చేతులలో పది దిక్కులు ఇమిడిపోయాయి. అతని చేతిలో సూర్యకిరణములవలె ప్రకాశించుచున్నట్టియు, అగ్నివంటిది శత్రువులను సంహరించునట్టి, చక్రం మిక్కిలి అందంగాను, గట్టిగాను, భయంకరంగాను ఉన్నది. అంచులు బంగారువి. దాని మధ్యభాగం వజ్రమయం. ఆయుధాలలో సాటిలేనిది. ఆ చక్రం యజమాని కోరికను బట్టి లావుగాను, సన్నగాను అనేక రూపాలు ధరించటంలో శక్తి కలది. దానికి భయపడని శత్రువు లేడు. అటువంటి చక్రంతో విష్ణుభగవానుడు కాలనేమి యొక్క వందచేతులను అట్టహాసం (పెద్దనవ్వు)తో నూరుతలలను ఖండించివేశాడు. ఆ రాక్షసుడు మరణించి కూడ నిలిచియే ఉన్నాడు.
అప్పుడు గరుత్మంతుడు వాయువేగము గలవాడై వక్షస్థలంతో కాలనేమిని నేలపై పడవేశాడు. అతని మృతశరీరం భూమిపై పడింది. ఆతడు మరణించగానే దేవతలు ఋషులు బాగుగని మెచ్చుకుంటూ అందరూ కలిసి శ్రీమహావిష్ణువును పూజించారు. తక్కిన రాక్షసులు ఆశ్చర్యపడుతూ స్తంభించిపోయారు. అప్పుడు భగవంతుడు ఆ రాక్షసులలో కొందరిని జుట్టు పట్టుకొని కొందరిని కంఠు పట్టుకొని నేలపై కూల్చివేశాడు. తక్కిన రాక్షసులను తన గదచక్రము మొదలైన ఆయుధాలతో సంహరించాడు. వాళ్ళందరూ ఆకాశం నుండి జారి నేలపై పడ్డారు. ఈ విధంగా రాక్షసులను చంపి పురుషోత్తముడైన భగవంతుడు ఇంద్రునికి ఇష్టమైన పని చేసి సంతోషించిన మనస్సుతో నిలిచియున్నాడు.
ఇలా యుద్ధం పూర్తి అయిన తరువాత బ్రహ్మ బ్రహ్మర్షులు, దేవర్షులు, గంధర్వులు, అప్సరసలు, ఆప్రదేశానికి వచ్చారు. దేవదేవుడు చక్రహన్తుడు అయిన భగవంతుని ప్రార్థిస్తూ ఈనాడు రాక్షససంహారమనే పనిని పూర్తి చేసి దేవతలకు కష్టాన్ని తొలగించావు. ఇందువల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. నీవు తప్ప మరొకడు ఆ రాక్షసుని చంపలేడు. తమయొక్క ఈ ఘనకార్యం చూచి మేము చాలా ఆనందిస్తున్నాం. రండి మనమందరం స్వర్గలోకానికి వెళ్ళాదాం. అక్కడ బ్రహ్మర్షులందరూ ఒకచోట చేరి మీరాకకు ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు మూడు లోకాలూ సంతోషిస్తున్నాయి. ఇప్పుడు మీరు అక్కడకు వెళ్ళండి. అక్కడ మహర్షులందరు ఉత్తమ స్తోత్రాలతో మీకు శాస్త్రప్రకారం పూజ చేస్తారు. నీవు అందరికీ వరాలు ఇస్తావు. మేము నీకేమీయగలం? ఇంద్రుడికి మూడులోకాల రాజ్యం ఇవ్వండి అని బ్రహ్మ ఇలా పలికిన తరువాత ఇంద్రాది దేవతలకు విష్ణుమూర్తి కాలనేమిని నేను చంపాను. చావగా మిగిలిన వాళ్ళు “బలి” రాహువు మాత్రమే. కనుక ఇక ఇప్పుడు ఇంద్రుడు, వరుణుడు, తమ దిక్కులపై మళ్ళీ అధికారం పొందదురుగాక. అట్లే యముడు దక్షిణదిశకు కుబేరుడు ఉత్తర దిక్కుకు పరిపాలకులు కాగలరు. చంద్రుడు నక్షత్రాలతో పాటు కర్తవ్యమును నిర్వహిస్తాడు. సూర్యుడు కాలనిర్మాణము చేయగలడు. అగ్నిదేవుడు బ్రాహ్మణులిచ్చే హవిస్సును స్వీకరించుగాక.
దేవతలారా! మీరిప్పుడు రాక్షసులవల్ల భయం లేకుండా శాన్తంగా ఉండండి. మీకు శుభమగుగాక! ఇప్పుడు నేను బ్రహ్మలోకానికి వెళ్తాను. రాక్షసులను ఎప్పుడూ నమ్మవద్దు. రాక్షసులవల్ల మీకెప్పుడు భయమేర్పడిన నేను వచ్చి మీ భయాన్ని తొలగిస్తాను. మహారాజా! సత్యపరాక్రముడైన విష్ణుభగవానుడు బ్రహ్మతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. తారకామయ యుద్దంలో విష్ణుమూర్తి విషయంలో నీవడిగిన ఆశ్చర్యకరమైన సంఘటన వర్ణించి చెప్పాను.
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో విష్ణువు దేవతలను ఊరడించుట కాలనేమి వధ అను నలభై ఎనిమిదవ అధ్యాయము
