హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

1 – ఆది సృష్టి వర్ణనము

పరమాత్మ ఐన నారాయణునకు అతని అంశయే ఐన పురుషశ్రేష్టుడగు నరునకు సరస్వతీదేవికీ నమస్కారం చేసి మహాభారత గ్రంధాన్ని చదవాలి. పుణ్యము, పవిత్రము పాపాలను పోగొట్టేది మంగళకరము చెప్ప శక్యముగాని మహిమ గలదియైన వ్యాసమహర్షి పెదవుల నుండి వెలువడిన భారతాన్ని విన్నవాడికి పుష్కరమనే తీర్థములో స్నానం చేయనవసరం లేదు. తన ముఖపద్మం నుండి జాలువారిన పురాణ వాఙ్మయమనే అమృతాన్ని సమస్త ప్రపంచమూ త్రాగుచున్న పరాశరమహర్షి పుత్రుడు. సత్యవతీదేవి హృదయానికి ఆనందం కలుగచేసే వ్యాసమహర్షి అందరి కంటే గొప్పవాడు. అనేక విషయములు తెలిసిన వేద విద్వాంసుడగు బ్రాహ్మణునికి బంగారు కొమ్ములు గల నూరు గోవుల దానం చేసినవాడు, పుణ్యమైన భారతకథను వినువాడు సమానమైన ఫలితాన్ని పొందుతారు.

నూరు అశ్వమేధయాగాలు చేసి నాలుగు వేలమందికి భోజనం పెట్టినవాడు, ఇంద్రపదవి కోసం నూరు యజ్ఞాలు చేసినవాడు, వీరిద్దరికంటే శ్రీహరివంశ పురాణాన్ని దానం చేసినవాడు అంతులేని పుణ్యాన్ని పొందుతాడు. వ్యాసవాల్మీకుల వాఙ్మయాన్ని చదివినవాడు వంద అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని వాజపేయ రాజసూయయాగాలు చేసి ఏనుగును, రథమును దానం చేసిన పుణ్యాన్ని పొందుతాడు. హరివంశమును వ్రాయించినవాడు తుమ్మెద తామరపూవును వలె విష్ణుమూర్తి పాదపద్మాన్ని విడువజాలడు. వేదవ్యాస మహర్షి బ్రహ్మకంటే గొప్పవాడు గొప్పయోగము, ఐశ్వర్యము కలవాడు. నారాయణుని అంశతో జన్మించినవాడు శుకుడనే పుత్రుడు కలవాడు. వేదమునకు నిధియైనవాడు అతనికి తలవంచి నమస్కరిస్తున్నాను.

మొట్టమొదటి పురుషుడు, బీజస్థానీయుడు, నాశరహితుడు బ్రహ్మ స్వరూపుడు వ్యక్త అవ్యక్త స్వరూపుడు మిక్కిలి పూర్వుడు. సూత్రాత్మ స్వరూపుడు, విరాట్స్వ రూపుడు, ఇంద్రియాలను ప్రవర్తింప చేసేవాడు, అన్ని పాపాలను పోగొట్టువాడు ఏ దోషమూ లేనివాడైన పరమాత్మకు నమస్కారము చేసి పురాణ విషయం ప్రారంభిస్తున్నాను. నైమిషారణ్యంలో కుల పతియైన శౌనకమహర్షి సూతుని ఈ విధంగా అడిగాడు.

ఓ మహర్షీ! భరతవంశరాజుల యొక్క గొప్ప చరిత్ర పూర్వం చెప్పావు. దేవతల యొక్క, రాక్షసుల యొక్క, సిద్దులు మొదలైన వారి యొక్క మిక్కిలి ఆశ్చర్యకరమైన పనులను, పరాక్రమములను, ధర్మనిశ్చయములను, విచిత్రము లైన కధలను చెప్పినావు. కౌరవుల జన్మవృత్తాంతాన్ని చెప్పావు. వృష్ణి, అంధక వంశముల వారి వృత్తాంతాన్ని చెప్పలేదు. దానిని ఇపుడు చెప్పవలసిందిగా కోరుతున్నాను. అదివిని సూతుడిలా అన్నాడు.

వ్యాసమహర్షి శిష్యుడైన వైశంపాయనుడు జనమేజయుడికి నీవడిగిన విషయం పూర్వం చెప్పాడు. ఆ వృష్ణవంశీయుల వృత్తాంతాన్ని ప్రారంభంనుంచీ నీకు చెపుతాను. జనమేజయుడు వైశంపాయనుని ఇలా అడిగాడు. నీవు చెప్పిన మహాభారతాన్ని విపులంగా విన్నాను. వృష్ణి అంధ వంశములందలి మహారధుల ఘనకార్యాలను నీవు చెప్పిన వాటిని విన్నా నాకు తృప్తి కలుగలేదు. వృష్ణి వంశము వారు, పాండవులు ఒకే రాశిగా నాకు అనిపిస్తోంది. నీవు నేర్పరివి. వాళ్ళ వంశాన్ని ప్రత్యక్షంగా చూచినవాడివి. ఓ తపోధనా! వారి వంశాన్ని విస్తారంగా చెప్పు. ఎవరిని ఎవరిని నేను కోరుతానో వారిని గూర్చి నీవు పూర్తిగా చెప్పుము. అది విని వైశంపాయనుడు ఇలా చెప్పాడు.

రాజా! పాపములను పోగొట్టే దివ్యము, పుణ్యమైన కథను చెపుతా విను. ఈ కథను విని గుర్తుంచుకొన్నవాడు వృద్ధిచెందిన వంశం కలవాడై స్వర్గలోకంలో పూజింపబడతాడు. మహారాజా! నారాయణుని వలన జన్మించిన బ్రహ్మ గొప్ప తేజశ్శాలి. అతడు సమస్త ప్రాణులను సృష్టించాడు. మహా తత్త్వము నుండి అహం కారం, దాని నుండి పంచభూతాలు పుట్టాయి. ఇది మొదటి సృష్టిగా చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు నేను విస్తారంగా నా బుద్దిననుసరించి ఆ సృష్టి విషయం చెపుతా, దాని వలన కీర్తి వృద్ధి చెందుతుంది. ఈ సృష్టి విషయాన్ని చెప్పినవాళ్ళు, విన్నవాళ్ళు ధనికులు, పేరుప్రతిష్ఠలు కలవాళ్ళు అవుతారు. శత్రువులు నశిస్తారు. చివరకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఆయుస్సు వృద్ధి పొందుతుంది. కాబట్టి విని తెలుసుకొనటానికి సమర్థులైన మీకు వృష్ణవంశమును, నాలుగు విధాలైన ప్రాణుల సృష్టిని చెపుతాను.

భగవంతుడు మొట్టమొదట నీటిని సృష్టించాడు. తరువాత ఆ నీటిలో వీర్యమును ఉంచాడు. నీటికి “నారము” అని కూడ పేరుంది. నీరు మానవులకు జన్మస్థానము, భగవంతుడు నివసించే ప్రదేశము. కనుక భగవంతుడు నారాయణుడని పిలవబడుతున్నాడు. భగవంతుడు నీటిలో ఉంచిన వీర్యము బంగారు గ్రుడ్డుగా తయారైంది. ఆ గ్రుడ్డు నుండి బ్రహ్మ పుట్టాడు. అక్కడనే బ్రహ్మ చాలకాలము ఉండి ఆగ్రుడ్డును రెండు ముక్కలు చేశాడు. వాటిలో ఒక ముక్కతో భూమిని, రెండవ ముక్కతో స్వర్గాన్ని నిర్మించాడు. ఆ రెండు ముక్కల మధ్య భాగంతో ఆకాశాన్ని సృష్టించాడు.

భూమిని నీటిమీద నిలబెట్టాడు. మరియు సూర్యుని, పదిదిక్కులను సృష్టించాడు. మరియు కాలమును, మనస్సును, వాక్కును, కామక్రోధములను, అనురాగాన్ని సృష్టించాడు. తరువాత బ్రహ్మ తన మనస్సునుండి మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు అనే సప్తఋషులను సృష్టించాడు. ఈ సప్తఋషులు కర్మమార్గమును గొప్పదానినిగా తలచారు. తరువాత బ్రహ్మ కోపమూర్తి అయిన రుద్రుని పుట్టించాడు. వీరికంటే పూర్వమే సనత్కుమారుని సృష్టించాడు. వీరందరూ సంతానమును కనుట అనే పనిలో నిమగ్నులైయ్యారు. సనత్కుమారుడు మొదలైనవాళ్ళు బ్రహ్మచారులయ్యారు.

సప్తర్షులు, రుద్రుడు సంతాన సమృద్ధిగల వంశాలకు జన్మనిచ్చారు. వీరిలో యక్షులు, సూర్యుడు మొదలైన దేవతలు, కశ్యపుడు మొదలైన మహర్షులు కూడా ఉన్నారు. తరువాత వాళ్ళు మెరుపులు, పిడుగులు, మేఘాలు, ఇంద్రధనుస్సు, పక్షులు, పర్జన్యుడు వీటిని సృష్టించారు. యజ్ఞాల కొరకు వారు ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలను సృష్టించారు. సాధ్యులనే వాళ్ళు ఈ వేదమంత్రాల ద్వారా దేవతల సంతోషం కొరకు యజ్ఞాలు చేశారని విన్నాను. తరువాత బ్రహ్మ తన ముఖం నుండి దేవతలను, రొమ్ము నుండి పితృదేవతలను, లింగమునుండి మనుష్యుల్ని, నడుము నుండి రాక్షసులని సృష్టించి సాధ్యులనే పురాతన దేవతలను పుట్టించాడు. వీళ్ళుకాక అనేకములైన పెద్ద ప్రాణులు, చిన్న ప్రాణులు బ్రహ్మ అవయవాల నుండి పుట్టారు. అప్పుడు వారు వసిష్ఠుడనే పేరు గల ప్రజాపతిని సృష్టించారు.

ఈ విధంగా మనస్సుచే ఎక్కువ సృష్టి చేసినా ప్రజలు వృద్ధిచెందలేదని బ్రహ్మ అప్పుడు తన శరీరాన్ని రెండుముక్కలు చేశాడు. ఒకముక్క పురుషుడు, రెండవముక్క స్త్రీగాచేసి అనేకవిధాలైన ప్రజాసృష్టి చేశాడు. ఆ స్త్రీపురుషులు భూమ్యాకాశాలను వ్యాపించి ఉన్నారు. విష్ణువు విరాట్పురుషుణ్ణి సృష్టించాడు. విరాట్పురుషుడు మనువును సృష్టించాడు. వారే మన్వంతరక్రమాన్ని నడిపించారు. రెండవది ఆపవ మన్వంతరంగా చెప్పబడుతోంది. ఆపవునివల్ల కలిగిన స్త్రీ అయోనిజ (తల్లిగర్భం నుంచి పుట్టినది కాదు) తరువాత నారాయణుడు ఆ మనువు ద్వారా యోనిజ ప్రజాసృష్టిని చేయించాడు. ఈ ఆదిసృష్టిని తెలుసు కొన్నవాడు కోరిన దానిని పొందుతాడు.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో ఆదిసృష్టి వర్ణనము అను మొదటి అధ్యాయము.