హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

3 - దక్షప్రజాపతి వలన మరుత్తులు పుట్టుట

తరువాత జనమేజయుడిలా అడిగాడు.

దేవతలు, రాక్షసులు, గంధర్వులు, సర్పాలు ఎలా పుట్టాయో వివరంగా తెలియజేయుము. వైశంపాయనడిలా చెప్పాడు.

పూర్వము బ్రహ్మ ప్రజలను సృష్టించమని దక్షునకు ఆజ్ఞఈయగా అతడెలా సృష్టించాడో చెప్పుతా విను!

మొదట దక్షుడు మనస్సంకల్పంతోనే ఋషులను, దేవతలను, గంధర్వులను, రాక్షసులను, యక్షభూత పిశాచాలను, పశుపక్షులను, సర్పాలను సృష్టించాడు. మన స్సంకల్పం వల్ల ప్రజలు వృద్ధి చెందకపోతుంటే ఆలోచించి స్త్రీ పురుష సంయోగం ద్వారా ప్రజలను సృష్టింపదలచినవాడై వీరణ ప్రజాపతి పుత్రికయైన అసిక్ని అను దానిని పెండ్లి చేసుకున్నాడు. దక్షుని వలన అసిక్నికి ఐదువేల పుత్రులు కలిగారు. వారు ప్రజలను వృద్ధి చేయదలచుచుండగా నారదుడు వారికి వైరాగ్యమును ఉపదేశించి వారితోపాటు తాను కూడ శపింపబడ్డాడు. అప్పుడు బ్రహ్మ మరీచి మొదలగు ఋషులతో కలిసి దక్షుడి దగ్గరకు వెళ్ళాడు. నారదునికి మరల జన్మ కలుగునట్లు చేయమని ప్రార్థించారు.

అప్పుడు దక్షుడు ఆ మహర్షులతో ఆలోచించి నేనొక కన్యాదానం చేస్తాను. ఆమె వలన నారదుడు మళ్ళీ పుడతాడు అని చెప్పాడు. జనమేజయుడు, మహర్షి, నారదుడు దక్షుని కుమారులను ఎందుకు నశింపచేశాడు? ఈ విషయం బాగా తెలుసుకో గోరుతున్నాను అని అడిగాడు. వైశంపాయనుడిలా చెప్పాడు.

రాజా! దక్షుని కుమారులైన హర్యశ్వులనువారు ప్రజలు వృద్ధిచెందాలని కోరుతూ నారదుడి దగ్గరకు వచ్చారు. అప్పుడు నారదుడు ఓరీ! మీరు మిక్కిలి మూర్ఖులు. ఎందుచేతనంటే భూమికి పైన, మధ్య, క్రిందభాగముల విస్తారము, పరిమాణము మీకు తెలియదు. మీరు ప్రజలనెలా సృష్టి చేయగలరు? అని ప్రశ్నించాడు. ఆమాటను విని హర్యశ్వగణం అన్నిదిక్కులకు పోయారు. వారక్కడ వాయువులేక శ్వాస ఆడనివారైనారు. సముద్రంలో పడిన నదులులాగ వారు తిరిగి రాలేదు. హర్యశ్వగణం అలా నశించిపోగా దక్షుడు వైరిణియందే వేయి పుత్రుల్ని కన్నాడు. వారిపేరు శబలాశ్వులు. వారు ప్రజలను సృష్టించటానికి ఇష్టపడు చుండగా నారదుడు వెనుక చెప్పినట్లే వీళ్ళకుకూడా చెప్పాడు. వాళ్ళు నారదమహర్షి బాగా చెప్పాడని తమ సోదరుల మార్గాన్ని తెలుసుకొనుటకు వెళ్ళాలని నిశ్చయించారు. భూమియొక్క ప్రమాణం తెలుసుకొని సుఖంగా ప్రజలను సృష్టిద్దామని వెనుకటి మార్గాన్నే అన్నిదిక్కులకు వెళ్ళారు. మళ్ళీ తిరిగిరాలేదు.

శబలాశ్వులు నశించిన పిమ్మట దక్షుడు కోపించి నారదుని నశించి గర్భ వాసాన్ని పొందుతావని శపించాడు. తరువాత దక్షుడు వైరిణియందు అరవైమంది కన్యలను సృష్టించాడు. ఆకన్యలను కశ్యపుడు సోముడు(చంద్రుడు) ధర్ముడు, ఇతర ఋషులు వివాహం చేసుకొన్నారు. ఆ కన్యలను పదిమందిని ధర్ముడికి, పదముగ్గురిని కశ్యపునకు, చంద్రుడికి ఇరవైఏడుగురిని, అరిష్టనేమికి నలుగురిని, భృగుమహర్షి కుమారునికి ఇద్దరిని, అంగిరసునికి ఇద్దరిని, కృశాశ్వనికి ఇద్దరిని వివాహం చేశాడు దక్షుడు. వాళ్ళపేర్లు చెపుతా విను.

అరుంధతి, వసుర్యామి, లంబా, భాను, మరుత్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ, యామీపుత్రిక. ఈపదిమంది ధర్ముని భార్యలు. వారి సంతానం పేర్లు చెపుతాను విను. విశ్వ విశ్వేదేవులను, సాధ్య సాగణాన్ని, మరుత్వ మరుత్వంతులను, భాను భానుగణాన్ని, ముహూర్త ముహూర్తగణాన్ని, లంబఘోషుని, యామీ పుత్రిక నాగవీధి, వృషలంబ అనువారిని కన్నారు. ప్రచేతుని పుత్రుడైన దక్షుడు చంద్రునికిచ్చిన స్త్రీలందరూ నక్షత్రముల పేర్లతో పిలువబడుతున్నారు. వీళ్ళుకాక మిగిలిన తేజస్సుకల దేవతలు ఎనిమిదిమంది వసువులని చెప్పబడు తున్నారు. వాళ్ళు ఆపుడు, ధ్రువుడ, సోముడు, ధరుడు, అనలుడు, అనిలుడు, ప్రత్యూషుడు, ప్రభాతుడు అనువారు. ఆపుని కొడుకులు వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, ముని అనువాళ్ళు.

ధ్రువుని కుమారుడు లోకాన్ని నాశనంచేసే కాలుడు. చర్చ అనువాడు చంద్రుని కొడుకు. ధరుని కుమారులు ద్రవిణుడు, హుతహవ్యవహుడనువారు. మనోహర కొడుకులు శిశిరుడు, ప్రాణుడు, రమణుడు. అనిలునకు భార్య శివ మనోజవుడను వానిని కన్నది. అవిజ్ఞాతగతి అనువాడు కూడ అనిలుని కొడుకే. రెల్లువనమందు నివసించే కుమారుడు అగ్నికుమారుడు. శాఖ, విశాఖ, నైగమేయులు కార్తికేయుని (కుమారస్వామి)కి తమ్ముళ్ళు. స్కన్ద, సనత్కుమారులు అగ్నిదేవుని నాల్గవఅంశతో పుట్టారు. ప్రత్యూషపుత్రుడు దేవలుడు. ఇతనికి తపస్వి, క్షమావంతుడు ఇద్దరు కొడుకులు.

బృహస్పతి సోదరి బ్రహ్మచారిణి అనేది విరక్తురాలై భూమిచుట్టూ తిరిగింది. ఆమె ఎనిమిదవ వసువైన ప్రభాసుని భార్య. ఆమె కుమారుడు విశ్వకర్మ. అతడు దేవతల శిల్పి. అనేకవిధాలైన అలంకారాలు తయారుచేయగలవాడు. అతడే దేవతలకు విమానాలు నిర్మించాడు. అతని శిల్పమే మనుష్యులకు కూడ ఒరవడి. సురభి కశ్యపునివలన పదకొండు మంది రుద్రులను కన్నది. విశ్వరూపుడు త్వష్ట కొడుకు. హరుడు, బహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంబుడు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, సర్వుడు, కపాలి ఈ పదకొండుగురు రుద్రులు. అమితమైన తేజస్సు గలవారు రుద్రులు. మొత్తం నూరుగురు కశ్యపుని భార్యలు. అదితి, దితి, దనువు, అరిష్ట, సురస, ఖశసురభి, వినత, తామ్ర, క్రోధవశ, ఇర, కర్రు, ముని అనువారు. వారి సంతానాన్ని చెపుతా విను.

వెనుకటి చాక్షుష మన్వంతరంలో “తుషితు” లను పన్నెండుగురు ముఖ్య దేవతలు వైవస్వత మన్వంతరంలో ఒకరితో మరొకరు “చాక్షుష మన్వంతరం” వచ్చింది. జీవులందరి కళ్యాణానికీ అందరం కలిసి అదితి గర్భంలో ప్రవేశించి జన్మిద్దాం. ఇలా అయితే మనకు మేలు జరుగుతుంది. అని మాట్లాడుకొని దేవత లందరు వైవస్వత మన్వంతరంలో కశ్యపుడికి ఔరసపుత్రులై అదితికి జన్మించారు. ఇంద్రుడు విష్ణువు అర్యముడు, ధాత, త్వష్ట, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు అనువారు పన్నెండుగురు సూర్యులు, ఆదిత్యులనే పేరు గలవారు. చంద్రునికి తన భార్యలయందు చాలామంది సంతానం కలిగారు.

అరిష్టనేమి సంతతి పదహారుమంది బ్రహ్మపుత్రుడనే జ్ఞాని వజ్ర, మేఘ, ఇంద్రధనుస్, విద్యుత్ అనే నలుగురు పుత్రులను కన్నాడు. బ్రహ్మార్షులచే గౌరవింపబడిన ఋక్కులు అన్నియు ప్రత్యంగిర యొక్క కుమారులు. కృశాశ్వునకు పుట్టిన పుత్రులందరూ దేవశాస్త్రులనే పేరుతో ప్రసిద్ధి చెందారు. వేయి యుగాల తరువాత వారు దేవతలై పుడతారు. దేవగణములు మొత్తము 33గ్గురు రౌమజులని పేరు గలవాళ్ళు. వీరికి గూడా పుట్టుక చావులున్నాయి. సూర్యుడికి ఉదయము, అస్తమించుట ఉన్నట్లే దేవగణములు జనన మరణములు కలిగిఉన్నారు. వీళ్ళు ప్రతియుగంలోనూ జన్మిస్తారు. కశ్యపుని వలన దితికి ఇద్దరు పుత్రులు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షడు జన్మించారు. సింహిక అనే కన్య కూడ పుట్టింది. ఆమె విప్రచిత్తికి భార్య. మహాబలవంతుడైన ఆమె కొడుకులు సైంహికేయులని పిలువబడతారు. వారు పదివేలమంది. వాళ్ళ కొడుకులు మనుమలు వందల వేలకొలది ఉన్నారు. వాళ్ళకు పుట్టినవాళ్ళు లెక్కకందనివాళ్ళు.

హిరణ్యకశిపునకు నలుగురు పరాక్రమవంతులైన పుత్రులు. వారు అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు అనువారు. సంహ్లాదుడును. వారిలో హ్లాదుని పుత్రుడు హ్రాదుడు. సంహ్లాదుని పుత్రులు సుందుని సుందుడు అనువారు. అనుహ్లాదుని కొడుకులు ఆయువు, శిబి, కాలుడు అని ముగ్గురు. ప్రహ్లాదుడికి ఒక్కడే పుత్రుడు విరోచనుడనేవాడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. బలి కుమారుడు బాణుడు, ధ్రుతరాష్ట్రుడు, చంద్రుడు, చంద్రమసుడు, ఇంద్ర తాపనుడు, కుంభనాభుడు, గర్దబాక్షుడు, కుక్షి మొదలగు నూరుగురు పుత్రులు పుట్టారు. బాణుడు వీరందరిలో మిక్కిలి బలశాలి. పెద్దవాడు శివునికి ప్రియమైనవాడు కూడ.

పూర్వము బాణుడు శివుని ప్రసన్నుని చేసుకొని శివునకు ప్రక్కనే విహరిస్తూ ఉండేటట్లు వరం పొందాడు. బాణుడికి లోహితి అనే భార్యయందు ఇంద్రదమనుడునే పుత్రుడు కలిగాడు. ఈ విధంగా హిరణ్యకశిపునకు ఒక లక్ష రాక్షసులు, హిరణ్యాక్షుడికి మహా బలవంతులు విద్వాంసులైన కుమారులైదుగురు కలిగారు. ఝర్జరుడు, శకుని, భూతసంపానుడు, మహానాభుడు, కాలనాభుడు అని వాళ్ళ పేర్లు. దనువను స్త్రీ కుమారులు నూర్గురు. వాళ్ళు తీవ్రమైన పరాక్రమము గలవాళ్ళు. వాళ్ళలో ముఖ్యులైన వాళ్ళను చెపుతాను విను.!

దివమూర్ఖుడు, శకుని, శంకుశిరుడు, శంకుకర్ణుడు, విరాధుడు, గవేష్టి, దుందుభి, అయోముఖుడు, శంబరుడు, కపిలుడు, వామనుడు, మరీచి, మఘన, ఇర, శంకుశిరుడు, వృకుడు, వక్షోభణుడు, కేతువు, కేతువీర్యుడు, శతహ్రదుడు, ఇంజిత్, సత్యజిత్తు, వజ్రనాభుడు, మహానాభుడు, విక్రాంతుడు, కాలనాభుడు, ఏకచక్రుడు, మహాబాహువు, తారకుడు, వైశ్వానరుడు, పులోముడు, విద్రావణుడు, మహాసురుడు, స్వర్భానువు, వృషపర్వుడు, తుహంతుడు, సూక్ష్ముడు, అతిచంద్రుడు, ఊర్ణనాభుడు, మహగిరి, అసిలోముడు, కేశి, శఠుడు, బలకుడు, మదుడు, గగనమూర్ధుడు, కుంభనాశుడు, ప్రమరుడు, విరూపాక్షుడు, సుదధుడు, హరుడు, అహరుడు, హిరణ్యకశిపుడు, శతమన్యు, శంబరుడు, శరభుడు, శలభుడు, విప్రచిత్తి వీరు దనువను స్త్రీ పుత్రులు. వీళ్ళలో విప్రచిత్తి తక్కినవాళ్ళ కంటే గొప్పవాడు, మిక్కిలి బలవంతుడును. వీళ్ళ పుత్రపౌత్రులతో వృద్ధి చెందిన రాక్షసవంశము. అందరినీ లెక్క పెట్టి చెప్పుట అసంభవము.

స్వర్భాను కుమార్తె ప్రభ, ఉపదానవి, హయశిర, శబి, వారపర్వణి (శర్మిష్ట) వీరందరు పులోమ పుత్రికలు. పులోమ కాలిక వీరిద్దరు వైశ్వానరుని కుమార్తెలు. వీరిద్దరు గొప్ప శక్తి కలవాళ్ళు. కశ్యపుడికి వీళ్ళు భార్యలయ్యారు. పులోమ, కాలిక అనువారి వల్ల కశ్యపుడు అరవైవేలమందిని కన్నాడు. ఈ రాక్షసులు మిక్కిలి బలవంతులు దేవతలకు కూడ చంపశక్యం కానివాళ్ళు. హిరణ్యపురంలో ఉండే వాళ్ళు. అర్జునుని చేతిలో వీరందరూ మరణించారు.

ప్రభ అనే స్త్రీకి నహుషుడు, శచికి సృంజయుడు, శర్మిష్టకు పూరువు జన్మించారు. ఉపదావనికి దుష్యంతుడు పుట్టాడు. విప్రచిత్తికి సింహిక యందు పదముగ్గురు కుమారులు కలిగారు. వీళ్ళు రాక్షసులతో కలిసి మహా పరాక్రమవంతులయ్యారు. వంశ, శల్య, నభ, వాతాపి, నముచి, ఇల్వల, బాస్వమ, అంజిక, నరక, కాలనాభ, శుక పోతరణ, వజ్రనాభ, దానవులు పదముగ్గురిలో రాహు అందరికంటే పెద్దవాడు. ఇతడే గ్రహణానికి కారకుడు, మూక తుహుండులిద్దరు హ్లాదుని పుత్రులు. సుందుడికి తాటయందు మారీచుడు పుట్టాడు. శివ మాణసుర కల్ప రాక్షసుల పుత్ర పౌత్రుల లెక్కించి చెప్పటం కఠినమైన విషయము.

సంహ్లాదుని వంశంలో వాకవచగణము పుట్టింది. వాళ్ళు గొప్ప తపస్సు చేసిన వాళ్ళు. వాళ్ళ పుత్రులసంఖ్య మూడు కోట్లు. వాళ్ళు మణి అనే పట్టణంలో ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రహ్మ నుండి వరాలు పొంది చంపశక్యం కానివాళ్ళు అయ్యారు. వాళ్ళను కూడ అర్జునుడే సంహరించాడు. తామ్రకు ఆరుగురు పుత్రికలు. వాళ్ళు కాకి, శ్యేని, భాసి, సుగ్రీని, శుచి, గృధ్రిక అనువారు. కారికి కాకులును, ఉలూకి గుడ్లగూబలును, శ్లేనికి గ్రద్దలు పుట్టినాయి. శుచికి జలచర పక్షులు, సుగ్రీవికి ఒంటెలు, గాడిదలు మొదలైనవి పుట్టాయి. వీటన్నింటి ద్వారా తామ్రవంశం వృద్ది చెందింది. వినత కుమారులు, ఆరుణుడు, గరుడుడు. గరుడుడు పక్షులలో శ్రేష్టుడయ్యాడు.

సురసకు వెయ్యి సర్పాలు పుట్టాయి. అవి ఎల్లప్పుడు గరుడునికి అధీనములై ఉండేవి. వీరిలో శేషుడు, వాసుకి, తక్షకుడు, ఐరావతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఐలాపుత్రుడు, శంఖకర్కోటకులు, ధనంజయ, మహానీల, మహాకర్ణ, ధృతరాష్ట్ర, బలాహక, కుమార పుష్పదంష్ట్ర, దుర్ముఖ, సుముఖ, శంఖ, శంఖపాల, కపిల, వామన, నహుష, శంఖరోమ, మణి మొదలైనవారు. వీరి పుత్ర మనుమలు గరుడునిచే చంపబడ్డారు. నేలపై నడుచునట్టివి, నీటిలో నడుచునట్టి పక్షులు అన్నీ పృధ్వి అనుదాని సంతతి. సురభి ఎద్దులను, దున్నపోతులను ఆవులను కన్నది. ఇర చెట్లు తీగలు, గడ్డిలోని రకాలను అన్నిటినీ కన్నది. ఖశ అనే స్త్రీ యక్షులను రాక్షసులను మునులను అప్సరసలను కన్నది. అరిష్ట బలవంతులైన గంధర్వులను కన్నది.

ఈ విధంగా కశ్యపుని యొక్క కదులునట్టి కదలనట్టి సంతతిని వర్ణించి చెప్పాను. వారి పుత్రులు మనుమలు వందల వేలకొలదిగా ఉన్నారు. ఇది స్వారోచిష మన్వంతరమందలి సృష్టి వైవస్వత మన్వంతరంలో వరుణుడు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో హోమం చేసేవాడుగా ఉన్న బ్రహ్మద్వారా ఏర్పడిన సృష్టికార్యము వివరించి చెపుతాను.

ఈ వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ సప్తర్షులను గంధర్వులు మొదలగు వాళ్ళనూ సృష్టికార్యంలో ఆజ్ఞాపించాడు. తరువాత దేవతలకు రాక్షసులకూ విరోధమేర్పడి రాక్షసులు నశించారు. పుత్రనాశనమునకు దుఃఖిస్తూ దితి భర్తయైన కశ్యపునకు సంతోషం కలిగించింది. అతడు వరం కోరుకోమన్నాడు. ఇంద్రుని చంపుటకు సమర్థుడైన పుత్రుడు కావాలని కోరింది. వంద సంవత్సరాలు గర్భం ధరించి ఉండ గలిగితే నీవు కోరినట్లే జరుగుతుందని భర్త వరమిచ్చాడు. రాజా! పరి శుద్ధురాలై ఉండి ఆమె గర్భం ధరించింది. కశ్యపుడిలా చెప్పి తపస్సు చేసుకొనుటకు వెళ్ళిపోయాడు.

ఇంద్రుడు ఆ గర్భాన్ని వ్యర్థం చేయటానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వేచి చూస్తున్నాడు. కొంచం తక్కువగా వంద సంత్సరాలైన సమయంలో ఇంద్రుడికి అవకాశం దొరికింది. కాళ్ళు కడుక్కొనకుండా దితి పడుకుంది. ఆమె నిద్ర పోతుండగా ఆమె గర్భంలో ప్రవేశించాడు. గర్భంలో పిండాన్ని తన వజ్రాయుధంతో కోసి ఏడు ముక్కలు చేశాడు. కోస్తుండగా శిశువు ఏడుపు ప్రారంభించాడు. ఇంద్రుడు మాటిమాటి అతని ఏడ్పును అడ్డగించినా మరల మరల ఏడుస్తూనే ఉన్నాడు. ఇందుకు ఇంద్రునికి కోపం వచ్చింది. ఒక్కొక్క ముక్కను మళ్ళీ ఏడేసి ముక్కలు చేశాడు. ఇంద్రుడు మరుత్తలనే దేవతలైన ఆ నలభై తొమ్మిది తనకు సహాయంగా చేసుకున్నాడు. ఈవిధంగా ప్రాణిసృష్టి వృద్ది చెందింది.

అప్పుడు విష్ణువు దేవతలలో ఒకణ్ణి సేనాపతిగా చేశాడు. ఒక్కొక్క దేవతను ప్రాణులకు రాజుగా చేశాడు. పృధు మహారాజు ఈ రాజులలో ప్రధానుడు. విష్ణువే ప్రధానుడు. వీరుడు, కృష్ణుడు, జయశీలుడు, ప్రజాపతి, మేఘము, సూర్యుడు అవ్యక్త పురుషుడు అయి ఉన్నాడు. ఈ ప్రజాసృష్టి విషయాన్ని నలభై తొమ్మిది వాయువుల పుట్టుక విన్నవాడు చదివినవాడు పరలోక భయం లేనివాడవుతాడు. అతడు మరల భూమిపై పుట్టవలసిన అవసరముండదు.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో దక్షప్రజాపతి వలన మరుత్తులు పుట్టుట అను మూడవ అధ్యాయం.