హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
28 - ఆయువు వంశ వర్ణనము
వైశంపాయనుడిలా అన్నాడు.
ఆయువు యొక్క కొడుకు అందరూ వీరులు. రాహువు కుమార్తె ప్రభయందు పుట్టారు. వీళ్ళు ఐదుగురు వీళ్ళపేర్లు నహుషుడు, వృద్ధశర్మ, రంభుడు, రజి అనేనుడు. వీళ్ళు మహారథులుగా మూడు లోకాలలో ప్రసిద్ధిచెందారు “రజి”కి నూటైదుగురు పుత్రులు పుట్టారు. వాళ్ళు రాజేయులని పేరు పొందారు. వాళ్ళు ఇంద్రుని కూడ భయపెట్టారు. దేవతలకూ, రాక్షసులకూ యుద్ధం వచ్చినప్పుడు, దేవతలు, రాక్షసులు కలిసి బ్రహ్మవద్దకు వెళ్ళారు. మారెండు పక్షాలలో ఏ పక్షం విజయం సాధిస్తుంది? దయచేసి చెప్పండి అన్నారు. అప్పుడు బ్రహ్మ రజి ఉన్న పక్షం గెలుస్తుంది అన్నాడు. ధర్మమున్నచోటనే జయముంటుంది. అని చెప్పాడు.
ఇలా చెప్పిన మీదట దేవతలు రాక్షసులు రజిని సేనాపతిగా చేసుకొనటానికి అతని దగ్గరికి వెళ్ళారు. మహరాజా! మా విజయం కోసం మీరు శ్రేష్టమైన ధనుస్సు చేత బట్టండి అని రెండు పక్షాలవాళ్ళూ అడిగారు. అప్పుడు అర్థశాస్త్రం తెలిసిన రజి తన స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ ఇంద్రాది దేవతలారా! నేను రాక్షసుల నందరినీ జయించి ఇంద్రపదవిని పొందగలను అన్నాడు. ఇది విని దేవతలు సంతోషించారు. రాజా నీకోరిక పూర్తి అవుతుంది అని దేవతలు చెప్పారు. అప్పుడు రాక్షసులతో చూడండి. దేవతలు నా మాట నెట్లంగీకరించారో అట్లే మీరు కూడ సమ్మతిస్తే నేను యుద్ధానికి సిద్ధపడతాను అన్నాడు.
అహంకారం గల రాక్షసులు అభిమానంతో ప్రహ్లాదుడు మా ఇంద్రుడు అతనిని వెంట బెట్టుకొని విజయాన్ని సాధిస్తాం అన్నారు. నీవు దేవతలు చెప్పిన నియమంపై దృఢంగా నిలిచి ఇంద్ర పదవిని పొందుము అన్నారు. అప్పుడు రజి తథాస్తు (అట్లే అగుగాక) అని పలికి నిశ్చింతగా ఉన్నాడు. దేవతలు నీవు రాక్షసులను చంపి ఇంద్రపదవిని పొందు అన్నారు. వాళ్ళమాట ప్రకారం రజి యుద్ధభూమిలో ఇంద్రునికి కూడ జయింపశక్యం కాని రాక్షసులను చంపి దేవతల చేతినుండి జారిపోయిన రాజ్యలక్ష్మిని పునరుద్దరించాడు. తరువాత దేవతల నందరినీ వెంట బెట్టుకొని ఇంద్రుడు రజి దగ్గరకు వెళ్ళాడు.
రాజా! ఇప్పుడు నీవు దేవతలకు రాజైన ఇంద్రుడవు అయ్యావు. ఇందులో సందేహమేమీలేదు. కాని ఈనాటి నుండి నేను నీ పుత్రుడనుగా చెప్పుకుంటాను. నా మంచి పనుల బలంతో ఇంద్రుడనై ప్రసిద్ధిని పొందుతాను అన్నాడు. రాజా! రజి ఇంద్రుని మాటకారితనం చేత మోసపోయి సంతోషంతో అతని మాటను అంగీకరించాడు. రజికి స్వర్గరాజ్యం దొరకగానే అతడు అక్కడ రాజ్యం చేయటానికి తన ఐదువందల మంది కొడుకులు స్వర్గంలో ప్రవేశించి ఇది మా తండ్రి రాజ్యము. కాబట్టి మేమందరం ఈ రాజ్యాన్ని పంచుకొంటం అని పలికి స్వర్గరాజ్యాన్ని పంచుకొన్నారు.
తరువాత చాలాకాలం గడవగా బలశాలియైన ఇంద్రుడు రాజ్యం కోల్పోయి బృహస్పతితో మహానుభావా! రాజ్యం కోల్పోయి కృశించిపోయాను. నా కోసం రేగుపండంత పురోడాశాన్ని (యజ్ఞంలో దేవతలికిచ్చే ఆహారాన్ని) నాకు కల్పించు దానిని తిని బలవంతుడనౌతాను అని అడిగాడు. అప్పుడు బృహస్పతి దేవేంద్రా! నీవు నాకు ముందే చెప్పి ఉంటే నీ ప్రీతికొరకు చేయరానిది లేదు. దేవేంద్రా! ప్రయత్నిస్తాను. నీవు త్వరలో రాజ్యాన్ని యజ్ఞభాగాన్ని పొందేటట్లు చేస్తాను. నీవు భయపడకు. తరువాత ఇంద్రుని తేజస్సు వృద్ధి పొందటానికి రజకి బుద్ధి నశించేటట్లు పని ప్రారంభించాడు బృహస్పతి. ముందు ఒక ధర్మశాస్త్రాన్ని రచించాడు. అందులో ధర్మాన్ని నిందించే మాటలు వ్రాయబడి ఉన్నాయి. అందులోని తర్క శాస్త్రం మాటలు మూర్ఖులకు ఆనందం కలిగించేటట్లు ఉన్నాయి.
బృహస్పతి తయారుచేసిన గ్రంధం రజియొక్క మందబుద్ధులైన కుమారులకు బాగా నచ్చింది. సంతోషం కలిగించింది. అది చదివి ధర్మవిరుద్దమైన బుద్ది కల వాళ్ళయ్యారు. ఆ పుస్తకంలోని చెడు ఉపదేశాన్నే గొప్ప జ్ఞానంగా తలచారు. వాళ్ళ మనస్సులలో ఆధర్మం ఇల్లు కట్టుకొంది. ఆ అధర్మంచేత ఆ రజి పుత్రులు నష్ట పోవటం మొదలైంది. ఈ విధంగా బ్రహ్మద్వేషం కలవాళ్ళయ్యారు. వాళ్ళ పరాక్రమం క్షీణించింది. అప్పుడు ఇంద్రుడు బృహస్పతి దయచే కామక్రోధాలతో నిండిన రజి పుత్రులను చంపి మళ్ళీ రాజ్యాన్ని పొంది సుఖంగా ఉన్నాడు. ఈ రాజ్యం కోల్పోవటం దేవేంద్రుని కీర్తి విన్నవాడు దుర్మార్గుడు కాడు.
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో ఆయువు వంశ వర్ణనము అను ఇరవై ఎనిమిదవ అధ్యాయము.
