హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

26 - పురూరవ చరిత్ర

వైశంపాయనుడు ఇలా చెపుతున్నాడు.

మహరాజ! బుధుని కొడుకు విద్వాంసుడైన పురూరవుడు. అతడు తేజశ్శాలి దానశీలుడు గొప్ప దక్షిణలిచ్చి యాగాలు చేసేవాడు. బ్రహ్మవాది, పరాక్రమ వంతుడు, శత్రువులకు జయింపశక్యము కానివాడు. సత్యము పలుకువాడు పవిత్రమైన బుద్ధి గలవాడు. అందరిచే ప్రార్థింపబడువాడు. మూడు లోకాలలోనూ గొప్ప కీర్తి గలవాడు. ధర్మం తెలిసినవాడును గొప్ప కీర్తి గల ఉర్వశి అభిమానం విడిచి అతనిని ప్రేమించింది. రాజు ఆమెతో పదిహేను సంవత్సరాలు కలిసిఉన్నాడు. అందమైన చైత్రరథమనే కుబేరుని ఉద్యానవనములోను అలకా పట్టణంలోన ఈ విధంగా అనేక సుందర ప్రదేశాలలో సంవత్సరాలు ఆమెతో విహరించాడు. పురూరవుడు ప్రయాగలో రాజ్యం చేశాడు. అతనికి దేవతల వంటి ఏడుగురులు పుత్రులు కలిగారు. వాళ్ళు ఆయువు, అమావసు, విశ్వావసు, శృతాయు, దృఢాయువు, శతాయువు, వనవాయువు అనువారు. ఇంతవరకు విని జనమేజయ మహారాజు అడిగాడు.

బ్రాహ్మణోత్తమా! మీరు చాలా విషయాలు తెలిసినవారు. దేవలోకంలో ఉండే ఊర్వశి భూలోకంలో ఉండే మహారాజును ఎందుకు ప్రేమించింది? ఈ సందేహం తీర్చకోరుతున్నాను. అప్పుడు వైశంపాయనుడిలా చెప్పాడు. మహారాజా! ఊర్వశి బ్రహ్మ శాపంచేత మనుష్య స్త్రీ అయి పురూరవుని వివాహం చేసుకుంది. వివాహ సమయంలో శాపం నుంచి తప్పుకోవటానికి పురూరవుడికి ఒక షరతు పెట్టింది. దిగంబరుడుగా (ఊర్వశి వద్దకు) తనవద్దకు రాకూడదు. ఆమె కోరినప్పుడే సంగమం. పక్కదగ్గర రెండు గొర్రెలు కట్టి ఉంటాయి. నేయి మాత్రమే ఆహారం ఒక పూటే భోజనం.

ఈ నియమాలు ఎంతకాలం పాటిస్తే అంతకాలమే నీ దగ్గర ఉంటాను. ఆమె చెప్పి నియమాల్ని రాజు పాటించాడు. యాభై మూడు సంవత్సరాలు ఆసక్తితో ఉన్నది. ఊర్వశి మనుష్య స్త్రీగా ఉండగా గంధర్వులు విచారం కలవాళ్ళయ్యారు. స్వర్గానికి అలంకారమైన ఊర్వశి తిరిగి వచ్చేటట్లు ఆలోచిద్దాం. విశ్వావసువనే గంధర్వుడు ఆమె పెట్టిన షరతులో ఏదైనా జరగకపోతే ఊర్వశి తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి నేను కొందరి సహాయంతో వెళ్తాను అని చెప్పి అతడు ప్రయాగకు వెళ్ళాడు. రాత్రి సమయంలో రాజభవనంలో దూరి ఒక గొర్రెను దొంగిలించి తెచ్చాడు. అప్పుడు ఊర్వశి రాజా! నా గొర్రెను ఎడపహరించాడు? అని ప్రశ్నించగా తొందరలో దిగంబరుడుగా రాజు పరుగెత్తాడు.

అప్పుడు దిగంబరుడైన పురూరవుని చూచి కామరూపం గల ఊర్వశి కనబడకుండా పోయింది. గంధర్వుడు విడిచిపెట్టిన గొర్రెను చూచి రాజు ఇంటికి పట్టుకొచ్చాడు. ఇంటిలో ఊర్వశి కనపడక మహారాజు మిక్కిలి దుఃఖించాడు. ఆమెను వెతుకుతూ భూమండలమంతా తిరిగాడు కురుక్షేత్రంలో ఆమెను చూచాడు. అక్కడ సరస్సులో స్నానం చేసి ఐదుగురప్సరలతో ఆమె క్రీడిస్తున్నది. ఆమెను చూచి రాజు మిక్కిలి దుఃఖపడ్డాడు. ఊర్వశి నేను ప్రేమించిన రాజు ఇతడే అని చెలికత్తెలకు చూపింది. చెలికత్తెలు ఊర్వశిని ఇక్కడే ఉండు అన్నారు. అప్పుడు ఊర్వశి రాజుతో నేను గర్భవతినని చెప్పింది.

ఒక సంవత్సరంలో నీకు పుత్రుడు కలుగుతాడు. ఒక్క రాత్రి మాత్రం నాతో పాటు ఉంటావు. అన్నది. రాజు సంతోషంతో తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఒక సంవత్సరం గడిచాక ఊర్వశి మళ్ళీ వచ్చింది. మహారాజు ఒక రాత్రి ఆమెతో గడిపాడు. తరువాత ఊర్వశి మహారాజ! గంధర్వులు నీకు వరమిద్దామనుకొన్నారు. నీవు వాళ్ళతో సమానుడవైనట్లు వరము అడుగుము అని చెప్పింది. రాజలాగే వరమడిగాడు. గంధర్వులు తధాస్తు అన్నారు. గంధర్వులు నిప్పులతో నిండిన పాత్రను రాజుకు ఇచ్చి ఈ అగ్నితో యాగం చేస్తే మాలోకాన్ని పొందుతావన్నారు. అప్పుడు రాజు ఊర్వశి పుట్టిన కుమారుని తీసికొని తన పట్టణానికి వెళ్ళాడు.

అరణ్యంలో అగ్నిని ఉంచి పుత్రునితో ఇంటికి వెళ్ళాడు. కొంచం సమయం తరువాత అగ్ని దగ్గరికి వెళ్తే అక్కడ అగ్నిలేదు. ఒక రావిచెట్టు ఉంది. కొన్ని క్షణాల తరువాత అగ్నివల్ల రావిచెట్టు పుట్టుట అతనికి ఆశ్చర్యం కలిగించింది. తరువాత గంధర్వులకు అగ్ని కనబడలేదని చెప్పాడు. రావిచెట్టు నుండి అరణి తయారుచేసి శాస్త్ర ప్రకారం మధించి ఆ అగ్నిని మూడుగా చేసి రాజు యజ్ఞం చేశాడు. అనేక విధాలైన యజ్ఞాలు చేసి గంధర్వలోకాన్ని పొందాడు. పూర్వము ఒకటిగా ఉన్న అగ్నిని పురూరవుడు మూడుగా చేశాడు. ఇలాంటి ప్రభావం కలవాడు పురూరవుడు మహర్షులు పొగడినట్టి పవిత్రమైన ప్రయాగక్షేత్రంలో పురూరవ మహారాజు రాజ్యం చేశాడు. ప్రయాగకే మారుపేరు “ప్రతిష్టానం” ఉత్తర భారతంలో గంగతీరాన ప్రతిష్టాన నగరం (ప్రయాగ) ఉన్నది.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో పురూరవ చరిత్ర అను ఇరవై ఆరవ అధ్యాయము.