హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
39 - కృష్ణుడు శతధన్వుని చంపుట
వైశంపాయనుడిలా చెప్పాడు.
రాజా! శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకిచ్చిన మణిని అక్రూరుడు శతధన్వుని ద్వారా అపహరింపచేసి స్వాధీనం చేసుకొన్నాడు. కృష్ణుని ద్వారా సత్రాజిత్తుకు మణి చేరినప్పటి నుండీ అక్రూరుడు సత్యభామా మణిని అడగటం ప్రారంభించారు. వాళ్ళకోరిక ఫలించకపోయేటప్పటికి శతధన్వుడు సత్రాజిత్తును చంపి మణిని అక్రూరుడికి ఇచ్చాడు. అప్పుడు అతడు మణి తనవద్ద ఉన్నదని ఎవనికీ చెప్ప కుండునట్లు శతధన్వునిచే ప్రతిజ్ఞ చేయించాడు. ఈ సమయంలో తండ్రి మరణం చేత దుఃఖిస్తున్న సత్యభామ రధంమీద హస్తినాపురానికి వెళ్ళింది. అక్కడ ఆమె తనభర్తకు శతధన్వుని పని చెప్పి దుఃఖించ మొదలుపెట్టింది. ఆ సమయంలో లక్కయింటిలో తగలబడిపోయిన పాండవులకు తర్పణం మాత్రంచేసి తక్కిన పనినంతనూ సాత్యకికి వప్పచెప్పి శ్రీకృష్ణుడు త్వరగా ద్వారకకు వచ్చి బలరామునితో ఇలా అన్నాడు!
ప్రసేనుని సింహం చంపింది. శతధన్వుడు సత్రాజిత్తును చంపాడు. ఈ పరిస్థితిలో స్యమంతకమణి నాకు చెందవలసియున్నది. కాబట్టి నీవు ఒక త్వరగా వెళ్ళే రథంమీద వెళ్ళి శతధన్వుని చంపి మణిని తీసుకురా. అప్పుడు స్యమంతకమణి మనచేతిలో ఉంటుంది. తరువాత శతధన్వుడికీ కృష్ణుడికీ ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు అన్నిదిక్కులా అక్రూరుడి కోసం చూచాడు. ఆ యుద్ధంలో అక్రూరుడు శతధన్వుడికి సహాయం చేయలేదు.
అప్పుడు శతధన్వుడు మిక్కిలి వేగంగా వెళ్ళే గుర్రాన్ని ఎక్కి పారిపోయాడు. చాలాదూరం వెళ్ళాక గుర్రం అలిసిపోయింది. అప్పుడు శతధన్వుడి దగ్గరకు రథం మీద కృష్ణుడు వచ్చేశాడు. శతధన్వుడు గుర్రాన్ని వదిలేసి కాళ్ళతో పరుగెత్తాడు. శ్రీకృష్ణుని రథం, గుర్రాలుకూడ అలిసిపోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడితో అన్నా! గుర్రాలు అలిసిపోయాయి. నీవిక్కడనే ఉండు. నేను శతధన్వుని వెంట పరుగెత్తి మణిని లాక్కొనివస్తాను. అని శ్రీకృష్ణుడు శతధన్వుని వెంట పరుగెత్తి మిధిలానగరం వద్దకు వచ్చాక శతధన్వుని చంపివేశాడు. కాని అతని వద్ద మణి దొరకలేదు.
అప్పుడు బలరాముడి దగ్గరకు వచ్చాడు. బలరాముడు కృష్ణా! మణి యిమ్మన్నాడు. అతనిదగ్గర మణి లేదన్నాడు కృష్ణుడు. అప్పుడు బల రాముడు కోపించి మాటిమాటికీ నిందించి నీవు నాకు తమ్ముడివి కనుక నేనేమీ అనలేకపోతున్నాను. నీకు శుభమగుగాక! నేను వెళ్తున్నా. నాకు ద్వారకలోకాని, నీతో కాని, వృష్ణివంశం వాళ్ళతోకాని పనిలేదు అనిపలికి మిధిలానగరంలో ప్రవేశించాడు. మిధిలానగరరాజు బలరాముని మిక్కిలి ఆదరించాడు.
అక్రూరుడు స్యమంతకమణిని రక్షించటానికి నేను యజ్ఞంచేస్తూ ఉంటే నాతో ఎవ్వడూ దెబ్బలాటకు రాడని దీక్షాకవచాన్ని ధరించాడు. అనేక యజ్ఞాలు చేయ మొదలుపెట్టాడు. అతని యజ్ఞాలు వరసగా అరవైఏళ్ళు సాగాయి. ఈ సమయంలోనే దుర్యోధనుడు మిధిలకు వెళ్ళాడు. అక్కడ బలరామునివద్ద గదా యుద్దాన్ని నేర్యుకొన్నాడు. తరువాత శ్రీకృష్ణుడు మహారధికులైన వృష్ణివంశం వాళ్ళను, అంధక వంశంవాళ్ళనూ, మహాపురుషులను వెంటబెట్టుకొని వెళ్ళి బలరాముని బ్రతిమాలి ద్వారకానగరానికి తీసుకువచ్చాడు. అక్రూరుడు బంధువులతో కలిసి సత్రాజిత్తును చంపి ద్వారకను విడిచిపెట్టి అంధకవంశీయులతో వేరొకచోటికి వెళ్ళిపోయాడు. మహాత్ముడైన కృష్ణుడు జ్ఞాతులలో భేదబుద్ధి ఏర్పడుతుందని అక్రూరుణ్ణి ఉపేక్షించి వదిలేశాడు. అక్రూరుడు ద్వారకను విడిచివెళ్ళగానే వర్షాలు కురవలేదు. వర్షాలు లేక రాజ్యం చాల నశించింది.
అప్పుడు “కుకుర”, అంధకవంశజనులు అక్రూరుని బ్రతిమాలారు. దానపతి అక్రూరుడు రాగానే వర్షం కురిసింది. అక్రూరుడు శ్రీకృష్ణుని సంతోషపెట్టుటకు తనతోబుట్టువును కట్టబెట్టాడు. శ్రీకృష్ణుడు అక్రూరునిదగ్గర మణి ఉందని తెలుసుకొని సభలో నీవద్ద ఉన్న మణిని ఇమ్ము. బలరాముడికి నామీద అనుమానం ఉండుటచే నాపై కోపంతో ఉన్నాడు అని చెప్పగా అక్రూరుడు మణిని ఇచ్చేశాడు. శ్రీకృష్ణుడు అక్రూరుని సరళబుద్దిచే ప్రసన్నుడై ఆ మణిని మరల అక్రూరుడికే ఇచ్చివేశాడు. అక్రూరుడు మణిరాగానే దాన్ని ధరించాడు. దానితో సూర్యునివలె ప్రకాశించాడు. పవిత్రతతో, శాంతమైన మనస్సుతో, నియమంగా ఈ కథను విన్నవాళ్ళు సమస్తశుభాలను, కోరికలను పూర్తిచేసుకుంటారు. వాళ్ళ కీర్తి బ్రహ్మ లోకం వరకూ వ్యాపిస్తుంది. ఇది సత్యమని నీకు చెపుతున్నాను.
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో కృష్ణుడు శతధన్వుని చంపుట అను ముప్పై తొమ్మిదవ అధ్యాయము
