హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
54 - నారద విష్ణుసంవాదం
వైశంపాయనుడిలా చెప్పాడు.
మహారాజ! నియమప్రకారం నిశ్చయింపబడిన సమయంలో అర్జునుడు ఇంద్రుని యొక్క భీముడు, వాయువు యొక్క నకుల సహదేవులు, అశ్వినీదేవతల యొక్క కర్ణుడు, సూర్యుని యొక్క ద్రోణాచార్యుడు, బృహస్పతి యొక్క భీష్ముడు, ఎనిమిదవ వసువు యొక్క విదురుడు, ధర్మం యొక్క దుర్యోధనుడు, కలియొక్క అభిమన్యుడు, చంద్రుని యొక్క భూరిశ్రవుడు, శుక్రుని యొక్క శృతాయుధుడు, వరుణుని యొక్క అశ్వత్థామ, శంకరుని యొక్క కణికుడు, మిత్రుని యొక్క ధృతరాష్ట్రుడు, కుబేరుని యొక్క ఇలా దుశ్శాసనుడు మొదలగువాళ్ళు గంధర్వుల యొక్క, సర్పాలయొక్క అంశతో జన్మించారు. దేవతలీవిధంగా అవతరించిన తరువాత దేవతల పక్షంలో కలిసి ఉన్న నారదమహర్షి విష్ణుభగవానుని సభకు వెళ్ళి కోపంతో విష్ణువును ఇలా అన్నాడు.
ఓ కేశవ! దేవతలు చాలామంది రాజుల నాశంకోసం తమతమ అంశలతో అవతరించారు. వాళ్ళంతా వ్యర్ధం నీ సహాయంతోనే క్షత్రియులతో యుద్ధ ఫలిస్తుంది. నరనారాయణులుంటేగాని పని జరుగదు. యథార్ధం తెలిసికూడా భూమి కోసం ఇలా చేయటం బాగాలేదు. దేవతలందరూ అవతరించారు కాని నీ అంశతో ఎవడూ అవతరించలేదు. అవతరించిన దేవతల సహాయం కొరకు నీవు వాళ్ళను ప్రేరేపిస్తే వాళ్ళు తమ పనిలో ఫలితం సాధించగలగుతారు. ఓ విష్ణుదేవా! నీ అంశావతారం కనబడక నేను పరుగెత్తుకొని వచ్చాను. నిన్నీ పనిలో ప్రేరేపించు టకే నేనిక్కడకి వచ్చాను. దీనికి కారణం చెపుతా -
ఓ హృషీకేశ! పూర్వం తారకామయ యుద్ధ సమయంలో నీచేత మరణించిన వారి స్థితి చెపుతున్నా. భూలోకంలో యమునానది ఒడ్డున అనేక విధాలైన జనులతో నిండిన మధురాపురమనే అందమైన పట్టణముంది. పూర్వం మధువనమని దాని పేరు. అక్కడ గొప్ప పరాక్రమవంతుడు అందరికీ భయంకలిగించేవాడు అయిన మధు అనే రాక్షసుడు ఉంటూ ఉండేవాడు. అతని కొడుకు మహాబలశాలి “రావణుడు” తన తండ్రితో సమానమైన బలవంతుడు. జనులకు భయం కలిగించేవాడు చాలా సంవత్సరాలు ఆటలతో గడిపిన తరువాత అక్కడి జనులను, దేవతలను వెళ్ళగొట్టేవాడు. అప్పుడు అయోధ్యలో శ్రీరాముడు రాజ్యం పాలిస్తున్నాడు.
రావణుడు రామచంద్రుని వద్దకు దూతని పంపాడు. ఆదూత పెడుసుగా మాట్లాడేవాడు. అతడు రాముని వద్దకు వచ్చి రామా! రాక్షసరాజు లవణుడు మీకు సమీపంలో ఉన్నాడు. మీకు శత్రువు. సాధారణంగా అభిమానవంతులైన సామంత రాజులను దగ్గర ఉండనీయకూడదు. రాజులు శత్రువులను ఓడించుట ముఖ్యమైన పనిగా తలుస్తారు. పట్టాభిషిక్తుడైన మొదట తన ఇంద్రియాలని జయించాలి. ఇంద్రియ జయమే వాస్తమైన విజయం. రాజులకు నీతిని ఉపదేశించే వాడెవడూ ఉండడు. ఇంద్రియాలనే శత్రువులు బలవంతులైతే అటివాళ్ళు ఉద్దరింపబడరు. మీరు ఒక సాధారణ స్త్రీ కొరకు రావణుని, అతని వంశాన్నీ చంపారు. నాకీవిషయం యుక్తయుక్తంగా లేదు.
ప్రపంచంలో మీరు చేసిన ఈ పని గొప్పదిగా తలచబడుచున్నది. కాని మీకిది నిందింపతగినదే. ఎందుచేతనంటే అప్పుడు మీరు వ్రతాన్ని అవలంబించి వనవాసం చేస్తున్నారు. వనవాసియైన తాపసుడు రాక్షసైన్యాన్ని చంపటం సజ్జనులు ఒప్పుకొనేది కాదు. కోపాన్ని విడిచిపెట్టుటే సజ్జనులకు తగిన ధర్మం. మీరు మోహానికీ కోపానికి లొంగిపోయి రాక్షసులను చంపారు. రావణుడు దుర్బుద్ది ఇంద్రియ జయం లేనివాడు కాబట్టి మీరతన్ని చంపగలిగారు. మీరు సమర్థులైతే ఇప్పుడు నాతో యుద్ధానికి రండి. అని పలికాడు. కఠినంగా మాట్లాడే దూత మాటలను విని శ్రీరాముడు ధైర్యంతో తొట్రుపాటు లేకండా చిరునవ్వుతో ఇలా అన్నాడు.
ఓ దూతా! నేను వేదమార్గాన్ని అనుసరించేవాణ్ణి. రావణునిపై గౌరవం చూపించి నన్ను దూషించటం న్యాయం కాదు. నేను సత్యమును పాటించేవాణ్ణి. రావణుడు నా భార్య నపహరించాడు. అందుచే అతన్ని చంపాను. ఈ విషయంలో దోషం ఏమున్నది? నీవు నీ ప్రభువు సందేశాన్ని వినిపించి నీ పని పూర్తి చేసుకొన్నావు. ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు. నావంటివాళ్ళు తనను పొగడుకునే నీచులతో యుద్ధం చేయరు. ఈ నా చిన్నతమ్ముడు శత్రుఘ్నుడే యుద్ధంలో అతన్ని చంపుతాడు. శ్రీరామచంద్రుడీ విధంగా మాట్లాడిన తరువాత సుమిత్రాదేవి కుమారుడైన శత్రుఘ్నుని వెంట బెట్టుకొని ఆ దూత వెళ్ళిపోయాడు. ఆ రాక్షసుని పట్టణానికి త్వరగా వెళ్ళి శత్రుఘ్నుడు యుద్ధోత్సాహంతో నగరసమీపంలో శిబిరం నిర్మించాడు.
దూత నుండి విషయమంతా విని క్రోధోద్రిక్తుడై యుద్దానికి సంసిద్ధంగా శత్రుఘ్నుని వద్దకు రావణాసురుడు వచ్చాడు. ఆ యిద్దరు వీరులకు గొప్ప యుద్ధం జరిగింది. ఒకరిపై ఇంకొకరు తీవ్రమైన బాణవర్షం కురిపించారు. ఇద్దరిలో ఎవరూ అలిసిపోలేదు. తరువాత కొంతసేపటికి శత్రుఘ్నుని బాణాలచేత బాధింప బడి తన త్రిశూలాన్ని చేత బట్టి గర్జిస్తూ రాక్షసుడు శత్రుఘ్నుని కఠం పట్టుకొని అంకుశంతో లాగాడు. అప్పుడు శత్రుఘ్నుడు కత్తి పట్టుకొని ఆ రాక్షసుని శిరస్సును ఖండించాడు. అతని నివాసమైన వనాన్ని కూడ ఛేదించాడు. అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ నగరాన్ని సుందరంగా తయారుచేశాడు.
ఆ పట్టణంలో రథాలు, గుర్రాలు, ఏనుగులు ఉన్నాయి. ఆ మధురా పట్టణం యమునా నది ఒడ్డున అర్ధచంద్రాకారంగా నిర్మించబడింది. అక్కడ ప్రజలు సుఖసంతోషాలతో అభివృద్ధితో ఉన్నారు. రావణాసురుడు చనిపోయిన తరువాత భోజవంశంలో పుట్టిన మహాబలశాలి ఉగ్రసేనుడు రాజ్యసింహాసనమెక్కాడు. కాలనేమి ఉగ్రసేనుడికి పుత్రుడుగా కంసుడిగా జన్మించాడు. కంసుడు తన పరాక్రమంచేత ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు. కాని అతడు దుర్మార్గుడు. అతని పేరు వింటేనే రాజుల యొక్క, ప్రజల యొక్క హృదయం కంపించేది. రాజధర్మం కంసుడికి బాగా ఇష్టమైనది. అతని స్వజనం కూడా అతని వలన సంతోషించే వారుకారు. అతని రాజ్యానికి మంచి చేసేవాడు కాడు. అతడెప్పుడూ కోపంతో నిండి ఉండేవాడు. ప్రజలు తన్ని చూచి భయపడేవాళ్ళు.
హయగ్రీవుడనే రాక్షసుడు కంసునికి చిన్న తమ్ముడుగా పుట్టి “కేశి” అని పేరు గలవాడయ్యాడు. అతడు మనుష్య మాంసం తింటూ బృందావనంలో ఉండేవాడు. దితిపుత్రుడై నరిష్టుడు ఏనుగు రూపాన్ని పొంది కంసుడికి వాహన మయ్యాడు. లంబుడు ప్రలంబుడుగా పుట్టాడు. భాండీరవనం మర్రిచెట్టు మీద ఉండేవాడు. ఖరుడు ధేనుకాసురుడయ్యాడు. ఇతడు తాటిచెట్ల వనంలో ఉండి ప్రజల్ని చంపుతుండేవాడు. రాహుడు, కిశోరుడు అనే రాక్షసులు చాణూరుడు, ముష్టికుడు అనే మల్లులుగా పుట్టారు. నీవీ రాక్షసులను సంహరించావు. వీళ్ళు మనుష్యరూపంతో మనుషుల్ని బాధించేవాళ్ళు.
నిన్ను ద్వేషించేవాళ్ళందరూనీ భక్తుల్ని చంపేవాళ్ళు. నీకు విరోధులైన వాళ్ళు స్వర్గం పొందలేరు. అందువల్ల ఓ మహావిష్ణు రా భూలోకానికి పోదాం. రాక్షస సంహారం కోసం నీవు భూమి మీద అవతరించుము. దేవతలు అనేక విధాలైన రూపాలను ధరించి భూలోకంలో అవతరించారు. ఈ సమయంలో నీవు కూడ అవతరించు. నీవు అవతరిస్తే కంసుడు నశిస్తాడు. భూదేవి పని పూర్తి అవుతుంది. భారతదేశపు గొప్ప భారం నీమీద ఉంది. నీవు భారత దేశానికి నేత్రాలు. కాబట్టి హృషీకేశ! నీవు భారతదేశానికి వెళ్ళి రాక్షసులను సంహరించు.
