హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

2 - స్వాయంభువమనువంశము - దక్షజన్మ

తరువాత వైశంపాయనుడిలా చెప్పాడు.

ఈ విధంగా ప్రజాసృష్టి కాగా ఆపవుడు ప్రజాపతి పురుషుడయ్యాడు. అతడు అయోనిజ అయిన శతరూపను భార్యగా చేసుకున్నాడు. ఆపవుని మహిమచేత శతరూప పదివేల సంవత్సరాలు తపస్సు చేసి సంతానం కొరకు భర్త వద్దకు వెళ్ళింది. అతడే స్వాయంభువమనువు. అతని మన్వంతరకాలము డెబ్భై ఒక్క యుగాలు. ఆమనువు వలన శతరూప వీరుడనే పేరుగల కుమారుని కన్నది. ఆ వీరుడనే వానికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు పుత్రులు, కామ్య అనే పుత్రిక పుట్టారు. కామ్య ప్రియవ్రతుని భర్తగాపొంది సమ్రాట్, కుక్షి, విరాట్, ప్రభు అను నలుగురు పుత్రులను కన్నది. ప్రజాపతియైన అత్రి, ఉత్తానపాదుని తనకు వారసునిగా చేసుకున్నాడు.

ఉత్తానపాదుడు సూకృత యను స్త్రీయందు నలుగురు పుత్రులను కన్నాడు. ధర్ముడను వాని బిడ్డ సూనృత ఆమె అశ్వమేధయాగము ద్వారా జన్మించింది. ఆమెయే ధ్రువుని తల్లి. ఉత్తానపాదుడు సూనృతయందు ధ్రువుడు, కీర్తిమంతుడు, శివుడు, శాంతుడు, అయస్పతి, అను పుత్రులను కన్నాడు. ధ్రువుడు మూడువేల దివ్యసంవత్సరాలు తపస్సు చేశాడు. అతని కోరిక గొప్ప కీర్తిని పొందాలని బ్రహ్మ సంతోషించి సాటిలేని లేని స్థానాన్ని ఇచ్చాడు. ధ్రువుడికి బ్రహ్మ ఇచ్చిన స్థానం సప్తఋషులకు ముందుంటుంది. శుక్రాచార్యులు అతని మహిమను కొనియాడాడు. ధ్రువుడికి శ్లిష్టి, భవ్యుడు, శంభు అనే కుమారులు కలిగారు. శ్లిష్టికి, సుచ్ఛాయ అనే స్త్రీయందు, రిపు, రిపుంజయ, పుణ్య, వృకల, వృకతేజసుడను పుత్రులు జన్మించారు.

రిపువు భార్య బృహస్పతి యను స్త్రీ దేవతల తేజస్సుతో కూడిన చాక్షుషుడను కుమారుని కన్నది. చాక్షుషుడు పుష్కరిణి అనే స్త్రీ యందు, ఊరువు, పూరువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవంతుడు, కవి, అగ్నిష్టుల్, అతిరాత్రుడు, సుద్యు మ్నుడు, అభిమన్యు అను పదిమంది పుత్రులు కలిగారు. ఊరువు అనువాడు అగ్నికుమార్తె యందు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, గయుడు, అంగిరసుడను ఆరుగురు కుమారులను కన్నాడు. అంగుడు, యముని కుమార్తె అయిన సునీధ వలన ఒక కుమారుని కన్నాడు. అతని పేరు వేనుడు. వేనుడి అపచారం వలన కోపించిన మహర్షులు అతని కుడిచేతిని మధించారు. (తరచారు) అతని భుజం నుండి “పృథు”వనువాడు పుట్టాడు. అతనిని చూచి ఋషులు సంతోషించారు.

ఇతడు ప్రజల్ని చక్కగా పరిపాలిస్తాడు. గొప్ప కీర్తిగడిస్తాడు. అని పలికారు! అట్లే అతడు ధనుస్సును, ఖడ్గాన్ని, కవచాన్ని ధరించి పరాక్రమంచేత ప్రకాశిస్తూ భూమిని పరిపాలించాడు. రాజసూయయాగం చేసిన రాజులలో అతడు మొదటి వాడు. అతని యజ్ఞం ద్వారానే సూతమాగధులను స్తోత్ర పాఠకులు పుట్టారు. అతని వలన గోరూపము ధరించిన భూమి అనేక సస్యాలను పండించింది. పృథు మహారాజుకు ఇద్దరు ధర్మాత్ములైన కుమారులు కలిగారు. ఒకడు “అంతనుడు”, రెండవవాడు పాలితుడు. అంతర్థానుడు శిఖండిని వలన హవిర్ధానుడనే వానిని కన్నాడు. హవిర్ధానుడు అగ్ని కుమార్తెయైన ధిషణ యందు ప్రాచీనబర్హి, శుక్ల, గయ, కృష్ణ, వ్రజ, ఆజిన, అను ఆరుగురు పుత్రులను కన్నాడు.

మహారాజా! ప్రాచీనబర్హి తన తండ్రికంటే గొప్పశక్తి కలవాడు. అతని పరి పాలనలో ప్రజలు మిక్కిలి అభివృద్ది పొందారు. ప్రాచీనబర్షికి సముద్రకన్య “సువర్ణ” తో వివాహం జరిగింది. అతనికి పదిమంది కుమారులు వారు ప్రచేతులను వారు. వారందరూ ధనుర్వేదంలో గొప్ప ప్రజ్ఞావంతులు. వారు సముద్రము మీద పడుకొని పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు రాజ్యపాలన చేసేవాళ్ళు లేక భూమి అడివిగా తయారైంది. మరియు ప్రజలు నశించారు. గాలులు వీచలేదు. ఆకాశం చెట్లతో ఆవరింపబడింది. పదివేల సంవత్సరాలు ప్రజలు కదలికలేని వారయ్యారు. అదివిని ప్రచేతులందరూ తమ ముఖాల నుండి గాలిని, అగ్నిని సృష్టించారు. ఆవాయువు అడవిలోని చెట్లను ఎండింప చేసింది. అగ్నివాటిని కాల్చి వేసింది.

ఈ విధంగా చెట్లన్నీ నశించాయి. చెట్ల వినాశాన్ని చూచి కొన్ని చెట్లు మాత్రం మిగిలి ఉండగా ఔషధులకధిపతియైన చంద్రుడు ఆ ప్రజాపతుల వద్దకు వచ్చి ఓ రాజులారా! కోపాన్ని విడిచిపెట్టండి. భూమి చెట్లు లేనిదైంది. అగ్నివాయువు తమ పనులు చాలించారు. రత్నంలాంటి మారిష అనే ఈ కన్య వెన్నెల గర్భంలో రక్షించ బడిఉంది. మీకు ఈమె భార్య అగుగాక ఈమె చంద్రవంశాన్ని వృద్ధి చేస్తుంది. సగం మీ తేజస్సు, సగం నా తేజస్సు కలిసి ఈమెకు దక్షుడనే ప్రజాపతి పుడతాడు. మీ తేజస్సుచేత తగలబడిన ఈ భూమిమండలాన్ని మళ్ళీ వృద్ధి పరుస్తుంది. అని చెప్పాడు. అంతట చంద్రుని మాట చొప్పున ప్రచేతులందరు మారిషను భార్యగా స్వీకరించారు.

తరువాత వారు మారిష యందు మానసికంగా, గర్భం ధరింపచేశారు. పది మంది మారిషుల వలన మారిషకు మహాతేజశ్శాలియైన దక్షప్రజాపతి పుట్టాడు. దక్షప్రజాపతి చంద్రవంశంతో చంద్రవంశాన్ని అభివృద్ధి పరిచే పుత్రులను కన్నాడు. చలనం లేని పదార్ధాలను, రెండు కాళ్ళు, నాలుగు కాళ్ళు గల ప్రాణులను సృష్టించాడు. దక్షుడు మరల మనస్సుతో ఆడపిల్లలను కూడ కన్నాడు. పదిమంది పిల్లల్ని ధర్మునికి, కశ్యపుడికి పదముగ్గుర్ని, మిగిలిన వాళ్ళను చంద్రునికి భార్యలను చేశాడు. చంద్రునికిచ్చిన కన్యలు నక్షత్రములనే పేరు గలవారు. ఆ స్త్రీలకు దేవతలు, పక్షులు, సర్పాలు, గోవులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసలు, ఇతర జాతులవారు కూడ పుట్టారు.

అది మొదలుకొని రాజా! ప్రజలు స్త్రీ పురుష సంగమం వల్ల కలిగినారు. పూర్వులు కోరిక వల్ల చూపువల్ల తాకుటవలన సృష్టించారు. అపుడు జనమే జయుడు ఇలా అడిగాడు. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, సర్పాలు, దక్షునిచే సృష్టించ బడినట్లు చెప్పావు కదా! దక్షుడు బ్రహ్మ బొటనవ్రేలి నుండి పుట్టాడని చెప్పావు. ఎడమ బొటనవ్రేలి నుండి అతని భార్య పుట్టిందన్నావు. ఆ దక్షుడు మళ్ళీ ప్రచేతులకు పుత్రుడెట్లయ్యాడు? ఇది నాకు కలిగిన సందేహము. దీనిని బాగుగా చెప్పమని కోరుతున్నాను. ఈ దక్షప్రజాపతి చంద్రునికి కూతురు బిడ్డడు కదా! మళ్ళీ మామగారెలా అయ్యాడు? వైశంపాయనుడు ఇలా సమాధానం చెప్పాడు.

ప్రపంచంలో ప్రాణులు పుట్టుట చచ్చుట ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఋషులు, విద్వాంసులు, జ్ఞానులు, వారికి తెలియనిది ఉండదు. దక్షుడు మొదలైన రాజులు ప్రతియుగమందు పుడుతూ ఉంటారు. మరల మరణిస్తూ ఉంటారు. విద్వాంసునకీవిషయం తెలియనిది కాదు. రాజా! పూర్వము ప్రజలలో వయస్సును బట్టి పెద్ద చిన్న అనే తేడా ఉండేది కాదు. తపోబలాన్ని బట్టే పెద్ద చిన్న అనే తేడా ఉండేది. చలనం కలిగినట్టి లేనట్టి యీ దక్షుని సృష్టి విషయాన్ని తెలుసుకొన్నవాడు సంతానవంతుడై చివరకు స్వర్గలోకమును పొందుతాడు.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశ పర్వములో స్వాయంభువమను వంశము - దక్షజన్మ అను రెండవ అధ్యాయము.