హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
27 - పురూరవని ద్వితీయపుత్ర వర్ణనము
పురూరవుని పుత్రులందరూ దేవకుమారుల వంటివాళ్ళు. వాళ్ళ పేర్లు - ఆయువు, అమావసు, విశ్వాయువు, శృతాయువు, వనాయువు, శతాయువు, దృఢాయువు. వీళ్ళు స్వర్గలోకంలో పుట్టారు. భీముడు నగ్నజిత్తు అనేవాళ్ళు, అమావసు పుత్రులు. భీముడి పుత్రుడు కాంచనప్రభుడు. ఇతని పుత్రులు మహాబలి సుహోత్రుడు, కేశిని కడుపున పుట్టిన జహ్నవు సుహోత్రుని కొడుకు, ఇతడు సర్వమేధమనే యజ్ఞం చేశాడు. భాగీరధి ఇతని గుణాలను మెచ్చుకొని భర్తగా చేసుకొను ప్రస్తావం చేసింది. జహ్నుమహర్షి అంగీకరింపక పోవుటచే అతని యజ్ఞశాలను ముంచివేసింది. అది చూచి సుహోత్రుని పుత్రుడు జహ్నవు కోపించి ఈ నీటినంతను త్రాగినీ ప్రయత్నాన్ని వ్యర్ధం చేస్తాను.
నీ గర్వానికి ప్రతిఫలం అనుభవిస్తావు అని గంగనంతను త్రాగేశాడు. ఈ సంఘటన చూచి మహర్షులు జహ్నుమహర్షిని బ్రతిమాలారు. భగీరథుడు గంగను జహ్నువుకు పుత్రికగా మార్చారు. ఇందుచే గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది. యువనాశ్వుని శాపంచేత గంగ యొక్క సగభాగం నుండి కావేరి పుట్టింది. ఇది యువనాశ్వునికి పుత్రిక. జహ్నుమహర్షి కావేరిని పెళ్ళి చేసుకున్నాడు. కావేరికి జహ్నవు వలన “సునహు” డనే కొడుకు జన్మించాడు. ఇతని కొడుకు అజకుడు. ఈతని కొడుకు చిరాకుడనే రాజు. ఇతనికి వేటంటే ఎక్కవ ఇష్టం. ఇతని కొడుకు కుశుడు.
కుశుడికి నలుగురు కుమారులు. వాళ్ళు దేవతలవంటి వాళ్ళు. గొప్ప తేజశ్శాలురు. వాళ్ళ పేర్లు “కుశికుడు, కుశనాభుడు, కుశాంబుడు, మూర్తిమంతుడు” - వాళ్ళలో కుశికుడు ఇంద్రునితో సమానమైన పుత్రుని కనాలని తపస్సు ప్రారంభంచాడు. వెయ్యి సంవత్సరాలు గడిచాక, ఇంద్రుడు ఈతనికి నాతో సమానుడైన పుత్రుడు కలుగుతాడని భయపడి తానే ఆ దంపతులకు పుత్రుడుగా జన్మించాడు. ఆ పుత్రుని పేరు “గాధి”. పురుకుత్స మహారాజు కూతురు కుశికుడికి భార్య అయినది. ఆమెకు పుత్రుడు గాధి. గాధికి సత్యవతి అనే కన్య ఉన్నది. ఆమెకు భృగుపుత్రుడైన ఋచీకునితో వివాహం జరిగింది.
భృగుపుత్రుడైన ఋచీకుడు తన భార్యతో సంతోషంగా ఉన్నాడు. మరియు గాధికి పుత్రసంతానం కోసం చరువును (నేతిఅన్నం) తయారుచేశాడు. ఋచీకుడు భార్యను పిలిచి ఈ చరువును నీవు, నీ తల్లి ఈ చరువును ఉపయోగించాలి (తినాలి) ఆమెకు తేజశ్శాలియైన క్షత్రియుడు పుడతాడు. నీ పుత్రుడు ధైర్యము శాంతి గల బ్రాహ్మణుడౌతాడు. ఇలా చెప్పి ఋచీకుడు తపస్సు చేసుకొనుటకు అరణ్యానికి వెళ్ళాడు. ఈ సమయంలో తన భార్యతో గాధి తన కుమార్తెను చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు సత్యవతి ఋచీకుడిచ్చిన చెరువును తెచ్చి తల్లికి ఇచ్చింది.
తల్లి అజ్ఞానం చేత తన చెరువును కుమార్తె సత్యవతికి తినిపించింది. ఆమె చెరువును తాను తిన్నది. ఇందువల్ల సత్యవతి శరీరం ప్రకాశవంతం అయింది. ఆమె గర్భం క్షత్రియులను నాశనం చేసే భయానకరూపంలో ఉంది. అప్పుడు ఋచీకుడు యోగబలంచేత అంతనూ తెలిసికొని సత్యవతితో సుమంగళీ! చరువులు తారుమారు కావటంచేత నీకు పుట్టేవాడు క్రూరమైన పనులు చేసేవాడు. భయంకరుడు అవుతాడు. నీ తల్లికి పుట్టేవాడు తపశ్శాలి బ్రహ్మజ్ఞాని అవుతాడు. ఎందు చేతనంటే ఆ చెరువులో నాలుగు వేదాలనీ సమావేశపరచాను. భర్త యిలా చెప్పిన మీదట వినయంతో దేవా! నాకు బ్రాహ్మణాధముడు (నీచ బ్రాహ్మణుడు) పుట్టకుండుగాక అని కోరింది.
ఋచీకుడు తల్లి దోషంచేతకాని, తండ్రిదోషంచేతకాని క్రూరుడు పుడతాడు. అని చెప్పగా సత్యవతి మరల మనుమడు సద్రాహ్మణుడు శాంతుడు కావాలని ప్రార్థించింది. ఋచీకుడు ప్రసన్నుడై నీవు చెప్పినట్లే జరుగుందని చెప్పాడు. సత్యవతికి జమదగ్ని పుట్టాడు. ఇతడు ఇంద్రియ నిగ్రహం కలవాడు, శాంతి స్వభావుడు తపో నిష్ఠ కలవాడు అయ్యాడు. సత్యవతి “కౌశికి” అనే మహానదిగా మారింది. ఇక్ష్వాకు వంశంలో “రేణువు” అనే ఒకరాజున్నాడు. అతనికి కుమార్తె రేణుక. ఆమెకు ఋచీకుని పుత్రుడైన జమదగ్ని వలన తేజస్వి భయంకరుడైన పుత్రుడు కలిగాడు. అతడు అన్ని విద్యలలో ఆరితేరాడు. ధనుర్విద్యలో పరిపూర్ణుడు క్షత్రియులను నశింప చేసేవాడు. “రాముడు” అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు.
సత్యవతి వలన ఋచీకుడికి ఇద్దరు పుత్రులు కలిగారు. వారిలో శునశ్శేపుడు, మధ్యవాడు చివరవాడు శునఃపుచ్చుడు. కుశికనందన పుత్రుడైన గాధి కొడుకు విశ్వామిత్రుడు. ఇతడు తన విద్యాశాంత స్వభావాల కారణంగా సప్తర్షులలో స్థానాన్ని పొందాడు. ఇతనికి విశ్వరథుడని కూడ పేరు కలదు. భృగుపుత్రుడైన ఋచీకుని దయవలననే వంశవర్ధనుడు మహాత్ముడైన విశ్వామిత్రుడు గాధి యింటిలో జన్మించాడు. ఇక ఇప్పుడు మహర్షి విశ్వామిత్రుని కుమారులైన దేవరాతుడు మొదలగువారు మూడు లోకాలలో ప్రసిద్ధులు. వాళ్ళ పేర్లు చెపుతాను విను.
దేవశ్రవుడు, కతి, ఇతని పుత్రులే కాత్యాయనులు. శాలావతి యందు హిరణ్యాక్షుడు. రేణుమన్లుడు, గాలవుడు, ముద్గలుడు, మధుచ్ఛనుడు, జయుడు మొదలగువారు. పాణినుడు, బభ్రవుడు, ధ్యానజప్యుడు మొదలగువారు కౌశిక వంశీయులు. యాజ్ఞవల్క్య, అఘమర్షణ, ఔదుంబరాదులు, హిరణ్యాక్షుని పుత్రులు. బాదరాయణ దేవల సాంకృత్యాదులు విశ్వామిత్ర వంశంలో పుట్టిన వాళ్ళు. సాంకృతి మొదలైన కుశికవంశ మహాత్ముల నుండి అనేకులు ఇతర ఋషుల వంశము వాళ్ళను వివాహం చేసుకొన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ వంశాల వారికి సంబంధాలు కనిపిస్తున్నాయి.
విశ్వామిత్రుని కొడుకులలో శునశ్శేపుడు పెద్దవాడు. శునశ్శేపుడు హరిశ్చంద్రుని యజ్ఞంలో పశువుగా ఆజ్ఞాపింపబడ్డాడు. కాని దేవతలు మళ్ళీ విశ్వామిత్రునికి అతనిని ఇచ్చివేశారు. దేవతలు తిరిగి అర్పించుట (ఇచ్చుట)చేతనే అతని పేరు దేవరాతుడని ప్రసిద్ధిచెందింది. దేవరాతుడు మొదలైన ఏడుగురు పృషద్వతి కుమారుడు ఎనిమిదవవాడు వీళ్ళు విశ్వామిత్రుని పుత్రుల ఎనిమిదవవాడి పేరు “లోహి” జనమేజయ మహారాజా! జహ్ను వంశచరిత్ర పూర్తి అయింది. ఇప్పుడు ఆయువు వంశాన్ని వర్ణిస్తాను.
