హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

30 - నహుషయయాతుల వంశ వర్ణనము

వైశంపాయనుడిలా చెప్పాడు.

పితృదేవతల కన్యయైన విరజయందు నహుషునకు గొప్పశక్తి గలవాళ్ళు, ఇంద్రునితో సమానులైన పుత్రులు కలిగారు. వాళ్ళు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, భవ, సుయాతి అనువారు. వాళ్ళలో యతి పెద్దవాడు. యయాతి మధ్య వాడు. గోవు అనే కకుత్స్థుని కుమార్తెతో అతనికి వివాహం జరిగింది. “యతి” మునివ్రతము నవలంబించి పరబ్రహ్మంలో కలిసిపోయాడు. తక్కిన ఐదుగురిలో యయాతి భూమిని జయించి రాజయ్యాడు. శుక్రాచార్యుల కూతురు దేవయాని, వృషపర్వుని కూతురు శర్మిష్ఠ ఇద్దరూ అతనికి భార్యలు. దేవయానికి “యదు”, “తుర్వసు”లు, వర్మిష్ఠకు “దృహ్యు”, “అను”, “పూరువు” అనువారు పుత్రులు.

ఇంద్రుడు సంతోషించి యయాతికి ప్రకాశమానమైన బంగారు రధాన్ని యిచ్చాడు. దానికి మనోవేగంతో సమానవేగంగల గుర్రాలు కట్టబడ్డాయి. ఆ దివ్యరధం సహాయంతో అతడు ఆరు రోజుల్లో భూలోకాన్ని, ఇంద్రునితో కూడిన స్వర్గమందలి దేవతలను జయించాడు. ఆ రధం పురువంశ రాజులందరి అధికారంలోనూ ఉన్నది. జనమేజయుని సమయంనుండి గార్గ్యుని శాపంచేత నశించిపోయింది. జనమేజయుడు గార్గ్యుని కుమారుని చంపి బ్రహ్మహత్యాపాపాన్ని పొందాడు. గరుడు కోపించి శాపం పెట్టాడు. ఆ కారణంచేత జనమేజయుడు రథం లేనివాడయ్యాడు. పతితుడై (పాపాత్ముడై) ఇటూ అటూ తిరుగుట ప్రారంభించాడు. నగరవాసులు, గ్రామవాసులు అతన్ని విడిచిపెట్టారు.

ఈ దుఃఖంతో అతనికి శాంతి లేకపోయింది. చివరకు “ఇంద్రోతు” డనే బ్రహ్మర్షి శౌనకుని శరణువేడాడు. శౌనకుడతనిని పవిత్రుని చేయుటకు అశ్వ మేధయాగం చేయించాడు. ఆ యజ్ఞం చివర అవబృధస్నానం చేయగానే పాపం నశించింది. అప్పుడు ఇంద్రుడు సంతోషించి దివ్యరధాన్ని వసువను వానికిచ్చాడు. వసువు బృహద్రుడికి, తరువాత ఇతని పుత్రునికీ ఆరథంమీద అధికరాకం ప్రాప్తించింది. తరువాత బృహద్వంశరాజైన జరాసంధుని చంపి భీముడా రథాన్ని శ్రీకృష్ణపరమాత్మకు అర్పించాడు. యయాతి మహారాజు ఏడుద్వీపాలతో కూడిన భూమండలాన్ని జయించి దానిని ఐదుభాగాలు చేశాడు. ఆ ఐదుభాగాలలో ఆగ్నేయ దిక్కును తుర్వసుకు, పడమరదిక్కును ద్రుహ్యునికి, ఉత్తరదిక్కును “అణువు”కు, ఈశాన్యదిక్కును యదువుకు, మధ్యభాగాన్ని పూరువుకు ఇచ్చాడు. యయాతి పుత్రులు ఈనాడు కూడా గ్రామనగరాదులతో శోభించే ఏడుద్వీపాలతో కూడిన భూమిని ధర్మంగా పరిపాలిస్తూ ఉన్నారు.

రాజా! పైన చెప్పిన మహా పురుషుల వృత్తాంతాన్ని ముందు చెపుతాను. ఇలా ఐదుగురు పుత్రులకు రాజ్యాన్ని విభజించి అస్త్రశస్త్రాలను విడిచిపెట్టాడు. తరువాత యయాతి పెద్దకొడుకైన యదువుతో కుమారా! నేను ముసలివాడినైనాను. నీవు నా ముసలితనాన్ని తీసికొని నీ యౌవనాన్ని నాకిమ్ము. నేను యువకుడనై భూమిపై తిరగగలుగుతాను అన్నాడు. యదువు నేనొక బ్రాహ్మణుడికి కోరినదాని నిస్తానన్నాను. ఆ బ్రాహ్మణుని కోరిక తీర్చిగాని నీ ముసలితనాన్ని తీసుకోలేనన్నాడు. మరియు ముసలితనంలో బోజనము, నీరుత్రాగుట మొదలైనవాటికి సంబంధించిన దోషాలు చాలా ఉన్నాయి. ఇందుచే నీ ముసలితనాన్ని నేను తీసుకోవాలనుకోటం లేదు. నాకంటే మిక్కిలి యిష్టమైన కొడుకులు మీకున్నారు.

వాళ్ళలో ఒకణ్ణి యెన్నుకోండి అన్నాడు. యదువు మాటలను విని యయాతి కోపించాడు. మరియు అతన్ని తిరస్కరిస్తూ ఓరిదుర్బుద్ధీ! నేను నీకు తండ్రిని. నా ఆజ్ఞను లెక్క చేయకపోతే ఇంతకంటే గొప్పధర్మం ఏముంది? అని పలికి ఓరి మూఢుడా! నా ఆజ్ఞను పాటించనందున నీ వంశం వాళ్ళందరికీ రాజ్యాధికారం ఉండదని శపించాడు. తరువాత యయాతి తుర్వసు, ద్రుహ్య, అణు అనే కొడుకులను ముసలితనం తీసుకోమని అడిగాడు. వాళ్ళలో కూడా ఎవడూ ఒప్పుకోలేదు. వాళ్ళను కూడ అట్లే శపించాడు యయాతి. ఇలా నలుగురు పుత్రుల్నీ శపించిం తరువాత అయిదవవాడైన పూరువుతో చెప్పాడు.

నువ్వు నామాట పాటిస్తే నాముసలితనాన్ని నీకిచ్చి నీ పడుచుతనాన్ని తీసుకొని రాజభోగాల్ని అనుభవిస్తాను అని యయాతి పలికాడు. ప్రతాపవంతుడైన పూరువు తండ్రి ఆజ్ఞను శిరసావహించి ఆయన ముసలితనాన్ని తీసుకున్నాడు. యయాతి పూరువు రూపయౌవనాల్ని తీసుకొని రాజభోగాలను అనుభవిస్తున్నాడు. తన కోరిక తీర్చుకోటానికి యయాతి విశ్వాచి అనే అప్సరసను వెంట బెట్టుకొని చైత్రరధ వనంలో విహరించాడు. తరువాత సుఖాలకు అంతుండదు అని ఆలోచించి పూరువు వద్దకు వెళ్ళి తన ముసలితనాన్ని తీసుకున్నాడు. ఆ సమయంలో అతడన్న మాటలు చెపుతా విను. ఈ మాటలు వింటే పూర్వ సంస్కారాలు అణగిపోతాయి. భోగాలను అనుభవించడంవల్ల వాంచ తగ్గదు. ఇంకా పెరుగుతుంది అని ఆమాటల సారాంశం.

ముసలివాడికి జుట్టు ఊడిపోతుంది. పళ్ళు ఊడిపోతాయి. బ్రతకాలనే ఆశ, ధనాశ మాత్రం తగ్గదు. ఆశ లేకపోవటం వల్ల కలిగే సుఖంలో ఏసుఖమైనా పదహారవ వంతుకూడ ఉండదు అని రాజర్షి యయాతి భార్యతో అరణ్యానికి వెళ్ళాడు. చాలాకాలం గొప్పతపస్సు చేశాడు. ఎత్తైన కొండ చరియమీద తపస్సుచేసి చివరలో ఆహారం మాని శరీరం విడిచి భార్యతోపాటు స్వర్గానికి వెళ్ళాడు. అతని వంశంలో ఐదుగురు గొప్ప రాజర్షులున్నారు. రాజర్షులు గౌరవించిన రాజర్షియదువు వంశాన్ని విను. ఆ వంశంలోనే నారాయణుడు, హరి, విష్ణువు అనబడే పరమాత్మ కులాన్ని ఉద్దరించేవాడై జన్మించాడు. యయాతి చరిత్రను చదివినవాడు ధన్యుడు, సంతానవంతుడు, చిరంజీవి, కీర్తికలవాడు అవుతాడు.