హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

45 - సురాసుర యుద్ధము- ఔర్వాగ్నిపుట్టుక

వైశంపాయనుడిలా చెప్పాడు.

తమతమ జయాన్ని కోరుతున్న దేవతలయొక్క, రాక్షసులయొక్క సేనలకు ఘోరమైన (సంకులమైన) యుద్ధం జరిగింది. వేగంగా పరుగెట్టే రథాలచేత విసురు తున్న అనేక విధాల ఆయుధాలచేత దేవతలకు రాక్షసులకు ఘోరయుద్ధం జరిగింది. ఆ యుద్ధం ప్రళయకాలంలాగా లోకానికి భయం కలిగించింది. పరిఘలనే ఆయుధాలతోను, పర్వతాలతోనూ రాక్షసులు ఇంద్రుడు మొదలగు దేవతలను కొట్టారు. రాక్షసులచే చంపబడుతూ దేవతలు మిక్కిలి దీనులయ్యారు. రాక్షసుల దెబ్బలకు తలలు రొమ్ములూ బ్రద్దలై దేవతలకు గాయాల నుండి రక్తం ప్రవహించింది. రాక్షసమాయ చేత దేవతల సైన్యం స్తంభించిపోయింది.

అప్పుడు ఇంద్రుడు రాక్షసైన్యంలో ప్రవేశించాడు. గొప్ప రాక్షస సైన్యాన్ని చంపుతూ తామసాస్త్రంతో చీకటిని సృష్టించాడు. ఇంద్రుని ప్రభావంవల్ల దేవతలు మాయాపాశము నుండి బయటపడ్డారు. ఆ చీకటిలో ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తెలియలేదు. దేవతలు గట్టి ప్రయత్నముతో రాక్షసుల శరీరాలను భూమిపై పడవేశారు. రాక్షసగణాలు పర్వతాలవలె నేలపై వ్రాశారు. అప్పుడు మయుడు ఇంద్రుడు సృష్టించిన చీకటిని పారద్రోలే మాయను సృష్టించాడు. రాక్షసులు నేలపై పడినవాళ్ళు లేచారు. మయుని మాయచే తపించిపోతూ దేవతలు ఇంద్రుని రక్షించమని శరణువేడారు. అప్పుడు ఇంద్రుడు వరుణునితో చెప్పగా అతడిలా చెప్పాడు.

పూర్వం ఉర్వుడనే బ్రహ్మర్షి మిక్కిలి కఠినమైన తపస్సుచేసి బ్రహ్మతో సమానమైన గుణలములు కలవాడయ్యాడు. అతని తపస్సుచేత ప్రపంచమంతటా తపించి పోయింది. అప్పుడు మునులు దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అంతకు ముందే హిరణ్యకశిపుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవతల రాకను తెలియచేశాడు. బ్రహ్మర్షులు ఉర్వునితో ఇలా చెప్పారు.

ఓ మహానుభావా! మీ ఋషివంశం నశించింది. నీవు ఒక్కడివే మిగిలిఉన్నావు. నీకు సంతానం లేదు. సంతానవృద్ధికి నీవే ప్రయత్నమూ చేయటంలేదు. చిన్నప్పటి నుండి తపస్సు చేస్తూ ఆత్మను కష్టపెడుతున్నారు. చాలామంది మునులు సంతానం లేనివాళ్ళై వంశపరంపరను సమాప్తి చేశారు. సంతానం లేకుండా వంశ వృద్ధి అసంభవం. వంశవిస్తారం కోసం తగిన పుత్రుని పుట్టించండి. అప్పుడు ఋషి మునులను తిరస్కరిస్తూ ఇలా అన్నాడు.

ఓ ముని సమూహమా! పూర్వం బ్రహ్మ మునులకు అరణ్యంలో దొరికే ఆహారమే పూర్వంనుంచీ వచ్చే ధర్మంగా చెప్పాడు. పండ్లు, దుంపలు తిని బ్రహ్మ చర్యం పాటించటమే ఋషులు చేయదగిన పని. ఇలాంటివాడు బ్రహ్మను కూడ వణికించగలడు. మీకు తపస్సు వలన ప్రభావముంటే బ్రహ్మలాగా మానస పుత్ర సృష్టి చేయండి అని ఉర్వుడు అగ్నిని సృష్టించాడు. ఉర్వుడు నా పుత్రునిపై మీరు చూపించిన దయకు ధన్యవాదాలు. నేను కృతార్థుడనని తలుస్తున్నాను. అప్పుడు ఓ మునిశ్రేష్టుడా! గుర్రంముఖంతో సముద్ర మితని స్థానం. ప్రళయమేర్పడినప్పుడు నేను నీ పుత్రుడూ సమస్త ప్రపంచాన్నీ కడుపులో పెట్టుకుంటాం. ఇతడు రాక్షసుల నందరినీ బూడిద చేస్తాడు. అని బ్రహ్మ పలికాడు.

అప్పుడు ఔర్వుడు అగ్ని సముద్రంలో గుర్రం ముఖంతో ప్రవేశించాడు. బ్రహ్మ ఋషులు వెళ్ళిపోయారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను చూచి హిరణ్యకశిపుడు ఉర్వుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఓ పూజ్యుడా! మీ తపస్సు వల్ల అద్భుతమైన కార్యం ఏర్పడింది. బ్రహ్మకూడ సంతోషించాడు. నీవు నీ పుత్రుడూ నాపై దయ చూపిస్తే నేను కృతార్థుడనౌతాను. అని పలుకగా మహర్షి ఉర్వుడు అగ్నిరూపమైన మాయను నీకిస్తున్నాను. అగ్ని కూడ ఈ మాయను తాకలేదు. ఈ మాయ మీ వంశానికి స్వాధీనమై ఉండి తనవారిని రక్షిస్తూ శత్రువులను నాశం చేస్తుంది. అన్నాడు. తరువాత హిరణ్యకశిపుడు ఉర్వమహర్షికి నమస్కరించి ఆ మాయను తీసుకొని సంతోషంతో స్వర్గానికి వెళ్ళాడు.

వరుణదేవుడు హిరణ్యకశిపు వద్ద నున్న మాయను గూర్చి వృత్తాంతమంతా చెప్పి ఇంద్రునితో ఈ మాయను నాశనం చేయాలంటే నీటినుండి పుట్టిన చంద్రుణ్ణి నాతో కూడా ఉండమనండి. అప్పుడు చంద్రుడు నీటిలో నుండు జంతువులను వెంటబెట్టుకొని తమ దయతో ఈ మాయను నశింపచేస్తా అన్నాడు.