హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
50 - విష్ణువు యోగనిద్ర, ఋషుల దేవతల ప్రార్థన
వైశంపాయనుడిలా చెప్పాడు.
మహారాజ! ఈ విధంగా ఆ బ్రహ్మర్షులు సత్కరింపగా విష్ణుమూర్తి ఆసభలో ఉన్న మునులను వీడ్కొని బ్రహ్మకు నమస్కరించి సంతోషంతో పురాణాల్లో ప్రసిద్ధమైన దివ్యమగు నారాయణాశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ ప్రవేశిస్తూనే అస్త్ర శస్త్రాల్ని విడిచిపెట్టి అక్కడ సముద్రరూపమైన తన నివాసాన్ని చూచాడు. ఆస్థానము ప్రళయకాల మేఘాలతో నిండి, మెరుపుల సమూహంతో కూడి, ఘోరమైన చీకటి కప్పబడి, దేవతలకు రాక్షసులకు తెలియనిది. సూర్యచంద్ర వాయువుల సంచారంలేనిది. ఆ ప్రదేశం విష్ణుమూర్తి తేజస్సుచేతనే ప్రకాశిస్తున్నది. అక్కడ ప్రవేశించి జడలు కట్టుకొన్నాడు. వెయ్యి శిరస్సులు ధరించి పడుకొన బోతున్నాడు. ఈ సమయంలో ప్రళయకాలం వచ్చినట్లు చూచి నిద్రా దేవత అతన్ని సేవించ మొదలుపెట్టింది.
విష్ణుభగవానుడు ఏకార్ణవ నియమానుసారంగా మేఘంలా చల్లనై ఆనంద దాయకమగు పక్కపై పడుకొన్నాడు. ఆ సమయంలో దేవతలందరూ ఋషులూ లోకసృష్టికొరకు పడుకొన్న భగవంతుడైన విష్ణువును ఉపాసించటం ప్రారంభించారు. ఆ నిద్రాసమయంలోనే ఆయన బొడ్డునుండి సూర్యునితో సమానమైన తేజస్సు గలది సుందరమైన రంగుల గలది అయిన ఒక తామరపువ్వు పుట్టింది. ఈ పద్మమే బ్రహ్మదేవుని జన్మస్థానము. ఆ భగవంతుడైన విష్ణువు నిద్రలోనే యజ్ఞో పవీతంతో కూడిన చేతినిఎత్తి లోకాలను గూర్చి ఆలోచించ మొదలుపెట్టాడు. నారాయణుని నుండి బ్రహ్మ పుట్టినట్లే బ్రహ్మ నిశ్వాసవాయువు నుండి ప్రజలు జన్మించారు. తరువాత ప్రజాపతుల నుండి పుట్టిన ప్రజలు బ్రహ్మ ఏర్పరచిన నాలుగు వర్గాలుగా విభజింపబడి వేదోక్త కర్మల ననుసరించి భగవను వచ్చి తనలో లీనమయ్యారు.
బ్రహ్మ బ్రహ్మర్షులు ఎవరూ కూడా యోగనిద్రలో ఉన్న భగవంతుని స్వరూపాన్ని తెలుసుకొనలేకపోయారు. భగవంతుడు ఎక్కడ నిద్రపోతాడు? ఎక్కడ కూర్చుంటాడు? ఎప్పుడు మేల్కొంటాడు? ఎప్పుడు పడుకొంటాడు? అతడు నిద్ర పోయేటప్పుడు అన్ని ప్రాణులలో చిన్నవాళ్ళెవరు? భోగమనుభవించే వాళ్ళెవరు? మొదలైన విషయాలు ఎవరికీ బోధపడవు. దేవతలు అతని విషయంలో అనేకరకాలైన ఊహలు చేస్తూ ఉంటారు. కాని అతని పుట్టుక, పని, యధార్ధస్థితి ఎవడికీ తెలుసుకునే శక్తిలేదు. పూర్వ ఋషులు చెప్పిన మంత్రాల ద్వారా భగవంతుని విషయంలో కొంచము తెలుసుకొని శక్తి కొలది అతని గుణాన్ని వర్ణిస్తూ ఉంటారు.
భగవంతుని పూర్వచరిత్ర వేదాలద్వారా, పురాణాలద్వారా మాత్రమే వింటున్నాం. కాని అతని వాస్తవ విషయం తెలియుటలేదు. అతని చరిత్రలతోనే వైదిక లౌకిక వాక్కులు నిండి ఉన్నాయి. ఆ భగవంతుడు అన్ని ప్రాణులకు మేలు చేయుటకు ఆయా సమయాల్లో అవతరిస్తూ ఉంటాడు. రాక్షసులను నశింపచేయుటానికి ఆయన ఎల్లప్పుడు సిద్దంగా ఉంటాడు. అవతార సమయంలో కూడా ఆషాఢమాసం నుండి కార్తికమాసం వరకూ నిద్రపోతాడు. వాస్తవంగా యజ్ఞాలు యజ్ఞ సాధనాలు వేదస్వరూపములే. వర్షాకాలంలో యజ్ఞయాగాది కార్యాలన్నీ ఆగిపోతాయి. శరద్రుతువులో వాజపేయం మొదలైన యజ్ఞాలు ప్రారంభించగానే ఆయన మేల్కొంటాడు. విష్ణుభగవానుడు నిద్రపోయిన తరువాత ఇంద్రుడు వర్షచక్రాన్ని త్రిప్పుతాడు.
భగవంతుని తమోగుణరూపమైన మాయే నిద్రగా చెప్పబడుతోంది. అతని తమోగుణరూపమైన మాయే రాత్రి అయి నిద్రారూపంలో జీవుల యొక్క జీవితంలో సగభాగం నష్టపరుస్తున్నది. పగటి పూట తిన్న ఆహారాన్ని అరిగేట్టు చేయటానికి రాత్రిపూట నిద్ర ఆక్రమిస్తుంది. మరణ సమయంలో ఈ నిద్ర ప్రాణాన్ని తీసుకుపోతుంది. ఈ నిద్ర జీవుల్ని త్వరగా మోహంలో పడవేస్తుంది. భగవంతుడైన విష్ణువు తన నారాయణాశ్రమంలో ఆ నిద్రకు లోబడి సమస్త ప్రపంచాన్ని మోహంలో పడవేసి పడుకుంటాడు. వెయ్యి దివ్యసంవత్సరాలు నిద్రతో గడుపుతాడు. ద్వాపరయుగం చివర జీవులు మిక్కిలి దుఃఖంలో ఉండటం చూచి మహర్షులు స్తోత్రం చేయగా ఆయన మేల్కొంటాడు. ఋషి సమూహం ఇలా పలుకుతారు.
ఓ హృషీకేశ! ఇప్పుడు మీరు అనుభవించిన పుష్పమాలను వలె నిద్రను విడిచిపెట్టండి. ఇటు చూడండి. బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మవాదులు వ్రతాలు చేసే వాళ్ళు అయిన ఋషిసమూహం బ్రహ్మగారితో సహ తమ దర్శనం కోరి స్తోత్రం చేస్తున్నారు. మీరు దేవతల శుభవాక్యాలను వినండి. ఇటువైపు మునులతో కూడి సప్తర్షులు అర్థవంతములైన దివ్యస్తోత్రములు చేస్తున్నారు. ఓ కమలనయన! దేవతలకు ఏదో కావలసిన ప్రయోజనమున్నది. అందుచేతనే మీరు లేచారు. ఈ వాక్యాలను విని భగవంతుడు విష్ణువు మేల్కొన్నాడు. అతడు లేవగానే చీకటి మాయమైంది. బ్రహ్మాదిదేవతలు లోకక్షేమం కోసం కొంచం చెప్పదలచి బాధ పడుతూ నిలబడ్డారు. వాళ్ళను చూడగానే విష్ణువు వాళ్ళను గూర్చి ధర్మంతో హేతుబద్ధమై అర్ధవంతముగ మాటలను ఇట్లు పలికాడు.
ఓ దేవతలారా! మీకెవళ్ళతో యుద్ధం వచ్చింది? ఎవళ్ళ వల్ల మీరు భయపడు తాన్నారు? రాక్షసుల వల్ల మనుష్యులకు అశుభం కలిగే సంఘటనలేమీ లేవుగదా! చెప్పండి. నేను త్వరగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు శుభం కలుగజేయటం కొరకు, నేను లేచి కూర్చున్నాను. ఇప్పుడు నేను చేయదగిన దానిని చెప్పండి.
