హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
12 - మహర్షిగాలవుని పుట్టుక
తరువాత వైశంపాయనుడిలా చెప్పాడు.
ఓరాజా! కువలాశ్వుని కొడుకులలో ముగ్గురు మాత్రం బ్రతికి ఉన్నారు. వాళ్ళలో దృఢశ్వుడు పెద్దవాడు. చంద్రాశ్వులిద్దరూ తమ్ముళ్ళు. ధుంధుమారుని కుమారుడు దృఢాశ్వుడికి హర్యశ్వుడు కుమారుడు. హర్యశ్వుడి కొడుకు నికుంభుడు. అతడెల్లప్పుడూ క్షత్రియ ధర్మమందు ఆసక్తి కలవాడు. నికుంభుని కొడుకు సంహతాశ్వుడు. ఇతడు యుద్ధంలో మంచినేర్పరి. సంహతాశ్వుడికి హైమవతి అనే కన్య కూడా ఉంది. ఆమె పేరు దృషద్వతి. ఈమె కొడుకు ప్రసేనజిత్తు మూడులోకాలలో ప్రసిద్ధుడు. ప్రసేనజిత్తు పతివ్రతయైన గౌరిని భార్యగా చేసుకొన్నాడు. ఆమె భర్తచే శపింపబడి బాహుద అనే నది అయింది. ఆమె పుత్రుడు యువనాశ్వుడు. ఇతని కుమారుడు ముల్లోకాలు జయించిన “మాంధాత”. అతనికి శశబిందు కుమార్తె, “చైత్రరధి” భార్య. ఆమె పదివేల సోదరులకు ఒకేఒక అక్క. మాంధాతకు పురుకుత్సుడు, ముచికుందుడు అనే కొడుకులిద్దరు. పురుకుత్సుని కొడుకు “త్రసద్దస్సుడు”. ఇతని కుమారుడు సంభూతుడు. ఇతని పుత్రుడు సుధన్వుడు
సుధన్వునుడికి విద్వాంసుడైన త్రయ్యారుణుడు పుత్రుడు. ఇతని కుమారుడు సత్యవ్రతుడు. ఇతడు వివాహ మంత్రాలకు విఘ్నం కలిగించాడు. ఇతరుని భార్యను అపహరించి తెచ్చాడు. ఆమెను భార్యగా చేసుకున్నాడు. అప్పుడు తండ్రి ఇతడిని విడిచిపెట్టాడు. త్రయ్యారుణుడు కులంలో చెడబుట్టావు, నిన్ను కొడుకునుగా చెప్పుకొన కోరుటలేదు. నీవు వెళ్ళి చండాలులతో పాటు ఉండు అని కొడుకును తిట్టాడు. తండ్రి యిలా చెప్పిన మీదట సత్యవ్రతుడు ఊరిబయటకు వెళ్ళి పోయాడు. వశిష్ఠుడుకూడ ఆపలేదు. ఈవిధంగా సత్యవ్రతుడు చండాలవాటికలో నివసించాడు. త్రయ్యారుణుడు రాజ్యం విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళాడు. సత్య వ్రతుడి పాపపు పనికి రాజ్యంలో పన్నెండు సంవత్సరాలు వర్షం పడలేదు.
ఈ సమయంలో గొప్ప తపశ్శాలి విశ్వామిత్రుడు భార్యను విడిచిపెట్టి నీరులేని ఒక ప్రదేశంలో తపస్సు చేయటానికి వెళ్ళాడు. విశ్వామిత్రుని భార్య కుటుంబ పోషణకు తన నడిమికొడుకును వందగోవులకు అమ్మివేసింది. సత్యవ్రతుడు కొడుకును అమ్ముతున్న విషయం చూచి విడిపించాడు. అతన్ని పోషించాడు. విశ్వామిత్రుని సంతోషంకోసం, ఆయన అనుగ్రహం కొరకూ ఆ పిల్లవానిని తాను పోషించాడు. ఆ పిల్లవాని కంఠానికి తల్లి త్రాడు కట్టుటచేత అతడు గాలవుడని పిలవబడ్డాడు.
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వములో మహర్షి గాలవుని పుట్టుక అను పన్నెండవ అధ్యాయము.
* * *
