హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
18 - పితృకల్పము శ్రాద్ధఫలవర్ణన
మార్కండేయుడిలా చెప్పాడు.
సనత్కుమారుడీవిధంగా చెప్పిన తరువాత నేనాయనను ఈ సందేహం అడిగాను. భీష్మా విను! సోవర్ధనులనే దేవప్రధానులైన పితృగణాలు ఎన్ని? ఏ లోకంలో వుంటారు?
సనత్కుమారుడిలా సమాధానమిచ్చాడు.
ఓ మునిశ్రేష్ఠా! మొత్తం వాళ్ళు ఏడుగణాలు. అందులో నాలుగు గణాలు రూపం కలవి. తక్కిన మూడు గణాలు రూపం లేనివి. వాళ్ళ లోకం సృష్టిని మహత్వం, ప్రభావం చెపుతాను విను.
ధర్మమూర్తి ధరులైన మూడుగణాలు లోకాలు సనాతనములనే పేరు గలవి. రూపంలేని మూడు పితృగణాలు ప్రజాపతి పుత్రులు. విరాజ ప్రజాపతి పుత్రులు గనుక వైరాజులు అనే ప్రసిద్ధి పొందారు. దేవగణాలు వాళ్ళను పూజిస్తాయి. యోగభ్రష్టులైన వీళ్ళు సనాతనములైన లోకాలను పొంది వెయ్యి యుగాల తరువాత బ్రహ్మవాదులుగా పుడతారు. వాళ్ళు పూర్వజన్మ స్మృతి కలిగి ఉత్తమమైన సాంఖ్య యోగాన్ని అవలంబించి మరల పుట్టనక్కరలేని ఉత్తమస్థితిని పొందుతారు. ఈ పితృదేవతలు యోగులకు యోగబలాన్ని వృద్ధి చేస్తారు. పూర్వము వాళ్ళు తమ యోగబలంతో సోముని (చంద్రుని) తృప్తి పరచి చంద్రలోకంలో ఉన్నారు. కనుక శ్రాద్ధం తప్పకుండా చెయ్యాలి.
ఓ మహామునీ! సోమపానం చేసే మహాత్ముల యొక్క ఈ మొదటి సృష్టిని చెప్పాను. ఈ పితృదేవతల యొక్క మనస్సంకల్పం చేతనే మేనక పుట్టింది. ఆమె హివంతుని భార్యయై మైనాకుని కన్నది. మైనాకుని కొడుకు క్రౌంచపర్వతం. హిమవంతుడు మేనక వలన ముగ్గురు కన్యలను కన్నాడు. వాళ్ళు అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల అనువాళ్ళు. ఆ ముగ్గురూ గొప్ప తపస్సును చేసి లోకాన్ని తపింపచేశారు. ఏకపర్ణ ఒకే ఆకును తిని తపస్సు చేసింది. ఏకపాటల పాటలపుష్పాన్ని ఒక్కటినే ఆహారంగా తీసుకున్నది. మూడవది ఏ ఆహారం లేకుండా తపస్సు చేయగా తల్లి ఆమెను ఉ= ఓ అమ్మాయీ మా=వద్దు అని నివారించింది. అందుచే ఆమెకు ఉమ అనే పేరు వచ్చింది. ప్రపంచంలో ఈ ముగ్గురూ బ్రహ్మవాదినులు యోగ బలం కలవాళ్ళు. ఆ ముగ్గురిలో పెద్దది ఉమ. ఆమెకు గొప్పయోగబలం ఉంది. గొప్ప అందకత్తె. శివుడామె భర్త. ఏకపర్ణ ఏకపాటల భర్తలు కూడా యోగాచార్యులు.
మరీచిమహర్షి పుత్రుడుండే స్థానము సోమపదము. స్వర్గంలో ఉండే దేవతలు సోమపద మందుండే, పితరులకు శ్రాద్ధం చేసి వారిని సంతోషపెడతారు. సోమపద మందలి పితరులు అగ్నిష్వాత్తులనబడతారు. ఈ పితరుల మనస్సంకల్పం వల్ల పుట్టిన కన్య “అచ్చోదనది” దానినుండి ఏర్పడినదే అచ్ఛోదనమనే సరస్సు. అచ్చోద తన తల్లి తండ్రులనేప్పుడూ చూడలేదు. దివ్యదృష్టితో శరీరంలేని పితరులను చూచి గుర్తు పట్టలేకపోయింది. ఈ కారణం చేత సిగ్గు పడింది. ఈ సమయంలో ఆయువు యొక్క కుమారుడు అమావసువు తన కుమార్తె అద్రికతో విమానంలో కూర్చుని అక్కడకు వచ్చాడు. అచ్ఛోద ఆయువును చూచి తండ్రి అని పిలిచింది. తండ్రి కానివాణ్ణి తండ్రి అనటంచే ధర్మాన్ని దాటినట్లైంది.
ఈ అధర్మంచేత స్వర్గం నుండి జారి పడనారంభించింది. క్రింద పడేటప్పుడు మిక్కిలి చిన్న విమానంలో తన పితరులు కూర్చొని ఉన్నారు. వాళ్ళు మిక్కిలి చిన్న శరీరం కలవాళ్ళు, వాళ్ళ శరీర తేజస్సు అగ్నిలా ప్రకాశిస్తోంది. శిరస్సు క్రిందికి పెట్టి జారిపడుతున్న అచ్ఛోద వాళ్ళను చూచి దీనంగా ఆరుస్తూ నన్ను రక్షించండి అని కేకలు వేసింది. ఆకాశంలో ఉన్న ఆమెకు భయపడవద్దని వాళ్ళు చెప్పారు. ఆమె ఆకాశంలోనే నిలిచి దీనంగా వాళ్ళను స్తోత్రంచేసి సంతోషపెట్టింది. పితృ దేవతలు నీ దోషం చేతనే నీవు పడుతున్నావు. దేవతలు ఏ శరీరాలతో చేసిన పనులకు ఆ శరీరాలతో ఫలితాన్ని అనుభవిస్తారు. దేవతలు చేసిన పనులకు వెంటనే ఫలితం కనిపిస్తుంది. కనుక నీవు ఈ కర్మఫలితాన్ని అనుభవించిన తరువాతనే తపస్సు యొక్క ఫలితాన్ని అనుభవిస్తావు.
పితరులిలా చెప్పిన మీదట మళ్ళీ వాళ్ళని స్తోత్రం చేసి సంతోషపెట్ట నారంభించింది. కొంచెంసేపు కర్మఫలాన్ని గూర్చి విచారించిన తరువాత వాళ్ళిలా అన్నారు. పుత్రీ! మహాత్ముడైన అమావసు భూలోకంలో పుట్టి రాజౌనప్పుడు నీవతనికి పుత్రికవుతావు. భూలోకంలో నీ కడుపునుండి పరాశర పుత్రుడు వ్యాసుడు, శంతన పుత్రులు విచిత్రవీర్య చిత్రాంగదులు జన్మిస్తారు. వ్యాసమహర్షి తన ప్రతిభచే వేదాన్ని నాలుగు భాగాలు చేస్తాడు. నీవు పుత్రుల్ని కన్న తరువాత మళ్ళీ నీలో లోకానికి వెళ్తావు. పితరులను గౌరవించనందున నీకు నీచ జన్మవస్తుంది. ద్వాపర యుగంలో వసువు భార్యకు పుత్రికవు అవుతావు. కాని నీవు చేప నుండి పుడతావు. ఇలా చెప్పిన తరువాత మత్స్యరాజుకు భార్య సత్యవతిగా పుట్టింది. ఈమె చేప కడుపున పుట్టింది. పల్లెవాళ్ళు పెంచడంచేత దాయి అని పేరు వచ్చింది. స్వర్గంలో నివసించే బర్హిషదులనే పితరులు వైభాజు లనబడుచున్నారు.
దేవతలందరూ ఈ పితరులను పూజిస్తారు. ఆ పితరులు తపశ్శాలియైన పులస్త్య ప్రజాపతికి పుత్రులు. ద్వాపరయుగంలో వారికి మనసు నుండి పుట్టిన కన్య “పీవరి” అనే పేరుతో ప్రసిద్ది చెందుతుంది. ఆమె ఒక యోగాచార్యునకు భార్య మరొక యోగాచార్యునకు తల్లి అవుతుంది. ఆమె కూడ యోగిని. ఆయుగం లోనే పరాశరుని వంశంలో శుకుడనే మహాతపశ్శాలి వ్యాసుని పుత్రుడు జన్మిస్తాడు. పీవరి కడుపున శుకునకు కృష్ణుడు, గౌరుడు, ప్రభువు, శంభుడు అనే నలుగురు మహాబలవంతులు యోగులైన పుత్రులు, కృతీ అనేక కన్య పుడతారు. ఆ కన్య అణుహకి అనే వాడికి భార్య బ్రహ్మదత్తుడికి తల్లి అవుతుంది. తరువాత శుకుడు వేదవ్యాసుని వలన ధర్మాలను తెలుసుకొని మరల జన్మించనవసరం లేని మోక్షాన్ని పొందాడు.
ఓ మునీశ్వరా! ధర్మమూర్తిధారులు ఆకాశంలో సంచరించువారైన పితరులు అందరూ స్వర్గలోకంలో ఉంటారు. వృష్ణి అంధక వంశాల వర్ణనలో వీరిని గూర్చి చర్చ వచ్చింది. ఇప్పుడు శరీరం ధరించిన మనుష్యులోకంలోని పితరులను వర్ణిస్తాను. సుకాలురనే పితరులు వసిష్ట ప్రజాపతి పుత్రులు. వాళ్ళందరూ అన్ని కోరికలు తీరిన జ్యోతిస్వరూప లోకాలలో నివసిస్తారు. బ్రాహ్మణ సమూహం నిత్యమూ వీళ్ళకి తర్పణం చేస్తుంది. స్వర్గలోకంలో గోవనే కన్య వీళ్ళ మానసపుత్రిక. ఆమెకు “ఏకశృంగ” అని మరొక పేరు. ఏకశృంగ శుకునికి మిక్కిలి ప్రియమైన భార్య. ఆమె వలన “సాధ్యు”ల యొక్క కీర్తి విస్తరించింది.
అంగిరసుని పుత్రులు సాధ్యులచే పెంచబడిన వాళ్ళు సూర్యకిరణాలచే ప్రకాశించు లోకాలలో ఉంటారు. కోరికలు కలవాళ్ళు ఆ పితరులను తృప్తిపరుస్తారు. యశోదవాళ్ళ మానసకన్య ఈమె విశ్వమహత్తను వాడి భార్య. ఆమె రాజర్షి దిలీపుడికి తల్లి. సుస్వధ అను పేరుతో ప్రసిద్ధులైన పితరులు పులహుని పుత్రులు కర్దమ ప్రజాపతికి తండ్రులు. వాళ్ళెప్పుడూ ఆకాశంలో నివసిస్తారు. వాళ్ళకు వైశ్యులు తర్పణాలు చేస్తారు “విరజ” వాళ్ళ మానసకన్య. నహుషుని భార్య యయాతికి తల్లి ఇంతవరకు మూడు విధానాలైన పితరులను చెప్పాను. ఇక నాల్గవ పితరుల చరిత్ర చెపుతా!
శుక్రాచార్యుని పుత్రిస్వధకు పుట్టిన పితరులు అందరూ అగ్నిపుత్రులు, శూద్రులు వాళ్ళకు తర్పణాలు చేస్తారు. వాళ్ళు మానసలోకాల్లో ఉంటారు. వాళ్ళ మానసకన్య నర్మదానది. నర్మద దక్షిణ దిశగా ప్రవహిస్తూ అనేక ప్రాణులను, పవిత్రులను చేస్తోంది. మహారాజ పురుకుత్సుని భార్య త్రసదస్సునికి తల్లి. ధర్మం నశించినప్పుడు ప్రజాపతి మనువు ఈ ఏడుగురు పితరులకు శ్రాద్ధమును తర్పణా లను చేస్తాడు. కనుక ఇతన్ని శ్రాద్ధదేవుడంటారు. స్వధామంత్రం చదువుతూ పితరులకు వెండి పాత్ర దానం చేసినవాడు పితరులను తృప్తిపరచినవాడవుతాడు. ఈ విధంగా పితరులను తృప్తిపరిస్తే పితరులు మనను తృప్తిపరుస్తారు.
ఓ మహామునీ! దేవతల పనికంటే పితరుల పని మిక్కిలి పొగడతగినది. ఎందుకనగా పితరులకు కోపముండదు. కనుక దేవతలకంటే వీళ్ళు త్వరగా తృప్తి పడతారు. వాళ్ళ ప్రసన్నత స్థిరమైనది. కాబట్టి వాళ్ళను తృప్తిపరచడం ప్రధానం. ఓ బ్రహ్మర్షీ! నీవు పితృభక్తుడవు. నా భక్తుడవు కూడా. నీకు మేలు చేస్తాను. శ్రాద్దము యొక్క ఫలాన్ని ప్రత్యక్షంగా చూడగలవు. ఓ మార్కండేయ! మీలాంటి సిద్దులు కూడా సాధారణ దృష్టితో పితరుల గొప్పతనాన్ని చూడలేరు. సనత్కు మారుడీ విధంగా చెప్పి నాకు దివ్యదృష్టినిచ్చి తనకిష్టమైన దిక్కుకు వెళ్ళిపోయాడు. మార్కండేయుడిలా అన్నాడు.
ఓ భీష్మా! సనత్కుమారుని దయచేత మనుష్యులకు తెలియరాని జ్ఞానాన్ని పొందాను. దాన్ని చెప్పుతా విను!
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో పితృకల్పము శ్రాద్ధఫలవర్థన అను పద్దెనిమిదవ అధ్యాయము.
