హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
49 - బ్రహ్మలోక వర్ణన
జనమేజయుడిలా అడిగాడు!
విష్ణుదేవుడు బ్రహ్మతో బ్రహ్మలోకానికి వెళ్ళి ఎంచేశాడు? బ్రహ్మ ఎందుకు తీసుకువెళ్ళాడు? భగవంతుడు బ్రహ్మలోకంలో ఏ స్థానానికి వెళ్ళాడు. అక్కడ ఏ యోగాన్ని అవలంబించాడు? ఏ నియమాన్ని పాటించాడు. అక్కడ ఉన్న సమయంలో అందరిచేత పూజింపబడే లక్ష్మీదేవి ఎలా పొందబడింది? ఆ భగవంతుడు వర్షకాల ప్రారంభంలోని నిద్రించి శరత్కాలంలో ఎందుకు మేల్కొంటున్నాడు? బ్రహ్మలోకంలో ఉన్నప్పుడు మూడులోకాల పనులను ఎలా నడుపుతున్నాడు? ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా? ఆ భగవంతుని యొక్క దివ్యచరిత్రను విస్తారంగా మొదటి నుంచి చివర వరకు వినగోరుచున్నాను.
వైశంపాయనుడిలా చెప్పాడు.
రాజా! విష్ణువు బ్రహ్మతో కూడ వెళ్ళి అక్కడ ఏం చేశాడో ముందుగా చెప్పుతాను విను.
ఆ భగవంతుని చరిత్ర చాలా రహస్యమైనది. ఇప్పటికీ దేవతలు కూడ అతని చరిత్ర రహస్యాన్ని ఎరుగరు. అయినా శక్తి కొలది వర్ణిస్తాను. దేవదేవుడైన నారాయణుడు లోకస్వరూపుడు. మూడులోకాలు నారాయణస్వరూపమే. ఆయన స్వర్గస్వరూపుడు. స్వర్గమంతా ఆయన స్వరూపము. మహాబుద్ధిశాలురు కూడ ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అంతు తెలియనివారే. కాని వారు మూడు లోకా లకూ హద్దు అతని శక్తితత్త్యమని తెలుసుకొంటున్నారు. ఆ మహాప్రభువు మనస్సుకూ, వాక్కుకూ గోచరం కానివాడు, దేవతలు కూడ నిత్యము అతనిని వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు నేను పూర్వము బ్రహ్మలోకము యొక్క వృత్తాంతాన్ని చెపుతున్నా
బ్రహ్మలోకానికి వెళ్ళి విష్ణుభగవానుడు మొట్టమొదటగా ఆ లోకాన్ని చూచాడు. తరువాత ఆయన వేద విధానప్రకారం అక్కడి ఋషులకు నమస్కారం చేశాడు. అక్కడ మహర్షులు ప్రాతఃకాల యజ్ఞంలో ఆహుతులు ఇస్తున్నారు. ఆ పని పూర్తి అయిన తరువాత వాళ్ళు అగ్నిదేవుడికి నమస్కారం చేశారు. అగ్ని ఋషులు ఆహ్వానించగా యజ్ఞభాగాన్ని స్వీకరిస్తాడు. ఆ అగ్నిదేవుడు నారాయణుని వేరొక రూపమే. ఊహకందని స్వరూపము కల నారాయణుడు ఋషులకు నమస్కరించి బ్రహ్మలోకంలో తిరగటం మొదలుపెట్టాడు.
అలా తిరిగే సమయంలో ఎత్తైన యూపస్తంభాలు చషాలముతో అగ్నితో బ్రహ్మర్షులు అలంకరించినవి అక్కడ ఉన్నాయి. నేతి పొగ యొక్క సువాసన అంతటా వ్యాపిస్తోంది. బ్రాహ్మణులు వేదపఠనం చేస్తున్నారు. నారాయణుని సంతోషం కోసం యజ్ఞాలు జరుగుతున్నాయి. ఈ పనులను చూచి ఆయన ఆయన అక్కడనే తిరుగుతున్నాడు. అక్కడ ఉన్న ఋషులు, సభలో ఉన్నవారు, దేవతలూ పవిత్రమైన మనస్సుతో తమ పవిత్ర హస్తాలతో అర్ఘ్యం పట్టుకొని ఓ కేశవ! మేము చేసిన పని, చేయుచున్న పని యేది కలదో దానియందు మీ సహాయం మాకు కావాలి. అగ్ని చంద్రుడు ఈ ప్రపంచము మీనుండియే పుట్టాయి. ధ్యానబలంచేత జ్ఞాననేత్రంతో చూస్తే ఒక్క జనార్ధునిని వల్లనే ఈ జగత్తు పుడుతోంది. అని స్పష్టమౌతుంది. నారాయణుడు కనపడకపోయినా దేవతలను మనుష్యులనూ బాగా తెలిసికొంటాడు. స్వర్గంలో దేవతలకు కూడ నారాయణుని వలన బలము, ఐశ్వర్యము కలుగుతున్నాయి.
భగవంతుడు యజ్ఞం చేసేవాళ్ళకు యజ్ఞఫలాన్ని ఇస్తాడు. పవిత్రుడు, స్వతంత్రుడు లోకపాలకుడు కూడ అయి ఉన్నాడు. స్వాగతం అడిగినతర్వాత గొప్ప కాంతిగల నారాయణునితో మునులు ఓ పద్మనాభ! తమరు మంత్రములతో కూడిన యజ్ఞంచేత పవిత్రమైన పాద్యాన్ని కాళ్ళు కడుక్కునే నీళ్ళను) పొందుటకు అధికారం కలవారు. మేము మిమ్ములను అతిధిగా భావిస్తున్నాము. మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు మా కర్మకాండ ఆగిపోయింది. ఎందుకనగా విష్ణుభగవానుడు లేని యజ్ఞము వ్యర్ధం. యజ్ఞంలో దక్షిణ ఇవ్వటం పూర్తి అయిన తరువాత మీ ద్వారా యజ్ఞం యొక్క ఫలితం ప్రాప్తిస్తుంది. అందుచేత ఈ వేళ మేము మీ యజ్ఞమే ప్రారంభిస్తున్నాం అని చెప్పారు.
మహారాజా! ఈ విధంగా బ్రహ్మర్షులు సత్కరించగా విష్ణుభగవానుడు ఆ సభలో ఉన్న మునులచే గౌరవింపబడి బ్రహ్మకు మునులకు ఇలాగే అగుగాక అని పలికాడు. బ్రహ్మ మిక్కిలి ఆనందంతో బ్రహ్మలోకంలో ఉన్నాడు
