హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

11 - దుంధువు వధ

జనమేజయుడిలా అడిగాడు.

ఓ బ్రాహ్మణోత్తమా! చాలాయుగాల కాలం గడిచిపోతే రేవతికిగా రైవతుడికి గానిని ముసలితనం ఎందుకురాలేదు? రైవతుడు తపస్సు చేయటానికి మేరు పర్వతానికి వెళ్ళగా ఈనాడు కూడ అతని వంశం ఎలా ఉన్నది. ఈ విషయాన్ని బాగా వినగోరుతున్నాను.

వైశంపాయనుడిలా చెప్పాడు.

ఓ పుణ్యాత్ముడా! బ్రహ్మలోకంలో ఆకలిదప్పిక, ముసలితనము, చావు, ఋతువులు మారుట ఉండదు. రైవతుడు బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు పుణ్య జనులనే రాక్షసులు అతని రాజధాని కుశావతిని పాడుచేశారు. రేవతునకు వంద సోదరులున్నారు. రాక్షసులు పట్టణాన్ని పాడుచేసేటప్పుడు వాళ్ళందరూ నలుదిక్కులకూ పారిపోయారు. వారు నివసించినచోట వాళ్ళ సంతానంవృద్ధి చెందింది. వాళ్ళందరు శార్యాతులనే పేరుతో ప్రసిద్ధి పొందారు. వాళ్ళందరూ పర్వతాల మీదకి వెళ్ళి నివసించటం ప్రారంభించారు. నాభాగారిష్టుడికి వైశ్యస్త్రీ యందు పుట్టిన ఇద్దరు కుమారులున్నారు. వాళ్ళు బ్రహ్మలో లీనమయ్యారు. కరూషుని కొడుకు లందరూ యుద్దం చేయటంలో ఆరితేరారు. వాళ్ళ కారూషులనే పేరుతో ప్రసిద్ది చెందారు. ప్రాంశువనువాడికి ఒకడే పుత్రుడు. అతని పేరు ప్రజాపతి. వృషధ్రుడు తన గురువుగారి ఆవును చంపి గురువు శాపంచేత అతడు శూద్రుడయ్యాడు.

జనమేజయ మహారాజా! ఈ విధంగా వైవస్వత మనువు యొక్క తొమ్మిది మంది కొడుకుల వృత్తాంతము చెప్పి వినిపించాను. మనువు తుమ్ముతుండగా ఇక్షకుడనే కుమారుడు కలిగాడు. అతనికి నూరుగురు కుమారులు పుట్టారు. వారిలో వికుక్షి పెద్దవాడు. అతని పొట్ట చాలా పెద్దది. ఈ కారణంచేత అతను యుద్ధం చేయలేకపోయాడు. కాని ధర్మాత్ముడై నందున అతని అయోధ్యా నగర రాజ్యం ఇచ్చారు. అతనికి శకుని మొదలైన యాభైమంది పుత్రులు కలిగారు. అందరూ ధర్మాత్ములే. వాళ్ళు ఉత్తరాపధంలో ఉండి అక్కడ దేశాలను రక్షిస్తూ ఉండేవాళ్ళ. శశాదుడు మొదలగు నలభై ఎనిమిది మంది దక్షిణదిక్కు నందుండి అక్కడ ప్రదేశాలను రక్షిస్తూ ఉండేవాళ్ళు.

ఇక్ష్వాకుడు అష్టకాశ్రాద్ధానికి మృగాలను చంపి మాంసం తెమ్మన్నాడు. అప్పుడు వికుక్షి వేటాడి మృగాల్ని చంపాడు. ఆ మృగమాంసం శ్రాద్ధంలో ఉపయోగించక ముందే ఒక కుందేలు మాంసాన్ని తిన్నాడు. అందుచే వశిష్ఠు మాట చొప్పున ఇక్ష్వాకుడు అతన్ని విడిచిపెట్టాడు. కుందేలు మాంసం తినుట చేతనే అతడు శశాదుడని పిలువబడ్డాడు. ఇక్ష్వాకు తరువాత శశాదుడే తండ్రి రాజ్యానికి అధికారి అయ్యాడు. పరాక్రమవంతుడైన కకుత్స్థుడనే పేరు వచ్చింది. కకుత్స్థుడి కొడుకు అనేనుడు. ఇతని కొడుకు పృథువు. పృథుపుత్రుడు విష్ణోరశ్వుడు. ఇతని కొడుకు ఆర్తుడు. ఇతని కొడుకు యువనాశ్వడు. ఇతని కుమారుడు శ్రావస్తుడు. ఇతడే శ్రావస్తిపురంలో నివసించేవాడు. ఇతనికి మహాయస్వీ పుత్రుడు. బృహదశ్వడు కూడ పుత్రుడే. బృహదశ్వని కొడుకు ధార్మికుడైన కువలాశ్వుడు. ఇతడే ధుంధు అనేవాణ్ణి చంపాడు. అందుచే ఇతనికి దుంధుమారుడనే పేరు వచ్చింది. ఇంత కధను విని జనమేజయుడు కువలాశ్వుడు ఏ కారణంచేత ధుంధువును చంపాడు? ఆ వృత్తాంతాన్ని బాగా వినగోరుతున్నానని అడిగాడు.

వైశంపాయనుడిలా చెప్పాడు.

మహారాజా! కువలాశ్వుడుకి నూరుగురు కొడుకులున్నారు. వారందరూ పండితులూ ధర్మాత్ములే యజ్ఞాలే చేసేవాళ్ళు ఎక్కువ డబ్బు దక్షిణగా ఇచ్చేవాళ్ళు. మరియు ధనుర్వేదం అంతు చూచినవాళ్ళు. కొంతకాలం తర్వాత బృహదశ్వుడు కుమారుడై కువలాశ్వుడికి రాజ్యమిచ్చి వనానికి వెళ్ళాడు. ఇదే సమయంలో బ్రహ్మర్షి ఉత్తంకుడు వచ్చి రాజుతో ఇలా చెప్పాడు.

రాజా! మమ్మల్ని రక్షించడం మీకు ప్రధానమైనపని. కనుక మొదట మీరీపని చేయ్యాలి. అలా కాకపోతే వానప్రస్థులైన తర్వాత ప్రశాంతంగా తపస్సు చేసుకోలేరు. నీవు రాజ్యం పరిపాలిస్తుంటే భూమండలం ఏ భయంలేకుండా ఉంటుంది. ప్రజ లను పాలించుట గొప్ప ధర్మం. అరణ్యానికి వెళ్లే ఈ ధర్మం దక్కదు. అరణ్యానికి వెళ్ళాలనే బుద్ది మార్చుకో. ప్రజలను నీవు రక్షించాలి. పూర్వపు మహారాజులిట్లే చేశారు. నా ఆశ్రమం దగ్గర ఇసుకతో కూడిన సమతలమైన ఎడారి ఉంది. అక్కడనే ఉజ్ఞానకం అనే సముద్రం ఉంది. అక్కడ దుంధువు అను రాక్షసుడు లోకనాశం కోసం దారుణమైన తపస్సు చేస్తున్నాడు. సంవత్సరం తరువాత ముక్కు నుండి గాలిని విడిస్తే కొండలతో, అడవులతో కూడిన భూమి కంపిస్తుంది. అతనిని శ్వాస వాయువుకి పెద్దదుమ్ము లేస్తుంది. ఏడురోజులు భూమి కంపిస్తూ ఉంటుంది.

నిప్పురవ్వలు, బొగ్గులు, పొగ ఏడురోజులుంటాయి. ఇందుచేత అక్కడ నా ఆశ్రమంలో ఉండలేకపోతున్నాను. ప్రపంచం మేలుకోరి పెద్ద శరీరము గల వాణ్ణి చంపివేయి. అతడు చస్తే లోకాలు స్తిమితపడతాయి. మహారాజా! నీవొక్కడవే వాణ్ణి చంపడానికి సమర్దుడవు. రౌద్రస్వరూపుడైన మహారాక్షసుని చంపినవాడికి వరమిచ్చి అతని తేజస్సును నీవు వృద్ధి పొందిస్తావు అని విష్ణువు నాకు వరమిచ్చాడు. సాధారణ పరాక్రమం కలవాడు అతనిని చంపలేడు. మహాత్ముడైన ఉత్తంకుడిలా చెప్పగా బృహదశ్వుడు ధుంధువును చంపుటకు కువలాశ్వుని చూపి మహాత్మా! నేను ఆయుధం ముట్టనని ప్రతిజ్ఞ చేశాను.

ఇందుచే నా కుమారుడు తప్పక ఆ రాక్షసుని వధిస్తాడు అని కుమారునికా పని వప్పచెప్పి తాను (బృహదశ్వుడు) తపస్సు చేసుకొనుటకు పర్వతశిఖరంమీదికి వెళ్ళాడు. కువలాశ్వుడు నూరుగురు కొడుకులతో ఉత్తంకుని వెంట ధుంధువుని చంపుటకు వెళ్ళాడు. ఈసమయంలో ఉత్తంకుని ప్రార్ధనను బట్టి లోకకళ్యాణం కొరకు శ్రీమహావిష్ణువు కువలాశ్వుని శరీరంలో ప్రవేశించాడు. దేవదుందుభులు మోగినై. కువలాశ్వుడు కుమారులచేత సముద్రం త్రవ్వించాడు. నారాయణుడు తన శరీరం లో ప్రవేశించుటచేత కువలాశ్వుడు మరింత బలవంతుడు అయ్యాడు. సముద్రం త్రవ్వుతుండగా ఇసకలో దాగి ఉన్న ధుంధువు పడమరదిక్కు నావరించి కనిపించాడు.

అతడు మఖంనుంచి పుట్టిన కోపాగ్నితో లోకాలను తపింప చేస్తున్నట్లున్నాడు. ఆ రాక్షసుడు కువలాశ్వుని నూరుగురు కొడుకులను కాల్చివేశాడు. తరువాత మహాతేజశ్శాలి కువలాశ్వుడు తన యోగబలంచేత అగ్నిని ఆర్పివేశాడు. పెద్దశరీరం గల ఆ రాక్షసుని తనబలంతో చంపి ఉత్తంకుడికి రాక్షసుడి చచ్చిన శరీరాన్ని చూపించాడు. ఉత్తంకుడు మహాత్ముడైన రాజుకు వరమిచ్చాడు. మరియు నశించని ధనరాశిని, శత్రువులను జయించు శక్తిని, ధర్మమందాసక్తిని, స్వర్గ నివాసమును, చనిపోయిన రాజపుత్రులకు నశించని పుణ్యలోకాలను ఉత్తంకుడు రాజుకు అనుగ్రహించాడు.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వముందు దుంధువు కధ అను పదకొండవ అధ్యాయము.