హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

22 - శ్రాద్దమహిమ

మార్కండేయుడిలా అన్నాడు.

ఓ భీష్మపితామహా! శ్రాద్ధంవల్ల కీర్తి వస్తుంది. శ్రాద్ధంవల్లనే యోగము, మోక్షమూ ప్రాప్తిస్తున్నాయి. ఇందుచేత శ్రాద్ధానికి గొప్ప ఫలితముందని చెపుతున్నాను. బ్రహ్మ దత్తుడు ఏడు జన్మలలో శ్రాద్ధంవల్ల పొందిన గొప్పఫలితం, పూర్వం బ్రాహ్మణులు ఆవును చంపటం మొదలైన పాపాలుచేసి శ్రాద్ధంవల్ల పొందిన ఫలాన్నీ తెలియజేసే కథను నీకు వినిపిస్తున్నాను.

ఆ కథ విన్నందువల్ల ధర్మబుద్ధి వృద్ధిచెందుతుంది. సనత్కుమారుడు పూర్వం అధర్మం చేసేవాళ్ళను, ధర్మంచేసే ఏడుగురు బ్రాహ్మణులను గూర్చి చర్చ చేసి నందున వాళ్ళను చూడటానికి నేను స్వయంగా కురుక్షేత్రానికి వెళ్ళాను. అప్పుడు నాదివ్యదృష్టితో వాగ్ధోషము, కోపము, హింస, దుర్మార్గము కలవాళ్ళను, కవి, చాసృమ, పితృవర్తి అనే పేర్లు కలవాళ్ళను ఏడుగురు బ్రాహ్మణులను చూచాను. విశ్వామిత్రుని పుత్రులు గార్గ్యుని శిష్యులు అయిన వాళ్ళు తండ్రి చనిపోయిన పిమ్మట బ్రహ్మచర్యవ్రతాన్ని అవలంబించి గర్గమహర్షి ఆశ్రమంలో ఉంటున్నారు.

ఒకనాడు గురువు ఆజ్ఞచేత ఆవును మేపుటకు అడివికి తీసుకు వెళ్ళారు. మార్గంలో వాళ్ళకు ఆకలివేసి ఆ ఆవును చంపాలనుకున్నారు. వాళ్ళలో కవి, చాసృమ అనే సోదరులు అలా చంపవద్దని కోరారు. కాని ఇతర సోదరులను ఆప లేకపోయారు. వాళ్ళల్లో నిత్యమూ శ్రాద్ధమందు ఆసక్తి కల “పితృవ” మీరీ ఆవును చంపాలనే గట్టిగా నిశ్చయించుకుంటే పితరులకు శ్రాద్ధం పెడదాం. ఇలా చేస్తే పితరులు సంతోషిస్తారు. ఈ గోవుకు కూడా మంచిమేలు కలుగుతుంది. మనకు పాపం కలగదు అన్నాడు. చివరకు ఏడుగురూ ఈమాటను అంగీకరించారు. ఆవును నీళ్ళు చల్లి పితృదేవతల కొరకు చంపేశారు. అందరూ కలిసి తినేశారు. తరువాత గురువైన గర్గ్యుని దగ్గరకు వెళ్ళి మహాత్మా! ఆవుని పెద్దపులి తినేసింది. దూడనుమాత్రం తీసుకొచ్చాం అని చెప్పారు.

ముని దూడను తీసుకున్నాడు. ఆయన సరల స్వభావం గలవాడు. ఇలా గురువుకు అన్యాయంగా సేవచేస్తూ ఆయుస్సు నిండగా మరణించారు. వాళ్ళు ఏడుగురు సోదరులూ ఒక కిరాతుడికి బిడ్డలై పుట్టారు. ఈజన్మలో వాళ్ళు తమ పనులు చేసుకుంటూ ఆశ, అసత్యమూ విడిచిపెట్టి జీవనానికి సరిపడినంత మాత్రమే ఆహారం తెచ్చుకొనేవాళ్ళు. ఆహారాన్ని సంపాదించుకున్న తరువాత సమయమంతా ధ్యానంతో గడిపేవాళ్ళు. వాళ్ళ పేర్లు నిర్వైరుడు, నిర్వృతి, శాస్త్ర, నిర్మన్యు, కృతి, వైధన, మాతృవర్తి అనేవి. ఆ ఏడుగురు మిక్కిలి ధర్మాత్ములు. కిరాతులమధ్య నివసిస్తున్నా తల్లిదండ్రుల సేవలో నిమగ్నులయ్యేవాళ్ళు.

ఇలా ఉండగా వాళ్ళ తల్లిదండ్రులు మరణించారు. అప్పుడు వాళ్ళు ధను ర్బాణాలను విడిచిపెట్టారు. వెనుకజన్మలో చేసిన మంచిపనులవల్ల వాళ్ళు కాలంజర పర్వతంమీద మృగాలై పుట్టారు. తరువాత పక్షులై, హంసలై పుట్టారు. తరువాత మనుష్యజన్మ పొందారు. గోమాంసమును పితరులకు పెట్టిన పుణ్యంచేత వాళ్ళకు పూర్వజన్మజ్ఞానం నశించలేదు.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో శ్రాద్ధ మహిమ అను ఇరవైరెండవ అధ్యాయము.