హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
16 - శ్రాద్ధకల్ప వర్ణన
జనమేజయుడిలా అడిగాడు.
ఓ బ్రాహ్మణశ్రేష్టుడా! అదితి పుత్రుడైన సూర్యుడు శ్రాద్ధదేవుడెలా అయ్యాడు? శ్రాద్ధం యొక్క విధానం ఎటువంటిది? పితృలోకం యొక్క పుట్టుక ఎలాంటిది? పితరులు స్వర్గంలో ఉంటారనీ వాళ్ళు దేవతలకు కూడ దేవతలనీ అని నేను బ్రాహ్మణుల నుంచి విన్నాను. ఈ విషయం బాగా తెలుసుకొన గోరుతున్నాను. పితృగణం ఎవరు? వాళ్ళ బలం ఏమి? మనం ఎలా చేస్తే శ్రాద్ధం వాళ్ళకు సంతోషం కలుగుతుంది? పితృదేవతలు మనకిచ్చే మేలు ఏమిటి? ఈ విషయం అంతా తెలుసుకొనగోరుతున్నాను.
వైశంపాయనుడిలా చెప్పాడు.
మహారాజ! పూర్వం సనత్కుమారుడు మార్కండేయుడికీ మార్కండేయుడు భీష్ముడికీ ఈ విషయం చెప్పటం జరిగింది. భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. అదే విషయాన్ని నీకు వినిపిస్తున్నా! భీష్ముడిలా చెప్పాడు ధర్మరాజా! పితృదేవతలను తృప్తిపరచటంలో ఆసక్తి కలవాడు, కోరిన ప్రయోజనం పొందటానికి పితృ దేవత లను సంతోష పెట్టేవాడు. ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సుఖాన్ని పొంద టానికి సమర్దుడగుతున్నాడు. ఆ పితృదేవతలు ధర్మం కోరేవాళ్ళకు ధర్మం పుత్రులను కోరేవాళ్ళకి పుత్రులను, పుష్టి కావాలనుకొనే వాళ్ళకు పుష్టిని యిస్తారు. మళ్ళీ ధర్మరాజు ఇలా అడిగాడు.
ఓ పూజ్యుడా! ప్రాణులందరూ తమ తమ కర్మలఫలాన్ని అనుభవిస్తూ, ఉంటారు. కొంతమందికి పితరులు స్వర్గంలోను, కొందరు నరకంలోను ఉంటారు. మనుష్యులందరూ తమ కోరికలు తీరాలని తండ్రికి, తాతకి, ముత్తాతకి శ్రాద్ధం చేసి పిండాలు పెడతారు. వేర్వేరు లోకాల్లో ఉండేవాళ్ళు శ్రాద్ధంలో ఇవ్వబడిన పిండాలను ఎలా పొందుతారు? ఈ స్థితిలో నరకంలో ఉండే పితరులు కోరిన ఫలితాన్ని ఎలా ఇవ్వగలరు? ఏ పితరులు స్వర్గమందుంటారు. ఏ పితరులు నరకంలో ఉంటారు? మనమెందుకు పితృయజ్ఞం చెయ్యాలి? స్వర్గంలో దేవతలు కూడ పితరులకు శ్రాద్ధం పెడతారని విన్నాను.
మహానుభావా! ఈ విషయం విస్తారంగా వినాలని కోరుతున్నాను. అమిత బుద్దిమంతుడవు నీవు ఈ విషయం చెప్పుము. పితృదేవతలను తరింపచేయు టానికి శ్రాద్ధం ఎలా చేయాలి. భీష్ముడిలా చెప్పాడు. నీవడిగిన విషయాలకు స్వర్గ మందున్న మా తండ్రి శంతనుమహారాజు ద్వారా నేను విన్నది చెప్పుతా! ఒకరోజున తద్దినంలో పిండాలు పెడుతున్నా ఆ సమయంలో నా తండ్రి భూమిలోంచి వెలుప లకు వచ్చి భుజకీర్తితో కూడిన ఎర్రనిచేతిని చాచి పిండం పెట్టమని అడిగాడు. అతడు వెనుక నేను చూచినట్లే ఉన్నాడు. శాస్త్రంలో చచ్చిపోయినవాడి చేతిలో పిండం పెట్టడం ఎక్కడాలేదు. అని ఆలోచించి సందేహించకుండా దర్భల మీదనే పెట్టాను.
అప్పుడు నా తండ్రి మిక్కిలి సంతోషించి మధురమైన వాక్కుతో భరత వంశంలో శ్రేష్టుడా! నీ వల్ల నేను సంతానం కలవాడ నయ్యాను. నేను భూలోకం లోను, స్వర్గంలోనూ కూడ కృతార్థుడనయ్యాను. నీ వంటి విద్వాంసుడు కొడుకవటం నా అదృష్టం. వేదధర్మాలను నీవు అనుసరించావు. వాటిని ప్రమాణంగా చేసుకొన్నాను. అందుచే నాకు మిక్కిలి సంతోషం కలిగించిన వాడవయ్యావు. రాజు నడవడిబట్టి ప్రజలు నడుస్తారు. నీ సత్ప్రవర్తనకు, శాస్త్రప్రమాణ బుద్ధికి మెచ్చి నీకు వరమిస్తున్నాను. నీవు ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడే మరణిస్తావు. ఇంకా ఏదైనా నీవు వరం కోరితే అది కూడా ఇస్తాను. నీమనస్సులో విషయం చెప్పు. అప్పుడు నేను కృతార్థుడనైనాను. నీవు సంతోషించావు కనుక అని, అప్పుడు భీష్ముడు తండ్రినిలా అడిగాడు.
తండ్రీ! దేవతలకు, పితరులకు ఏమీ తేడాలేదని వింటున్నాను. ఐతే దేవతల్ని పూజించాలా! పితరులను పూజించాలా! మనం పిండాలు పరలోకంలో ఉన్న పితరులకు ఎలా ప్రాప్తిస్తాయి? మరియు శ్రాద్ధం యొక్క ప్రయోజనమేమి? దేవదానవ గంధర్వాదులు ఎవర్ని పూజిస్తారు? ఈవిషయంలో నాకు పెద్దసందేహం ఉంది. తెలుసుకోవాలని ఉత్సాహం కూడా ఉంది. మీరు అన్నీ తెలిసినవారు. కనుక నాసందేహాన్ని పోగొట్టండి. అప్పుడు భీష్ముడి తండ్రి ఇలా చెప్పాడు. నీ ప్రశ్నలన్నిటికీ సంగ్రహంగా సమాధానం చెపుతా. శ్రద్ధగా విను.
స్వర్గంలో దేవతలందరూ బ్రహ్మపుత్రులు. దేవతలు, మనుష్యులు, కిన్నరులు, మహాసర్పాలు అందరూ పితృయజ్ఞం చేస్తారు. ఇలా చెయ్యాలని బ్రహ్మయొక్క శాసనం. పితృ యజ్ఞంచేత పితరులు తృప్తిపడి మనలను తృప్తిపరుస్తారు. కాబట్టి నీవు సోమరితనం లేకుండ శ్రేష్ఠమైన శ్రాద్ధ పితృదేవతలను పూజింపుము. అన్ని కోరికలను తీర్చు వారు మేలుచేస్తారు. పేరు, గోత్రం మొదలైనవి చెప్పి వాళ్ళ నారాధిస్తే స్వర్గమందున్న దేవతలు కూడ సంతోషిస్తారు. ఈవేళ ప్రఖ్యాతిచెందిన పితృభక్తుడు మార్కండేయ ముని మనపై అనుగ్రహంతో ఇక్కడకు వచ్చారు. మిగిలిన మాటలు వీరే నీకు చెపుతారు. ఇట్లుచెప్పి నాతండ్రి అక్కడనే అంతర్ధానం చెందాడు (కనబడకుండా పోయాడు.)
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో శ్రాద్ధకల్ప వర్ణనమనే పదహారవ అధ్యాయము.
