హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
13 - త్రిశంకుకథ
వైశంపాయనుడు ఇలా చెప్పాడు.
సత్యవ్రతుడు భక్తిచేత దయవలన విశ్వామిత్రుని భార్యను పోషించాడు. లేళ్ళను, అడివిపందులనూ, దున్నపోతుల్ని చంపి విశ్వామిత్రుని ఆశ్రమ సమీపంలో మాంసాన్ని చెట్టుకు కట్టాడు. సత్యవ్రతుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం పన్నెండు సంవత్సరాల వరకు జనరహితమైన అరణ్యంలో ఉంటూ నియమాల్ని పాలిస్తున్నాడు. ఇంత సమయమూ వసిష్ఠుడు పౌరుహిత్యము గురుత్వము ఉండటంచేత అయోధ్యా రాజ్యాన్ని అంతఃపుర రక్షణమూ చేశాడు. సత్యవ్రతుడు బాల్యంచేతనో, రాబోవు కష్టాన్నిబట్టో వసిష్ఠుడి మీద మిక్కిలి కోపం కలవాడయ్యాడు. ఎందుకంటే తన తండ్రి త్రయ్యారుణుడు తనను విడిచిపెట్టేటప్పుడు వసిష్ఠడు అడ్డుకోలేదు. అందుచే అతని పాపం నశించింది. చెట్టుకు కట్టిన మాంసం అయిపోగా అన్ని కోరికలను తీర్చునటువంటి మిక్కిలి పాలనిచ్చే వసిష్ఠుని ఆవును చూచాడు. జనమేజయ మహారాజా! కోపంచేత అలసట వలన ఆకలిచేత కూడ ఆ ఆవును చంపేశాడు. ఆ మాంసాన్ని తాను తిని విశ్వామిత్రుని కొడుకులకు కూడ పెట్టాడు. ఈ సంగతిని విని వసిష్ఠుడు కోపించాడు. మరియు ఇలా అన్నాడు.
తండ్రిని సంతోష పెట్టకపోవుట, గురువుగారి ఆవును చంపుట, మాంసాన్ని శుద్ది చేయకుండా తినటం ఈ మూడు పాపాలు చేశావు. కనుక నీవు త్రిశంకువు అయ్యావు అని (శంకువంటే పాపము) విశ్వామిత్రుడు భార్యను పోషించటానికి వచ్చి త్రిశంకువుకు సంతోషంతో వరమిచ్చాడు. అప్పుడు త్రిశంకువు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళేట్లు వరం కోరాడు. పన్నెండు సంవత్సరాలు వర్షం లేక ఏర్పడిన భయంపోగా విశ్వామిత్రుడు త్రిశంకుని తండ్రి రాజ్యాని పట్టాభిషిక్తుని చేసి అతనిచే యాగం చేయించాడు. వసిష్ఠుడు దేవతలూ చూస్తుండగానే విశ్వామిత్రుడు త్రిశంకుని స్వర్గానికి పంపాడు. త్రిశంకు భార్య సత్యరధ. హరిశ్చంద్రుడనే కుమారుని కన్నది. హరిశ్చంద్రుడు త్రిశంకవుడని పిలువబడ్డాడు. ఇతడు రాజసూయయాగం చేసి సమ్రాట్టయ్యాడు. హరిశ్చంద్రుని కొడుకు రోహితుడు. ఇతడు రోహితపురమనే పట్టణాన్ని నిర్మించాడు. రాజర్షి రోహితుడు చాలాకాలం రాజ్యం పరిపాలించి ప్రజలను బాగా పరిపాలించాడు. తరువాత ఈ సంసారం సారం లేనిదని గ్రహించి నగరాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చాడు. రోహితుని కొడుకు హరితుడు హరితుని కొడుకు “చంచు” ఇతనికి విజయుడు, సుదేవుడు అని ఇద్దరు కొడుకులు. ఈ యిద్దరిలో పెద్దవాడు క్షత్రియ జాతినంతను జయించాడు. కనుక విజయుడనబడుచున్నాడు. ఇతని కొడుకు ధర్మార్థ పండితుడైన “రురుకుడు” ఇతనికి వృకుడు కొడుకు వృకుని పుత్రుడు బాహువు. శకయవన, కాంబోజ, పారద, పహ్లవ, హైహయ, తాలజంఘులు మొదలగువాళ్ళు మ్లేచ్చులు, బాహువును రాజ్యం నుంచి తప్పించారు. బాహువు కుమారుడు సగరుడు. ఇతడు విషంతోపాటు పుట్టాడు. ఇతడు ఔర్వుని ఆశ్రమంలో భార్గవుని చేత రక్షింపబడ్డాడు. సగరుడు భార్గవుడి నుండి ఆగ్నేయాస్త్రాన్ని పొంది తాలజంఘలను, హైహయుడు మొదలగువాళ్ళను జయించాడు. మరియు శకపహ్లవ పారదాదుల ధర్మాన్ని నశింపచేశాడు.
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో త్రిశంకు కథ అనే పదమూడవ అధ్యాయము.
