హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

36 - జనమేజయ వంశవర్ణనము

వైశంపాయనుడిలా చెప్పాడు.

మహారాజ! కీర్తిశాలియైన వృజనవంతుడు క్రోష్టు పుత్రుడు. ఇతనికి “స్వాహి”, వీనికి పుత్రుడు “ఉషద్గు”. యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞప్రభావంచే ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరు చిత్రరధుడు. ఇతడు గొప్పపనులందు ఆసక్తి కలవాడు. చిత్రరధుని పుత్రుడు శశబిందు గొప్పదాత. చివరకు రాజర్షుల సత్యమార్గమును ఆశ్రయించాడు. శశబిందు పుత్రుడు పృధుశ్రవుడు. ఇతనికి అంతరుడు, వీనికి సుయజ్ఞుడు, వీనికి ఉశత్తు, వీనికి శత్రుతాపనుడు, శినేయువు. శినేయు పుత్రుడు మరుత్తుడు. ఇతడు ధర్మము నాచరించి “కంబలబర్హి” అనే పుత్రుని పొందాడు. ఇతనికి శతప్రసూతి, శతప్రసూతికి రుక్మకవచుడు పుత్రుడు. పరాజిత్తు. ఇతనికి రుక్మేషు, పృథురుక్మ, జ్యామఘ, పాలిత, హరి మహాబలవంతులైన ఈ ఐదుగురూ పుత్రులు. రుక్మకవచుడు పాలితుడు, హరి అనే పుత్రుల్ని పోషించే భారం విదేహ రాజుకు వప్పచెప్పాడు. రుక్మేషు సింహాసనంపై కూర్చున్నాడు. అతని చిన్నతమ్ముడు పృథురుక్ముడు. అతని ఆజ్ఞను పాలించేవాడు. కొంతకాలం తరువాత ఈ యిద్దరు సోదరులూ కలిసి జ్యామఘుణ్ణి రాజ్యంనుంచి బయటకు వెళ్ళగొట్టారు. జ్యామఘుడు రాజ్యాశ వదలి ఆశ్రమవాసి అయ్యాడు.

కొంతకాలం తపస్సుచేసి బ్రాహ్మణుల ఆశీస్సులతో పరాక్రమించి జ్యామ ఘుడు ధనుస్సును ఎత్తాడు. రధంమీద ఎక్కి మరొకదేశం జయించాలని వెళ్ళాడు. అతడు ఒంటరిగా నర్మదానది ఒడ్డు, మృత్తికావతీ పట్టణం, ఋక్షవత్ పర్వతము జయించి శుక్తిమతీ నగరంలో నివసించాడు. పతివ్రత, గడుసుది అయిన “శైబ్య” అతని భార్య. జ్యామఘుడు సంతానం లేకపోయినా మరొక వివాహం చేసుకోలేదు. యుద్ధంలో విజయం పొంది ఒక కన్యను తీసుకువచ్చాడు. భార్యకు భయపడి ఇది కోడలు అన్నాడు. అతని భార్య ఎవరికి కోడలు? అని అడిగింది. రాజు నీకే అన్నాడు. నీకు ముందుపుట్టే కొడుక్కి భార్య అవుతుంది అన్నాడు. ఈ మాటవిని ఆ కన్య కఠోరమైన తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సు ప్రభావం చేత ముసలి తనంలో శైబ్యకు ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరు విదర్భుడు. అతడు యువకుడైన తరువాత ఉపదానవితో (ఆ కన్యతో) అతనికి వివాహం జరిగింది. అతనికి “క్రథ”, “కౌశిక” అను యిద్దరు పుత్రులు కలిగారు. తరువాత మూడవ పుత్రుడు రోమపాదుడు పుట్టాడు.

రోమపాదుని కొడుకు బభ్రువు. ఇతనికి “ఆహృతి”, ఇతనికి విద్వాంసుడైన కౌశికుడు. ఇతని కొడుకు చేది. ఇతని వంశంలో పుట్టిన రాజులు వైద్యుల నబడుతు న్నారు. విదర్భుని పుత్రుడు భీముడు. ఇతనికి కుంతి, ఇతనికి ధృష్టుడు. ఇతనికి ఆవస్తుడు, దాశార్హూడు, విషహరుడు అని ముగ్గురు పుత్రులు. దాశార్హూడికి “వ్యోమ”, ఇతనికి జీమూతుడు. ఇతనికి బృహతి, ఇతనికి భీమరధుడు. ఇతనికి నవరధుడు, ఇతనికి దశరథుడు, ఇతని పుత్రుడు శకుని. ఇతనికి కరంభుడు, ఇతనికి దేవ రాతుడు. దేవరాతునికి దేవక్షత్రుడు. అతడు వూరువంశపు భద్రవతి కడుపున జన్మించాడు. అతడు మధువంశీయులకు వంశోద్దారకుడు. ఇతడు “మధు” వని పేరుపొందాడు. మధు భార్య వైదర్భికి పురుద్వంతుడు జన్మించాడు. మధుకి ఇక్ష్వాకువంశపు కన్యకూడ ఒక భార్య. ఆమెకు సత్యవంతుడు. ఇతడు సాత్వతుల కీర్తిని వృద్ధి చేసినవాడు. మహారాజ! జ్యామఘుని వంశ వృత్తాంతాన్ని వింటే ప్రపంచంలో గొప్పకీర్తి, పుత్రప్రాప్తి కలుగుతుంది.