హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
52 - భూమి తన దుఃఖాన్ని చెప్పుట
వైశంపాయనుడిలా చెప్పాడు.
మహారాజ! నీటితో కూడిన మేఘంలాగ నల్లని శరీరం గల విష్ణుభగవానుడు గంభీరమైన కంఠస్వరంతో అలాగా కానీయండి అని దేవతలతోపాటు మేరుపర్వతం వైపు బయల్దేరారు. భగవంతుని వక్షస్థలం శ్రీవత్సమనే పుట్టుమచ్చతో హరము ప్రకాశిస్తున్నది. ఆయన శరీరం మీద పీతాంబరం ప్రకాశిస్తోంది. అందుచే సంధ్యాకాల మేఘంతో కూడిన పర్వతంలా అతని శరీరం శోభిస్తోంది. ఆయన గరుడ వాహనంపై వెళ్ళుచుండగా బ్రహ్మ, ఇంద్రాదిదేవతలు వెంట వచ్చారు. త్వరగానే వాళ్ళు మేరుపర్వతం చేరారు. అక్కడ దేవతలు సూర్యకిరణాలతో ప్రకాశించుతూ ఏరూపాన్నై నాధరించగల దేవసభను చూచారు.
అందులో బంగారు స్తంభాలున్నాయి. దాని బయట ద్వారము రత్నములు పొదగబడి ఉంది. వజ్రాలతో రణం ఉంది. అంతటా రత్నాలు పొదిగిన చిత్రాలున్నాయి. విశ్వకర్మ నిర్మించిన దేవమాయతో కూడిన సభా భవనం అది. దేవతలందులో ప్రవేశించి సంతోషంతో విమానంలో ఆసనముల మీదను కూర్చొని ఉన్నారు. తరువాత బ్రహ్మ ప్రభంజనవాయవుకి శబ్దం వినపడకుండా చూడమని ఆజ్ఞయిచ్చాడు. నిశ్చబ్దంగా స్తిమితంగా ఉన్న ఆ దేవతల సభలో భూమి కష్టంతో దీనంగా ఇలా పలికింది.
దేవా! కొంచం బలంతో ధరించే దాన్ని నీ అనుగ్రహంతో నేను ప్రయత్న పూర్వకంగా ధరిస్తున్నాను. నీవు పోషించని ప్రాణిలేదు. ఓ నారాయణా! లోకం యొక్క మేలుకోరి నీవే ప్రతియుగంలోనూ భూమికి బరువు తగ్గిస్తున్నావు. నీ ప్రభావంచేతనే నేను పాతాళం చేరాను. ఇప్పుడు నిన్ను శరణువేడుతున్నాను. మీరు నన్ను రక్షించండి. దుర్మార్గులైన రాక్షసుల ద్వారా బాధ ఏర్పడినప్పుడు మిమ్మల్ని శరణు వేడుతున్నాను. నిన్ను శరణువేడకపోతే లక్ష విధాల భయం కలుగుతోంది. పూర్వం బ్రహ్మ నన్ను తగ్గించి మట్టితో ఇద్దరు రాక్షసుల్ని సృష్టిం చాడు. తరువాత వాళ్ళ శరీరాలు తాకి చూడగా ఒకడి శరీరం మెత్తగా, రెండవవాడి శరీరం కఠినంగా ఉంది. మెత్తని శరీరం వాడికి మధువని, గట్టి శరీరంవాడికి కైటభుడని పేర పెట్టాడు.
నామకరణం అయిన తరువాత వాళ్ళిద్దరూ యుద్ధం చెయ్యాలని ఆలోచించారు. వాళ్ళు వస్తున్నారని చూచి బ్రహ్మదేవుడు సముద్రము నీటిలో దాక్కున్నాడు. పూర్వం నీబొడ్డు నుండి పుట్టిన పద్మమే అతని నివాసస్థానమైంది. ఆ రాక్షసులిద్దరూ మహాసముద్రం నీటిలో ప్రవేశించారు. అక్కడ చాలాకాలం నిశ్చింతగా నిద్రపోయారు. చాలాకాలం తరువాత వాళ్ళిద్దరూ తిరుగుతూ తిరుగుతూ బ్రహ్మగారి దగ్గరకు వచ్చారు. పెద్ద శరీరం గల భయంకర రాక్షసులను చూచి బ్రహ్మ తామర తూడుతో విష్ణుమూర్తిని మేల్కొలిపాడు. విష్ణుమూర్తి పక్కనుండి లేచాడు. అప్పుడా రాక్షసులకు విష్ణుభగవానునికి ఘోరమైన యుద్ధం జరిగింది.
చాలాకాలం యుద్ధం చేసిన తరువాత ఆ రాక్షసులిద్దరూ సంతోషించారు. మేము నీ యుద్ధము నేర్పు చూచి సంతోషించాము. కనుక మేము నీ చేతిలోనే మరణించుట మంచిదని తలుస్తున్నాము. కాని నీరు లేనిచోట చావాలని మా అభిప్రాయం. మేము ఎవడిచేతిలో చస్తామో వాడికే పుత్రులముగా పుట్టాలని మా కోరిక అన్నారు. అప్పుడు నీవు వాళ్ళిద్దరినీ నీ చేతులతో పట్టుకొని గట్టిగా నొక్కటం చేత వెంటనే మరణించారు. ఇలా చచ్చిపోయి ఆ రాక్షసులు సముద్రపు నీటిలో మునిగిపోయారు. నీటి కెరటాలచే కొట్టబడిన వాళ్ళ శరీరం నుండి వచ్చిన క్రొవ్వు నీటిలో కలిసిపోయింది. నారాయణుడు మళ్ళీ ప్రజలను సృష్టించాడు. రాక్షసుల కొవ్వుతో కప్పబడినందున భూమికి “మేడిని” అనే పేరు వచ్చింది. తరువాత నీ ప్రభావం వల్ల నేను నిత్యమైన భూమిగా చేయబడ్డాను.
పూర్వం వరాహరూపం ధరించి మార్కండేయుడు చూస్తుండగానే ఒక కొమ్మతో నీటిమధ్య నుండి నన్ను పైకి తెచ్చావు. నీవొకమారు బలిచక్రవర్తి యజ్ఞంలో కాళ్ళతో కొలిచి నన్ను ఉద్దరించావు. ఈ సమయంలో దిక్కులేనిదాననై మిక్కిలి కష్టపడి నిన్ను శరణుజొచ్చాను. బంగారానికి అగ్ని, కిరణాలకు సూర్యుడు, నక్షత్రాలకు చంద్రుడులాగా నీవు నాకు గురువుగా ఉన్నావు. ప్రపంచాన్ని నేను మోస్తుంటే నాకు శక్తినిచ్చి పోషించేవాడివి నీవు, పరశురాముడు నా బరువును తోసివేయుటకు ఇరవై ఒక్కమారు క్షత్రియులను నశింపచేశాడు. రాజుల రక్తంతో తర్పణం చేశాడు. తరువాత దక్షిణగా కశ్యపమునికి దానం చేశాడు. క్షత్రియుల రక్తమాంసాలచేత, కొవ్వుచేత దుర్గంధం కలదానినై కశ్యపమహర్షి వద్దకు వెళ్ళాను. ఓ భూమి! ముఖం వంచి ఎందుకు దుఃఖిస్తున్నావని కశ్యపుడు అడిగాడు. అప్పుడు నేను కశ్యపమహర్షికి ఇలా చెప్పాను.
పరశురాముడు నాభర్తలను చంపివేశాడు. నేనిప్పుడు విధవైనాను. నాపట్టణాలు శూన్యమయ్యాయి. కాబట్టి నేను బ్రతక తలుచుకోలేదు. కనుకనే మహానుభావా! నాకు తగిన భర్తను ఇవ్వండి. అతడు సముద్రాలనీ, గ్రామాలనూ, నగరాలతోసహా నన్ను రక్షించటానికి సమర్థుడుగా ఉండాలి.
పూజ్యుడైన కశ్యపుడు ఆ మాటను విని సరేనన్నాడు. తరువాత మనుష్యులలో గొప్పవాడైన మనువుకు నన్ను ఇచ్చాడు. ఆ మనువు వలన జన్మించిన ఇక్ష్వాకులం రాజులలో ఒకరి తరువాత ఒకరిని పొందాను. మహర్షులతో సమానులైన రాజులచే పరిపాలింపబడ్డాను. చాలామంది క్షత్రియులు నన్ను జయించి స్వర్గం చేరారు. నాకోసం దెబ్బలాటలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా.
ఓ జగన్నాధా! ఇది అంతా నీ యొక్క లీలాప్రభావమే. లోకకళ్యాణం కోసం నీవే యుద్ధభూమిలో క్షత్రియుల మరణానికి కారణం. కనుక నా భారాన్ని తగ్గించటానికి నీ హృదయంలో దయుంటే నాకు అభయం ఇవ్వండి. చక్రాయుధాన్ని ధరించే నీవే నాకు సహాయం చేసేవాడవు. నేను నిన్ను శరణు వేడుతున్నాను. మీరు నా భారాన్ని తొలగిస్తారా లేదా చెప్పండి.
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో భూమి తన దుఃఖాన్ని చెప్పుట అను యాభై రెండవ అధ్యాయము
