హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

25 - చంద్రుని పుట్టుక, దేవాసుర యుద్ధము

వైశంపాయనుడిలా చెప్పాడు.

రాజా! పూర్వం బ్రహ్మ ప్రపంచసృష్టి మొదలెట్టినప్పుడు సోముని(చంద్రుని) తండ్రి అత్రిమహర్షి బ్రహ్మ మనస్సు నుండి పుట్టాడు. తరువాత అత్రి తన పుత్రులను వెంటబెట్టుకొని సమస్తప్రాణులకూ శుభం కోరుతూ ఉండేవాడు. గొప్ప తేజశ్శాలి. అత్రి కర్రవలె నిలిచి, చేతులు పైకెత్తి మౌనంతో వెయ్యి దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. రెప్పపాటు లేకుండా ఇంతకాలం నిలబడి ఉండటం చేత అతని శరీరంనుండి తేజస్సు అతని శరీరాన్నంతా తేజోమయంగా చేస్తూ పైకిలేవ మొదలెట్టింది. తపస్సు చేసే సమయంలో అతని కళ్ళనుండి వెడలిన నీరుచేత పది దిక్కులు మిక్కిలి ప్రకాశించాయి. ఆ తేజస్సును దిగ్ధేవతలు గర్భంగా ధరించాయి. కాని వాళ్ళు సహించలేకపోయారు. తరువాత తేజోమయములలో కొన్ని సంతోషపెట్టే చంద్రబింబ రూపమైన గర్భం ఆదిగ్ధేవతలతోపాటు భూమిమీద పడింది.

ఇలా భూమిపై పడిన చంద్రుని బ్రహ్మదేవుడు లోకకళ్యాణం కొరకు లేవనెత్తి తన రథంమీద కూర్చోపెట్టాడు. బ్రహ్మయొక్క ఆ రథం వేదంచేత నిర్మింపబడిందని నేను విన్నాను. ఆ రధానికి వెయ్యి తెల్లని గుర్రాలు కట్టబడ్డాయి. నారాయణ స్వరూపుడైన అత్రిపుత్రుడు చంద్రుడు క్రిందపడగానే బ్రహ్మదేవుని ఏడుగురు పుత్రులూ కలిసి అన్ని వేదాల మంత్రాలనే ఉచ్చరిస్తూ స్తోత్రం చేయమొదలెట్టారు. ప్రకాశవంతమైన చంద్రుని వృద్ధిచెందే కాంతిచేత మూడులోకాలు ప్రకాశింపచేయ బడ్డాయి.

లోకపితామహుడు బ్రహ్మ చంద్రుని రథంమీద కూర్చొనబెట్టుకొని ఇరవై ఏడుమార్లు భూమికి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసేటప్పుడు రథవేగంవల్ల జారిపడిన చంద్రుని తేజస్సువలన భూమిమీద అనేక ఓషధులు పుట్టాయి. ఆ ఓషధుల ప్రభావంవల్ల మూడులోకాలు జరాయుజాండజాది నాల్గు విధాలైన ప్రాణుల పోషణా జరుగుతున్నది. చంద్రుడు ప్రపంచానికి పుష్టినిచ్చేవాడు. ఈవిధంగా తేజస్సును పొంది అనేకవిధాల స్తోత్రం చేయబడుతూ చంద్రుడు వెయ్యి పద్మ సంవత్సరాలు తపస్సు చేశాడు. బంగారురంగు గలిగి ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవతలకు తనపనులచే ప్రసిద్ధిచెందిన చంద్రుడు నిధి(గని) అయినాడు.

తరువాత బ్రహ్మవేత్తలలో గొప్పవాడైన బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి ఓషధులకు, బ్రాహ్మణులకు, నీటికి రాజుగా చేసి పట్టాభిషేకం చేశాడు. ఇలా పట్టాభిషిక్తుడై చంద్రుడు తనకాంతిచే మూడులోకాలను కాంతితో కూడినవాటినిగా చేశాడు. ప్రచేతుని కుమారుడైన దక్షప్రజాపతి ఆ చంద్రునికి ఇరవైఏడుగురు కన్యలను ఇచ్చాడు. ఆ ఇరవైఏడుగురూ నక్షత్రాల పేర్లతో ప్రసిద్ధిపొందారు. చంద్రుడు ఇంత గొప్పరాజ్యాన్ని పొందిన తరువాత ఒక లక్షగోవులను దానంచేసి రాజసూయయాగం ప్రారంభించాడు. ఆ యజ్ఞంలో పూజ్యుడైన అత్రిమహర్షి హోత (హోమం చేసేవాడు), భృగుమహర్షి అధ్వర్యుడు (యాగం నడిపించేవాడు), వసిష్ఠుడు సామవేదం గానంచేసేవాడు, బ్రహ్మ బ్రహ్మస్థానంలో ఉండగా విష్ణుమూర్తి, సనత్కుమారుడు మొదలైన బ్రహ్మర్షులు ఆ యజ్ఞంలో సభ్యులయ్యారు. చంద్రుడు ఆయజ్ఞంలో సభ్యులకు ఇతరమహర్షులకు మూడులోకాలనూ దానమిచ్చాడని నేను విన్నాను.

సిని, కుహు, ద్యుతి, తుష్టి, ప్రభ, వసు, కీర్తి, ధృతి, లక్ష్మి ఈ తొమ్మిది దేవతలూ అతనికి సేవచేస్తారు. చంద్రుడు యజ్ఞంచివర అవబృథస్నానం చేసిన తర్వాత అతని తేజస్సుతో పదిదిక్కులూ మిక్కిలి ప్రకాశించాయి. జనమేజయ మహారాజ! చంద్రుడు మునులద్వారా ఆశకుమించిన గౌరవాన్ని పొంది ఐశ్వర్య మదంచే మదించాడు. అతని బుద్ది నీతిమార్గం నుండి తప్పిపోయింది. అతడు అంగిరసుని మాటలువిని దేవగురువైన బృహస్పతి భార్య “తార” ను అపహరించాడు. అప్పుడు దేవతలు బ్రహ్మర్షులు ప్రార్ధించారు. కాని చంద్రుడు తారను పంపలేదు. ఇందుచేత బృహస్పతి చంద్రునిపై కోపించాడు.

శుక్రాచార్యుడు చంద్రుడికి మద్దతునిచ్చాడు. బృహస్పతి తండ్రియైన అంగిరసుని శిష్యుడు శుక్రాచార్యులు. అందుచే వాళ్ళు గురుపుత్రుడైన బృహస్పతిపై పక్షపాతం కలిగి ఉన్నారు. రుద్రుడు కూడ అంగిరసుని శిష్యుడే. ఈ కారణంచేత తన ఆజగవ ధనుస్సును ఎక్కు పెట్టి బృహస్పతిపక్షంలో నిలిచాడు. ఆయుద్ధంలో చాలామంది దేవతలు, రాక్షసులు మరణించారు. ఆ యుద్ధంలో బ్రతికి ఉన్న చంద్రుని పక్షం దేవతలు బ్రహ్మను శరణువేడారు. అప్పుడు బ్రహ్మదేవుడు శుక్రాచార్యుని శంకరుని యుద్ధం మాన్పించి, తారను బృహస్పతికి ఇప్పించాడు. తారను గర్భవతిగా చూచి బృహస్పతి నీవు నా భార్యవై ఇతరుని వల్ల గర్భం ధరించరాదు అని పలుకగా తేజశ్శాలియైన పుత్రుని రెల్లువనంలో పారేసింది తార. ఆ శిశువు తేజస్సును చూచి దేవతలు సంశయించినవారై తారను అడిగారు.

దేవి! నిజం చెప్పు. ఈ శిశువు ఎవని పుత్రుడు? చంద్రుని కొడుకా బృహస్పతి కొడుకా? ఈ విధంగా దేవతలు అడుగగా తార భయపడి ఏమీ చెప్పలేదు. ఆ శిశువే అప్పుడు తారకు శాపమివ్వటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆమెను ఎవని పుత్రుడో నిజం చెప్పమని అడిగాడు. తార చేతులు జోడించి ఇతడు చంద్రుని కుమారుడని మెల్లగా చెప్పింది. అప్పుడు చంద్రుడు పిల్లవాని శిరస్సును ముర్కొని, అతనికి బుధుడని పేరు పెట్టాడు. ఈ బుధుడు ఎల్లప్పుడూ సూర్యునికి విరుద్ధమైన దిక్కున ఉదయిస్తాడు. బుధుడు వైరాజమనవు కుమార్తె ఇల యందు ఒక కుమారుణ్ణి కన్నాడు. అతని పేరు పురూరవుడు. పురూరవుడు ఊర్వశి అనే అప్సరస యందు ఏడుగురు పుత్రులను కన్నాడు. ఈ సమయంలో చంద్రుని క్షయరోగం కలిగింది. ఇందుచే చంద్రమండలం క్షీణించటం మొదలు పెట్టింది.

అప్పుడు తన తండ్రియైన అత్రి మహర్షిని శరణువేడాడు. అత్రిమహర్షి అతని దుఃఖాన్నిపోగొట్టాడు. ఈ విధంగా క్షయరోగం పోయిన తరువాత చంద్రుని కాంతి మళ్ళీ అన్నివైపులా ప్రకాశించింది జనమేజయా! ఈ విధంగా నేను చంద్రుని కీర్తిని వృద్ధి చేసే వృత్తాంతాన్ని చెప్పాను. ఇప్పుడు ఈ వంశచరిత్ర చెపుతాను. ఈ కథను వినుటచే ధనము, ఆరోగ్యము, పుణ్యము, ఆయుస్సు, వృద్ధి పొందుట సంభవించును. తలచిన కోరిన పూర్తి అవుతుంది.