హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
43 - యుద్ధానికి సిద్ధమైన రాక్షససేన
వైశంపాయనుడిలా చెప్పాడు.
మహారాజా! దైత్యులు దానవులు (రాక్షసులు) భగవంతుడు దేవతలకు అభయమిచ్చాడని విని మిక్కిలి ఆసక్తితో యుద్ధానికి తయారవటం ప్రారంభిం చారు. మయుడనే రాక్షసుడు బంగారు రథంమీద బయల్దేరాడు. ఆ రథం పన్నెండు వందల చేతి విస్తారం కలిగి ఉంది. ఆ రధంలో గదపరిఘ మొదలైన ఆయుధాలు చిరుగంటలు మొదలైన వస్తువులు ఉన్నాయి. ఆ రథం పెద్ద పెద్దపులి చర్మంతో కప్పబడింది. రత్నాలతో బంగారు జాలరులతో ప్రకాశిస్తున్నది. ఆ రథం బయల్దేరేటప్పుడు మేఘధ్వనితో సమానమైనధ్వని ఏర్పడుతుంది. ఆ రాక్షసుడు ఎలుగుబంటిలా నల్లగా ఉన్నాడు. అతడు చాలామంది శత్రువులను చంపటంలో సమర్దుడు. తారకాసురుడు కూడ పొడవుగా విశాలంగా ఉన్న ఒక రథంమీద కూర్చున్నాడు. విరోచనుడు గదచేత పట్టుకొని నిలిచాడు. హయగ్రీవుడు (రాక్షసుడు)వెయ్యి గుర్రాలు పూన్చిన రథంమీద కూర్చుని అటూఇటూ తిరుగుతున్నాడు. వరాహ రాక్షసుడు ధనుష్టంకారం చేస్తూ సైన్యానికి ముందున్నాడు. ఖరుడనే రాక్షసుడు కళ్ళనుండి క్రోధంవల్ల కన్నీరు కారుస్తున్నాడు. రాక్షసులందరూ గర్జిస్తున్నారు. ఆయుధాలతో ఆడుతున్నారు. కొందరు రాక్షసులు చక్రాలతో సైన్యాన్ని సంతోషపెడుతున్నారు. ఈ విధంగా రాక్షసపైన్యం మదించి యుద్దానికి సిద్ధంగా ఉన్నది. ఉత్సాహంతో దేవతల ఎదుట నిలిచింది.
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో యుద్ధానికి సిద్ధమైన రాక్షససేన అను నలభై మూడవ అధ్యాయము
