హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

14 - సగరుని పుట్టుక

జనమేజయుడిలా అడిగాడు.

ఓ తపోధనా! సగరుడు విషంతో ఎలా పుట్టాడు? మరియు అతడు కోపించి “శకులు” మొదలగు క్షత్రియుల కులానికి తగిన ధర్మాన్ని నాశనం చేయుట, ఈ విషయం తమరు దయచేసి వివరంగా చెప్పండి. వైశంపాయనుడిలా చెప్పాడు.

రాజు జూదం, త్రాగుడు మొదలైన వ్యసనాలలో పడ్డాడు. ఈ కారణంచేత శకయవనాది రాజులు అందరూ కలిసి తమ భుజబలంతో బాహుకుణ్ణి రాజ్యం నుంచి తొలగించి ఆ రాజ్యం మీద అధికారం చలాయించారు. అప్పుడు రాజు బాహువు దుఃఖపడి భార్యతో అడవికి వెళ్ళాడు. అక్కడనే మరణించాడు కూడా. బాహువు భార్య, భర్తతోపాటే అడవికి వెళ్ళింది. అంతకు మునుపే సవతి ఆమెకు విషం పెట్టింది. ఆమె, మరణించిన భర్తతోపాటు చితిపై కూర్చొని తాను కూడ ప్రాణత్యాగానికి సిద్ధపడింది.

అప్పుడు భృగువంశంవాడైన ఔర్వుడు ఆమెను దయతో అడ్డగించాడు. అతని ఆశ్రమంలోనే ఆమె విషంతోపాటు శిశువును కన్నది. అతడే సగరుడు. ఔర్వుడు ఆ శిశువుకు జాతకర్మ మొదలగు సంస్కారాలను జరిపి వేదశాస్త్రాలను బోధించి యుద్ధవిద్యలో శిక్షణ యిచ్చి ఆగ్నేయాస్త్రాన్ని కూడ ఇచ్చాడు. ఆ అస్త్ర బలంతో యుద్ధంలో హైహయులను నశింపచేశాడు. దీనిచే ప్రపంచంలో అతడు గొప్పకీర్తి పొందాడు. తరువాత శకయవనాదులను చంపుటకు బయల్దేరాడు. వీరుడైన సగరుడు చంపుతుండగా ఆ రాజులు వసిష్ఠమహర్షిని శరణుకోరారు. శరణుజొచ్చిన వాళ్ళను రక్షించడం ధర్మం కనక వసిష్ఠుడు వాళ్ళకు అభయమిచ్చి సగరుణ్ణి చంపవద్దని అడ్డగించాడు.

గురువు మాటను గౌరవించి సగరుడు వాళ్ళను చంపకుండా వాళ్ళ ధర్మాన్ని నశింపచేసి వేషాన్ని మార్పు చేయించాడు. శిరస్సును సగం గొరిగించి శకులను విడిచిపెట్టాడు. యవనులకు కాంబోజులకు పూర్తిగా తల గొరిగించి పారదులకు తలవెంట్రుకలు లేకుండ చేసి, పహ్లవులకు మీసాలు ధరింపచేశాడు. వీళ్ళలో ఎవరికీ వేదాన్ని ఉచ్చరించే అధికారం లేకుండా చేశాడు. జనమేజయ మహారాజా! సగరుడు గురువు వసిష్ఠుడు చెప్పినట్లు శత్రువులను మితిమీరి చంపటం ఆపి శకయవనాది రాజులను జయించి వారిని ధర్మభ్రష్టులను చేశాడు. సగర మహారాజు ఈ విధంగా భూమండలాన్ని జయించి అశ్వమేధ యాగానికి దీక్ష పూనాడు. ఆ యజ్ఞపు గుర్రాన్ని తానే రక్షిస్తూ దాని వెనుక వెళ్ళాడు. ఆగ్నేయదిశలో సముద్రం ఒడ్డున తిరుగుతుండగా ఇంద్రుడా గుర్రాన్ని దొంగిలించి భూమి క్రిందికి వెళ్ళాడు.

అప్పుడు సగరుడు ఆ ప్రదేశాన్ని కొడుకులచే త్రవ్వించాడు. అలా వారు తవ్వుతుండగా అక్కడ ఆదిపురుషుడు విష్ణుమూర్తి యోగములో ఉండి కపిలదేవుని రూపంలో కూర్చుని ఉన్నాడు. అతన్ని చూడగానే సగరపుత్రులు దగ్గరకు వెళ్ళి యోగాన్ని పాడుచేశారు. కపిలదేవుడు కళ్ళు తెరవగానే భయంకరమైన ఆగ్ని వెలువడింది. ఆ అగ్నిలో సగరపుత్రులందరూ తగలబడిపోయారు. బర్హకేతు, సుకేతు, ధర్మరథుడు, పంచజనుడు అనే నలుగురు మాత్రం చావకుండా మిగిలారు. ఆ సమయంలో విష్ణువు ప్రత్యక్షమై సగరుడికి వరమిస్తూ రాజా! మీ వంశం నశించదు. నీవు గొప్ప కీర్తి పొందుతావు. సముద్రుడు నీకు పుత్రుడు. చివరకు తగలబడిన నీ కొడుకులు నాశంలేని లోకాలను పొందుతారు అని చెప్పాడు.

ఈ సమయంలోనే సముద్రుడు చేతులతో పూజాద్రవ్యం తీసుకొని సగరుడి వద్దకు వచ్చాడు. నమస్కరించాడు. అప్పుడు సగరుడు సముద్రుని తన పుత్రునిగా భావించాడు. కాబట్టే సముద్రానికి సాగరమనే పేరు వచ్చింది. సగరుడు సముద్రము నుండే తన యజ్ఞాశ్వాన్ని పొందాడు. నూరు యజ్ఞాలు చేసినవాడయ్యాడు. సగర మహారాజుకు అరవై వేలమంది పుత్రులున్నారని విన్నాను.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో సగరని పుట్టుక అను పదనాల్గకు అధ్యాయము.