హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

32 - పురువంశ పరంపర

వైశంపాయనుడిలా చెప్పాడు.

రాజర్షియైన ఋచేయువు గొప్పవీరుడు. తక్షకుని కుమార్తె జ్వలనతో అతనికి వివాహం జరిగింది. జ్వలనకు మతినారుడనే పుత్రుడు కలిగాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. వాళ్ళ పేర్లు తంసుడు, ప్రతిరథుడు, సుబాహువు. మతినారుకు ఒక “గౌరి” అనే కన్య కూడ ఉంది. ఆమె మాంధాతకు తల్లి అయింది. మతినారుని పుత్రులు ముగ్గురూ బ్రహ్మజ్ఞానులు, బలవంతులు, యుద్ధనిపుణులు కూడ. వాళ్ళలో తంసుడు పెద్దవాడు. ప్రతిరథుని కొడుకు కణ్వుడు. ఇతని కొడుకే మేధాతిథి. ఇతని వలన కణ్వుడు బ్రాహ్మణుడయ్యాడు. ఇతని వంశీయులను కాణ్వాయనులని పిలుస్తారు. కణ్వుని కూతురు “ఈలిని”. ఈమె ఎక్కువ బ్రాహ్మణ భక్తి కలది. “తంసు”తో ఈమెకు వివాహం జరిగింది. తంసుని కుమారుడు “సురోధుడు”. ఇతడు బ్రహ్మజ్ఞాని, పరాక్రమవంతుడు కూడ. ఉపదానవి ఇతని భార్య. ఈమె కుమారులు దుష్యంతుడు, సుష్మంతుడు, ప్రవీరుడు, అనఘుడు అను నలుగురు. దుష్యంతుని కొడుకు భరతుడు. ఇతడు పదివేల ఏనుగుల బలం కలవాడు. సర్వదమనుడను ఈతడు చక్రవర్తి. భరతుని తల్లి శకుంతల. అతని పేరుతోనే మీరు భారతులనబడుతున్నారు. ఆకాశవాణి శకుంతల నవ మానించవద్దు. భరతుని తండ్రివి నీవేనని శకుంతల సత్యమే పలికింది. నీవు భరతుని పోషించు శకుంతల నీ భార్యయేయని పలికింది. తల్లుల కోపం చేత భరతుని పుత్రులు నశించారు. ఈ విషయంలో ఒక కథ.

భరద్వాజుడు భరతుని చేత ఒక యజ్ఞం చేయించాడు. దేవతలు భరద్వాజుని భరతుని కుమారరూపంగా మార్చారు. పూర్వం తల్లులు భరతపుత్రుల్ని పనికిరాని వారినిగా చేశారు. భరద్వాజుని వల్ల కలిగిన పుత్రునికి వితథుడని పేరువచ్చింది. వితథుడు పుట్టగానే మహారాజు భరతుడు స్వర్గస్థుడయ్యాడు. తరువాత భరద్వాజుడు కూడా వితథుడికి పట్టాభిషేకంచేసి, అరణ్యానికి వెళ్ళిపోయాడు. వితథుడికి కుమారులు ఐదుగురు. వాళ్ళపేర్లు సుహోత్రుడు, సుహోత, గయుడు, గర్గుడు, కపిలుడు. సుహోత్రుడికి ఇద్దరు కొడుకులు. వాళ్ళ పేర్లు కాశికుడు, గృత్సమతి. వాళ్ళ యిద్దరినుండి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యజాతులకు చెందిన అనేక పుత్రులు జన్మించారు. కాని “కాశికకు” ఒక్కడే దీర్ఘతపుడనువాడు. ఇతనికి ధన్వంతరి జన్మించాడు. ఇతని కొడుకు కేతుమంతుడు. ఇతనికి భీమరథుడు, ఇతనికి దివోదాసుడు. ఇతడు రాక్షసులకు యమునివంటివాడు. ఆకాలంలో క్షేమకుడనే రాక్షసుడు రాజైన దివోదాసు రాజధానియైన కాశీని జనశూన్యంగా చేశాడు. దివోదాసుడు గోమతీనదిఒడ్డున రాజధానిని ఏర్పరుచుకొన్నాడు.

ఇప్పుడు విశ్వామిత్రుని పుత్రుల పేర్లు చెపుతా విను.

విశ్వామిత్రునికి భార్య శాలావతివల్ల దేవశ్రవుడు, కతి, హిరణ్యాక్షుడు పుట్టారు. ముల్లోకములందు ప్రసిద్ధిచెందిన దేవరాతుడు మొదలగువారు విశ్వామిత్రుని పుత్రులు. కతికి కాత్యాయనుడు జన్మించాడు. ఇతని రెండవభార్య “రేణు” రేణు మంతుని, సాంకృత్యుని, గాలవుని, మౌద్గల్యుని కన్నది. ఈకుశికవంశ మహాత్ములు సమస్త ప్రపంచానికీ తెలిసినవాళ్ళు. పాణిన, బభ్రవ, ధ్యానజవ్య, పార్థివ, దేవరాత, శాలంకాయన, సీశ్రవ, లేహిత్య, యామదూత, కారీష ఇంకా ఇతర కౌశికులు కుశిక వంశమునందు జన్మించినవారుగా తలచబడుచున్నారు. ఈ మహాత్ములలో చాలమందికి ఇతర ఋషుల కులమందు వివాహాలు జరిగాయి. విశ్వామిత్రుని పుత్రుల్లో శునశ్శేపుడు పెద్దవాడు. అతడు భృగువంశంవాడై యుండి కౌశిక వంశీయుడయ్యాడు. దృషద్వతి పుత్రులైన అష్టకదేవరాతాదులు అందరూ విశ్వామిత్రుని పుత్రులు. అష్టకుడి కొడుకు లేహి. ఈవిధంగా రాజా! జహ్నుగణ వృత్తాంతం నీకు చెప్పాను. ఇప్పుడు అజమీఢవంశ వృత్తాంతం చెపుతా విను.

అజమీఢుడికి నలిని అనే భార్యయందు సుశాంతిక జన్మించింది. ఆమెకు పూరుజాతి అతనికి వాహ్యాశ్వుడు, పుత్రులు. వాహ్యాశ్వుడికి ఐదుగురు కొడుకులు. వాళ్ళపేర్లు ముద్గలుడు, సృంజయుడు, యవీనరడు కృమిలాశ్వుడు. ఈ ఐదుగురు దేశరక్షణలో సమర్థులు. ఇందుచే పంచాలురని చెప్పబడుతున్నారు. వీళ్ళ రాజ్యం పేరుకూడా పంచాలమే. ముద్గలవంశ రాజులు మౌద్గల్యులుగా చెప్పబడుచున్నారు. వీళ్ళు క్షత్రియవంశంలో పుట్టి కూడ బ్రాహ్మణులుగా చూడబడుతున్నారు. కణ్వుడు, ముద్గలవంశం వాళ్ళు అంగిరసునిపై పక్షపాతం కలవాళ్ళు. ఇంద్రసేనుడు ముద్గలుని పెద్దకొడుకు. ఇంద్రసేనుడికి వధ్య్రశుడు, ఇతనికి దివోదాసుడు, అహల్య పుట్టారు. అహల్యకు శతానందుడు గౌతముని వలన కలిగాడు. ఇతనికి సత్యధృతి. ఇతనికి ఒకకొడుకు, ఒక కూతురు కలిగారు. వేటకు వెళ్ళిన శంతనమహారాజు ఈ ఇద్దరు పిల్లల్నీ దయతో ఇంటికి తీసుకువెళ్ళాడు. పిల్లవాడి పేరు కృపుడు, పిల్లపేరు కృపి. రాజా! ఈ విధంగా నీకు గౌతమపుత్రుల చరిత్ర చెప్పాను. దివోదాసు సంతతి గూర్చి చెపుతా విను.

దివోదాసు కొడుకు మిత్రయువు. ఇతనివల్ల మైత్రాయణీశాఖ ఏర్పడింది. ఈ శాఖవాళ్ళకు మైత్రేయులని పేరు. వీళ్ళందరూ క్షత్రియులు. భృగువంశంతో సంబంధం కలవాళ్ళు. సృంజయుని కొడుకు పంచజనుడు. ఇతనికి సోమదత్తుడు, ఈతనికి సహదేవుడు ఇతనికి సోమకుడు కొడుకులు. సోమకుని పుత్రుడు జన్తువు. ఇతనికి వందమంది కొడుకులు అందరికంటే చిన్నవాడు వృషతుడు, ఇతనికి ద్రుపదుడు, ఇతనికి ధృష్టద్యుమ్నుడు, వీనికి ధృష్టకేతువు జన్మించారు. వీళ్ళందరూ అజమీఢుని వంశంవాళ్ళు. అజమీఢుని మూడవభార్య మీ పూర్వులకు తల్లి. ధూమిని వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసింది. మితభోజనం చేస్తూ దర్భలపై పరుండేది. అజమీఢుడికి ధూమినికీ ఋక్షుడు పుట్టాడు. ఇతనికి సంవరణుడు, ఇతనికి కురువు. ఇతడు కురుక్షేత్ర నగరాన్ని నిర్మించాడు.

ఇతని వంశం విశాలమైనది. ఈవంశీయులు కౌరవులు. కురుమహారాజుకు సుధన్వుడు, సుధనువు, మహాబాహువు పరీక్షిత్తు, ప్రవరుడు అని నలుగురు పుత్రులు. సుధన్వుని కొడుకు సుహోత్రుడు. ఇతనికి చ్యవనుడు, ఇతని కొడుకు కృతయజ్ఞుడు. ఇతనికి విశ్రుతుడు, ఇతనికి వైద్యోపరిచరుడు. ఇతనికి గిరికయందు బృహద్రధుడు, ప్రత్యగ్రహుడు, కుశుడు, మారుతుడు, యదువు, మత్యుడు, సత్తముడు అని ఏడుగురు జన్మించారు. అతని కుమార్తె “కాలి”. బృహద్రధుని కొడుకు కుశాగ్రుడు. ఇతనికి వృషభుడు, వీనికి పుష్పవంతుడు, ఇతనికి సత్య హితుడు, వీనికి ఊర్జుడు, ఇతనికి సంభవుడు. వీనికి పుట్టినవాడు రెండుముక్కలుగా ఉన్నాడు. జర అనే రాక్షసి ఆ రెండుముక్కల్నీ కలిపింది. ఇందు వల్ల అతని పేరు జరాసంధుడు. ఇతడు క్షత్రియులనందరినీ జయించాడు.ఇతని కొడుకు సహదేవుడు. ఇతని పుత్రుడు ఉదాయువు. ఇతని కుమారుడు శ్రుతధర్ముడు. ఇతడు మగధదేశపు రాజు. “కురు” మహారాజు రెండవపుత్రుడు పరీక్షిత్తుకు ధర్మాత్ముడైన జనమేజయుడు.

ఇతనికి శ్రుతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అని ముగ్గురు పుత్రులు. వీళ్ళుకాక సురధుడు, మతిమంతుడు అనే యిద్దరు పుత్రులు కూడా ఉన్నారు. సురధుని కొడుకు విదూరధుడు. ఇతనికి ఋక్షుడు. వీనికి కురువు. మహారాజా! ఈవిధంగా మీవంశంలో ఇద్దరు ఋక్షులు, ఇద్దరు పరీక్షిత్తులు, ముగ్గురు భీమసేనులు, ఇద్దరు జనమేజయులు పుట్టారు. రెండవ ఋక్షుడికి భీమసేనుడు, వీనికి ప్రతీవుడు. ఇతనికి ముగ్గురు కుమారులు. శంతను, దేవాపి, బాహ్లికి. నీవు శంతనువంశంలో పుట్టావు. బాహ్లికునకు సోమదత్తుడు. ఇతనికి భూరిశ్రవుడు, భూరి, శలుడు అని ముగ్గురు పుత్రులు. దేవాపి మునిధర్మాన్ని స్వీకరించాడు. ఇందుచే చ్యవనుడు అతన్ని పుత్రుడుగా స్వీకరించాడు.

రాజా! ఇప్పుడు శంతనువంశాన్ని చెపుతా. నీవు ఆ వంశంలోనే జన్మించావు. శంతనువు రాజయ్యాడు. అతనికి గంగవలన దేవవ్రతుడు జన్మించాడు. ఇతడే భీష్ముడు. కౌరవవంశానికి పితామహుడు (తాత). “కాలి” వలన శంతను మహారాజుకు విచిత్రవీర్యుడు కలిగాడు. ఇతడు తండ్రికి ఇష్టుడు. కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు) విచిత్రవీర్యుని భార్యయందు పాండు, ధృతరాష్ట్ర, విదురులనే ముగ్గుర్ని కన్నాడు. ధృతరాష్ట్రుడు గాంధారియందు నూరుమంది పుత్రులను కన్నాడు. వాళ్ళలో దుర్యోధనుడు పెద్దవాడు. పాండురాజు కుమారుడు అర్జునుడు. ఇతని కొడుకు అభిమన్యువు. నీ తండ్రి పరీక్షిత్తు అభిమన్యుని పుత్రుడు. రాజా! నీవు పుట్టిన పురువంశ చరిత్రను చెప్పాను. ఇప్పుడు తుర్వసుద్రుహ్యు “అను” యదువంశమును వర్ణిస్తున్నాను. విను.

తుర్వసు కొడుకు వహ్ని, ఇతనికి బహ్లికుడు, ఇతని పుత్రుడు గోభాను. వాని పుత్రుడు విజయవంతుడైన త్రైసానువు. ఇతనికి కరంధముడు. ఇతనికి మరుత్తు. ఆవిక్షితమరుత్తనేవాడు వేరు. ఇతన్ని ఇదివరకే చెప్పాను. రాజైన మరుత్తు చాలా యజ్ఞాలు చేశాడు. గొప్పదక్షిణలిచ్చాడు. కాని పుత్రసంతానం లేదు. సమ్మత అనే ఒక్క కన్యమాత్రం అతనికి జన్మించింది. ఆకన్యను సంవర్తకుడనువాడికి దక్షిణగా ఇచ్చాడు. తరువాత ఆమెకే దుష్యంతుడు జన్మించాడు. ముసలితనంలో యయాతి శాపంచేత తుర్వసువంశం కూడా పూరువంశంలో కలిసిపోయింది. దుష్యంతుని కొడుకు కరుత్థాముడు. అతనికి “తధాక్రీడుడు”, ఇతనికి నలుగురు పుత్రులుః- పాండ్య, కేరల, కోల, చోల. వీళ్ళరాజ్యాలు వీళ్ళ పేర్లతోటే ప్రసిద్ది చెందాయి. “ద్రుహ్యు” నకు బభ్రు, సేతు అనే యిద్దరు పుత్రులు. సేతువు పుత్రుడు అంగారుడు. ఇతనికి మరుత్పతి అని కూడా ప్రసిద్ధి కలదు. పధ్నాలుగు సంవత్సరాలు ఘోరయుద్ధంచేసి అతికష్టంమీద యౌవనాశుడతన్ని చంపివేశాడు. అంగారుడి కొడుకు గాంధారుడు. అతని రాజ్యంకూడ గాంధారమే. గాంధారదేశపు గుర్రాలు మిక్కిలి శ్రేష్ఠములుగా తలచబడ్డాయి. “అను” అనేవాడి కొడుకు ధర్ముడు. ఇతని కొడుకు ధృతుడు, వీనికొడుకు దుదుహుడు. ఇతనికి ప్రచేతుడు, వీనికి సుచేలుడు. రాజా! ఈవిధంగా నీకు అనువంశచరిత్ర చెప్పాను. ఇప్పుడు యదువుయొక్క వంశావళిని విస్తారంగా వర్ణిస్తాను.