హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

47 - దేవతలు కాలనేమితో యుద్దము చేయుట

వైశంపాయనుడిలా చెప్పాడు.

మహారాజా! కాలనేమి రాక్షసులను సంతోషపెట్టుటకు వర్షాకాల మేఘంలాగా వృద్ధి పొందాడు. కాలనేమిని చూచి రాక్షసులు స్తిమితపడి లేచారు. అమృతం ప్రాప్తించినట్లు ఆనందించారు. అందరూ యుద్ధానికి సంసిద్ధులయ్యారు. మయ తార వరాహ హయగ్రీవ రాక్షసులు అనేక విధాలైన ఆయుధాలు పట్టుకొని కాలనేమిని ముందుంచుకొని యుద్ధరంగంలో నిలబడ్డారు. వాయువుచే రక్షింపబడి నారాయణునిపై ఆధారపడిన దేవసైన్యము అనేక విధాలైన అస్త్రములను పట్టుకొని సముద్రంలా ప్రకాశించింది. రెండు సేనలు కలిశాక ఘోరమైన యుద్ధం ప్రారంభ మయింది. దేవతలు మొదట చురుకుగా లేకపోయినా తరువాత పరాక్రమించి రాక్షసులను చంపనారంభించారు. రాక్షసులు మొదట పరాక్రమం చూపించి తరువాత సడలిపోయారు.

రెండు సైన్యాలూ సముద్రంనుంచి పైకి లేచిన మేఘాలవలె ఉన్నాయి. ఎవరి శిబిరాల్లో వారుండగా ఒక్కసారి భేరీలు మ్రోగాయి. శంఖాలు ఊదబడ్డాయి. ఆ ధ్వనిచే భూమండలం దిక్కులు ఆకాశము ప్రతిధ్వనించాయి. రాక్షసుల సింహనాదాలు వినబడలేదు. అప్పుడు రెండు సైన్యాలు ఒకరిపై ఒకరుపడి చంపనారంభించారు. కొందరు వీరులు ద్వంద్వయుద్ధం చేశారు. దేవతలు అనేకవిధాలైన ఆయుధాలతో రాక్షసులను కొట్టారు.

కొందరి శరీరాలు చూర్ణమయ్యాయి. కొందరి శరీరాలు బాణాలు గ్రుచ్చకొని ముక్కలైనాయి. రోషంతో కూడిన సైనికులు రథాలమీద, విమానాలమీద ఎక్కి యుద్ధం చేశారు. ఎంత ఆపద వచ్చినా యుద్ధరంగాన్ని విడవక నిలిచి పోరాడారు కొందరు. రథాలచేత కాలిబంట్లచేత మార్గం ఆవరింపబడింది. ఆకాశంలో రథముల ధ్వనులు గంభీరంగా వినిపిస్తున్నాయి. ఒకటి రథం దొంగిలించబడింది. ఒకడు రథంక్రింద పడి చచ్చాడు. రథం నడిచే మార్గం లేకపోయింది. ఇద్దరు కత్తియుద్ధం చేస్తూ ఆరుపులే అలంకారాలుగా ఒకరినొకరు కొట్టుకున్నారు. చాలామంది సైనికులు రక్తం కక్కుకున్నారు.

ఈ విధంగా రెండు సైన్యములు ఆయుధములు విసురుకుంటూ ఘోర యుద్ధం చేశారు. రెండు పక్షాల బాణవర్షం చేత సూర్యుడు కనపడలేదు. ఈ సమయంలో కాలనేమి సముద్రజలంతో నిండిన మేఘంలాగా ఉండి కోపంతో లేచాడు. పర్వత శిఖరాలు అతని శరీరం తాకి చూర్ణం అయిపోయాయి. అతడు అనేక విధములైన అస్త్రసమూహాలతో ధనుస్సులతో పరిఘలనే ఆయుధాలతో ఆకాశాన్ని కప్పి వేశాడు. కొండశిఖరాలతో చెట్లతోనూ దేవగణాన్ని పడగొట్టాడు. చాలామంది చిన్నాభిన్నమైన శిరస్సులు కలవారయ్యారు. కాలనేమిచే కొట్టబడిన దేవతలు యుద్ధ రంగంలో ఎదిరించలేకపోయారు. అతడు ఇంద్రుని బాణాలతో బంధించి స్తంభింపచేశాడు. ఐరావతమనే ఏనుగు కదలలేకపోయింది. వరుణుడు నీరు లేని మేఘంలా, నీరులేని సముద్రంలా కదలిక లేనివాడయ్యాడు. కాలనేమి బాణాలచే దెబ్బతిని ఇంద్రుడు ఐరావతంమీద నిశ్శబ్దంగా కూర్చున్నాడు. యముడు దక్షిణదిశకు వెళ్ళాడు.

కాలనేమి ఈ విధంగా దిక్పాలకుల్ని పారద్రోలి తన శరీరాన్ని నాలుగు భాగాలు చేసి నాలుగు దిక్కులలో దిక్పాలకుల పని తానే చేయ మొదలుపెట్టాడు, చంద్రుని కాంతిని తీసివేసుకున్నాడు. సూర్యుని అతని పనినుండి తప్పించాడు. వాయుదేవుని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆ రాక్షసుడు సమస్త లోకాలకూ భయం కలిగించాడు. కాలనేమి రెండవ బ్రహ్మదేవునిలా ప్రకాశించాడు. దేవతలందరూ అతనికి వశులయ్యారు.ఆ విధంగా కాలనేమి సృష్టిని స్థితిని చేస్తూ బ్రహ్మయొక్క స్థానాన్ని పొందాడు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుని స్తోత్రం చేసినట్లు రాక్షసులు కాలనేమిని పొగడనారంభించారు.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో దేవతలు కాలనేమితో యుద్ధము చేయుట అను నలభై ఏడవ అధ్యాయము