హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

37 - కుకుర (బభ్రు) వంశవర్ణనము

వైశంపాయనుడిలా చెప్పాడు.

మహారాజ! కౌసల్య కడుపున పుట్టిన భజిన, భజమాన, దేవావృధ, అంధక, యాదవులకానందం కలిగించు వృష్ణి, వీళ్ళందరూ సాత్వతకుని పుత్రులు. నేనిపుడు నలుగురు పుత్రుల వృత్తాంతం విస్తారంగా చెపుతున్నాను. భజమానుడికి సృంజయుని కన్యలు “వాహ్యక”, “ఉపవాహ్యక” అను భార్యలిద్దరున్నారు. వీళ్ళ యిద్దరివల్ల భజమానునికి చాలామంది పుత్రులు కలిగారు. వాళ్ళలో కృమి, క్రమణ, ధృష్ణు, శూర, పురంజయ అను పుత్రులు వాహ్య కడుపున పుట్టారు. అయుతజిత్తు, సహస్రజిత్తు, శతజిత్తు, దశక అనువాళ్ళు ఉపవాహ్యక పుత్రులు.

దేవావృధుడను రాజు పర్ణాశానదిలో స్నానము, ఆచమనం చేసి ప్రశాంతమైన మనస్సుతో కఠోరమైన తపస్సు చేశాడు. అతడు నిత్యమూ పర్ణాశానదిలో స్నానం చేశేవాడు. ఇందుచే ఆ నది సంతోషించి అతనికి ఇష్టమైన పని చేయాలని తలంచింది. దేవావృధుడికి తగిన స్త్రీ కనబడక తానే అతనికి భార్య కాదలచింది. పర్ణాశ ఒక కన్యకరూపాన్ని పొంది దేవావృధుని భర్తగా వరించింది. రాజు అందుకు అంగీకరించాడు. కొన్నిరోజులకు పర్ణాశ గర్భిణి అయింది. పదిమాసాలు నిండిన తరువాత ఒక పుత్రుని కన్నది. అతని పేరు “బభ్రు”. ఇతడు తన యోగబలం చేత అంతటా ఒకేమారు కనిపించేవాడని చెపుతారు. ఇతడు తండ్రికి తగినవాడు. దేవతాసమానుడు. ఇతడు యుద్ధభూమిలో ఏడువందల అరవైఆరు యోధులను సంహరించాడు. బుద్ధిమంతుడైన బభ్రు బ్రహ్మవాది. అనేక సద్గుణాలు కలవాడు. సాత్వతవంశీయులలో అతడు గొప్పకీర్తి గడించినవాడు. ఇతని వంశం మిక్కిలి విశాలమైనది.

మృత్తికావత నగరరాజు భోజుడు. దృడాశ్వని కుమార్తెకు, అంధక వంశానికి చెందిన “కుకుర”, భజన, శమి, కంబలబర్హి అనే నలుగురు పుత్రులు కలిగారు. వాళ్ళలో కుకురుని కుమారుడు ధృష్ణువు. ఇతనికి పోతరోముడు, వీనికి తైత్తిరి, ఇతనికి పునర్వసు, ఈతనికి అభిజిత్తు పుత్రులు. ఆహుకుడు, ఆహుకి కూడ ఈతని సంతతియే. ఆహుకుడు నాలుగు దిక్కులనూ జయించినవాడు. ఆహుడికి అవన్తి రాజుతో వివాహం జరిగింది. ఆహుకునికి ఇద్దరు పుత్రులు. ఒకడి పేరు దేవకుడు, రెండవవాడు ఉగ్రసేనుడు. దేవకుడికి దేవవంతుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవరక్షితుడు అనే నలుగురు పుత్రులు. దేవకి, శాంతిదేవ, సుదేవ, దేవరక్షిత, వృకదేవి, ఉపదేవి, సునామ్ని అనే ఏడుగురు కన్యలు జన్మించారు. ఆహుక పుత్రుడైన ఉగ్రసేనుడికి కంసుడు, న్యగ్రోధుడు, సునాముడు, కంకుడు, శంకుడు, రాష్ట్రపాలుడు, సుతను, పుష్టిమంతుడు, అనాధృష్టి అని తొమ్మిదిమంది కొడుకులు, కంసవతి, సుతను, రాష్ట్రపాలి కంక అని ఐదుగురు పుత్రికలు ఉన్నారు. పుత్రులలో కంసుడు పెద్దవాడు.

మహారాజ! ఈవిధంగా కుకురవంశమందు పుట్టిన ఉగ్రసేనుడు అతని సంతానంయొక్క వృత్తాంతం చెప్పి వినిపించాను. కుకురవంశ వృత్తాంతం విన్నవారికి వంశవృద్ధి కలుగుతుంది.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో కుకుర (బభ్రు) వంశవర్ణనము ముప్పై ఏడవ అధ్యాయము