హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
9 - వైవస్వతమను, యమ, యమీ,శిశువుల పుట్టుక
వైశంపాయనుడిలా చెపుతున్నాడు.
జనమేజయ మహారాజా! కశ్యపుని వలన దాక్షాయణికి సూర్యుడు పుట్టాడు. అతనికి విశ్వకర్మ కూతురు “సంజ్ఞ” అను స్త్రీతో వివాహం జరిగింది. సంజ్ఞ మూడు లోకాలలోనూ “సురేణు” అను పేరుతో ప్రసిద్ది చెందింది. ఆమె కోపస్వభావు రాలు. సౌందర్యవతి, పడుచుది ఐనా సూర్యుని మిక్కిలి వేడిశరీరంతో సంతోషించ లేదు. సూర్యతేజస్సుచే ఆమె శరీరమంతా కాలిపోయి రూపలావణ్యాలు నశించాయి. పూర్వం ఒకప్పుడు బుధుడు భిక్షకోసం కశ్యపుని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అదితి గర్భవతిగా ఉంది. అందుచే అలసట వలన ఆమె వెంటనే బిక్ష పెట్టలేకపోయింది. ఇందుకు కోపించి బుధుడు నీ గర్భం నశిస్తుందని శపించాడు. ఈమాట విని అదితి ఏడవసాగింది. ఏడుస్తున్న భార్యను చూచి కశ్యపుడు ప్రేమతో ప్రియురాలా! నీ కడుపులో పిల్లవాడు చనిపోడు. వాడు గ్రుడ్డు మీద కూర్చొని ఉన్నాడు అని చెప్పాడు.
కశ్యపుడు ఇలా పలుకుటచే సూర్యుడికి మార్తాండుడనే పేరు వచ్చింది. మెల్లమెల్లగా సూర్యుని తేజస్సు పెరిగింది. అందుచే మూడులోకాలు తపించి పోవటం ప్రారంభించాయి. సూర్యుడి ద్వారా సంజ్ఞకు ఒక పిల్ల, ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో కన్య పేరు “యమున”. ఇద్దరు మగపిల్లల్లో ఒకడు శ్రాద్ధదేవుడు, రెండవవాడు యముడు. శ్రాద్ధదేవుడే వైవస్వతమనువుగా ప్రసిద్దిచెందాడు. యముడు, యమున ఇద్దరూ కవలపిల్లలు. సంజ్ఞ సూర్యుని దుర్భరమైన తేజస్సును సహించలేక పోయింది. ఈ కారణంగా ఆమె తనతో సమానమైన అందము, లావణ్యము గల ఒక ఛాయను సృష్టించింది. ఆఛాయ స్త్రీని సంజ్ఞ ఎదుట చేతులు జోడించి నిలబడింది.
నేను నీలజ్ఞను పరిపాలించే సేవకురాలను, నన్ను ఆజ్ఞాపించు. నేనేం చేయను? అన్నది. సంజ్ఞ ఓ శుభస్వరూపురాలా! నేను నా తండ్రి యింటికి వెళ్లాను. నీవు ప్రశాంతంగా ఇక్కడ ఉంటూ మగపిల్లల నిద్దరినీ, కన్యనూ రక్షిస్తూ ఉండు. కాని ఈ విషయం సూర్యభగవానునికి ఎప్పుడూ చెప్పవద్దు అన్నది. అప్పుడు ఛాయదేవి! ఎవడైనా నాజుట్టు పట్టుకొనేదాకా, నాకు శాపం ఇచ్చేదాకా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పను. నీవు సుఖంగా వెళ్ళు అన్నది. వైశంపాయనుడిలా చెప్పాడు.
సంజ్ఞ ఈ విధంగా ఛాయను ఒప్పించి సిగ్గుతో తన తండ్రివద్దకు వెళ్ళి పోయింది. విశ్వకర్మ సంజ్ఞను గద్దించి అడిగి నీ భర్తవద్దకు వెళ్ళమన్నాడు. తండ్రి మాటిమాటికీ మందలించుటచేత సంజ్ఞ ఆడగుర్రం ఆకారాన్ని ధరించి వెళ్ళి పోయింది. ఉత్తర కురుదేశంలో గడ్డిమేస్తూ తిరుగుతూ ఉంది. సూర్యుడు ఛాయను సంజ్ఞగానే తలచి తనతో సమానమైన తేజస్సుగల ఒక కుమారుని కన్నాడు. ఆ పుత్రుడు పెద్దన్న మనువుతో సమానమైన ఆకారం కలవాడు అయ్యాడు. అందుచే అతడు సావర్ణుడనే పేరుతో ప్రసిద్ధిచెందాడు. సూర్యునికి ఛాయయందు పుట్టినవాడు శనైశ్చరుడనే పేరు కలవాడు. ఛాయ తన పుత్రునే మిక్కిలి ప్రేమతో చూచేది. సంజ్ఞ పుత్రులపై ఎక్కువ ప్రేమ చూపించేది కాదు. వైవస్వతమనువు సవతితల్లి చెడునడ వడిని సహించాడు. కాని యముడికి ఓర్పులేదు. బాలచపలత్వము, రోషమువలన యముడు ఛాయను నిందించాడు. అప్పుడామె నీకాళ్ళు తెగిపడుగాక అని యముణ్ణి శపించింది.
అందుకతడు చాల బాధపడి శాపభయం చేత కలతచెంది తన తండ్రియైన సూర్యుని దగ్గరకు వెళ్ళాడు. చేతులు జోడించి నాకిచ్చిన శాపం తొలగిపోయే టట్లు చేయమని కోరాడు. తల్లి మమ్మల్ని సరిగా చూడక చిన్నవాడిని మిక్కిలి ప్రేమతో చూస్తోంది. ఇందుచే నేను కాలెత్తాను, కాని తన్నలేదు. ఈ తప్పును క్షమించండి. ఇందుకామె నీకాళ్ళు తెగిపడతాయని శపించింది. మీరు ప్రసన్నులై క్షమిస్తే నాకాళ్ళు తెగిపడవు అన్నాడు. అప్పుడు సూర్యుడు నాయనా! దీనికి పెద్ద కారణం ఉంటుంది. నీవంటి సత్యం పలికే ధర్మాత్ముడికి సాధారణంగా కోపం రాదు. నీతల్లి మాటను నేను మార్చలేను. కృములు నీపాదంనుంచి మాంసాన్ని తీసుకుపోతాయి భూమిమీదికి. అప్పుడు నీవు సుఖపడతావు. ఈవిధంగా నీతల్లి మాట చెల్లినట్లవుతుంది. నీవు శాపంనుండి కాపాడబడినవాడవు అవుతావు అన్నాడు.
తరువాత సూర్యుడు సంజ్ఞతో దేవి! తల్లి పిల్లలందరిపై సమానప్రేమ చూపించాలి. నీవు చిన్నవాడిని ఎందుకెక్కువగా ప్రేమిస్తున్నావు? అని ప్రశ్నిస్తే ఆమేదీ సమాధానం చెప్పలేదు. తన అభిప్రాయాన్ని ఏమీ చెప్పలేదు. అప్పుడు సూర్యుడు తన యోగబలంచేత జరిగినదంతా గ్రహించాడు. ఛాయకు నశించమని శాపమివ్వడానికి సిద్ధపడ్డాడు. కోపంతో ఆమె తలవెండ్రుకలను చేతితో పట్టు కొన్నాడు. అప్పుడామె చేసిన ప్రతిజ్ఞ ప్రకారం జరిగిన విషయాన్నంతనీ చెప్పేసింది. ఈ విషయమంతా విని కోపించి సూర్యుడు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళాడు. విశ్వకర్మ సూర్యుని గౌరవించి పూజించాడు. కోపంతో ఉన్న సూర్యుని ఓదారుస్తూ ఇలా చెప్పాడు.
దేవా! నీ మిక్కిలి తేజస్సుతో కూడిన రూపం బాగాలేదు. ఈకారణంచేత సంజ్ఞ ఆడగుర్రం రూపం ధరించి అడవిలో గడ్డి మేస్తున్నది. ఇవేళ మీరు ఆకులు తింటూ చిక్కిపోయి, దీనురాలై, జడలు ధరించి, బ్రహ్మచారిణి, పూజింపతగినది, యోగబలంతో కూడినది అయిన ఆమెను యోగబలంతో ఏనుగుచే పెరికి వేయ బడిన తామరపూవువలె ఉన్నదాని చూడగలవు. నామాట నంగీకరిస్తే ఈనాడే మీరూపాన్ని మిక్కిలి అందంగా తయారుచేస్తానన్నాడు. సూర్యుడు (త్వష్ట) విశ్వకర్మ యొక్క మాటను ఒప్పుకొన్నాడు.
అప్పుడు సూర్యుణ్ణి విశ్వకర్మ చక్రంమీద కూర్చొనపెట్టి తరిచాడు. అప్పుడు సూర్యుని రూపం మిక్కిలి అందంగా చూడదగినదయింది. అప్పటి నుంచి సూర్యుని ముఖం ఎర్రపడింది. సూర్యుని పూర్వపు ముఖకాంతినుండి ధాత, అర్యమ, మిత్ర, వరుణ, అంశ, భగ, వివస్వత్, పూష, పర్జన్య, జఘన్య, త్వష్ట, విష్ణు అనే పన్నెండుగురు సూర్యులు వెలువడ్డారు. తన శరీరంనుండి బయలెవడలిన ఆదిత్యులను చూచి సూర్యుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. విశ్వకర్మ అతనికి గంధంపువ్వులు, అలంకారాలు, ధగధగ మెరిసే కిరీటం సమర్పించి సమ్మానించాడు. మరియు సూర్యునితో ఇలా అన్నాడు.
ఓసూర్యదేవా! ఇప్పుడు మీరు మీభార్య అయిన సంజ్ఞ దగ్గరకు వెళ్ళండి. ఇప్పుడామె ఆడగుర్రం రూపంతో ఉత్తరకురుదేశంలో గడ్డివనంలో తిరుగుతూ ఉంది. అప్పుడు సూర్యుడు తన యోగబలంచేత మగగుర్రం రూపం ధరించి అక్కడకు వెళ్ళాడు. గుర్రం రూపు ధరించి ఉన్న ఆమెతో సంగమానికి సిద్ధపడ్డాడు, పరపురుషుడని ఆమె ఇష్టపడలేదు. సూర్యదేవుని వీర్యాన్ని ఆమె ముక్కు రంధ్రాల ద్వారా వెలుపలికి వదిలింది. దానినుండి దేవతల వైద్యులు అశ్వినీ కుమారులు పుట్టారు. ఆ పిల్లలలో ఒకడి పేరు ద్యు, రెండవవాడి పేరు నాసత్యుడు. అప్పటి నుండి సూర్యుడు వాళ్ళకు తండ్రి అయ్యాడు. సూర్యుని భార్య తల్లి అయింది. ఎనిమిదవ ప్రజాపతియొక్క (సూర్యుని యొక్క) కుమారులు వీరిద్దరూ.
తరువాత సూర్యుడు తన సహజరూపాన్ని ధరించి తన భార్య సంజ్ఞ ఎదుట కనపడ్డాడు. జనమేజయా! సంజ్ఞా తనభర్తను చూచి ప్రసన్నురాలైంది. యముడు తల్లి శాపం వలన మిక్కిలి దుఃఖపడుతూ ధర్మపూర్వకంగా ప్రజలను పరిపాలించ సాగాడు. మరియు తమ పనులచే పితృదేవతలకు అధిపతి లోకపాలకుడు అయ్యాడు. శ్రాద్ధదేవుడు మనువని, సావర్ణి అనే రెండు పేర్లతో ప్రసిద్ధి చెందాడు. శ్రాద్ధదేవుని తమ్ముడు శనైశ్చరుడు గ్రహాలలో ఒక పూజింపదగిన స్థానాన్ని పొందాడు.
ఓ జనమేజయా! సూర్యుని వలన పుట్టిన ఈ దేవత జన్మకధను విన్నవాడు తలుచుకొన్నవాడు అన్ని ఆపదలనుండి విడువబడి గొప్ప కీర్తిని పొందుతాడు. యముని చెల్లెలు యమిజనులకు ప్రియమైన యమునానది అయినది. విశ్వకర్మ సూర్యుని తరచునప్పుడు వెలువడిన తేజస్సుచే విష్ణుచక్రాన్ని నిర్మించాడు. విష్ణువు దానితో చాలామంది రాక్షసులను చంపాడు.
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వములో వైవస్వతమను, యమ, యమీ,శిశువుల పుట్టుక అను తొమ్మిదవ అధ్యాయము.
