హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

7 - మన్వంతర, మనుదేవతాఋషివర్ణన

జనమేజేయుడిలా అడిగాడు.

ఓ తపోధనా! అన్ని మన్వంతరాల గూర్చి విస్తారంగా వినగోరుచున్నాను. వారి సృష్టిక్రమాన్ని కూడ చెప్పవలసినదిగా కోరుతున్నాను అని.

అప్పుడు వైశంపాయనుడిలా అన్నాడు.

నాయనా! వందల కొలది సంవత్సరాలు కూడ విస్తారంగా చెప్పటానికి చాలవు. మన్వంతరాలను తగ్గించి చెపుతాను విను!

స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఔత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సావర్ణి, భౌత్యుడు, రౌచ్యుడు, బ్రహ్మ సావర్ణి మొదలగు నలుగురూ మనువులుగా చెప్పబడుచున్నారు. వీరిలో కొందరు గతించినవారు ఇప్పుడున్నవారు రాబోవువారు ఉన్నారు. ఈ మనువులను గూర్చి ఆ కాలమందలి ఋషుల గూర్చి దేవగణముల గూర్చి చెపుతాను!

మరీచి, అత్రి, అంగీరసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, వశిష్టుడు వీరు ఏడగురు బ్రహ్మకుమారులు. రాజా! ఉత్తరదిక్కున కనిపించే సప్తఋషులు వేరు. స్వాయంభువ మన్వంతరంలో “యాములు” అనే దేవతలున్నారు. అగ్నీధ్రుడు, అగ్నిబాహుడు, మేధా, మేధాతిధి, వసువు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సవనుడు, పుత్రుడు ఈ పదిమందిని స్వాయంభువుని పుత్రులు. రాజా! ఇది మొదటి మన్వంతరం.

ఔర్వుడు, వశిష్టుని కుమారుడు స్తంభుడు, కాశ్యపుడు, ప్రాణుడు, బృహస్పతి, దత్తడు, అత్రి, చ్యవనుడు ఈ ఋషులు తుషితులనే దేవతలుగా స్వారోచిష మన్వంతరంలో చెప్పబడుతున్నారు. హవిధ్రుడు, సుకృతి, జ్యోతి, ఆస, మూర్తి, ఆయ, స్మయ, ప్రధిత, నభస్య, నభు, ఊర్జ అనువారు స్వారోచిష మనువు యొక్క మహాబలవంతులైన పుత్రులు. రెండవ మన్వంతరం ఇది.

ఇక మూడవ మన్వంతరం చెపుతాను విను.

వాశిష్టులని పేరు పొందిన వసిష్ఠుని పుత్రులు ఏడుగురు. వారే బ్రహ్మనుండి జన్మించి ఊర్జులని ప్రసిద్ధిచెందారు. వారే ఈ మన్వంతరంలోని ఋషులు. మహారాజా! ఇప్పుడు ఉత్తముడనే మనువు యొక్క పుత్రులను గూర్చి చెపుతున్నాను విను. ఈష, ఊర్జ, తనూర్జ, మధు, మాధవ, శుచి, శుక్ర, సహ, నభస్య, నభ అను వీరు ఉత్తమమనువు పుత్రులు. ఈ మన్వంతరంలో భానుగణము దేవతలు. ఇది మూడవ మన్వంతర వృత్తాంతము.

ఇక నాల్గవ మన్వంతర విషయం చెప్పుతున్నాను.

ఇది తామస మన్వంతరము. దీనిలో కావ్యుడు, పృధు, అగ్ని, జిహ్నధాత, కపివంతుడు, అకపీవంతుడు, వీరు సప్త ఋుషులు. వీరికి పురాణాల్లో అనేక పుత్రులు చెప్పబడ్డారు. ఈ మన్వంతరంలో సత్యులనేవాళ్ళు దేవగణము. ఓ రాజా! ద్యుతి, తపస్య, సుతప, తపోమూల, తపోధన, తపోరతి, అకల్మాష, తనిద, ధన్వి, పరంతప అనే పదిమంది తమనువు పుత్రులు.

తరువాత ఐదవ మన్వంతరంలో వేదబాహు, యదుఘ్న, మునివేదశిర, హిరణ్యరోమ, పర్జన్య, సోమపుత్ర, ఊర్ధ్వబాహు మరియు అత్రిపుత్రుడు, సత్య నేత్రుడు అనేవారు సప్త ఋుషులు. ఈ మన్వంతరంలోని దేవతలందరూ రజో గుణంతో కూడినవాళ్ళు. వీరి ప్రకృతి మార్గము కూడ రజోగుణము కలది. పారిప్లవ, రైభ్యనామకులు ఈ మన్వంతరంలోని దేవతలు. ధృతిమంతుడు, అవ్యయుడు, యుక్తుడు, తత్వదర్శి, నిరుత్సకుడు, అరణ్యుడు, ప్రకాశనుడు, నిర్మోహుడు, సత్యవాక్కు మరియు కృతి అనేవారు ఐదవ రైవతమనువు యొక్క కుమారులు.

ఇక ఆరవ మన్వంతర వృత్తాంతము చెపుతాను విను.

భృగువు, నభ, వివస్వంతుడు, సుధామ, విరాజ, అతినామ, సహిష్ణు వీరు ఈ మన్వంతరంలోని సప్త ఋుషులు. ఇక చాక్షుష మన్వంతరం తర్వాత మన్వంతరం లోని దేవతలను విను ఆద్యుడు, ప్రభూతుడు, ఋషిఋభుడు, లేఖుడు, ఈ ఐదుగురూ ఈ మన్వంతరం తాలూకు దేవతలు. వడ్వల అనే స్త్రీకి పుట్టిన అంగీరస ఋషిపుత్రులు. ఊరువు మొదలైన పదిమంది ఆరవ మనువు పుత్రులు.

ఇక ఏడవ మన్వంతర వృత్తాంతం చెపుతా విను.

అత్రి, వసిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు ఋచీకుని పుత్రుడైన జమదగ్ని, వీరు ఏడవ మన్వంతరపు సప్తర్షులు. సాధ్యగుణము, విశ్వేదేవగణము, రుద్రగణము, వసుగణము, మరుద్గణము, ఆదిత్యగణము, అశ్వినిదేవత లిద్దరూ వీరు దేవతలు. మరియు ఇక్ష్వాకు మొదలైన పదిమంది వైవస్వత మనువు యొక్క పుత్రులు. మహారాజ! నేను చెప్పిన గొప్ప ఋషుల యొక్క కొడుకులు, మనుమలు అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నారు. పైన చెప్పిన అన్ని మన్వంతరాలతోనూ నలభై తొమ్మిది వాయువులు లోకవ్యవస్థ కొరకూ, లోకరక్షణ కొరకూ నిలిచి ఉన్నాయి. ఒక మన్వంతరం పూర్తికాగానే నాలుగు సప్తకగణములు తమ పని పూర్తి చేసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాయి. వారి తరువాత ఇతర పురుషులు తమ తపోబలంతో ఖాళీ ఐన స్థానాలను పూర్తి చేస్తారు. మహారాజ! ఇలా అన్ని మన్వంతరాలూ వస్తూ పోతూ ఉంటాయి. ఈ విధంగా ఏడు మన్వంతరాలు కథను వినిపించాను.

ఇప్పుడు రాబోయే ఆరు మన్వంతరాల కథనూ చెప్పుతాను విను.

సావర్ణి మనువులు ఐదుగురు. మొదటి సావర్ణి సూర్యుని పుత్రుడు. అతనికి వైవస్వతసావర్ణి అనే పేరు వచ్చింది. తక్కిన నలుగురు సావర్ణులు బ్రహ్మదేవుని పుత్రులు. వాళ్ళు సుమేరుపర్వతం మీద తపస్సు చేశారు. ఈ కారణంచే వాళ్ళు మేరుసావర్ణి అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. దక్షుని కుమార్తె ప్రియ అనే దానికి పుట్టినవాళ్ళు గొప్ప తపశ్శాలురు తేజస్సు గలవారును. రుచిప్రజాపతి కుమారుడు రౌచ్యుడు, భూతిప్రజాప్రతి పుత్రుడు భౌత్యుడు వీరిద్దరూ మనువులయ్యారు. తక్కిన నలుగురు మనువులు భూతికి పుట్టినవాళ్ళు. కనుక వాళ్ళు భౌత్యులని పిలువబడుతున్నారు. ఇప్పుడు రాబోవు ఎనిమిదవ సావర్ణిలో ఋషులను గూర్చి చెప్పుతా! -

రాముడు, వ్యాసుడు, అత్రి పుత్రుడు, దీప్తిమంతుడు, భారద్వాజుడు, ద్రోణుని కుమారుడు అశ్వత్థామ, గౌతముని కుమారుడు, శరద్వంతుడు, కుశికుని కులంలో పుట్టిన గాలవుడు, కశ్యప వంశమందులిరురువు వీరు బ్రహ్మతో సమాన మైన తేజస్సు కలవాళ్ళు. మరియు ఇట్టివాడే ఐన భౌత్యుడు ఆ మన్వంతరపు సప్త ఋుషులు. వీరందరూ పవిత్రులు మహర్షులు ఎల్లప్పుడూ బ్రహ్మలోకంలో నివ సిస్తారు. వీళ్ళు తమ తపోబలం వల్ల జరిగిన జరుగుచున్న జరుగబోయే వృత్తాంతాన్ని తెలుసుకొన గలవాళ్ళు. ధర్మతత్త్యము తెలిసి వంశస్థాపకులు అవుతారు. సత్య యుగం మొదలగు యుగాలలో ఈ మహర్షులు వర్ణాశ్రమ విభాగం చేస్తారు.

ధర్మం క్షీణించినపుడు వీళ్ళ వంశంలోనే వేదమును ప్రచారం చేసే మహాత్ములు పుడతారు. వీళ్ళు కోరినట్లు వరాలిచ్చే సమర్థత పొందుతారు. వీరెప్పుడూ మహర్షులే. రాజా! ఈ విధంగా ఈ మన్వంతర ఋషులను వర్ణించాను. ఇప్పుడు సావర్ణి మనువు యొక్క కలుగబోవు పుత్రులనూ గూర్చి చెపుతా విను. వాళ్ళు పదిమంది. వరీయనుడు, అవరీయనుడు, సమ్మతుడు, ధృతి మంతుడు, వసువు, చరిష్ణువు, అధృష్టుడు, ఆర్యుడు, వాజుడు, సుమతి అనే వాళ్ళు పదిమంది. ఇప్పుడు మొదటి సావర్ణి మన్వంతరంలోని మునుల గూర్చి చెపుతాను విను.

పులస్త్యుని కుమారుడు మేధాతిధి, కశ్యపుని పుత్రుడు వసువు, భృగుపుత్రుడు జ్యోతిష్మంతుడు, తేజస్వి, అంగిరుడు వశిష్ట పుత్రుడు సనకుడు, అత్రి, సువన, హవ్యవాహనుడు, పులహపుత్రుడు పౌలహుడు. వీరే మేరుసావర్ణి మన్వంతరంలో సప్తర్షులౌతారు. ఈ మన్వంతరంలో ముగ్గురే దేవతలౌతారు. వారు దక్షపుత్రుడు, రోహితకుడు సంతానము కాగలరు. దృష్టకేతు పంచహోత్ర, నిరాకృతిచ ప్రృధుశ్రవ, భూరిధామ, ఋచీక, అష్టహతగయ అనేవాళ్ళు ప్రధమ సావర్ణియొక్క పుత్రులు. గొప్ప తేజశ్శాలురు అవుతారు.

పదవ మన్వంతరంలో పులహపుత్రుడు హవిష్మంతుడు, భుగుపుత్రుడు సుకృతి, అత్రిపుత్రుడు అయోమూర్తి, అష్టమ పులస్త్యపుత్రుడు ప్రమతి, కశ్యప పుత్రుడు నభోగుడు, అంగిరస పుత్రుడు సత్యుడు వీరు సప్తర్షులౌతారు. ఈ మన్వంతరంలో దక్షిణోత్తర దిశలను అభిమానించే ఇద్దరు దేవతలవుతారు. సుత, ఉత్తమేజ, నికుషంజ, వీర్యవంత, శతానీక, నిరమిత్ర, వృషసేన, జయద్రధ, భూరిద్యమ్న, సువర్చస ఈపదిమంది దక్షసావిత్రికి పుత్రులౌతారు. ఇప్పుడు పద కొండవ మన్వంతరంలో మూడవసావర్ణి కాలంలో కాబోయే ఋషుల పేర్లు చెపుతా.

కాశ్యపపుత్రుడు హవిష్మంతుడు, అత్రిపుత్రుడు అనఘుడు, అంగిరసుని పుత్రుడు చారుధిష్టుడు, పులస్త్యపుత్రుడు నిశ్చరుడు, పులహపుత్రుడు అతితేజుడు వీరే సప్తర్షులు ఔతారు. ఈమన్వంతరంలో బ్రహ్మపుత్రులు మూడు సంప్రదాయా లలో ఉండి దేవతలు కాగలరు. సంవర్తకుడు, సుశర్మ, దేవానీకుడు, పురూద్వహుడు, క్షమాధన్వుడు, దృఢాయువు, ఆదర్శుడు, పండకుడు, మనువు ఈ తొమ్మిదిమంది ఈ మూడవ రుద్రసావర్ణి యొక్క పుత్రులౌతారు. ఇప్పుడు నాల్గవ సావర్ణి యొక్క సప్తర్షులను విను.

వసిష్ఠపుత్రుడు ద్యుతి, అత్రిపుత్రుడు సుతపుడు, అంగిరసుడు, కశ్యప పుత్రుడు తపస్వి, పులస్త్య పుత్రుడు తపోశనుడు, పులహపుత్రుడు తపోరవి, భృగు పుత్రుడు విక్షేపుడు వీళ్ళే సప్తర్షులౌతారు. ఈ మన్వంతరంలో బ్రహ్మమానస సుత్రులు ఐదువిభాగాల్లో విభజింపబడినవాళ్ళు దేవతలవుతారు. దేవబాహువు, అదూరుడు, దేవశ్రేష్ఠుడు, విదూరధుడు, మిత్రవంతుడు, మిత్రదేవుడు, మిత్రకృత్తు, మిత్ర బాహువు, సువర్చుడు ఈ పన్నెండుగురు బ్రహ్మ సావర్ణి పుత్రులు.

పదమూడవ “రౌచ్య” మన్వంతరంలో అంగిరసునిపుత్రుడు ధృతిమంతుడు, పులస్త్యపుత్రుడు హవ్యపుడు, పులహపుత్రుడు తత్త్వదర్శి, భృగుపుత్రుడు నిరుత్సుకుడు, అత్రిపుత్రుడు నిష్ట్రకంపుడు, కాశ్యపపుత్రుడు నిర్మోహుడు, వసిష్ఠ పుత్రుడు సుతపుడు వీరు సప్తర్షులౌతారు. ఈ మన్వంతరంలో కూడ బ్రహ్మ యొక్క ముగ్గురుపుత్రులే దేవగణం అవుతారు. ఇప్పుడు పదమూడవ మనువు పుత్రులను గూర్చి విను. చిత్రసేనుడు, విచిత్రుడు, నయుడు, ధర్మభృతుడు, ధృతుడు, సునేత్రుడు, క్షత్రవృద్ది, సుతపుడు, నిర్భయుడు, ధృడుడు వీరే రౌచ్యమనువు యొక్క పుత్రులు. ఇప్పుడు పధ్నాల్గవ భౌత్యమన్వంతరంలో ఉండే సప్తర్షులను విను.

కశ్యపపుత్రుడు అగ్నీధ్రుడు, పులస్త్యపుత్రుడు భార్గవుడు, భృగుపుత్రుడు అతిబాహువు, అంగీరసుని పుత్రుడు శుచి, అతిపుత్ర యుక్తుడు, వసిష్ఠపుత్రుడు శుక్రుడు, పులహపుత్రుడు అజితుడు వీరే ఈ మన్వంతరపు సప్తర్షులు అవుతారు. ప్రతిరోజూ ప్రొద్దున ఈ మనువుయొక్క, సప్తర్షుల యొక్క, మనుపుత్రుల యొక్కయు పేర్లను పలుకువాళ్ళు సుఖం కలవాళ్ళు అవుతారు. ఇలా చేయటంచేత కీర్తి, ఆయుస్సు ప్రాప్తిస్తాయి. ఈవిధంగ వెనుకటికాలంలో, రాబోవుకాలంలో మహర్షు లయ్యే వారిని, ఐదుదేవగణాల వృత్తాంతాన్ని చెప్పాను. తరంగ, భీరు, విప్ర, తరస్వాన్, ఉగ్ర, అభిమాని, ప్రవీణ, జిష్ణుస్కందన, తేజస్వి, సబల అనువాళ్ళు భౌత్యుమనువుయొక్క పుత్రులౌతారు.

భౌత్యమనువు కాలం పూర్తికాగానే ఒక కల్పం పూర్తి అవుతుంది. ఓ మహారాజ జనమేజయ! ఈవిధంగ నేను పేర్లను చెప్పుతూ పధ్నాలుగు మనువుల యొక్క వృత్తాంతం చెప్పి వినిపించాను. తపస్సుచేత, ప్రజాసృష్టిచేత గ్రామనగరాలలో సముద్రాలతో కూడిన భూమిని పాలిస్తు వారుండగనే లోకనాశం కూడా జరుగుతుంది.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వముందు మన్వంతర, మనుదేవతా ఋషివర్థన అను ఏడవ అధ్యాయము.