హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
42 - ఈశ్వరత్వము- తారకామయయుద్ధము
వైశంపాయనుడిలా చెప్పాడు.
మహారాజా! ఇప్పుడు నేను సత్యయుగంలో విష్ణుభగవానుని విశ్వత్వము, హరిత్వము దేవలోకంలోని వైకుంఠత్వము మనుష్యలోకంలోని కృష్ణత్వము మొదలైన ఊహకందని సత్యయుగంలో జరిగిన, జరుగబోయే కార్యములను యదార్ధంగా వర్ణిస్తున్నాను విను.
ఆ భగవంతుడు నాశం లేనివాడు. జగత్తును సృష్టించేవాడు. అంతులేని ఆత్మ స్వరూపం తెలియబడని రూపం కలవాడు. అ మహాప్రభువే శరీరాన్ని ధరించి సత్యయుగంలో “హరి” అని పిలవబడతాడు. బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, యముడు, శుక్రుడు, బృహస్పతి, వీళ్ళందరూ నారాయణుని వేర్వేరు రూపాలు. వాళ్ళే అదితికి పుత్రులుగా పుట్టి విష్ణువు, ఇందునికి తమ్ముడు ప్రసిద్ధి పొందాడు. దేవతలకు శత్రువులైన దైత్య దానవ రాక్షసులను చంపుటకు అదితి కడుపున పుట్టుట ఆయన అనుగ్రహమే.
త్రిగుణాత్మకుడు మామయుడైన పరమేశ్వరుని నుండి బ్రహ్మ పుట్టాడు. ఆ మొదటి పురుషుడే పూర్వం మరీచి మొదలైన ప్రజాపతులను సృష్టించాడు. అతడే కశ్యపుడు మొదలైన అనేక రూపాలను పొంది మిక్కిలి గొప్పదైన బ్రహ్మ వంశాన్ని విస్తరింపచేశాడు. ఆ మహాత్ముల వల్లనే వేదంలోని అనేక శాఖలు వెలువడ్డాయి. వేదాని చదవటం గొప్ప మహిమతో కూడిన పరమేశ్వరుని యొక్క పేర్లను పలుకుటయే. ఓ మహారాజా! ఆ భగవంతుడు వేదపాఠ స్వరూపుడు. అనీ ఇంకా ఇతరములైన వరిర్ణపదగిన విషయాలను చెపుతున్నాను విను.
సత్యయుగంలో వృత్రాసురుని సంహారం అయిన తరువాత ముల్లోకాలలో ప్రసిద్ది చెందిన తారకామయమనే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షస సమూహం యుద్ధం పిచ్చితో భయంకరరూపం ధరించి దేవ, గంధర్వ, యక్ష, రాక్షస సర్పజాతి వాళ్ళను చంపివేశారు. యుద్ధంలో చంపబడుతూ పెడముఖం పెట్టి తగ్గిపోయిన ఆయుధాలు కలవాళ్ళై విష్ణుమూర్తిని శరణు వేడారు.
ఈ సమయంలో మేఘాలు బొగ్గులను వర్షిస్తూ సూర్య చంద్రగ్రహ సముదాయంతో కూడిన ఆకాశాన్ని కప్పివేస్తూ మెరుపులతో కూడి ఘోరములై ధ్వని చేస్తూ ఉండగా ఏడువాయువులు వేగంతో ఒకదానినొకటి ఢీకొంటూ వీచాయి. పిడుగులు, తోకచుక్కలు ఆకాశంనుండి పడ్డాయి. వేడినీళ్ళ వర్షం మొదలైన అశుభ శకునాలను చూచి ఆకాశం మండిపోతున్నట్లు తలచబడింది. ఆకాశంలో ఎగిరే విమానాలు ఒకమారు క్రిందకీ ఒకమారు పైకీ పోతున్నట్లు కనిపించాయి.
నలువైపులా చీకటి అలుముకొని ఏమీ కనపడుటలేదు. ప్రళయకాలమని అందరూ భయపడ్డారు. ఇదే సమయంలో నల్లని శరీరంగల భగవంతుడు విష్ణుమూర్తి తన రెండుచేతులతో చీకటిని చీల్చివేసి దివ్యరూపంతో అందరి ఎదుట ప్రత్యక్ష మయ్యాడు. ఆ సమయంలో ఆయన స్వచ్చమైన పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. శరీరమంతటా బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆయనవద్ద బంగారు వస్త్రాలున్నాయి. ఆయన పర్వంలాగా నిశ్చలంగా ఉన్నాడు. చేతిలో నందకమనే ఖడ్గం ఉంది. శంఖచక్రగదా రూపములైన ఆయుధాలు ఉన్నాయి. ఆయన దివ్యతేజస్సుగల రథంమీద కూర్చున్నాడు. ఆయన రథపు జండాపై గరుత్మంతుడు కూర్చుని ఉన్నాడు. ఇటువంటి అభయదాతయైన పరమాత్మను చూడగానే చేతులు జోడించి జయజయ ధ్వనులు చేస్తూ శరణువేడారు.
ఆకాశమందున్న పురుషోత్తముడైన విష్ణువు వాళ్ళందరి దీనవాక్కులను విని యుద్ధంలో రాక్షసులను చంపాలని సంకల్పించి ప్రేమతో ఓ దేవతలారా! భయపడవద్దు. నిశ్చిన్తగా ఉండండి. నేనిప్పుడే ఈ రాక్షసులను ఓడించుతాను. అప్పుడు మీరు మళ్ళీ మూడులోకాల రాజ్యాలపై అధికారాన్ని పొందుతారు. సత్యమైన ప్రతిజ్ఞ గల విష్ణుమూర్తి యొక్క ఈ వాక్కును విని పాలసముద్రంలో అమృతం దొరికినప్పటి ఆనందాన్ని పొందారు. తరువాత చీకటి నశించింది. మేఘాలు మాయమయ్యాయి, సుఖకరమైన వాయువు వీచింది. సూర్యచంద్రుల కాంతులు నిర్మలమయ్యాయి. మనుష్యులకు భయం తొలగిపోయింది. మహర్షులు భయంలేని వారై గట్టిగా వేదాలను చదువసాగారు. ప్రపంచంలో ప్రాణులందరూ సంతోషంతో ధర్మ కార్యములు చేయమొదలుపెట్టారు.
