హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

20 - బ్రహ్మదత్తవంశ వర్ణనము

మార్కండేయుడిలా అన్నాడు.

ఆ మహానుభావు డంతర్ధానమైన తరువాత ఆ మహాత్ముని మాటప్రకారం విజ్ఞానంతో కూడిన దివ్యనేత్రం నాకేర్పడింది. అప్పుడు నేను కౌశికుని పుత్రులైన బ్రాహ్మణులను చూచాను. వాళ్ళలో ఏడవవాడు పనులవల్ల స్వభావంవల్ల “పితృవర్త” అనే పేరుతో ప్రసిద్ధిపొందాడు. అతడు ఏడవజన్మలో బ్రహ్మదత్తుడనే రాజు అయ్యాడు. కాంపిల్యమనే పట్టణంలో శుక్రుని కుమార్తె గర్భంనుండి అణుహుడనే వానివలన బ్రహ్మదత్తుడు పుట్టాడు. భీష్ముడిలా అన్నాడు.

మహానుభావ! మార్కండేయుడు బ్రహ్మదత్తుని వంశాన్ని వర్ణించినట్లు నీకు వినిపిస్తా. ధర్మరాజు అడిగాడు. అణుహుడనే రాజు ఎవని పుత్రుడు? ఎపుడున్నాడు? బ్రహ్మదత్తుడు అతని కుమారుడే కదా! రాజైన బ్రహ్మదత్తుడు ఎట్టి పరాక్రమం కలవాడు? అతడు భరద్వాజుని పుత్రులలో ఏడవవాడెలా అయ్యాడు? యోగా చార్యుడైన శుకమహర్షి సాధారణ వీరుడికి తన కన్యను ఎప్పుడూ ఇవ్వడు ఓ మహా మునీ! నేను ఈ వృత్తాంతాన్ని విశేషంగా బ్రహ్మదత్తుని చరిత్రనూ వినగోరుతున్నాను. మారండేయముని నోటినుండి మీరు విన్నట్లు చెప్పండి.

భీష్ముడిలా చెప్పాడు. ధర్మరాజ! రాజర్షి మహాత్ముడైన బ్రహ్మదత్తుడు నా తాత ప్రతీపమహారాజు సమకాలికుడు. ఆయన ప్రాణులకు మంచి జరగాలని ఆలోచించేవాడు. యోగా చార్యుడైన గాలవఋషి అతనికి మిత్రుడు. ఆయన తన తపోబలంవల్ల వేదాంగా లను నిర్మించి సంహిత పదము ఒకేమారుగ చదవాలనే నియమాన్ని వ్యాపింప చేశాడు. యోగాత్మకుడైన పుండరీకుడు ఆయనకు మంత్రి. ఆయన ఏడుమార్లు పుట్టాడు. ఏడుజన్మలలోనూ యోగాత్మునితో కలిసి ఉండేవాడు. మార్కండేయ ముని పురువంశపు బ్రహ్మదత్తుని వంశం ఎలా వర్ణించాడో అలా చెపుతున్నాను.

ధర్మరాజా! బృహత్క్షత్రుడనే రాజుకు సహోత్రుడనే పుత్రుడున్నాడు. అతని పుత్రుడు “హస్తి”. హస్తినాపురాన్ని అతడే నిర్మింపచేశాడు. ఇతనతికి ముగ్గురు పుత్రులు. వాళ్ళు అజమీఢుడు, ద్విమీడుడు, పురుమీఢుడు. పురుమీడుని పుత్రుడు “బృహదిషువు” అనువాడు. ఇతనికి మహాయశశాలియైన బృహద్దనువు పుత్రుడు. ఇతనిని బృహద్ధర్ముడని కూడ పిలుస్తారు. ఇతని కుమారుడు సత్యజిత్తు. ఇతని పుత్రుడు విశ్వజిత్తు. ఇతని కుమారుడు సేనజిత్తు. సేనజిత్తుకు రుచిరుడు, శ్వేతకేతువు, మహిమ్నారుడు, వత్సుడు అనే నలుగురు కుమారులు. వత్సుడు అవంతీ పట్టణానికి రాజు. ఇతని వంశంవాళ్ళని పరివత్సకులంటారు.

రుచిరుని పుత్రుడు పృధుసేనుడు. ఇతనికి “పారుడు” కుమారుడు. వీనికి నీపుడు పుత్రుడు. ఇతనికి వందమంది పుత్రులు. వాళ్ళందరూ గొప్ప పరాక్రమ వంతులు. వారందరూ “నీపు”లని ప్రసిద్ది చెందిన రాజులు. నీపుడికి వంశోద్దారకుడైన పుత్రుడు “సమరుడు”. కాంపిల్యనగరంలో ఉండే సమరుడు ఎక్కువ యుద్దప్రీతి కలవాడు. సమరుని కుమారులు పరుడు, పారుడు, సదశ్వుడు మిక్కిలి ధర్మాత్ములు. పారుని కొడుకు పృథువు. ఇతనికి సుకృతుడు కొడుకు. ఇతనికి విభ్రాజుడు కొడుకు. విభ్రాజుని పుత్రుడు అణుహుడు “కృత్వి” కి భర్త దామాదుడు.

ఈ అణుహుని పుత్రుడే రాజర్షి బ్రహ్మదత్తుడు. ఇతని పుత్రుడు విష్వక్సేనుడు. బ్రహ్మదత్తుని రెండవ కుమారుని పేరు నర్వసేనుడు. విష్వక్సేనుని పుత్రుడు దండసేనుడు. ఇతని పుత్రుడు భల్లాటుడు. పూర్వమితడు కర్ణునిచేత చంపబడ్డాడు. భల్లాటుడి కొడుకు “దుర్బుద్ధి” అనేవాడు అయ్యాడు. అతడు నీపవంశరాజుల్ని చంపివేశాడు. తాను రాజసింహాసనం మీద కూర్చున్నాడు. ఉగ్రాయుధుడనేవాడు మిక్కిలి అభిమానవంతుడు. అతన్ని నేనే యుద్దంలో చంపేశాను. ఉగ్రాయుధుడు అహంకారము గలవాడు, మదించినవాడు కూడ. ధర్మరాజు ఉగ్రాయుధుడు ఎవడి కొడుకు? ఏ వంశంలో పుట్టాడు? ఎందుకు నీవతన్ని చంపావు? ఈవిషయం నాకు చెప్పమని అడిగాడు. భీష్ముడిలా చెప్పాడు.

అజమీఢుని కొడుకు యవనీరుడు. ఇతని కొడుకు ధృతిమంతుడు. ఈతని కొడుకు సత్యధృతి, ఇతని పుత్రుడు దృఢనేమి. వీనికొడుకు సుధర్ముడు. ఇతని కుమారుడు సార్వభౌముడు. ఇతని వంశంలో “మహాన్” అనే రాజు జన్మించాడు. ఇతని పుత్రుడు రుక్మరధుడు. ఇతని పుత్రుడు సుపార్వుడు. ఇతని పుత్రుడు సుమతి, వీని కుమారుడు “సన్నతి”. ఈతని కొడుకు మహావీరుడు. ఇతని పుత్రుడు కృతుడు. ఇతడు కోసలదేశపు హిరణ్యనాభుని శిష్యుడు. హిరణ్యనాభుడు సామ వేదాన్ని ఇరవైనాలుగు భాగాలుగ విభజించాడు. మహావీరుడు ఉగ్రాయుధుడు కృతకుడి పుత్రుడు. ఉగ్రాయుధుడు పాంచాలదేశ రాజైన నీపుడనేవాణ్ణి చంపివేశాడు ఉగ్రాయుధుని కొడుకు క్షేమ్యుడు. ఇతని పుత్రుడు సువీరుడు. ఇతని కొడుకు నృపంజయుడు. ఇతని కొడుకు బహురథుడు.

ఈ రాజులందరూ పురువంశీయులే. తరువాత ఉగ్రాయుధుడి బుద్ది పాడయింది. ఇతడు నీపరాజులను చంపి రాజ్యాన్ని విస్తరింపచేశాడు. నా తండ్రి చని పోయినపుడు మంత్రులచే చుట్టబడి నేను నేలపై పరుండియుండగా ఉగ్రాయుధుడి దూతవచ్చి కురునందన! ఉగ్రాయుధుడు మీకుమార్తె “గంధకావి” స్త్రీలలో రత్నం. ఆమెను నాకు ఇచ్చివేయి. నేనామెను భార్యగా చేసుకుంటా. ఇలాచేస్తే మీరాజ్యం ధనంతో వృద్దిచెందుతుంది. నేను అన్ని శ్రేష్టవస్తువులపైనా అధికారిని. నాపేరు వినగానే శత్రువులు పారిపోతున్నారు. నీవు నీరాజ్యాన్ని, ప్రాణాల్ని, వంశాన్ని క్షేమంగా ఉంచాలనుకుంటే నా ఆజ్ఞను పరిపాలించు. లేకపోతే నీకు శాంతి ఉండదు అని పలికాడు.

తీవ్రమైన దూతల మాటలువిని దుష్టబుద్ది అయిన అతని అభిప్రాయం గ్రహించి యుద్దానికి సిద్దంకండి అని నేను సేనాపతికి ఆజ్ఞయిచ్చాను. అప్పుడు విచిత్రవీర్యుడు చిన్నపిల్లవాడు. ఆలోచనాపరులైన మంత్రులు, ఋత్విక్కులు, స్నేహితులుకూడ యుద్దానికి వెళ్ళవద్దని నన్ను ఆపుచేశారు. మంత్రులు ఇది యుద్దానికి సమయంకాదని, సామదాన భేదోపాయములతో ప్రయత్నించి వాటివల్ల ప్రయోజనం లేకపోతే అప్పుడు యుద్ధంలో ఉగ్రాయుధుణ్ణి చంపుదువుగాక అని సలహా యిచ్చారు. ధర్మరాజా! సమయం వచ్చినప్పుడు పెద్దవాళ్ళ మాట మన్నించాలి. అప్పుడు రాజా యుద్ధం విరమించాను. తరువాత మంత్రులు సామదానాది ఉపాయాలతో ప్రయత్నించారు. అతడు ఏమాత్రం అనుకూలుడు కాలేదు. ఉగ్రాయుధుడు భీష్ముడికి దూతలతో కబురంపి యుద్దానికి తన సైన్యాన్నికూడ పంపాడు. కాని సైన్యం అతని పరస్త్రీవ్యామోహపాపం కారణంగా తిరిగి వెళ్ళిపోయింది. పాపాలవల్ల అతనిని మరణించినట్లు తలచాను.

తరువాత బ్రాహ్మణుల ఆశీర్వాదం పొంది యుద్ధానికి వెళ్ళి నాబలంచేత, అస్త్రబలంచేత అతనిని సంహరించాను. ఈవిధంగా ఉగ్రాయుధుడి చేత నీపరాజు, నాచేత ఉగ్రాయుధుడు మరణించిన తరువాత నా ఆజ్ఞప్రకారం ద్రుపదుడి తండ్రి “పృషత్తు” కాంపిల్య నగరంనుండి వచ్చి ఆహిచ్ఛత్ర నగరంపై అధికారం చేపట్టాడు. తరువాత ద్రుపదుడు ఆరాజ్యానికి ప్రభువయ్యాడు. ద్రుపదరాజు ద్రోణుని తన రాజ్యంనుంచి వెడలగొట్టినప్పుడు అర్జునుడు ద్రుపదుని జయించి ఆహిచ్ఛిత్ర, కాంపిల్యనగరాల్ని గురువైన ద్రోణుడికి ఇచ్చాడు. ద్రోణుడా రాజ్యాలను తీసికొని మళ్ళీ ద్రుపదుడికే ఇచ్చేశాడు. ధర్మరాజా! ద్రుపద, బ్రహ్మదత్త, నీప, ఉగ్రాయుధుల వంశవృత్తాంతాన్ని నీకు వినిపించాను అన్నాడు భీష్మపితామహుడు.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో బ్రహ్మదత్త వంశ వర్ణనను ఇరవయ్యవ అధ్యాయము.